పాడిపంటలే జీవనాడులు!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. పెట్టుబడుల కొరత వంటి ఇబ్బందులతోపాటు ఇతర రంగాల అభివృద్ధి వల్ల సేద్యరంగం సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పాడిపంటలే రాష్ట్రానికి జీవనాడులుగా నిలుస్తున్నాయి.

Published : 10 Dec 2022 02:55 IST

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. పెట్టుబడుల కొరత వంటి ఇబ్బందులతోపాటు ఇతర రంగాల అభివృద్ధి వల్ల సేద్యరంగం సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పాడిపంటలే రాష్ట్రానికి జీవనాడులుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రాముఖ్యం, శ్రామికశక్తి వర్గీకరణ తదితర వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రాష్ట్రం మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 25% పైగా ఉంది. జనాభాలో 61% మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర మొత్తం భూవైశాల్యంలో 45% మేర సాగు జరుగుతోంది. వ్యవసాయంతోపాటు మత్స్య, కోళ్ల, పాడి లాంటి అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఆదాయాన్ని అందిస్తున్నాయి. అయితే వ్యవసాయ రంగంలో సాంకేతికత పెరగడం, అదే సమయంలో పెట్టుబడి తగ్గడం, వ్యవసాయేతర (పారిశ్రామిక, సేవా) సంస్థల అభివృద్ధి వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతోంది. ఫలితంగా వ్యవసాయ రంగం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ ప్రకారం పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే సాగు రంగం అభివృద్ధి 6 శాతానికి మించి ఉండాలి.

వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికల ఉద్దేశాలు

* పంటల ఉత్పాదకతను పెంచడం

* సాగు వ్యయాన్ని తగ్గించి, లాభాలు పెంచడం

* వ్యవసాయ విస్తరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం

* సాగులో సాంకేతికతను వినియోగించడం

* ఉపాంత, చిన్న రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ సౌలభ్యం కల్పించడం

2021 - 22 ఆర్థిక సర్వేలో వ్యవసాయ ప్రగతి

* ఆంధ్రప్రదేశ్‌ను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడం.

* 2020-21 నాటికి 13.41 లక్షల హెక్టార్ల భూమి సూక్ష్మ సాగునీటి సేద్యం కిందకు మారింది. సూక్ష్మసేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. సుమారు 11.91 లక్షల మంది రైతులు ఈ విధానంతో ప్రయోజనం పొందుతున్నారు.

* గ్రామ స్థాయిలో ‘ఊరూరా పశుగ్రాస’ క్షేత్రాలు ఏర్పాటు చేయడం.

* 2029 నాటికి 50% పచ్చదనంతో హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడం.

* సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు- 2030ని సాధించడానికి ఒక ప్రత్యేకమైన విజన్‌ను తయారుచేయడం.

* ప్రతి గ్రామ సచివాలయంలో ఒకటి చొప్పున 10,777 రైతు భరోసా కేంద్రాల స్థాపన.

* రైతులకు పంటలపై అవగాహన కోసం 4576 పొలంబడి కార్యక్రమాల నిర్వహణ.

* 2020-21లో వ్యవసాయ పరపతి కింద రూ.148.5 కోట్లు పంపిణీ చేశారు.

* ఉద్యాన పంటలు 17.95 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. వీటిలో 314.78 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.

* పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 15.6%. కూరగాయల ఉత్పత్తిలో 7.8%.

* పట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. 1,24,983 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగవుతోంది. ఇందులో 4,710 ఎకరాల్లో మల్బరీ తోటలను సూక్ష్మ సేద్యం కింద సాగు చేస్తున్నారు.

* 2020-21లో ఉత్పత్తి అయిన ముడిపట్టు 8033.3 మెట్రిక్‌ టన్నులు.

* పశుగణన ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 176.27 లక్షల గొర్రెలు, 52.22 లక్షల మేకలు, 0.92 లక్షల పందులు, 1075.11 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది.

* కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మొదటి స్థానం, మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో అయిదో స్థానంలో ఉంది.

* 154 హబ్‌లు, అగ్రి ఇన్‌పుట్‌ షాప్‌లు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను గ్రామ సచివాలయాలతో అనుసంధానం చేయడం.

* 100% రాయితీతో వేప పూత యూరియా, నాణ్యమైన విత్తనాలు అందించడం.

* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు (నష్టాల వల్ల) రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.

ఉప రంగాల వారీగా పరిశీలిస్తే (2021 - 22 ముందస్తు అంచనా)

1. వ్యవసాయ రంగం - రూ.83,204 కోట్లు

2. జంతు సంపద - రూ.59,674 కోట్లు

3. అటవీ సంపద - రూ.2,687 కోట్లు

4. మత్స్య సంపద - రూ.66,648 కోట్లు

మొత్తం రూ.2,12,213 కోట్లు వ్యవసాయ రంగ వృద్ధి రేటు

2019-20 - 8.60% 

2020-21 - 2.68%

2021-22 - 11.27%

2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వర్గీకరణ

మొత్తం జనాభా - 495 లక్షలు (100%)

ప్రధాన శ్రామికులు - 193 లక్షలు (38.98%)

ఉపాంత శ్రామికులు - 37 లక్షలు (7.47%)

పనిచేయనివారు - 265 లక్షలు (53.53%)

ప్రధాన శ్రామికులు అంటే ఒక ఏడాదిలో   183 రోజులకు మించి పనిచేసేవారు. ఉపాంత   శ్రామికులు అంటే ఏడాదిలో 183 రోజుల కంటే తక్కువ రోజులు పనిచేసేవారు.

* పనిచేసేవారు = ప్రధాన శ్రామికులు + ఉపాంత శ్రామికులు

* పనిచేసేవారి రేటు = (ప్రధాన శ్రామికులు + ఉపాంత శ్రామికులు)/జనాభా × 100 (193 + 37)/495 × 100 = 46.46%
(రాష్ట్ర జనాభాలో 1000 మందిలో సుమారు 465 మంది పని చేస్తున్నారని అర్థం.)

* ప్రధాన శ్రామికులు అధికంగా ఉన్న జిల్లాలు.. గుంటూరు, తూర్పుగోదావరి కాగా తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం.

* ఉపాంత శ్రామికులు అధికంగా ఉన్న జిల్లాలు.. విశాఖపట్నం, అనంతపురం. తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం.


వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి వ్యూహాలు

* 2019 సంవత్సరం రబీ నుంచి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కిందఇచ్చే ఆర్థిక సహాయం రూ.13500కు పెంచడం. - డ్రాప్‌ ఇన్సూరెన్స్‌ వడ్డీ లేని రుణాలు, 9 గంటల ఉచిత విద్యుత్‌, మద్దతు ధరలు కల్పించడం. పై పథకాలను కౌలు రైతులకు వర్తింపజేయడం.

* కనీస మద్దతు ధరల ద్వారా దళారుల నుంచి రైతులను కాపాడటం

* రైతుల సందేహాల నివృతి కోసం రైతుల సలహా కేంద్రాలు, కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం.

* సున్నా వడ్డీ పంట రుణాలను రైతులందరికీ వర్తింపజేయడం.

* వ్యవసాయం, ఉద్యాన పంటలకు సంబంధించి  సలహాలు, సూచనలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అగ్రికల్చర్‌ మిషన్‌ ఏర్పాటు చేయడం.

* విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల నాణ్యత కోసం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం.

* బోరు బావుల కింద వరి పంటల సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం.

* భూమి సారాన్ని పెంచడానికి మైక్రో న్యూట్రియంట్‌లపై రైతులకు అవగాహన కల్పించడం.

* కౌలు రైతులకు  అవగాహన కల్పించడం.

* కౌలు రైతులకు క్రాప్‌ రుణాలను అందించడం కోసం (సీసీఆర్‌సీఎస్‌ - క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌) ను మంజూరు చేశారు.

* వర్షాధార ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని రైతులకు సమగ్ర పంటల విధానంపై డ్రాట్‌ మైగ్రేషన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పించడం. 

* ఆచార్య   నాగార్జున విశ్వవిద్యాలయం, వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ ద్వారా సమగ్ర కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి టోల్‌ ఫ్రీ నంబరు 155251తో రైతుల సందేహాలు తీర్చడం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని