సమస్తం... సమున్నతం!

రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమం, పురోగతి పూర్తిగా మంత్రిమండలి పరిధిలోనే ఉంటుంది. అందులో ఒకరు నాయకులై నిర్దేశిస్తే, సలహాలు-సూచనలతో సభ్యుల బృందం సమష్టిగా యంత్రాంగాన్ని నడిపిస్తుంది. ఆ నిర్ణయాలకు తిరుగు ఉండదు

Published : 30 Nov 2022 02:17 IST

భారత రాజ్యాంగం  రాజకీయాలు

రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమం, పురోగతి పూర్తిగా మంత్రిమండలి పరిధిలోనే ఉంటుంది. అందులో ఒకరు నాయకులై నిర్దేశిస్తే, సలహాలు-సూచనలతో సభ్యుల బృందం సమష్టిగా యంత్రాంగాన్ని నడిపిస్తుంది. ఆ నిర్ణయాలకు తిరుగు ఉండదు. అధికారానికి అడ్డులేదు. విధానాల రూపకల్పన నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు సమస్త విషయాల్లోనూ వాస్తవ అధికారంతో సమున్నత పాలనాకేంద్రంగా క్యాబినెట్‌ వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆ అంశాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి.

ముఖ్యమంత్రి - రాష్ట్ర మంత్రిమండలి

రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవ అధిపతి ముఖ్యమంత్రి. ఆ పదవిని చేపట్టే వారి సమర్థత, పనితీరు, వ్యక్తిత్వంపై ప్రగతి ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడిగా వ్యవహరిస్తూ, పరిపాలనను నిర్వహిస్తారు.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్‌ 163, 164, 167 ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్‌) గురించి వివరిస్తాయి. జాతీయ స్థాయిలో ఉన్నట్లే, రాష్ట్రస్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని  రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం రాష్ట్ర    స్థాయిలో రాష్ట్రాధినేత అయిన గవర్నర్‌కు నామమాత్రపు  కార్యనిర్వాహక అధికారాలు ఉంటే, ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.
ఆర్టికల్‌ 163(1): గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది.
ఆర్టికల్‌ 163(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి పదవీకాలం గవర్నర్‌/విధానసభ విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి కింది కారణాల వల్ల అధికారం కోల్పోతుంది.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు. - విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు. - విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరస్కరణకు గురైనప్పుడు. - విధాన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు. - విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు. - విధానసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఓడిపోయినప్పుడు.
* ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరణించినా, పదవికి రాజీనామా చేసినా, ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించినా మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

నియామకాలు

ఆర్టికల్‌ 164(1): విధానసభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని/రాజకీయ పార్టీల కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమిస్తారు. ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.
ఆర్టికల్‌ 164(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది.
ఆర్టికల్‌ 164(3): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
ఆర్టికల్‌ 164(4): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు గవర్నర్‌ సమక్షంలో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు.
ఆర్టికల్‌ 164(5): ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులు కావాలంటే శాసనసభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యత్వం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులైతే 6 నెలల్లోగా శాసనసభలో సభ్యత్వం పొందాలి. లేకపోతే వారు పదవిని కోల్పోతారు.
ఆర్టికల్‌ 164(6): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.
ఆర్టికల్‌ 167(1): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలను, మంత్రిమండలి జరిపిన తీర్మానాలను   గవర్నర్‌కు ముఖ్యమంత్రి తెలియజేయాలి.
ఆర్టికల్‌ 167(2): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని తనకు తెలియజేయాలని గవర్నర్‌ ముఖ్యమంత్రిని  కోరవచ్చు. గవర్నర్‌కు, రాష్ట్ర మంత్రిమండలికి మధ్య సంధాన కర్తగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.
ఆర్టికల్‌ 167(3): గవర్నర్‌ ఆమోదం కోసం ఏదైనా బిల్లు/ తీర్మానం వచ్చినప్పుడు దాన్ని మొత్తం మంత్రిమండలి సమగ్రంగా పరిశీలించలేదని గవర్నర్‌ భావిస్తే సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని మంత్రిమండలి పునఃపరిశీలనకు పంపవచ్చు. మంత్రిమండలి సంబంధిత బిల్లు/తీర్మానాన్ని పునఃసమీక్షించి/సమీక్షించకుండా రెండోసారి గవర్నర్‌ ఆమోదముద్రకు పంపితే, తప్పనిసరిగా ఆమోదించాలి.

ముఖ్యమంత్రి అధికారాలు - విధులు

* రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరిస్తారు. - రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటులో తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటారు. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీల్లో కొందరు సభ్యులను ఎంపిక చేసుకుని వారి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసి, వారు మంత్రులుగా నియమితులయ్యే విధంగా చూస్తారు. మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు, మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు సలహా ఇస్తారు. రాష్ట్ర మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి సమావేశాల ఎజెండాను నిర్దేశిస్తారు. - శాసనసభకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను శాసనసభలో ప్రకటిస్తారు. శాసనసభ సమావేశాల్లో, శాసనసభ బయట ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం ఉంటుంది. - రాష్ట్ర పరిపాలనకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మంత్రిమండలికి,  గవర్నర్‌కు మధ్య వారధిగా ఉంటారు.
పదవీరీత్యా కింద పేర్కొన్న సంస్థల్లో ముఖ్యమంత్రి సభ్యులుగా ఉంటారు.
జాతీయ అభివృద్ధి మండలి - జాతీయ సమగ్రతా మండలి - నీతి ఆయోగ్‌  - జాతీయ జనాభా కమిషన్‌ - అంతర్‌ రాష్ట్ర మండలి     - జోనల్‌ కౌన్సిల్‌ (ప్రాంతీయ మండలి) - రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

రాష్ట్ర మంత్రిమండలి

రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉంటారు. - ఆర్టికల్‌ 164(1)(తి) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. చిన్న రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య 12 మంది కంటే తక్కువ ఉండకూడదు. - ఆర్టికల్‌ 164(1)(తీ) ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులైన శాసన సభ్యులను ఎలాంటి లాభదాయక పదవిలోనూ నియమించకూడదు.    - ఆర్టికల్స్‌ 164(1)(తి), 164(1)(తీ)లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2003) రాజ్యాంగానికి చేర్చారు.

మంత్రిమండలి - అధికారాలు, విధులు

ప్రభుత్వ విధానాల రూపకల్పన: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, అమలుచేసే బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలిదే. ప్రజల సంక్షేమం కోసం రూపొందించే విధానాలపై మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.

రాష్ట్ర పరిపాలన: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను రాష్ట్ర మంత్రిమండలి నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన సాగిస్తారు. ప్రతి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకుమించిన శాఖల పరిపాలనపై నియంత్రణ, బాధ్యత కలిగి ఉంటారు.

సమన్వయ సాధన: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య మంత్రిమండలి సమన్వయాన్ని పెంపొందిస్తుంది. మంత్రుల మధ్య ఆ సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన లోపభూయిష్టంగా మారుతుంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించి అమలు చేస్తారు.
శాంతి భద్రతల పరిరక్షణ: ఇది రాష్ట్ర జాబితాలోని అంశం. ప్రజల ప్రాణాలను పరిరక్షించి శాంతిభద్రతలను నెలకొల్పడం, సాధారణ ప్రజానీకం శాంతియుత సహజీవనాన్ని సాగించే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

శాసన నిర్మాణంలో పాత్ర: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనలో రాష్ట్ర మంత్రిమండలి కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ మంత్రిమండలి నిర్ణయిస్తుంది. శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసనాల రూపకల్పనలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, దీర్ఘకాలిక వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు సలహాలిస్తుంది.

నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని  ఉన్నతాధికారులందరినీ గవర్నర్‌ పేరుతో మంత్రిమండలి నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది. మంత్రిమండలి ద్వారా జరిగే నియామకాల్లో అడ్వకేట్‌ జనరల్‌, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్త మొదలైన కీలక పదవులు ఉంటాయి.

సమష్టి బాధ్యతా సూత్రాన్ని పాటించడం: ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభ/ విధానసభకు సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో రాష్ట్ర మంత్రిమండలి ఒక సమష్టి జట్టుగా వ్యవహరిస్తుంది. శాసనసభలో విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర మంత్రిమండలి కొనసాగుతుంది.
గవర్నర్‌కు వ్యక్తిగత బాధ్యతను వహించడం: రాష్ట్ర మంత్రిమండలి సభ్యులందరూ తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై గవర్నర్‌కు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాసన   సభలో గవర్నర్‌ ప్రసంగించే ఉపన్యాస సారాంశాన్ని మంత్రిమండలి రూపొందిస్తుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సలహాలు, సహాయాన్ని గవర్నర్‌కు అందిస్తుంది.

ఆర్థికపరమైన విధులు: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై మంత్రిమండలికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విత్త విధానాన్ని మంత్రిమండలి నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రగతికి అవసరమైన వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, విద్యావిధానం,
ప్రణాళికల రూపకల్పన మొదలైన బాధ్యతలను మంత్రిమండలి నిర్వహిస్తుంది. శాసనసభ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలుచేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని