మెంటల్‌ ఇమ్యూనిటీ పెంచుకుందామా?

వాతావరణమంతా వైరస్‌లు ఉన్నాయని గాలి పీల్చుకోవడం మానేయలేం కదా... దారి నిండా ముళ్లు ఉన్నాయని నడవకుండానూ ఉండలేం. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాం.

Published : 14 Sep 2022 00:51 IST

వాతావరణమంతా వైరస్‌లు ఉన్నాయని గాలి పీల్చుకోవడం మానేయలేం కదా... దారి నిండా ముళ్లు ఉన్నాయని నడవకుండానూ ఉండలేం. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాం. మరి ‘మెంటల్‌ ఇమ్యూనిటీ’ గురించి ఆలోచించారా?

ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండటానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం. వైరస్‌ల బారినపడకుండా టీకాలు వేయించుకుంటున్నాం. ఆహారం తీసుకునే విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇంతవరకూ బాగానే ఉన్నా..

1 శారీరక ఆరోగ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యం అతి ముఖ్యమైన మానసిక ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. అందుకే విపరీతమైన ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు, నిరాశా నిస్పృహల్లోకి కూరుకుపోతున్నాం.
2 ముఖ్యంగా విద్యార్థుల్లో మానసిక అనారోగ్యం మరింతగా పెరిగిపోతోంది. శారీరకంగా బాగానే ఉన్నా.. ఈ పోటీ ప్రపంచంలో తమను తాము నిరూపించుకోవడానికి మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు.
3 శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని ప్రతిఒక్కరూ ఆశపడతారు. అయితే అనుకున్నవి అన్నీ అనుకున్నట్టుగానే జరగాలని లేదు కదా. అలా జరిగితే దాన్ని జీవితం అనరేమో.. ఉదాహరణకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని ఆశించారు కానీ రాలేదు. ఇంటర్వ్యూల్లో ఎంపిక అవుతారనుకున్నారు కానీ కాలేదు. ఇలాంటి ఘటనలు ఎదురుకాగానే వెంటనే కుంగుబాటుకు గురవుతున్నారు.
4 ప్రతి సమస్యకూ ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. అందులో మీకు తెలిసినవి కొన్నయితే.. తెలియనివి ఎన్నో. ఇలాంటప్పుడు మీ సమస్యలను కనీసం దగ్గరివారితోనైనా పంచుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్లు చెప్పే పరిష్కారాల దిశగానూ ఒకసారి ఆలోచించాలి. సాధారణంగా మీ మనసుకు తోచిందే మీకు బాగా నచ్చుతుంది. కానీ ఎదుటివారు వాస్తవిక దృక్పథంతో ఆలోచించి పరిష్కారం చూపొచ్చు. దాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలూ పొందొచ్చు.
5 సమస్యలను వెంటనే పరిష్కరించాలని తొందరపడకూడదు. కాస్త నిదానంగా ఎదురుచూస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఆవేశంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలతో మిగిలేదేమీ ఉండదు. మీ మీద ఎన్నో ఆశలుపెట్టుకున్న కుటుంబ సభ్యులకు బాధను మిగల్చడం తప్ప.
6 చదువు, ప్రేమ, ఆర్థిక పరిస్థితులు... సాధారణంగా యువతను ఎక్కువగా ఒత్తిడికి గురిచేసేది ఈ మూడు అంశాలే. వీటిల్లో ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కానేకాదు.
ఉదాహరణకు పరీక్ష తప్పుతాననే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుందాం. తర్వాత ఫలితాలు వచ్చి ఆ విద్యార్థి పాసయ్యాడు. ఇది సరిదిద్దుకోలేని పొరపాటే కదా. ఉన్నత విద్యావంతులూ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను బలి తీసుకుంటున్నారు.
7 కొంతమంది విద్యార్థులకు ఉన్నంత ప్రతిభ, తెలివితేటలు మీకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వారికంటే మీరు ఎక్కువగా కష్టపడి చదవాలి. ఎదుటివాళ్లు ప్రతిభావంతులని నమ్ముతున్నారు కదా. అలాగే మిమ్మల్ని మీరూ నమ్మాలి. ఒత్తిడిని జయించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే.. శారీరకంగానేకాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నట్టే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని