జీవావరణంలో గొలుసులు.. పిరమిడ్‌లు!

ఆహారం ప్రతి జీవికి ప్రాథమిక అవసరం. ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహారపు అలవాటు ఉంటుంది.  కానీ ఏదో ఒక దశలో ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉపయోగపడటం ఈ ఆవరణ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం.

Updated : 01 Dec 2022 06:57 IST

జనరల్‌ స్టడీస్‌  

పర్యావరణ అంశాలు

ఆహారం ప్రతి జీవికి ప్రాథమిక అవసరం. ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహారపు అలవాటు ఉంటుంది.  కానీ ఏదో ఒక దశలో ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉపయోగపడటం ఈ ఆవరణ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం. ఆ విధంగా ప్రకృతిలోని ఆహారపు గొలుసులో ఏ జీవులు ఏయే స్థాయుల్లో ఉన్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి.

జీవుల ఆహారపు అలవాట్లు

ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాల్లో వివిధ జీవజాతుల ఆహారపు అలవాట్లు విభిన్న రకాలుగా ఉంటాయి. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు ఇలా భిన్న ఆహార అలవాట్లతో జీవులుంటాయి. వాటి ఆహార అలవాట్ల ఆధారంగా ఆ జీవులను పలు రకాలుగా విభజించవచ్చు.

ఉత్పత్తిదారులు: తమకు కావాల్సిన ఆహారాన్ని  స్వయంగా తయారు చేసుకుని స్థానబద్ధంగా జీవించే జీవులను ఉత్పత్తిదారులు అంటారు. ఇవి ఇతర జీవులకూ ఆహారాన్ని అందిస్తాయి. వీటినే స్వయం పోషకాలు అంటారు. ఆహార గొలుసులో ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి. సౌరశక్తి నుంచి లేదా వివిధ రసాయన పదార్థాల నుంచి సంక్లిష్ట కర్బన పదార్థాలను తయారుచేసుకుని జీవిస్తాయి.

ఉదా: మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, వృక్ష ప్లవకాలు, బ్యాక్టీరియా.

వినియోగదారులు: ఇవి ఆహార పదార్థాల కోసం ఉత్పత్తిదారులపై లేదా ఇతర వినియోగదారులపై ఆధారపడి జీవించే జీవజాతులు. వీటినే పరపోషకాలు అంటారు. ఆహార అలవాట్లను బట్టి ఈ జీవులను కింది రకాలుగా విభజించారు.

ఎ) ప్రథమ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ప్రథమ పోషక స్థాయిలోని ఉత్పత్తి  దారుల నుంచి పొందుతాయి. వీటిని శాకాహారులుగా  పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో ద్వితీయ పోషక స్థాయిని కలిగి ఉంటాయి.

ఉదా: మిడతలు, గొల్లభామలు, కుందేళ్లు, జింకలు.

బి) ద్వితీయ వినియోగదారులు: ఇవి తమకు    కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారుల నుంచి పొందుతాయి. ఇవి శాకాహారులుగా, మాంసాహారులుగా జీవిస్తాయి. వీటినే ప్రాథమిక మాంసాహారులు లేదా సర్వభక్షకులు అని పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో తృతీయ పోషక స్థాయిని   ఆక్రమిస్తాయి.

ఉదా: మానవులు, కుక్కలు, పిల్లులు, కోళ్లు.

సి) తృతీయ వినియోగదారులు: ఇవి ప్రథమ, ద్వితీయ వినియోగదారులపై ఆధారపడి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను పొందగలుగుతాయి. వీటిని ద్వితీయ మాంసాహారులుగా పరిగణిస్తారు. ఇవి ఆహార గొలుసులో చతుర్థ పోషక స్థాయిని ఆక్రమించి ఉంటాయి.
ఉదా: పెద్ద చేపలు, కొంగలు, గద్దలు, పాములు, నక్కలు, తోడేళ్లు.

డి) అంతిమ వినియోగదారులు: ఆహార పదార్థాల కోసం ఇతర వినియోగదారులపై ఆధారపడతాయి. ఇవి ఆహార గొలుసులో పంచమ పోషక స్థాయిలో ఉంటాయి.

ఉదా: పులులు, సింహాలు.

పరాన్నజీవులు: ఇతర జీవులపై నివసిస్తూ, వాటి శరీరాల నుంచి ఆహారాన్ని పొందుతూ ఆశ్రయం ఇచ్చిన జీవికి హాని కలిగించేవి. వీటినే పరాన్నజీవులు (పారాసైట్స్‌) అంటారు.

ఉదా: జలగ, నల్లి, నులిపురుగులు.

విచ్ఛిన్నకారులు: ఇవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తరువాత వాటి మృత కళేబరాల్లోని సంక్లిష్ట కర్బన పదార్థాలను

సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి మృత కళేబర కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడతాయి. వీటిని ప్రకృతి పారిశుద్ధ్యులు (నేచురల్‌ స్కావెంజర్స్‌) అంటారు.
ఉదా: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రాబందులు.

శక్తి పరిమాణాల ప్రకారం..

ఆహార గొలుసుల్లోని వివిధ స్థాయుల్లో అందుబాటులోని శక్తి పరిమాణాలను అందించే వివిధ జీవజాతులకు చెందిన జనాభా, జీవ పదార్థాలను రేఖీయంగా చూపించడాన్ని  జీవావరణ పిరమిడ్‌లు అంటారు. వీటిని మొదట ఛార్లెస్‌ ఎల్టన్‌ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టోనియం పిరమిడ్‌లు అంటారు. మూడు రకాలుగా  విభజించారు.

సంఖ్యా పిరమిడ్‌లు: ఇవి వివిధ జనాభాల సంఖ్యాపరమైన సంబంధాన్ని ఆహార గొలుసుల్లో వివిధ పోషక స్థాయుల్లో సూచిస్తాయి. సాధారణంగా పిరమిడ్లలో ఆధార స్థాయిలో ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువగా ఉండి క్రమంగా అగ్ర  భాగానికి చేరేకొద్దీ వివిధ పోషక స్థాయుల్లోని జీవుల సంఖ్య తగ్గుతుంది. కానీ కొన్నింటిలో ఈ పిరమిడ్‌ తలకిందులుగా కూడా ఉంటుంది.

ఉదా: అటవీ ఆవరణ వ్యవస్థలో చేతితో అల్లిన నూలు కండె ఆకారంలో, పరాన్నజీవుల ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా, మిగిలిన ఆవరణ వ్యవస్థల్లో  నిట్టనిలువుగా సంఖ్యా పిరమిడ్‌లుంటాయి.

జీవరాశి పిరమిడ్‌లు: వివిధ పోషక స్థాయుల్లోని జీవ అనుఘటకాల భారం లేదా ద్రవ్యరాశి గురించి తెలిపే   పిరమిడ్‌ పటాన్ని జీవరాశి పిరమిడ్‌ అంటారు. ఇందులో ఆధార భాగంలోని పోషక స్థాయి నుంచి శిఖర పోషకస్థాయి వరకు క్రమంగా జీవరాశి పరిమాణం తగ్గడాన్ని గమనించవచ్చు. ఇందులో గడ్డి మైదానాలు, అటవీ ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉండగా, కొలను  ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

శక్తి పిరమిడ్‌లు: ఒక చదరపు మీటరు వైశాల్యం ఉన్న స్థలంలో సంవత్సరం పాటు వివిధ పోషక స్థాయుల్లోని జీవరాశులు వినియోగించిన శక్తి మొత్తాన్ని తెలిపే రేఖాపటం శక్తి పిరమిడ్‌. ఇందులో ఉత్పత్తిదారుల నుంచి అంతిమ వినియోగదారుల స్థాయి వరకు శక్తి క్రమంగా తగ్గుతుంది. వివిధ ఆవరణ వ్యవస్థల్లోని శక్తి పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉంటాయి.


నమూనా ప్రశ్నలు

1. సంఖ్యా పిరమిడ్‌ కిందివాటిలో వేటిని సూచిస్తుంది?

1) ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతుల సంఖ్య    
2) ఒక జీవ సముదాయంలోని ఉపజాతులు
3) ఒక సముదాయంలోని జనాభా          
4) పోషక స్థాయిలోని జీవి ద్రవ్యరాశి

2. కిందివాటిలో ఆహార గొలుసుకు మూలాధారం?

1) ఉత్పత్తిదారులు     2) వినియోగదారులు
3) విచ్ఛిన్నకారులు     4) పూతికాహారులు

3. కిందివాటిలో సర్వభక్ష జీవికి ఉదాహరణ?

1) కుందేలు   2) పులి   3) ఏనుగు  4) కాకి

4. ఆవరణ వ్యవస్థలో మిడత, గొల్లభామ, కుందేలు ఏ వినియోగదారులు?

1) ప్రథమ         2) ద్వితీయ  
3) అంతిమ        4) ఉత్పత్తిదారులు  

5. నిట్టనిలువు పిరమిడ్‌లో కోడి, పిల్లి, కుక్కలను ఏ పోషక స్థాయిలో చూపిస్తారు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) తృతీయ   4) చతుర్థ

6. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) సమాంతరం       2) నిట్టనిలువు    
3) తలకిందులు       4) అన్నీ

7. కొలను ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌ ఏ విధంగా ఉంటుంది?

1) తలకిందులుగా      2) నిట్టనిలువుగా    
3) జిగ్‌జాగ్‌          4) నూలుకండె ఆకారం  

8. అటవీ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) తలకిందులుగా         2) అడ్డంగా  
3) నూలుకండె ఆకారం      4) సిలిండర్‌ ఆకారం

9. సాధారణంగా పిరమిడ్‌లలో ఆధారస్థాయిలోని  అనుఘటకాలు?

1) ఉత్పత్తిదారులు            2) వినియోగదారులు  
3) ద్వితీయ వినియోగదారులు    4) అన్నీ  

10. ఆకుపచ్చ శైవలాలు దేనికి ఉదాహరణ?

1) పరాన్నజీవులు        2) పూతికాహారులు  
3) ఉత్పత్తిదారులు        4) ట్రాన్స్‌ఫార్మర్స్‌

జవాబులు: 1-1, 2-1, 3-4, 4-1, 5-3, 6-2, 7-1, 8-3, 9-1, 10-3.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని