Published : 20 Nov 2022 01:24 IST

దేశం కోసం.. తెలంగాణ సైతం!

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

దేశవ్యాప్తంగా సాగిన జాతీయోద్యమం హైదరాబాద్‌ రాజ్యంలోనూ రగిలింది. నాయకత్వం వహించిన నేతలకు బహిష్కరణ శిక్ష విధించేందుకు నాటి ప్రభుత్వం ప్రయత్నించింది. పోరాటాల్లో హిందువులను భాగస్వాములను చేస్తున్న భజన మండళ్లను రద్దు చేసింది. నిరంకుశత్వంతో ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఖిలాఫత్‌ కోసం కదంతొక్కిన జనాన్ని అణచివేసేందుకు ఫర్మానాలు జారీ చేసింది. ఎన్ని చర్యలు చేపట్టినా, ఎంతటి ఆంక్షలను అమలు చేసినా మతాలకు అతీతంగా దేశం కోసం తెలంగాణ నాయకులు, విద్యార్థులు సహా ఎందరో స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. అటు ఆంగ్లేయులను, ఇటు నిజాం నవాబులను కలవరపాటుకు గురిచేశారు.


తెలంగాణలో స్వాతంత్య్ర పోరాటం

భారత స్వాతంత్య్రోద్యమ ప్రభావం తెలంగాణపై ఉండేది. వివిధ సంస్థలు,   గ్రంథాలయాలు, పత్రికల ప్రభావం వల్ల ఇక్కడి ప్రజలు చైతన్యవంతులై నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు.

స్వదేశీ ఉద్యమం

మహారాష్ట్రలో బాలగంగాధర్‌ తిలక్‌ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమ ప్రభావం హైదరాబాద్‌  ప్రజలపై పడింది. అందులో భాగంగానే 1906-07లో సమావేశాలు జరిపి స్వదేశీ ఉద్యమ ప్రచారం నిర్వహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉద్యమంలో ఆర్య సమాజ నాయకులైన కేశవరావ్‌ కొరాట్కర్‌, దామోదర్‌ సత్వలేకర్‌ కీలకపాత్ర పోషించారు. నిజాం ప్రభుత్వం తమకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించనుందని తెలుసుకున్న దామోదర్‌ సత్వలేకర్‌, అప్పాజీ తులజా పూరేకార్‌లు స్వచ్ఛందంగా హైదరాబాద్‌ను వదలి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. తిలక్‌కు 1908లో మాండలే జైలు శిక్ష విధించిన మేజిస్ట్రేట్‌ జాక్‌సన్‌ ఆ తర్వాత నాసిక్‌ జిల్లా   కలెక్టర్‌గా నియమితుడయ్యాడు. రహస్య విప్లవ సంఘంలో సభ్యుడైన అనంత లక్ష్మణ కనారే అనే విద్యార్థి జాక్‌సన్‌ను కాల్చి చంపాడు. 1907లో సూరత్‌ కాంగ్రెస్‌లో జరిగిన గొడవల ప్రభావం హైదరాబాద్‌ రాజ్యంపై పడింది. 1908లో తిలక్‌ నిర్బంధం తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట లాంటి చోట్ల తిలక్‌ పేరుతో చందాలు వసూలయ్యాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భజన మండళ్లు ఏర్పడి హిందువులను స్వాతంత్య్రోద్యమంలోకి ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే ప్రభుత్వం భజన మండళ్లను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దేశ ప్రముఖ నాయకుల పటాలు, వందేమాతరం నినాదం ఉన్న అగ్గిపెట్టెలు, లాకెట్లు, గుండీలు, ‘స్వదేశీవే కొనండి’ అనే స్టిక్కర్‌ ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలంటూ స్వదేశీ ఉద్యమం ప్రచారం చేసింది. హైదరాబాద్‌ నగరంలో ‘ఫక్త్‌ ఆఫ్‌ రూల్స్‌’ అనే సంస్థ స్వదేశీ వస్తువులనే వాడాలని తెలుపుతూ బహిరంగంగానే కరపత్రాలు విడుదల చేసింది.

అంజుమన్‌ ఇక్వాన్‌-సఫా (ది బ్రదర్‌హుడ్‌ సొసైటీ) అనే సంస్థ నిజాం రాజ్యంలో స్వదేశీ   ఉద్యమాన్ని ప్రచారం చేసింది. హైదరాబాద్‌లోని ‘ఫర్డ్‌ అఫ్రోజ్‌’ అనే సంస్థ స్వదేశీ వస్త్రాలు వినియోగించాలని, అందుకోసం దుకాణాలు తెరవాలని కరపత్రాలను విడుదల చేసింది. నిజాం రాజ్యంలోని హిందువుల్లో నానాటికీ పెరుగుతున్న సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని చూసిన ప్రభుత్వం కలవరపడింది. తన నిరంకుశత్వాన్ని తీవ్రం చేసింది. హిందూ సంస్కృతి వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆనాటి నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ 1905లో జిల్లాలు, పట్టణాల పేర్లు మార్చాడు. దాంతో ఎలుగందల-కరీంనగర్‌గా, ఇందూరు-నిజామాబాద్‌గా, పాలమూరు-మహబూబ్‌నగర్‌గా, మెతుకు-మెదక్‌గా, మానుకోట-మహబూబాబాద్‌గా, భువనగిరి-భోంగీర్‌గా మారాయి. అదేవిధంగా ‘పాడు’ అనే పదంతో పూర్తయ్యే స్థలాల పేర్లకు పహడ్‌ను చేర్చాడు. జాతీయ కాంగ్రెస్‌ ప్రభావం వల్ల 1918లో హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ఏర్పడింది. దీన్ని వామన్‌ నాయక్‌ స్థాపించి తొలి అధ్యక్షుడయ్యాడు. వామన్‌ నాయక్‌ 1907లో గుల్బర్గాలో హైస్కూల్‌ను ప్రారంభించి కర్ణాటక ప్రాంతంలో విద్యావ్యాప్తికి తోడ్పడ్డాడు.

తారానాథ్‌: తారానాథ్‌ రాయచూరు నివాసి. జాతీయ విద్యాబోధన కోసం 1920లో రాయచూరులో హందర్ద్‌ పాఠశాలను స్థాపించాడు. ఈయన మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో వ్యాసం రాస్తూ అప్పటి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ను ఇండియన్‌ డయ్యర్‌గా వర్ణించాడు. ఫలితంగా తారానాథ్‌ను నిజాం రాజ్యం నుంచి బహిష్కరించారు. ఈయన తుంగభద్రా నది వద్ద నిజాం రాజ్య సరిహద్దుల్లో ‘హేమాయతనం’ పేరుతో ఆశ్రమాన్ని స్థాపించాడు. అక్కడి నుంచే ‘ప్రేమ’ అనే పత్రికను ప్రారంభించి దాని ద్వారా జాతీయ భావన, స్వదేశీ ఆదర్శాలను వ్యాపింపజేశాడు. విద్యావిధానంలో విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా వినూత్న మార్పులను ప్రవేశపెట్టాడు.  ఆ విధానాలే తర్వాత గాంధీజీ పర్యవేక్షణలో ‘నయీతాలీం’ అనే పేరుతో  అమలయ్యాయి. తారానాథ్‌ ‘న్యూ నేషనల్‌ ఎడ్యుకేషన్‌’ అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు.

ఖిలాఫత్‌ ఉద్యమం

1919లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మెసపటోమియా, అరేబియా, సిరియా, పాలస్తీనాలపై టర్కీ అధికారాన్ని బ్రిటన్‌ గుర్తించలేదు. ముస్లిం ప్రపంచానికి ముఖ్యుడైన ఖలీఫా పదవిని ఆంగ్లేయులు రద్దు చేశారు. దీంతో ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని భారతదేశంలోని ముస్లింలు ఆందోళన చేపట్టారు. అదే ఖిలాఫత్‌ ఉద్యమం. మహాత్మాగాంధీతోపాటు జాతీయ కాంగ్రెస్‌ మద్దతు పొందిన ఈ ఉద్యమం హైదరాబాద్‌ రాజ్యంలోనూ జరిగింది. 1920, మార్చి 19న దేశవ్యాప్తంగా జాతీయ సంతాపదినాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ముల్లా అబ్దుల్‌ బాసిద్‌ ఆధ్వర్యంలో ‘ది రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ’ సంస్థ రూ.లక్షకు పైగా చందా వసూలు చేసి నాటి టర్కీ ప్రధానమంత్రికి పంపింది. 1920 మార్చి, ఏప్రిల్‌ల్లో యూమ్‌-ఇ-ఖిలాఫత్‌ (ఖిలాఫత్‌ జయంతి)ని హైదరాబాద్‌, ఔరంగాబాద్‌, రాయచూరు, గుల్బర్గా, కరీంనగర్‌, మెదక్‌, జనగామలలో నిర్వహించారు. బారిస్టర్‌ అస్‌ఘార్‌, హసన్‌, మహ్మద్‌, ముర్తుజా, వామన్‌నాయక్‌, కేశవరావ్‌ కొరాట్కర్‌, పండిత దిగంబర దాసు చౌదరి, ఎం.నరసింగరావు, రాఘవేంద్రశర్మ తదితర నాయకులు ఖిలాఫత్‌ ఉద్యమానికి నాయకత్వం వహించారు. జమీందారు, సియాసత్‌, జమానా లాంటి పత్రికలు ఖిలాఫత్‌ ఉద్యమాన్ని హైదరాబాద్‌ రాజ్యంలో ప్రచారం చేశాయి. ‘అల్‌ హిలాల్‌’ పత్రిక మౌలానా ఆజాద్‌ సంపాదకత్వంలో హైదరాబాద్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. 1920, ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాల  మైదానంలో యూమ్‌-ఇ-ఇంతిహాన్‌ (పరీక్షా దినం) నిర్వహించే సందర్భంగా గొప్ప సభ జరిగింది. మౌల్వీ సయ్యద్‌ జమద్‌ అలీషా అధ్యక్షత వహించాడు. 1920, మే 5న నగరంలో హర్తాళ్‌, ఐక్యతా దినం పాటించారు. పరిస్థితులు చేజారుతున్నాయనే సాకుతో 1921, సెప్టెంబరు 14న నిజాం ప్రభుత్వం ఫర్మానా జారీ చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు జరపకూడదని పేర్కొంది. దీంతో ఖిలాఫత్‌ ఉద్యమం ఆగిపోయింది.

సహాయ నిరాకరణోద్యమం

గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమ ప్రభావంతో హైదరాబాద్‌లో చరఖాలతో భారీగా నూలు వడకడం, ఖద్దరు లాల్చీలు, టోపీలు ధరించడం ప్రారంభమైంది. బ్రిటిష్‌ రెసిడెన్సీలో ఉండే మస్లేకర్‌ చరఖాలు చేయించి అమ్మేవాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన సరపోజి ఖద్దరు వడికే పారిశ్రామిక సంస్థను స్థాపించాడు. బద్రుల్‌ హసన్‌, జఫ్‌పార్‌ హసన్‌, బారిస్టర్‌ శ్రీకృష్ణ, పద్మజా నాయుడు ఖాదీ ఉద్యమ వ్యాప్తికి పాటుపడ్డారు. బద్రుల్‌ హసన్‌ బొంబాయిలో చరఖాలు కొని హైదరాబాద్‌కు తెప్పించి పంపిణీ చేసేవాడు. ఆయనే హైదరాబాద్‌ బుక్‌ డిపో అనే పేరుతో పుస్తక విక్రయశాలను నెలకొల్పాడు. హిందూ, ముస్లిం ఉద్యమకారులు ఇక్కడ కలుసుకుని చర్చించుకునేవారు. ఖాదీ గురించి మహ్మద్‌ జహర్‌ అహ్మద్‌ రాసిన వ్యాసాలను హైదరాబాద్‌లోని ముషీరె దక్కన్‌ పత్రిక, ఉత్తర హిందూస్థాన్‌లోని మదీనా అర్ధ వార పత్రికలు ప్రచురించేవి. కేశవరావ్‌ కొరాట్కర్‌, రాఘవేంద్ర శర్మ, బద్రుల్‌ హసన్‌, వామన్‌ నాయక్‌లు రెసిడెన్సీ బజారులో ఒక రహస్య సంఘాన్ని   ఏర్పరిచి తిలక్‌ స్వరాజ్య నిధి కోసం పనిచేశారు.1921, అక్టోబరు 2న గాంధీజీ 53వ జన్మదినోత్సవాన్ని  హైదరాబాద్‌లో నిర్వహించారు. బ్రిటిష్‌ ఇండియాలో చదివే హైదరాబాద్‌ విద్యార్థులు సహాయ   నిరాకరణోద్యమానికి ప్రభావితులై తమ చదువులను ఆపేశారు. 1921లో బొంబాయిలోని గ్రాంట్‌ మెడికల్‌  కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జయసూర్య తన చదువుకు స్వస్తి పలికాడు.  అలీగఢ్‌లో చదువుతున్న హైదరాబాద్‌ విద్యార్థులు ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజీని విడిచిపెట్టి, మహ్మదాలీ స్థాపించిన నేషనల్‌ కాలేజీలో చేరారు. మాడపాటి హనుమంతరావు, వామన్‌ నాయక్‌, బారిస్టర్‌ శ్రీకృష్ణ, రాఘవేంద్రరావు, విశ్వేశ్వరనాథ్‌లు హిందీని అభ్యసించాలంటూ ఉద్యమం ప్రారంభించారు.

మాదిరి ప్రశ్నలు

1. హైదరాబాద్‌ బుక్‌ డిపోను ఎవరు నెలకొల్పారు?

1) శ్యామ్‌ రావు  2) నిత్యానంద  3) తారానాథ్‌   4) బద్రుల్‌ హసన్‌

2. హిందూ పత్రికలో నిజాంను ‘ఇండియన్‌ డయ్యర్‌’గా వర్ణించినవారు?

1) సరపోజి    2) తారానాథ్‌   3) వీరభద్రుడు  4) హనుమంతరావు

3. హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?

1) 1912      2) 1915      3) 1918      4) 1922

4. గుల్బర్గాలో నూతన విద్యాలయ హైస్కూల్‌ను ఎవరు ప్రారంభించారు?

1) వామన్‌ నాయక్‌   2) తారానాథ్‌   3) రాఘవేంద్ర రావు   4) సరపోజి

5. హైదరాబాద్‌ నగరంలో స్వదేశీ వస్తువులనే వాడాలని తెలుపుతూ కరపత్రాలు పంపిణీ చేసిన సంస్థ ఏది?

1) ఫక్త్‌ ఆఫ్‌ రూల్స్‌    2) అంజుమన్‌    3) ఇక్వాన్‌-సఫా    4) క్రిసెంట్‌

6. హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రథమ అధ్యక్షుడు ఎవరు?

1) తారానాథ్‌    2) రాఘవేంద్ర శర్మ   3) వామన్‌ నాయక్‌    4) కేశవరావ్‌ కొరాట్కర్‌

7. యూమ్‌-ఇ-ఖిలాఫత్‌ (ఖిలాఫత్‌ జయంతి)ని ఎప్పుడు నిర్వహించారు?

1) 1918     2) 1919      3) 1920       4) 1921

8. మహబూబ్‌నగర్‌లో ఖద్దరు వడికే పారిశ్రామిక సంస్థను ఎవరు ప్రారంభించారు?

1) సరపోజి   2) బద్రుల్‌ హసన్‌    3) జఫ్‌పార్‌   4) మస్లేకర్‌

సమాధానాలు: 1-4,  2-2,   3-3,  4-2,  5-1,  6-3,  7-3,  8-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని