మధ్యలోనే ఆగిపోతున్నారా?

కొత్త కోర్సులో చేరడం, పరిచయం లేని సబ్జెక్ట్‌ చదవడం, నూతన నైపుణ్యాన్ని అభ్యసించడం... ఇలా ఏ కొత్త పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టి... సగం వరకూ పూర్తిచేసి... ఆ తర్వాత చేతులెత్తేసే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ ఇది సరికాదు.

Published : 30 Aug 2022 01:01 IST

కొత్త కోర్సులో చేరడం, పరిచయం లేని సబ్జెక్ట్‌ చదవడం, నూతన నైపుణ్యాన్ని అభ్యసించడం... ఇలా ఏ కొత్త పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టి... సగం వరకూ పూర్తిచేసి... ఆ తర్వాత చేతులెత్తేసే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ ఇది సరికాదు. ముఖ్యంగా విద్యార్థి దశలో... భవిష్యత్తును నిర్దేశించే లక్ష్యాల సాధనలో అలసత్వం అస్సలు కూడదు.  చదువులోనూ, కెరియర్‌లోనూ విజయవంతం కావాలని భావించే వారెవరైనా తమ టాస్క్‌లను మధ్యలోనే వదిలేయకుండా పూర్తిచేయాలి. అలా చేయాలంటే...


తెలుసుకుందాం..

* ఎంతటి కార్యదక్షత ఉన్న వారైనా... ఏదో ఒక సమయంలో మానసికంగా అలసిపోవడం మామూలే. సవాళ్లు ఎదురైనప్పుడు అసలు ఈ పని ఎందుకు మొదలుపెట్టామా అని కూడా అనిపించొచ్చు. కానీ ఆ భావన నుంచి ఎంత త్వరగా బయటకొస్తే అంత వేగంగా పనిలో నిమగ్నం కాగలం.

* ఒక్కసారి ఇది చేయాలి అని నిర్ణయించుకున్నాక... మళ్లీ ఆప్షన్‌ తీసుకోకూడదు. ఎవరికైనా ఒక పని చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు అనే ఆప్షన్‌ ఉంటే... అందులో వందశాతం కృషి చేయలేరు. పూర్తయ్యే తీరాలి అనుకున్నప్పుడే పూర్తిగా తలమునకలవుతారు. ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి.

* ఎప్పుడూ ప్రేరణ కోల్పోకూడదు. మనిషిని నడిపించేది అంతర్లీనంగా ఉండే స్ఫూర్తే. దాన్ని నిరంతరం కలిగి ఉండాలి.

* కొన్నిసార్లు సహనం చాలా అవసరం. ముఖ్యంగా దీర్ఘకాల లక్ష్యాలను చేరుకునేటప్పుడు ఎంతో ఓపిగ్గా ఉండాల్సి వస్తుంది. విసుగు చెందితే లక్ష్యాలు నీరుగారడమే కాక, అప్పటివరకూ పడిన శ్రమంతా వృథా అయ్యే ప్రమాదం ఉంది.


ఆచరిద్దాం..

* ఈ పని ఎందుకు మొదలుపెట్టామనే కారణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కారణం మన మనసుకు ఎంత దగ్గరైనది అయితే... చేసే పనిలో నాణ్యత, వేగం అంత ఎక్కువగా ఉంటాయి. మరింత శ్రమించగలుగుతాం.

* నిరాశగా అనిపించినప్పుడు పాత విజయాలను గుర్తుచేసుకుంటే కొత్త ఉత్సాహం వస్తుంది. చిన్నదే అయినా, సక్సెస్‌పై మనల్ని మనం అభినందించుకోవాలి. అదే స్ఫూర్తితో కొత్త పనులు చేసేందుకు ప్రయత్నించాలి.

* అవరోధాలు అవసరమేనన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా విజయాల నుంచి కంటే, అపజయాల నుంచే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అడ్డంకులు ఎదురైనప్పుడే సమస్యల పరిష్కారం అర్థమవుతుంది. అందువల్ల వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలి.

* కొన్నిసార్లు పని పూర్తిచేయలేక మొత్తంగా వదిలేద్దాం అనిపిస్తుంటే... ముందు చిన్న విరామం తీసుకోవడం ఉత్తమం. దాన్నివల్ల మనసు తేలికపడి కొత్త ఆలోచనలు వస్తాయి. టాస్క్‌ను ఎలా పూర్తిచేయాలో తెలుస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు