ప్రగతి చోదక శక్తులు!

పరిశ్రమలు నడవాలన్నా, వాహనం కదలాలన్నా, విమానం ఎగరాలన్నా ఇంధనాలు కావాల్సిందే. ఆధునిక ప్రగతి మొత్తం ఆ శక్తివనరుల చుట్టూనే తిరుగుతోంది. వాటిలో వాడిన కొద్దీ తరిగిపోయేవి కొన్ని ఉంటే, ఎంత ఉపయోగించుకున్నా ఎప్పటికీ లభించేవి ఇంకొన్ని ఉన్నాయి.

Published : 17 Oct 2022 00:28 IST

జనరల్‌ స్టడీస్‌ ఇండియన్‌ జాగ్రఫీ

పరిశ్రమలు నడవాలన్నా, వాహనం కదలాలన్నా, విమానం ఎగరాలన్నా ఇంధనాలు కావాల్సిందే. ఆధునిక ప్రగతి మొత్తం ఆ శక్తివనరుల చుట్టూనే తిరుగుతోంది. వాటిలో వాడిన కొద్దీ తరిగిపోయేవి కొన్ని ఉంటే, ఎంత ఉపయోగించుకున్నా ఎప్పటికీ లభించేవి ఇంకొన్ని ఉన్నాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలకంగా మారిన ఆ ఇంధనాల లభ్యత, వినియోగాల వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

శక్తి వనరులు

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారేందుకు శక్తివనరులు ప్రధానంగా దోహదపడ్డాయి. ప్రాచీన కాలంలో నిప్పుతో మొదలైన శక్తివనరుల వినియోగం నేడు విద్యుత్తు, ఇంధనాల రూపంలో ప్రతి రంగంలోనూ కొనసాగుతోంది. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి శక్తి సంపద విశేషంగా సాయపడుతోంది. ఒక ప్రాంత ఆర్థికాభివృద్ధి అక్కడ వాడుతున్న శక్తి వనరుల మీద ఆధారపడి ఉంటుంది. శక్తి వనరులు రెండు రకాలుగా ఉన్నాయి.

తరిగిపోయేవి: వీటినే సంప్రదాయ ఇంధన వనరులు అంటారు. వినియోగిస్తున్న కొద్దీ ఈ వనరుల నిల్వ తగ్గిపోతూ ఉంటుంది. వీటి పునరుత్పత్తి సాధ్యం కాదు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధంగా ఉపయోగించుకోవాలి.

ఉదా: బొగ్గు, పెట్రోల్, సహజ వాయువు, యురేనియం, థోరియం వంటి ఖనిజాలు

తరిగిపోనివి: వీటిని సంప్రదాయేతర ఇంధన వనరులంటారు. ఎంత ఉపయోగించుకున్నా, ఎన్నిసార్లు వాడినా ఇవి తరిగిపోవు. మళ్లీ, మళ్లీ వినియోగించుకోవచ్చు. ప్రకృతిలో ఎల్లప్పుడూ లభ్యమవుతాయి. ప్రస్తుతం సాంకేతికాభివృద్ధి కారణంగా వీటి ఉపయోగం పెరుగుతోంది. ఉదా: సూర్యరశ్మి, గాలి, నీరు

మనదేశంలో వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా బొగ్గు, ముడిచమురు, అణుశక్తి, సహజ వాయువు, జలవిద్యుత్తు శక్తిని ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో సాంకేతిక అభివృద్ధి ఫలితంగా సౌరశక్తి, పవన శక్తి, సముద్ర తరంగాల శక్తి, జీవశక్తి (బయో-ఎనర్జీ) వాడకం పెరుగుతోంది.

ముడిచమురు

ముడిచమురు (పెట్రోలియం) నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ మొదలైనవి లభిస్తాయి. గ్రీకు భాషలో పెట్రా అంటే శిల, ఓలియమ్‌ అంటే నూనె. పెట్రోలియం అంటే శిలాజ ఇంధనం. దేశంలో మొదటగా అస్సాంలోని దిగ్బాయ్‌లో ముడిచమురు నిల్వలు గుర్తించారు. ఆ తర్వాత నహర్‌కటియ, కాంబట్‌ సింధు శాఖ, బాంబే హై వద్ద కూడా కనుక్కున్నారు. 1956లో భారత్‌లో ఓఎన్‌జీసీ (ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) ఏర్పడింది. నాటి నుంచి ఈ సంస్థ పర్యవేక్షణలో చమురు నిల్వలున్న ప్రదేశాల పరిశోధన, ఉత్పత్తి జరుగుతోంది. 2020-21 లెక్కల ప్రకారం దేశంలో చమురు నిల్వలు 603.6 మిలియన్‌ టన్నులు. దేశంలో బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతంలోని దిహంగ్‌ లోయ, దిగ్బాయ్, నహర్‌ కటియా, టిపం కొండలు, రాజస్థాన్‌లోని మంగళ, గుజరాత్‌లోని అంకలేశ్వర్, లూనెజ్, అహ్మదాబాద్‌-కలోల్, ఆలియాబెట్‌; పశ్చిమ సముద్ర తీరంలోని బాంబే హై, బెస్సెయిన్‌ చమురు క్షేత్రం; తూర్పుతీరంలో తమిళనాడులోని నారీమనమ్, కోవిలప్పల్, ఆంధ్రప్రదేశ్‌లోని రవ్వ క్షేత్రం (కాకినాడ), నర్సాపుర్, లింగాల, పాశర్లపూడి మొదలైన ప్రదేశాల్లో ముడిచమురు వెలికితీత జరుగుతోంది.

సహజ వాయువు

మన దేశంలో సహజ వాయువును మొదట పంజాబ్‌లోని జ్వాలాముఖి, బరోడా వద్ద కనుక్కున్నారు. నహర్‌కటియా, హుగ్రీజన్‌ ప్రాంతాల్లో ఈ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బిజయ్‌పుర్, గుజరాత్‌లోని వాగోడియాల వద్ద గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌) ఆధ్వర్యంలో సహజ వాయువును వెలికితీశారు. 1960ల్లోనే సహజ వాయువును ఇంధనంగా వినియోగించడం ప్రారంభమైంది. 2020-21 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం సహజ వాయువు నిల్వలు 1371.89 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం సహజ వాయువులో 75 శాతం ఓఎన్‌జీసీ కంపెనీ వెలికితీస్తోంది.

సంప్రదాయ ఇంధనాలు

బొగ్గు: ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరుల్లో ముఖ్యమైంది బొగ్గు. దీన్నే నల్లబంగారం అంటారు. అనాదిగా పరిశ్రమలకు, మన దేశంలో విద్యుదుత్పత్తికి ఇది ప్రధాన ఇంధనం. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో నేటికీ 50 శాతంపైగా బొగ్గు ద్వారానే జరుగుతోంది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉంది. మొదటి స్థానం చైనాది. బొగ్గు నిల్వల పరంగా భారత్‌ ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. భూమి పొరల్లో ఈ బొగ్గు ఎంత లోతు లో ఉంటే అంత నాణ్యంగా ఉంటుంది. మన దేశంలో రెండు రకాల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.

గోండ్వానా రకం: ఇది కార్బోనిఫెరస్‌ యుగంలో ఏర్పడింది. ఈ నిల్వలు మహానది, సోన్‌నది, నర్మద, దామోదర్‌ నదీ లోయ ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలోని మొత్తం బొగ్గు నిల్వల్లో 98 శాతం పైగా ఈ రకమైనవే. ఇవి నాణ్యమైన ఆంత్రసైట్, బిట్యుమినస్‌ రకానికి చెందినవి.

టెర్షియరీ రకం: ఇది తృతీయ మహాయుగపు బొగ్గు. మొత్తం బొగ్గులో ఈ రకం కేవలం 2 శాతం మాత్రమే. ఇది లిగ్నైట్‌ రకానికి చెందింది. అస్సాంలోని శివాలిక్‌ కొండల వద్ద, రాజస్థాన్, కశ్మీర్‌లో, తమిళనాడులోని కడలూర్‌ జిల్లా నైవేలి, గుజరాత్‌లోని కచ్‌లో లభిస్తుంది.

బొగ్గు రకాలు: బొగ్గు ఏర్పడే క్రమంలో విభిన్న రకాల ఒత్తిడులు, ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి, కాలం ఆధారంగా అవి అనేక విధాలుగా ఉంటాయి. మందం, గట్టిదనం, తేమ శాతం, బూడిద రకాల ఆధారంగా బొగ్గును వర్గీకరిస్తారు.

ఆంత్రసైట్‌: ఇది నాణ్యమైన రకం. నలుపు రంగులో, దృఢంగా ఉంటుంది. ఇందులో 80 శాతం పైగా కర్బనం ఉంటుంది. జమ్ము-కశ్మీర్‌లో లభిస్తుంది. నీలి రంగు మంటను ఇస్తుంది.

బిట్యుమినస్‌ బొగ్గు: ఇది మెత్తగా/మృదువుగా ఉంటుంది. దేశంలో ఈ రకమే అధిక మోతాదులో ఉంది. దీనిలో కర్బనం 40-80 శాతం, 15-40 శాతం తేమ ఉంటాయి. నలుపు రంగులో, మందంగా ఉంటుంది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ల్లో లభిస్తుంది.

లిగ్నైట్‌: దీన్ని గోధుమ రంగు బొగ్గు అంటారు. 40-55 శాతం కర్బనం, 35 శాతం తేమ ఉంటాయి. నైవేలీ (తమిళనాడు), పల్నా (రాజస్థాన్‌), లక్ష్మీపుర్‌ (అస్సాం), కారేవా (జమ్ము- కశ్మీర్‌)లలో లభిస్తుంది. దేశంలో లిగ్నైట్‌ నిక్షేపాలు తమిళనాడులో అధికంగా ఉన్నాయి.

పీట్‌: బొగ్గుగా మారే క్రమంలో ఏర్పడే రకమిది. దీనిలో 40-50% కర్బనం ఉంటుంది. కాల్చినప్పుడు పొగ, బూడిద ఎక్కువగా వస్తాయి.

బొగ్గు ఉత్పత్తి: 90 శాతం పైగా ఉపరితల గనుల ద్వారా జరుగుతోంది.

ఉత్పత్తిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు: ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. బొగ్గు ఎగుమతులు: మన దేశం నుంచి నేపాల్, బంగ్లాదేశ్‌లకు ఎక్కువ.

దిగుమతులు: ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి అధికం.

అణువిద్యుత్తు శక్తి

అణుశక్తికి కావాల్సిన యురేనియం, థోరియం వంటి ఖనిజాలు కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఇల్మినైట్, మోనజైట్‌ ఖనిజాల రూపంలో లభిస్తాయి. ఇల్మినైట్‌ నుంచి టిటానియం, మోనజైట్‌ నుంచి థోరియం లభిస్తాయి. అణుశక్తి ఉత్పత్తి 1970లో బొంబాయిలో జరిగింది. దేశంలో ప్రస్తుతం 7 ప్రాంతాల్లో అణువిద్యుత్తు కేంద్రాలున్నాయి. అవి తారాపుర్‌ (మహారాష్ట్ర), రావత్‌భాటా (రాజస్థాన్‌), కల్పకం (చెన్నై), నరోరా (ఉత్తర్‌ప్రదేశ్‌), కాక్రపార (గుజరాత్‌), కైగా (కర్ణాటక), కూడంకుళం (తమిళనాడు). మన దేశంలో యురేనియం తవ్వకానికి అనుమతి ఉన్న సంస్థ ‘యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’. దీన్ని 1967లో ఏర్పాటు చేశారు. కేంద్ర అణుశక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీని నిర్వహణలో ఝార్ఖండ్‌లో యురేనియం గనులు (6 భూగర్భ, ఒక ఉపరితల) ఉన్నాయి. కొత్తగా మూడు ప్రదేశాల్లో యురేనియం ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. అవి తుమ్మలపల్లె (కడప జిల్లా), కిలాంగ్‌ (మేఘాలయ). లంబాపుర్‌ - పెద్దగట్టు (నల్గొండ జిల్లా. ఇది ప్రతిపాదిత ప్రాజెక్టు).

దేశంలో మొత్తం చమురుశుద్ధి కర్మాగారాలు: 23, అందులో 18 ప్రభుత్వరంగ సంస్థలు, 3 ప్రైవేట్‌ రంగం, 2 సంయుక్త భాగస్వామ్యం.

అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది.

అతి చిన్న కర్మాగారం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని