నకిలీలు ఉన్నాయ్‌... జాగ్రత్త!

ఇటీవల సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో ‘విద్యార్థులు ఎక్నాడ్జ్‌మెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాలి’ అంటూ పేమెంట్‌ గేట్‌వే తెరుచుకునేది.

Updated : 10 Jan 2023 05:07 IST


ఇటీవల సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో ‘విద్యార్థులు ఎక్నాడ్జ్‌మెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాలి’ అంటూ పేమెంట్‌ గేట్‌వే తెరుచుకునేది. ‘అసలు ఎటువంటి డబ్బూ చెల్లించాల్సిన పని లేదు కదా, ఇలా కట్టమంటోంది ఏంటా’ అని ఆరాతీస్తే... అది అసలు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌ కానేకాదు! అచ్చం దాన్ని పోలినట్లు తయారుచేసిన నకిలీ సైట్‌. దీని ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డబ్బు కొట్టేయడం మాత్రమే కాదు... వ్యక్తిగత సమాచారం చోరీ చేసేందుకు దుండగులు ఈ ఎత్తు వేశారు.


అలాగే... ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షకు సిద్ధమవుతున్న వైద్య విద్యార్థులను... ఆ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఏంటో ముందే చెబుతాం అంటూ కొందరు కేటుగాళ్లు సోషల్‌మీడియా యాప్‌ల ద్వారా సంప్రదిస్తున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ (ఎన్‌బీఈ) గుర్తించింది. దుండగులు చాలా తెలివిగా, తమ వద్దనున్న ప్రశ్నపత్రాలు ఎన్‌బీఈవేనని అనిపించేలా సంస్థ లోగో, ప్రశ్నపత్రం సరళిని ఉపయోగించినట్లు తెలుసుకుంది. ఇది పూర్తిగా మోసపూరిత చర్యేనని, విద్యార్థులు ఈ ట్రాప్‌లో పడొద్దని హెచ్చరికలు జారీ చేసింది ఎన్‌బీఈ.


తరహా వెబ్‌సైట్లను చోరులు ఎంత నాణ్యంగా తయారుచేస్తున్నారంటే... అవి నకిలీవనే ఆలోచన కూడా మనకు రాదు. నిజానికి వీటి ద్వారా ఏదో కొద్దిపాటి సొమ్ము చేజిక్కించుకోవడం దుండగుల లక్ష్యం కాదు. ఒక్కసారి మీరు ఆ సైట్లలోకి వెళ్లడం, ఏదైనా క్లిక్‌ చేయడం, సమాచారం నమోదు చేయడం వంటివి చేస్తే... ఆ కాస్త డేటాతో వారు మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా గురించి, గోప్యమైన ఇతర సమాచారం దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. 

నకిలీలు.. గతంలో వస్తు విపణికి మాత్రమే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు విద్యారంగాన్నీ తాకుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న ఈ రంగం మార్కెట్‌ను గమనించి... దుండగులు ఈ మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ డిగ్రీలు, ప్రశ్నపత్రాలు... ఇలా ఒక్కటేమిటి, విద్యార్థులకు అవసరమయ్యి, ఆకర్షించే ప్రతి విషయాన్నీ వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిపట్ల అప్రమత్తంగా లేకపోతే డబ్బు నష్టపోవడమే కాకుండా, లేనిపోని సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.


వెబ్‌సైట్లు చూసేటప్పుడు...

విద్యార్థులు తరచూ వాడే సైట్ల అడ్రస్‌ను పోలిన వెబ్‌ అడ్రస్‌లతో నకిలీ సైట్లు ఉంటాయి. ఒక పదం లేదా అక్షరం మార్చడం వంటివి చేస్తుంటారు. అయితే... సైటును పూర్తిగా చూస్తే ఆ తేడాను గమనించవచ్చు. అందుకే దేన్నయినా వినియోగించేటప్పుడు మనకు కావాల్సిన విభాగం దగ్గరకు నేరుగా వెళ్లిపోకుండా ఒకసారి  మొత్తం జాగ్రత్తగా చూడాలి.

మనకొచ్చే సంక్షిప్త సందేశాలు, ఈ-మెయిల్స్‌లో ఉన్న లింక్స్‌ను క్లిక్‌ చేయడం కంటే కూడా నేరుగా కావాల్సిన వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయడం మంచిది. ఫేక్‌ సైట్లలోకి మనల్ని లాగేందుకు దుండగులు ఇలాంటి ఈ-మెయిల్స్‌, నోటిఫికేషన్స్‌ ద్వారా గాలం వేస్తుంటారు. వీటిని ‘ఫిషింగ్‌ మెయిల్స్‌’ అంటారు. అందువల్ల ఇటువంటి వాటిని అనుసరించకపోవడం ఉత్తమం.

మన సిస్టంలో వెబ్‌సైట్‌ చెకర్‌, సేఫ్‌ బ్రౌజింగ్‌ టూల్స్‌ పెట్టుకోవడం ద్వారా కొంతవరకూ వీటి నుంచి దూరంగా ఉండొచ్చు.

కొన్ని సైట్లు చూడటానికి నాసిరకంగా అనిపిస్తూ ఉంటాయి. పదాల్లో తప్పులు దొర్లడం, సైట్‌ డిజైన్‌లో లోపాలు వంటివి కనిపిస్తుంటే... అటువంటి వాటికి స్పందించే ముందు పూర్తిగా సరిచూసుకోవడం మంచిది. 

అనుమానం వస్తే ఆ డొమైన్‌ ఎన్నాళ్ల నుంచి మనుగడలో ఉందో చూడాలి. ఈ సమాచారం విడిగా అంతర్జాలంలో వెతికితే సులువుగా లభిస్తుంది.

వైరస్‌ స్కాన్‌ రన్‌ చేయడం ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది.

గూగుల్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ టూల్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ అడ్రస్‌ టైప్‌ చేస్తే అది సురక్షితమా కాదా అన్నది చెప్పేస్తుంది.

ఈ ఫేక్‌ వెబ్‌సైట్లకు చాలాసార్లు ‘అబౌట్‌ అజ్‌’ అనే విభాగం కానీ, సంప్రదించాల్సిన సమాచారం కానీ ఉండవు. సంస్థ అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ ఇవ్వకపోయినా, ఇచ్చినా అవి తప్పు అని తెలిసినా అప్రమత్తంగా ఉండాలి.


ఆన్‌లైన్‌ డిగ్రీలు...

ఇప్పుడు ఆన్‌లైన్‌ కోర్సులు చేయడం సర్వసాధారణం. అయితే ఏదైనా కోర్సు ఎంచుకునేటప్పుడు కూడా అది సరైనదా కాదా అని చెక్‌ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సంస్థల్లో కూడా నకిలీల బెడద ఎక్కువయ్యింది. ఇవి సరైనవా కాదా అన్నది తెలుసుకునేందుకు కొన్ని సూచనలు

1. ఆన్‌లైన్‌ డిగ్రీల అక్రెడిటేషన్‌ను సరిచూసుకోవాలి. చదవాలి అనుకుంటున్న కోర్సు గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

2. కొన్ని సంస్థలు ప్రఖ్యాత యూనివర్సిటీల పేరును కాపీ కొడుతుంటాయి. పేరుమోసిన సంస్థలకు ముందో వెనుకో ఒక పదం తగిలించి అనుబంధ విభాగాలు అని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇటువంటి వాటి వలలో పడొద్దు.

3. చేరే ముందే మొత్తం ఫీజు చెల్లించేయమంటుంటే అనుమానించాల్సిందే. * రివ్యూలు ఏమైనా ఉన్నాయో లేదో, ఆ రివ్యూ ఇస్తున్న వ్యక్తి సరైనవారా కాదా అన్నది చెక్‌ చేసే అవకాశం ఉందేమో చూడాలి.

4. డిగ్రీ చేయడం మరీ వేగంగా, సులభంగా అయిపోతున్నట్లు అనిపిస్తే కాస్త ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

5. అసలైన సంస్థలు విద్యార్థులకు సపోర్ట్‌ సర్వీస్‌, లైబ్రరీ వంటి సౌకర్యాలు కల్పిస్తుంటాయి అటువంటి సమాచారం ఏదీ లభించకపోతే ఇంకొంచెం తెలుసుకుని నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నించాలి.

6. ఆ సంస్థ పూర్తి సమాచారం, అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ వంటివి ఏవీ లేకపోతే అనుమానించాలి. అది ఎంత ఆన్‌లైన్‌ సేవలు అందించేదే అయినా... ఎక్కడో ఒక చోట కార్యాలయం అనేది ఉండకమానదు. ఆ వివరాలు తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని