నిర్ణయాలకు ముందు...

ఇష్టమైన కోర్సా... డిమాండ్‌ ఉన్న కోర్సా... దేన్ని ఎంచుకోవాలి? ప్రభుత్వ కొలువా? ఎంఎన్‌సీ కంపెనీనా... ఏ ఉద్యోగంలో చేరితే పదోన్నతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి... ఇలాంటి సందర్భాల్లో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితి విద్యార్థులకు ఎదురవుతుంటుంది.

Published : 20 Oct 2022 01:27 IST

ఇష్టమైన కోర్సా... డిమాండ్‌ ఉన్న కోర్సా... దేన్ని ఎంచుకోవాలి? ప్రభుత్వ కొలువా? ఎంఎన్‌సీ కంపెనీనా... ఏ ఉద్యోగంలో చేరితే పదోన్నతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి... ఇలాంటి సందర్భాల్లో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితి విద్యార్థులకు ఎదురవుతుంటుంది.
డిగ్రీ తర్వాత స్నేహితులందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు. రోహిత్‌ మాత్రం స్టార్టప్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుల సందేహాలను, భయాలను లెక్కపెట్టకుండా ముందడుగు వేశాడు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించిన అతడి నిర్ణయాన్ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు.
సాధారణంగా ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తుంటాం. మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల జీవితంలో ఎన్నో మార్పులూ వస్తుంటాయి. అయితే అన్నీ సత్ఫలితాలనే ఇవ్వవు. వాటిల్లో కొన్ని పొరపాటువీ ఉంటాయి. ఆ తర్వాత వాటి వల్ల పశ్చాత్తాప పడే పరిస్థితీ వస్తుంటుంది. అలా కాకూడదంటే...

* బలవంతంగానో లేదా ఎవరో ఏదో అనుకుంటారనే మొహమాటంతోనే ఒక నిర్ణయానికి రాకూడదు. అది ఎప్పుడూ మీ ఆసక్తి, అభిరుచులకు అద్దం పట్టాలి.
* తీసుకోబోయే నిర్ణయం వల్ల కలిగే సానుకూల, ప్రతికూల ఫలితాలను ఒకచోట రాసి చూసుకోవాలి. సానుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటే దాన్ని అంతటితో వదిలేయాలి. తర్వాత మరో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది.
* అతి ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల అనర్థాలే ఎక్కువ. ఇలా చేస్తున్నారంటే.. వాస్తవ పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారని అర్థం. అతి నమ్మకంతో సమస్యను తేలిగ్గా తీసుకుని నిర్ణయం తీసుకుంటే నష్టపోయే ప్రమాదమే ఎక్కువ.
*నిర్ణయాలు తీసుకోవడంలో ఊహల కంటే వాస్తవ పరిస్థితులకే ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు మీరో ప్రముఖ కాలేజీలో చేరాలనుకున్నారు. అక్కడ మీకు నచ్చిన కాంబినేషన్లలో కోర్సు అందుబాటులో లేదు. అయినాసరే అక్కడే చదవాలనుకున్నారు కాబట్టి దాంట్లోనే చేరితే ఇబ్బందిపడతారు. ఇష్టంలేని కోర్సును మనసు పెట్టి చదవలేరు, చక్కని మార్కులనూ పొందలేరు.
* అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడానికి వెనకాడకూడదు. పదేపదే నిర్ణయాలను మార్చేయడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆ తర్వాత తెలివిగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీకు లేదని తెలుసుకుని బాధపడతారు.
* చదవాల్సిన కోర్సు, చేరాల్సిన కాలేజీ, ఉద్యోగం లాంటి ముఖ్యమైన విషయాల్లో  నిర్ణయానికి వచ్చే ముందు  స్నేహితులు, సీనియర్లు, కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అనుభవజ్ఞుల సలహాలతో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల అనుభవాల నుంచీ పాఠాలు నేర్చుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని