Published : 15 Aug 2022 01:43 IST

దేశ రక్షణలో మీరూ భాగమవుతారా?

సరిహద్దులో కాపలాకాస్తూ.. దేశ రక్షణలో తరిస్తూ ‘జైజవాన్‌’గా నిలిచిపోవాలంటే... సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో చేరిపోవచ్చు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి బీఎస్‌ఎఫ్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది.

ప్రముఖ సంస్థల్లో కోరుకున్న కొలువును సంపాదించినా.. కొంతమంది దేశం కోసం ఏమీ చేయలేకపోయామని మథనపడుతుంటారు. అలాంటి అసంతృప్తికి దూరంగా ఉండాలనుకునేవాళ్లు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు ప్రస్తుత ప్రకటనలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌) - 11, హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) - 312, మొత్తం 323 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌) 11 పోస్టులనూ ఎస్టీలకు కేటాయించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) 312 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 154, ఈడబ్ల్యూఎస్‌లకు 41, ఓబీసీలకు 65, ఎస్సీలకు 38, ఎస్టీలకు 14 కేటాయించారు.

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సీనియర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (10+2) పరీక్ష, ఇంగ్లిష్‌/ హిందీ షార్ట్‌హ్యాండ్‌, టైపింగ్‌ పరీక్షలు పాసవ్వాలి.

* ఏఎస్‌ఐ (స్టెనో) పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో షార్ట్‌హ్యాండ్‌ పరీక్ష పాసై ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు రాయగలగాలి. కంప్యూటర్‌పైన వేగంగా టైప్‌ చేయగలగాలి.

* హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు టైపింగ్‌ పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి.

శారీరక ప్రమాణాలు: రెండు పోస్టులకూ పురుష అభ్యర్థులు 165 సెం.మీ. ఎత్తు, మహిళా అభ్యర్థులు 155 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ., మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం.మీ ఉండాలి.

* జనరల్‌/ఓబీసీ/ఎస్సీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఛాతీ 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 82 సెం.మీ. ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు ఛాతీ 76 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 81 సెం.మీ. ఉండాలి. స్త్రీ, పురుష అభ్యర్థులు వయసు, ఎత్తులకు సరిపడా బరువు ఉండాలి.

వయఃపరిమితి: అభ్యర్థుల వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు గరిష్ఠ వయఃపరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. బీఎస్‌ఎఫ్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.  

దరఖాస్తు రుసుము: రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీఎస్‌ఎఫ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, షార్ట్‌హ్యాండ్‌ (ఏఎస్‌ఐ), టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

రాత పరీక్ష: ఎంపిక చేసిన సెలక్షన్‌ కేంద్రల్లో బీఎస్‌ఎఫ్‌ రాత పరీక్షను నిర్వహిస్తుంది. రాత పరీక్ష తేదీ, సమయాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ సమాచారాన్ని అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. రాత పరీక్షలో 5 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో హిందీ/ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు 20 మార్కులు, పార్ట్‌-2లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌కు 20 మార్కులు, పార్ట్‌-3లో న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌కు 20 మార్కులు, పార్ట్‌-4లో క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌కు 20 మార్కులు, పార్ట్‌-5లో బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 20 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 35 శాతం. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి.  

జీతభత్యాలు: అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనో)కు లెవెల్‌-5 కింద మూలవేతనం 29,200, హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)కు లెవెల్‌-4 కింది మూలవేతనం రూ.25,500 ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: 06.09.2022

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని