తిరుగులేని తీర్పులు!

పాలన రాజ్యాంగం ప్రకారం సాగకపోయినా, పౌరహక్కులకు భంగం కలిగినా, సమానత్వం ప్రమాదంలో పడినా అంతిమంగా రక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఉంది. రాజకీయం రాజ్యాంగం గీత దాటితే, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే, సామాజిక న్యాయానికి అడ్డంకులు ఎదురైతే ఆ ధర్మపీఠం ఆదుకుంటుంది. చెల్లని చట్టాలను నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది.

Published : 08 Oct 2022 00:12 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

పాలన రాజ్యాంగం ప్రకారం సాగకపోయినా, పౌరహక్కులకు భంగం కలిగినా, సమానత్వం ప్రమాదంలో పడినా అంతిమంగా రక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఉంది. రాజకీయం రాజ్యాంగం గీత దాటితే, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే, సామాజిక న్యాయానికి అడ్డంకులు ఎదురైతే ఆ ధర్మపీఠం ఆదుకుంటుంది. చెల్లని చట్టాలను నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది. అవసరమైన శాసనాల రూపకల్పనకు మార్గదర్శనం చేస్తుంది. తిరుగులేని తీర్పులతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది.

సుప్రీంకోర్టు - చారిత్రక నిర్ణయాలు

భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగానికి సంరక్షణకర్తగా వ్యవహరిస్తుంది. దేశ పరిపాలనను రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా కొనసాగే విధంగా పర్యవేక్షిస్తుంది. తన తీర్పుల ద్వారా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు మార్గనిర్దేశం చేస్తుంది. వివిధ కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు దేశ పరిపాలనలో కీలక మలుపులకు కారణమయ్యాయి.

శంకరీ ప్రసాద్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1951): పార్లమెంటు 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ సవరణ చట్టం రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు తొలిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.జె.కానియా.

గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): ఈ కేసులో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణల చట్టాన్ని సవాలు చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పులకు భిన్నంగా పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని, రాజ్యాంగ సవరణ కూడా ఆర్టికల్‌ 13(2)లో పేర్కొన్న ‘చట్టం’ అనే పదం పరిధిలోకి వస్తుందని పేర్కొంది. పార్లమెంట్‌ ప్రాథమిక హక్కులను సవరించాలంటే ‘ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ కోకా సుబ్బారావు ఉన్నారు.

కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1973): ఈ కేసును విచారించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌.సిక్రీ నేతృత్వంలోని 13 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పడింది. మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, 24, 25వ రాజ్యాంగ సవరణ చట్టాలు మొదలైన వాటిపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి పేర్కొంది.

ముఖ్యాంశాలు:

* రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా పార్లమెంటు సవరించవచ్చు.

* ఆస్తి హక్కుపై పరిమితులను విధించవచ్చు.

* న్యాయసమీక్ష, ప్రాథమిక హక్కుల మూలతత్వం, రాజ్యాంగ ఔన్నత్యాన్ని సంరక్షించాలి.

* ప్రజాస్వామ్య ప్రభుత్వం, గణతంత్ర రాజ్యభావన, సమాఖ్య భావన కొనసాగాలి.

మినర్వా మిల్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1980): ఈ కేసులో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చిన ఆర్టికల్‌ 368(4), ఆర్టికల్‌ 368(5)లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ రెండు క్లాజులు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు ప్రయత్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ నేతృత్వంలో ధర్మాసనం కేసును విచారించింది.

* ఆర్టికల్‌ 368(4) ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు. ఆర్టికల్‌ 368(5) ప్రకారం పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారంపై ఎలాంటి పరిమితులు ఉండకూడదు. ఈ రెండు ఆర్టికల్స్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కానీ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది.

ఎస్‌.పి. గుప్తా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1981): ఈ కేసు ద్వారా మనదేశంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ - పిల్‌)కు సంబంధించి కొత్త అధ్యాయం మొదలైంది. జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి ‘పిల్‌’కు సరైన నిర్వచనం ఇచ్చారు. న్యాయ లేదా రాజ్యాంగపరమైన హక్కులు ఉల్లంఘనకు గురైతే ఎవరైనా ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులో పిల్‌ వేయవచ్చని పేర్కొన్నారు.

ఇందిరా సహాని వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1992): ఈ కేసులో మండల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాల వారికి (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ రిజర్వేషన్ల ను సుప్రీంకోర్టు సమర్థిస్తూ ‘సంక్షేమ స్వభావం’, ‘సమన్యాయం’ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది.

ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1994): ఆర్టికల్‌ 356 ప్రకారం కర్ణాటకలో విధించిన రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఎస్‌.ఆర్‌.బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పునిస్తూ ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమగ్రత, సమాఖ్య విధానం, సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది. రాష్ట్రపతి పాలనకు సంబంధించి మార్గదర్శకాలను వెలువరించింది.

ముఖ్యాంశాలు:

* రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలనపై న్యాయసమీక్ష జరపవచ్చు.

* రాష్ట్రపతి పాలనను న్యాయస్థానం రద్దు చేస్తే, రద్దయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి.

* రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీని కలిగి ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభలోనే పరీక్షించాలి.

* రాష్ట్రపతి పాలన విధించేందుకు తగిన ఆధారాలుఉన్నాయా? లేదా? అనేది కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి.

జోసఫ్‌ షైనీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018): ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)లోని సెక్షన్‌ 497ని సవాలు చేస్తూ వేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.

ముఖ్యాంశాలు:

* వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీలోని సెక్షన్‌ 497 చెల్లదు.

* ఇష్టపూర్వక శృంగారం మహిళల హక్కు.

* భర్తకు భార్య వ్యక్తిగత ఆస్తి కాదు.

యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (2018): కేరళలోని శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నియంత్రించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, జస్టిస్‌ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ముఖ్యాంశాలు:

* వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ ఆలయంలోకి ప్రవేశించవచ్చు.

* అయ్యప్ప స్వామి భక్తులది హిందూమతమే. శారీరక పరిస్థితిని కారణంగా చూపి మహిళల గౌరవాన్ని భంగపరుస్తూ ఉండే ఎలాంటి మతపర సంప్రదాయమైనా రాజ్యాంగ విరుద్ధమే.

* ఆరాధనలో పాటించాల్సిన సమానత్వంపై పితృస్వామ్య వ్యవస్థ భావజాలం పైచేయి సాధించలేదు.

* 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదన్న సంప్రదాయం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25(1), 26 లకు విరుద్ధం.

* నెలసరి ఆధారంగా మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం ఆర్టికల్‌ 17కి వ్యతిరేకమని, అది అంటరానితనం కిందకి వస్తుందని పేర్కొంది.

నవతేజ్‌సింగ్‌ జోహర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018): జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్‌ 377 పై తీర్పును వెలువరించింది.

ముఖ్యాంశాలు:

* ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీలోని సెక్షన్‌ 377 చెల్లుబాటు కాదు.

* ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు.

* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌ (ఎల్‌జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది.

అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018): క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే అంశాన్ని సుప్రీంకోర్టు విచారించి తీర్పు వెలువరించింది.

ముఖ్యాంశాలు:

* క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

* ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించే అంశం కోర్టు పరిధిలో లేదు. అలాంటి చట్టం చేసేందుకు పార్లమెంటుకి మాత్రమే అధికారం ఉంది.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి నేరచరిత్రకు సంబంధించిన సమాచారాన్ని రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రంతో సహా సమర్పించాలి.

* అత్యాచారాలు/అపహరణలు/హత్యలు/దారుణమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సభ్యత్వాన్ని రాజకీయ పార్టీలు రద్దు చేయడం తప్పనిసరి చేసే విధంగా పార్లమెంటు చట్టం చేయాలి.

* అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో పెట్టాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని