కాలేజీలో చేరకుంటే ఫీజు వెనక్కి!

ఒక కాలేజీలో అడ్మిషన్‌ తీసుకుని, ఫీజు చెల్లించి... అనుకోని కారణాలతో వేరే చోట చేరాల్సి వచ్చినప్పుడు సాధారణంగా విద్యార్థులు ముందు కళాశాలలో చెల్లించిన ఫీజులను కోల్పోవాల్సి వస్తుంది. అయితే 2022-23 విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులు ఇలా నష్టపోకుండా యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) ఓ నిర్ణయం తీసుకుంది

Published : 17 Aug 2022 01:48 IST

ఒక కాలేజీలో అడ్మిషన్‌ తీసుకుని, ఫీజు చెల్లించి... అనుకోని కారణాలతో వేరే చోట చేరాల్సి వచ్చినప్పుడు సాధారణంగా విద్యార్థులు ముందు కళాశాలలో చెల్లించిన ఫీజులను కోల్పోవాల్సి వస్తుంది. అయితే 2022-23 విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులు ఇలా నష్టపోకుండా యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) ఓ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకూ విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నా, వేరే క్యాంపస్‌కు మారాల్సి వచ్చినా ఎటువంటి రుసుములూ వసూలు చేయకుండా వారు చెల్లించిన మొత్తం ఫీజును కళాశాలలు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అదే డిసెంబర్‌ 31 వరకూ అయితే కళాశాలలు రూ.వెయ్యి మాత్రమే ప్రాసెసింగ్‌ చార్జీల కింద వసూలు చేసి మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న తల్లిదండ్రులకు పిల్లల  ఫీజు మరింత భారం కాకుండా ఈ వెసులుబాటు కల్పించింది.
    మెస్‌, హాస్టల్‌, ట్యూషన్‌ ఫీజుతో సహా మొత్తం చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా యూజీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జేఈఈ, సీయూఈటీ, ఇతర ప్రవేశ పరీక్షలు ఈసారి ప్రతి సంవత్సరం కంటే కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో... విద్యార్థులు ఇబ్బంది పడకుండా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా సమయంలో విద్యార్థులు మెస్‌, హాస్టల్‌ సేవలను వినియోగించుకోలేదు కాబట్టి, అప్పుడు వారు కట్టిన ఫీజును ఈ విద్యాసంవత్సరానికి జమ చేసుకోవాల్సిందిగా విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను విద్యాసంస్థలు అంగీకరించాలని కోరింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని