Published : 11 Jan 2023 00:28 IST

పక్కవాళ్లకు నేర్పిస్తే... మనకూ మంచిదే!

బాగా చదివేవారిని ఇతర విద్యార్థులు తమకూ నేర్పించమనీ, సందేహాలు తీర్చమనీ అడుగుతుంటారు. వారు కూడా ఓపిగ్గా తమకు తెలిసిన విషయాలు చెబుతుంటారు. కానీ తెలుసా... ఇలా చెప్పడం వల్ల వారికి మరింతగా సబ్జెక్టుపై పట్టు వచ్చేస్తుంది. పక్కవాళ్లకు చెప్పడం వల్ల నేర్చుకునేవారి కంటే నేర్పించేవారికే ఎక్కువ లాభాలని పరిశోధనలు చెబుతున్నాయి!

దీన్ని శాస్త్రీయంగా ప్రొటెజె ఎఫెక్ట్‌ అంటున్నారు. మనకేదైనా అంశం బాగా తెలియాలి అనుకుంటే.. ఒకసారి నేర్చుకున్నాక వేరే వాళ్లకు అర్థమయ్యేలా వివరించేందుకు ప్రయత్నించాలి. ఆ క్రమంలో మన మెదడు ఆ విషయాన్ని తెలుసుకోవడంలో పూర్తిగా నిమగ్నం కావడమే కాదు, అన్నికోణాల నుంచీ దాని గురించి ఆలోచిస్తుంది. కేవలం చదివి గుర్తుపెట్టుకునేదానికీ, ఇలా విశ్లేషణాత్మక ధోరణిలో సాధన చేసేదానికీ చాలా తేడా ఉంటుంది. దానివల్ల తెలియకుండానే ఆ అంశాలపై మనకు పట్టు లభిస్తుంది.

ఇది కేవలం చదువు, పుస్తకాలకే పరిమితం కాదు, హాబీలు - పని... ఏదైనా సరే మనం బాగా నేర్చుకోవాలంటే ముందు అవతలివారికి బాగా చెప్పగలిగేలా సాధన చేయాలి.

దీనివల్ల మెదడులో మెటాకాగ్నిటివ్‌ ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుంది. మోటార్‌ లెర్నింగ్‌, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్‌ ఎక్కువవుతుంది. నేర్చుకోవడంలో వందశాతం నిమగ్నమవుతాం. ప్రభావవంతమైన లెర్నింగ్‌ స్ట్రాటజీలు అనుసరించడంతోపాటు తరిగిపోని ప్రేరణ, ఆసక్తి చూపగలుగుతాం. అంతేకాదు... ఇది ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందట. పరీక్షల్లో మెరుగ్గా జవాబులు రాసేందుకు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకునేందుకు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడేందుకు సహకరిస్తుందట. అందుకే ఒక్కరే చదివేటప్పుడైనా సరే... వేరే వాళ్లకు ఎలా అయితే వివరిస్తారో అలా చదివేందుకు ప్రయత్నించాలి. కుదిరితే పక్కవారికి అర్థమయ్యేలా చెప్పాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని