Updated : 21 Nov 2022 01:25 IST

అలవాటుపడేదెలా?

విద్యార్థులు, ఉద్యోగార్థులూ కాలేజీలు... కోచింగ్‌లని ఎక్కడికెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. ఉన్నతవిద్య అభ్యసించేవారు చాలామంది రాష్ట్రాలు దాటుతుంటారు.. విదేశాలకువెళ్లేవారి సంఖ్యా ఎక్కువే! అలా వెళ్లేటప్పుడు వారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఆహారం ఒకటి. అంతగా అలవాటు లేని ఆహార పదార్థాలను తినాల్సిరావడం, ఇంటి భోజనాన్ని మిస్‌ కావడం జరుగుతుంటుంది. అలా అని సరైన పోషణ లేకపోతే చదువు, కెరియర్‌పై ధ్యాస పెట్టేదెలా? అందుకే దీన్ని ఎలా ఎదుర్కోవచ్చో చూద్దాం...

లాంటి సమయాల్లో ఎక్కువగా పాటించాల్సిన నియమం ఎంతోకొంత వంట నేర్చుకోవడం. బయట లభించే ఆహారం ఇంట్లో చేసిన వాటి నాణ్యతకు ఎప్పుడూ సాటిరాదు. హాస్టళ్లలో కాకుండా సొంతంగా గదుల్లో ఉండేవారికి ఇది ఆచరణీయమైన పద్ధతి. దీనివల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు, ఖర్చులు తగ్గి.. డబ్బూ ఆదా అవుతుంది.

* కొన్నిసార్లు మరీ బోర్‌ కొడితే ఏ ఇండియన్‌ రెస్టారెంట్‌కో, మన దేశంలో అయితే తెలుగు భోజనశాలలకో వెళ్లొచ్చు... కానీ అక్కడ భోజనం పూర్తిగా మన సొంతూళ్లో ఉన్నట్టు ఉండదనే విషయం గమనించాలి. కొంతమేరకు స్థానికత ప్రభావితం చూపిస్తుంది. అందువల్ల ఎంత తక్కువ అంచనాలతో వెళ్తే అంత మంచిది, హాయిగా తినేయొచ్చు.

* మనలాగే వచ్చి.. ఆహారానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నవారితో బృందంగా ఏర్పడవచ్చు. ఖాళీ సమయాల్లో అందరూ కలిసి వంట చేసుకోవడం, సరదాగా గడపడం వల్ల పరిచయాలు - బంధాలు పెరుగుతాయి.

* వీలైనంత వరకూ స్థానిక ఆహార పదార్థాల్లో వివిధ వెరైటీలు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు మెల్లగా వాటికి అలవాటు పడతాం. ఒకటి కాకపోతే ఒకటైనా మనకు నచ్చినది లభించవచ్చు.

* మనకు బాగానచ్చే సొంతూరి చిరుతిళ్లు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. దీని వల్ల లోకల్‌ రుచి మరీ కోల్పోతున్నామనే భావన కలగకుండా ఉంటుంది.

* వేరే ఆహారం తీసుకునేటప్పుడు అందులో వాడే ముడి పదార్థాలు వీలైనంతగా మనకి బాగా అలవాటు అయినవి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు కాస్త తెలిసిన భోజనం తింటున్న భావన కలుగుతుంది, అదే సమయంలో ఒంటికీ బాగుంటుంది.

* నిజానికి ఇప్పుడు కాస్త అన్నిచోట్లా అన్ని రకాలైన ఆహారం, వండుకునేందుకు సరుకులు దొరుకుతున్నాయి. అందువల్ల మరీ భయపడాల్సిన పనైతే లేదు.

* దేనికైనా కొంత సమయం పడుతుంది. వెంటనే కంగారుపడకుండా మెల్లగా అలవాటు చేసుకోవడానికీ, సర్దుకుపోవడానికీ ప్రయత్నించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts