అసలైన భారతీయులు!

అనాది కాలం నుంచి అడవులు, కొండ ప్రాంతాల్లోనే నివాసం. వేట లేదా వ్యవసాయం ప్రధాన జీవన విధానం. నాగరిక సమాజానికి పూర్తిగా దూరం. సొంత సంప్రదాయాలు, మత విశ్వాసాలు, బలమైన బంధుత్వాలతో సాగుతున్న సనాతన సహజీవనం.

Published : 20 Aug 2022 02:47 IST

సమాజ నిర్మాణం, సమస్యలు ప్రజావిధానాలు/పథకాలు

అనాది కాలం నుంచి అడవులు, కొండ ప్రాంతాల్లోనే నివాసం. వేట లేదా వ్యవసాయం ప్రధాన జీవన విధానం. నాగరిక సమాజానికి పూర్తిగా దూరం. సొంత సంప్రదాయాలు, మత విశ్వాసాలు, బలమైన బంధుత్వాలతో సాగుతున్న సనాతన సహజీవనం. ప్రకృతి అంటే అపారమైన ప్రేమ.  జంతువులపై అంతులేని ఆరాధన. అదే అమాయకులైన అడవి బిడ్డల చారిత్రక బతుకు చిత్రం. వారి సంస్కృతి సామాజికం, సహజసిద్ధం, స్థానికం, పరిణామ క్రమాల ఫలితం. అందుకే  ఆ ఆదివాసీలు అసలైన భారతీయులు.

గిరిజనులు

భారత రాజ్యాంగం గిరిజనుల్లోని అన్ని తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా నిర్వచించలేదు. రాజ్యాంగంలోని 342, 366(25) ఆర్టికల్స్‌ షెడ్యూల్డ్‌ తెగలుగా ఎవరిని గుర్తించాలో పేర్కొన్నాయి. ఆర్టికల్‌ 342 ప్రకారం షెడ్యూల్డ్‌ తెగలు లేదా గిరిజనులు అంటే గిరిజనుల్లోని కొన్ని తెగలు, కొన్ని వర్గాలు లేదా అన్నివర్గాలు/అన్ని తెగలు. వాటికి ఆ గుర్తింపును రాష్ట్రపతి ప్రకటిస్తారు.

నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉన్నవారిని గిరిజనులు/తెగలు అంటారు. ట్రైబ్‌ అనే ఆంగ్ల పదం ట్రైబస్‌ అనే రోమన్‌ పదం నుంచి వచ్చింది. గిరి అంటే కొండ. కాబట్టి కొండ ప్రాంతాల్లో నివసించే వారిని గిరిజనులు (ఆదివాసీలు)గా  పిలుస్తారు. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవనవిధానంపై పరిశోధనలు చేసినవారు లూయిస్‌ హెన్రీ మోర్గాన్‌. ఈయన గ్రంథం ‘ది ఏన్షియంట్‌ సొసైటీ’. భారతదేశంలో గిరిజనుల జీవనవిధానంపై పరిశోధనలు చేసినవారు వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథం ‘ట్రైబ్స్‌ ఇన్‌ ఇండియా’.

భారత్‌లో ఇవీ లెక్కలు: 1991 రాయ్‌బర్మన్‌ కమిషన్‌ ప్రకారం దేశంలో మొత్తం గిరిజన తెగల సంఖ్య 427. వారి జనాభా 6.776 కోట్లు (8.08%).

* 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజన తెగలు 573. వారి జనాభా 10.43 కోట్లు (8.6%). ఇందులో పురుషులు 5.24 కోట్లు, స్త్రీలు 5.19 కోట్లు.

తెగ లక్షణాలు

* భౌగోళికంగా దూరంగా, ఒంటరిగా జీవనం * మిగతా సమాజంతో కలవడానికి బిడియం, సంకోచం ఆర్థిక వెనుకబాటుతనం * అనాగరికులుగా ఉండటం * బలమైన బంధుత్వాలు * తెగల్లో రాజకీయ పరిషత్‌లు, పంచాయతీలు వంటి అనేక  రాజకీయ విభాగాలు ఉండటం. వాటి నిర్ణయాలకు వారు కట్టుబడటం. * అంతర్‌ వివాహం-ఒక తెగవారు ఆ తెగలోని వారినే వివాహం చేసుకోవడం.ప్రతి తెగకు ప్రత్యేకమైన సంస్కృతి * ఒక ప్రాంతంలోని గిరిజనులంతా ఒకే రకమైన వృత్తిలో ఉండటం. ఉదా: అడవుల పెంపకం, పోడు వ్యవసాయం, ఆహార సేకరణ, స్థిర, మారక వ్యవసాయం.

ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రత్యేక సంస్కృతి, ఒకే పేరు, ఒకే భాష, అంతర్‌ వివాహం, సమష్టి ఆంక్షలు, ఆర్థిక స్వయంసమృద్ధి, విశిష్ట సామాజిక, రాజకీయ వ్యవస్థలు కలిగి ఉండటం తెగల ముఖ్య లక్షణం.

ఆదిమ గిరిజన తెగలు

గిరిజనుల్లో మరింత వెనుకబడి, నాగరికతకు దూరంగా ఉన్న వర్గాలను ఆదిమ గిరిజనులు అంటారు. వీరిని ప్రస్తుతం పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌  (పీవీటీజీ) అని పిలుస్తారు. ప్రస్తుతం 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (అండమాన్‌-నికోబార్‌ దీవులు)లో ఇలాంటి 75 తెగలు ఉన్నట్లు గుర్తించారు. 1961లో ‘ధేబార్‌ కమిషన్‌’ పీవీటీజీలను అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించింది. వారి అభివృద్ధి, సంరక్షణకు సిఫార్సులు చేసింది. వాటిని అనుసరించి 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి వంద శాతం కేంద్ర నిధులతో, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలో ప్రత్యేక పథకాలను ప్రారంభించారు.

లక్షణాలు: * ఏకరూప సముదాయం స్వల్ప జనాభా * భౌగోళిక ఏకాంతం * మార్పులను ఇష్టపడక  పోవడం * సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం * ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉండటం * ఆర్థిక వెనుక  బాటుతనం

భౌగోళిక విస్తరణ 

బి.ఎస్‌.గుహ అనే మానవ శాస్త్రవేత్త తెగలను మూడు మండలాలుగా విభజించారు. అవి: ఉత్తర-ఈశాన్య మండలం, కేంద్ర/మధ్యమండలం, దక్షిణ మండలం.

ఉత్తర-ఈశాన్య మండలం: తూర్పు కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ (ఉత్తర ప్రాంతం), సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలు, అస్సాం ఈ మండలంలో ఉన్నాయి. దేశ గిరిజన జనాభాలో 11% ఇక్కడ నివసిస్తున్నారు. 

ఉదా: ఆకా, దఫ్లా, కుకి, మిజోలు, నాగా, గారో, జయంతియా, ఖాసీ, బోటియా, లుసాయి. 

కేంద్ర/మధ్య మండలం: మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలు ఈ మండలంలో ఉన్నాయి. ఉదా: సంతాల్‌లు, భిల్లులు, గోండులు, గదవా, కలియా.

దక్షిణ మండలం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ మండలంలో ఉన్నాయి. ఉదా: సవర, చెంచు, కోలం, కొండరెడ్లు, తోడా, కదర్, కోయ.

2011 జనాభా లెక్కల ప్రకారం..

ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌  (14.7%), తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం (0.2%). కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీ జనాభా అధికంగా దాద్రానగర్‌ హవేలీ (1,78,564), తక్కువగా డామన్‌ డయ్యూలో (15,363) ఉంది.

ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం (94.4%), తక్కువగా ఉన్న రాష్ట్రం గోవా (0.14%). కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీ జనాభా శాతం అధికంగా లక్షదీవులు (94.5%), తక్కువగా అండమాన్‌ దీవుల్లో (8.3%) ఉంది.

ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు పంజాబ్, హరియాణా. కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి, ఛండీగఢ్‌ల్లో ఎస్టీలు లేరు. దేశంలో అధికంగా ఉన్న గిరిజన తెగ భిల్లులు (52 లక్షల మంది). వీరు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నారు. సంతాల్‌ తెగ (36 లక్షల మంది) పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో ఉంది. గిరిజన తెగలు ఎక్కువ శాతం సిర్‌చిఫ్‌ (మేఘాలయ 98.1%) జిల్లాలో ఉండగా తక్కువగా హాథ్రస్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) జిల్లాలో ఉన్నారు.
తెలంగాణలో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల జనాభా 59,18,073 (5.7%). తెలంగాణలో మొత్తం గిరిజన తెగల సంఖ్య 32, గిరిజన జనాభా 32.87 లక్షలు (9.3%). అధికంగా ఉన్న గిరిజన తెగలు లంబాడీలు (20,46,117), కోయ (4,86,391). జనాభా, శాతం పరంగా అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం ఖమ్మం.


జాతిపరమైన వర్గీకరణ

భాష, మతం, జీవన విధానాలు, పోలికలు, జాతిపర లక్షణాలను బట్టి 1981లో రిస్లీ మొదటిసారిగా తెగలను శాస్త్రీయంగా వర్గీకరించారు.

రిస్లీ ప్రకారం:

ద్రావిడ జాతి వర్గం: శారీరకంగా పొట్టితనం, పొడవైన తల, వెడల్పుగా నొక్కినట్లు ఉండే ముక్కు, నల్లటి కళ్లు, నల్లటి శరీర రంగు, తలపై దట్టమైన ఉంగరాల జుట్టు ఈ జాతివారిలో కనిపిస్తాయి. ఉదా: ఛోటానాగపుర్‌

మంగోలి జాతి వర్గం: విశాలమైన శిరస్సు, చదునుగా చక్కగా ఉండే ముక్కు, పొట్టితనం, శరీరం మీద రోమాలు తక్కువగా ఉండటం ఈ జాతి ప్రజల లక్షణాలు. ఉదా: హిమాలయ ప్రాంతం, ఉత్తర ఈశాన్య ప్రాంతం.

రుగ్గిరీ అభిప్రాయం:

భారత ప్రజలు ఆరు రకాలుగా ఉన్నారని రుగ్గిరీ అభిప్రాయపడ్డారు. అందులో గిరిజన తెగలు మూడు రకాలని పేర్కొన్నారు.  

నీగ్రిటోలు: పొట్టిగా ఉండటం, ఎత్తయిన శిరస్సు, పొడవైన నుదురు, దళసరి పెదవులు,  శరీరంపై తక్కువ రోమాలు వీరిలో ఉంటాయి.

ఉదా: అండమాన్‌ నికోబార్‌లోని తెగలు, కేరళ, కర్ణాటకలోని కడర్‌ తెగ

తొలి ద్రావిడ జాతి వర్గం: పొట్టిగా ఉండటం, పొడవైన తల, తేనె రంగు పోలిన శరీరం, గోధుమ రంగు కళ్లు ఈ జాతివారిలో ఉంటాయి.  

ఉదా: భిల్లు, చెంచు, సంతాల్, ముండా

ఎత్తుగా ఉండి పొడవైన తల ఉన్నవారు: పొడవైన శరీరం, తల; ఒత్తు జుట్టు, పలుచటి నుంచి మధ్యరకంగా ఉండే పెదవులు, చక్కటి శరీర సౌష్ఠవం.

ఉదా: తోడా తెగ (నీలగిరి కొండలు - తమిళనాడు)

హైడెన్‌ వివరణ:
భారతదేశ ప్రజలను హైడెన్‌ మూడు రకాలుగా విభజించారు. 

1) హిమాలయ ప్రాంతం 

2) ఉత్తర మైదాన ప్రాంతం (ప్రస్తుతం పాకిస్థాన్‌)

3) దక్కన్‌ ప్రాంతం 

ఈ మూడు ప్రాంతాల్లోని ప్రజలను తిరిగి వివిధ రకాలైన జాతులుగా విభజించారు.

* దక్కన్‌ ప్రాంతంలోని నీగ్రిటో జాతి 

* దక్కన్‌ ప్రాంతంలోని తొలి ద్రావిడ జాతి. 

* హిమాలయ ప్రాంతంలోని మంగోలాయిడ్‌ జాతి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని