సలహాలు పాటిస్తూ.. విచక్షణ వినియోగిస్తూ!

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల అధిపతులుగా వ్యవహరించే గవర్నర్‌లకు రాజ్యాంగం పలురకాల అధికారాలను అప్పగించింది. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వంలోని కీలక పదవులకు రాజ్‌భవన్‌ అధినేత  నియామకాలు జరుపుతారు. పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగే విధంగా పర్యవేక్షిస్తారు.

Published : 23 Nov 2022 00:47 IST

భారత రాజ్యాంగం, రాజకీయాలు

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల అధిపతులుగా వ్యవహరించే గవర్నర్‌లకు రాజ్యాంగం పలురకాల అధికారాలను అప్పగించింది. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వంలోని కీలక పదవులకు రాజ్‌భవన్‌ అధినేత  నియామకాలు జరుపుతారు. పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగే విధంగా పర్యవేక్షిస్తారు. మంత్రిమండలి సలహా మేరకు పాలన సాగిస్తారు. అవసరమైన సందర్భాల్లో విచక్షణాధికారాలను వినియోగిస్తారు. పాలనా యంత్రాంగం విఫలమై రాష్ట్రపతి పాలన వస్తే వాస్తవ కార్యనిర్వ హణా ధికారిగా వ్యవహరిస్తారు.  అందుకే రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆ పదవికి సంబంధించిన అధికారాలు, విధులపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

గవర్నర్‌ - అధికారాలు, విధులు

గవర్నర్‌ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రానికి ప్రథమ పౌరులు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలన్నీ గవర్నర్‌ పేరు మీదే జరుగుతాయి. సందర్భానుసారం రాజ్యాంగపరంగా అధికారాలను వినియోగిస్తారు.

కార్యనిర్వాహక అధికారాలు

ఆర్టికల్‌ 154: గవర్నర్‌ రాష్ట్రాధినేత, రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. రాష్ట్ర పరిపాలన గవర్నర్‌ పేరు మీద నిర్వహించాలి.

ఆర్టికల్‌ 163(1): గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది.

ఆర్టికల్‌ 164(1): శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ సాధించిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో  తప్పనిసరిగా గిరిజన సంక్షేమ మంత్రిని నియమించడం సంబంధిత రాష్ట్రాల గవర్నర్ల బాధ్యత. 94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006 ద్వారా గిరిజన సంక్షేమ మంత్రి రాష్ట్ర మంత్రివర్గంలో తప్పనిసరిగా ఉండాలనే నియమం నుంచి బిహార్‌ను తొలగించారు.

కీలకమైన పదవులకు నియామకాలు: గవర్నర్‌ రాష్ట్రంలోని మరికొన్ని కీలకమైన పదవులకు నియామకాలు జరుపుతారు.    ఆర్టికల్‌ 165 - రాష్ట్ర ప్రభుత్వానికి

ప్రధాన న్యాయ సలహాదారుడైన రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌. ఆర్టికల్‌ 316 - రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు. ఆర్టికల్‌ 243 - రాష్ట్ర ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌, సభ్యులు. ఆర్టికల్‌ 243  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌. ఆర్టికల్‌ 233 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు దిగువస్థాయి న్యాయస్థానాలకు న్యాయమూర్తులు.

శాసనాధికారాలు

ఆర్టికల్‌ 168 - గవర్నర్‌ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం. శాసనసభ అంటే గవర్నర్‌, విధాన సభ, విధాన పరిషత్తు (ఒకవేళ విధాన పరిషత్తు ఉంటే) అని అర్థం. ఆర్టికల్‌ 171 - కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న విశిష్ట వ్యక్తులను విధాన పరిషత్తులోని మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు నామినేట్‌ చేస్తారు. ఆర్టికల్‌ 174 - శాసనసభ సమావేశాలను ప్రారంభించడం (సమన్స్‌), దీర్ఘకాలంపాటు వాయిదా వేయడం (ప్రొరోగ్‌), విధానసభ రద్దు (డిజాల్వ్‌) లాంటి అధికారాలను కలిగి ఉంటారు. ఆర్టికల్‌ 175 - శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్టికల్‌ 176 - శాసనసభకు ప్రత్యేక సందేశాలను పంపవచ్చు.  ఆర్టికల్‌ 186 - విధానసభకు ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ అందుబాటులో లేనప్పుడు సభా సమావేశాల నిర్వహణకు సభలోని సభ్యుల్లో ఒకరిని నామినేట్‌ చేస్తారు. ఆర్టికల్‌ 192 - కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసుల మేరకు శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు. ఆర్టికల్‌ 200 - శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్‌ ఆమోదముద్రతో చట్టాలవుతాయి.
ఆర్టికల్‌ 201 - రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల్లో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని భావిస్తే గవర్నర్‌ వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. ఆర్టికల్‌ 213 - ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారం.

రాష్ట్ర శాసనసభ సమావేశాలు అందుబాటులో లేనప్పుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సిఫారసుల మేరకు గవర్నర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 213 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు. అది చట్టంతో సమానం.

ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవితకాలం: శాసనసభ సమావేశమైన ఆరు వారాలు లేదా ఆరు నెలల ఆరు వారాలు లేదా 7 1/2 నెలలు లేదా 222 రోజులు. గవర్నర్‌ జారీ చేసే ఆదేశం ఆ గడువులోగా శాసనసభ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే రద్దవుతుంది. ఆర్టికల్‌ 333 - రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేస్తారు. 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ప్రకారం ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు. ఇది 2020, జనవరి 25 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్థికాధికారాలు

ఆర్టికల్‌ 199 - ఆర్థిక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి.ఆర్టికల్‌ 202 - రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గవర్నర్‌ అనుమతితోనే శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఆర్టికల్‌ 293 - రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రుణాలు సేకరించాలంటే సంబంధిత బిల్లులను గవర్నర్‌ అనుమతితోనే శాసన   సభలో ప్రవేశపెట్టాలి. ఆర్టికల్‌ 243 - అయిదేళ్లకొకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్‌ 267(2) - రాష్ట్ర అసంఘటిత నిధి గవర్నర్‌ నియంత్రణలో ఉంటుంది.

న్యాయాధికారాలు

ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష/న్యాయాధికారాలు ఉంటాయి. మరణ శిక్షలు, సైనిక కోర్టులు విధించే శిక్షలు, కేంద్రం శాసనాల ధిక్కరణకు విధించిన శిక్షలు మినహాయించి మిగిలిన అన్ని శిక్షలకు రాష్ట్రపతి మాదిరిగానే గవర్నర్‌ క్షమాభిక్ష ప్రసాదించవచ్చు.

విచక్షణాధికారాలు

రాష్ట్ర విధాన సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు.

విధానసభ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే గవర్నర్‌ తన విచక్షణతో ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఆ విధంగా నియమితులైన ముఖ్యమంత్రి నిర్ణీత గడువులోగా విధానసభలో తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు.

మంత్రిమండలి రద్దు విషయంలో: విధాన సభలో మెజార్టీ కోల్పోయిన ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలిని రద్దు చేసే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్‌ విధాన సభ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే మంత్రిమండలిని రద్దు చేసిన సందర్భాలున్నాయి. ఉదా: 1984లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి, నాదెండ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రిగా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రాంలాల్‌ నియమించారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో రాంలాల్‌ను గవర్నర్‌ పదవి నుంచి తొలగించారు.

శాసనసభ రద్దు విషయంలో: శాసన సభ కాలపరిమితి పూర్తికాకుండానే గవర్నర్‌ శాసనసభను రద్దు చేయవచ్చు. శాసనసభను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చేసిన సిఫారసును గవర్నర్‌ పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

ఉదా:  ః 1985లో ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు మేరకు నాటి గవర్నర్‌ శంకర్‌దయాళ్‌ శర్మ శాసనసభను రద్దు చేశారు.

1994లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దు చేయాలని నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు చేసింది. కానీ అప్పటి గవర్నర్‌ కె.కృష్ణకాంత్‌ తిరస్కరించారు.

2004లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను  నాటి గవర్నర్‌ సుర్జీత్‌సింగ్‌ బర్నాలా రద్దు చేశారు. 

2018లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసును అనుసరించి అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శాసన సభను రద్దుచేశారు.

రాష్ట్రపతి పాలనకు సిఫార్సు (ఆర్టికల్‌ 356): ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనా, శాంతి భద్రతలు క్షీణించినా, తరచూ ప్రభుత్వం పడిపోతున్నా, రాజకీయ అస్థిరత ఏర్పడినా సంబంధిత రాష్ట్రంలో  ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో వాస్తవ కార్యనిర్వాహణాధికారాలను  గవర్నర్‌ నిర్వర్తిస్తారు.

https://tinyurl.com/24pjdrdf


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని