కేసరాలు.. అండాలు.. కొన్ని రేణువులు!

పువ్వు ఎలా పూస్తుంది? కాయ ఏవిధంగా కాస్తుంది? ఫలం తయారయ్యే తీరు ఏమిటి? అన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే.

Updated : 23 Jan 2023 04:37 IST

జనరల్‌ స్టడీస్‌ బయాలజీ

పువ్వు ఎలా పూస్తుంది? కాయ ఏవిధంగా కాస్తుంది? ఫలం తయారయ్యే తీరు ఏమిటి? అన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. మొక్కల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ప్రత్యేకంగా  పైకి కనిపించేది కాదు. కేసరాలు, పరాగ రేణువులు, అండాలు జరిపే ఒక సహజ ప్రక్రియ. ఇది అనేక రకాల కొత్త లక్షణాల ఆవిర్భవానికి కారణమవుతోంది. జీవుల మనుగడకు మూలాధారంగా నిలుస్తోంది. అందరినీ అందంతో ఆకర్షించే సుమాలలో జరిగే ఆ సృష్టి విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి

పుష్పించే మొక్కల్లో పుష్పం లైంగిక భాగం. ఇది లైంగిక ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది.    పుష్పవిన్యాసాక్షానికి అతుక్కుని ఉంటుంది. పుష్పాన్ని కుదించిన ప్రకాండం అంటారు. అందులోని భాగాలను రూపాంతరం చెందిన పత్రాలుగా పిలుస్తారు. పుష్పంలో కింది భాగాన ఉన్న కాడ వంటి భాగమే పుష్పవృంతం. దీని అగ్రభాగం పుష్పాసనం (Thalamas). పుష్పంలోని భాగాలు పుష్పాసనంపై వలయాలుగా అమరి ఉంటాయి. ఒక సాధారణ పుష్పంలో 4 రకాల పుష్ప    భాగాలుంటాయి. అవి 1) రక్షక పత్రావళి (Calyx)   2) ఆకర్షక పత్రావళి (Corolla) 3) కేసరావళి (Androecium)  4) అండకోశం (Gynoecium).


రక్షక పత్రావళి: పుష్పంలో బయటి నుంచి మొదటి వలయం ఇది. మొగ్గ దశలో ఉన్నప్పుడు దానికి రక్షణ కల్పిస్తుంది. కొన్నిసార్లు ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది.

ఆకర్షక పత్రావళి: పుష్పంలోని రెండో వలయం. దీనిలో వివిధ రంగుల్లో ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కం జరగడానికి సహకరిస్తాయి. రక్షక, ఆకర్షక పత్రావళి ప్రత్యుత్పత్తికి అంతగా తోడ్పడవు. కాబట్టి వీటిని అనావశ్యక అంగాలు అంటారు.

కేసరావళి: పుష్పంలోని మూడో వలయం. వీటిలో ఒక్కొక్క దాన్ని కేసరం (Stamen) అంటారు. ఇవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరానికి ఉండే కాడను కేసర దండం (Filament) అని అంటారు. కేసర దండం పైభాగంలో ఉబ్బిన భాగాన్ని పరాగకోశం (Anther) అంటారు. దీనిలో పరాగ రేణువులు ఏర్పడతాయి. పుష్పం అభివృద్ధి చెందిన తర్వాత పరాగకోశం పగిలి పరాగ రేణువులు బయటకు విడుదలవుతాయి.

అండకోశం: పుష్పంలోని నాలుగో వలయం. దీన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా భావిస్తారు. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫలదళాలతో ఉంటుంది. అండకోశంలో కింద ఉబ్బిన భాగాన్ని అండాశయం, మధ్య భాగాన్ని కీలం, చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు.     అండాశయంలో అండాలు ఉంటాయి. కీలాగ్రం పరాగరేణువులను నిలిపి ఉంచుకోవడానికి   సహాయపడుతుంది. కేసరావళి, అండకోశం రెండూ లైంగిక ప్రత్యుత్పత్తికి తప్పనిసరి. వీటిని ఆవశ్యక అంగాలు అంటారు. పుష్పంలో కేసరావళి, అండకోశం ఉంటే అవి ద్విలింగ పుష్పాలు (Bisexual Flowers). కేసరావళి, అండకోశాల్లో ఏదో ఒకటి ఉంటే ఏకలింగ పుష్పాలు (Unisexual Flowers). ఏకలింగ పుష్పంలో కేసరావళి ఉంటే అది పురుష పుష్పం, అండకోశం ఉంటే స్త్రీ పుష్పం అవుతుంది. ఒకే మొక్కలో పురుష, స్త్రీ పుష్పాలు ఉంటే దాన్ని ద్విలింగాశ్రయ స్థితి అని; పురుష, స్త్రీ పుష్పాలు పూర్తిగా వేర్వేరు మొక్కలపై అమరి ఉంటే ఏకలింగాశ్రయ స్థితి అంటారు.

అండాశయం, అండాలు: అండకోశంలో ఉబ్బిన భాగం అండాశయం. దీనిలో అండాలు ఉంటాయి. సాధారణంగా అండాలను ఆవరించి అండ కవచాలు ఉంటాయి. అండంలో అండ కవచాలు కప్పివేయకుండా ఉన్న భాగాన్ని అండద్వారం అని, అండం కింది భాగాన్ని కలాజా అని అంటారు. అండంలో పిండకోశం ఉంటుంది. దీనిలో ఏడు కణాలు ఉంటాయి. వీటిలో అండద్వారం వైపు మూడు కణాలు ఉంటాయి. వీటిలో మధ్యలో ఉన్న కణాన్ని స్త్రీ బీజకణం అని, దీనికి రెండువైపులా ఉండే కణాలను సహాయ కణాలు అంటారు. పిండకోశం కింది భాగంలో ఉండే కణాలను    ప్రతిపాదక కణాలు అంటారు. పిండకోశం మధ్యలో ఉండే కణాన్ని ద్వితీయ కేంద్రకం  అంటారు. ఇది ద్వయస్థితిలో ఉంటుంది.


ఫలదీకరణం

పుష్పంలోని కీలాగ్రం మీద చేరిన పరాగరేణువు (పుప్పొడి రేణువు) మొలకెత్తి పరాగ నాళాన్ని ఏర్పరుస్తుంది. ఆ నాళంలో ఉత్పాదక కణం విభజన చెంది రెండు కణాలు ఏర్పడతాయి. ఇవి పురుష సంయోగ  బీజాలుగా వ్యవహరిస్తాయి. పరాగనాళం అండంలోని పిండకోశంలోకి రెండు పురుష సంయోగ బీజాలను విడుదల చేస్తుంది. వీటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీన్ని సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణం అంటారు. దీనివల్ల సంయుక్తబీజం ఏర్పడుతుంది. ఇది విభజన చెంది పిండంగా మారుతుంది. రెండో పురుష సంయోగబీజం ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. దీన్ని త్రిసంయోగం అంటారు. దీని ఫలితంగా ప్రాథమిక అంకుర్చద కేంద్రకం ఏర్పడుతుంది. ఇది త్రయస్థితికలో ఉండి విభజన చెంది అంకురచ్చదాన్ని ఏర్పరచి, ఎదుగుతున్న పిండాన్ని పోషిస్తుంది. ఈ విధంగా రెండు సంయోగాలు జరగడాన్ని ద్విఫలదీకరణ అంటారు.

ఫలదీకరణాంతర మార్పులు: ఫలదీకరణం జరిగిన తర్వాత పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి రాలిపోతాయి. కీలాగ్రం, కీలం క్షీణిస్తాయి. అండకోశంలోని అండాశయం ఫలంగా మారుతుంది. అండాశయంలోని అండాలు విత్తనాలుగా మారుతాయి. పిండకోశంలోని సంయుక్త బీజం పిండంగా మారుతుంది. ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం అంకురచ్చదంగా మారుతుంది. చివరకు ఫలంలోని విత్తనాలు నేలలో మొలకెత్తి, కొత్త మొక్కలు ఏర్పడతాయి.


పరాగ సంపర్కం

కేసరంలోని పరాగకోశంలో ఉత్పత్తి అయిన పరాగరేణువులు పరాగకోశం పగలడం ద్వారా బయటకు విడుదలై వివిధ రకాలుగా అండకోశంలోని కీలాగ్రాన్ని చేరతాయి. దీనినే పరాగసంపర్కం (Pollination) అంటారు. దీనికి గాలి, నీరు, కీటకాలు, పక్షుల వంటివి సహాయపడతాయి. వీటిని పరాగ సంపర్క సహాయకారులు అంటారు. ఈ సంపర్కం రెండు రకాలుగా ఉంటుంది.

1) ఆత్మపరాగ సంపర్కం: ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం.

2) పరపరాగ సంపర్కం: ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్క మీద ఉన్న ఇంకొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం లేదా అదే జాతికి చెందిన వేరొక మొక్కలో ఉన్న పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం. ఆత్మపరాగ సంపర్కం కంటే పరపరాగ సంపర్కం మేలైంది. దీనివల్ల కొత్త లక్షణాలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది.


ముఖ్యాంశాలు

* అనృత ఫలాలు (False Fruit) కు ఉదాహరణ - ఆపిల్‌

* జాజికాయపైన ఉన్న బీజపుచ్చం (Aril)  జాపత్రి. దీన్ని సుగంధద్రవ్యంగా వాడతారు.

* కొబ్బరిలో తినే భాగం - అంకురచ్చదం

* వంకాయలో రక్షకపత్రాలు ఫలంతో పాటుగా దీర్ఘకాలికంగా ఉంటాయి.

* అతి చిన్న పుష్పం - వుల్ఫియా

* అతి పెద్ద పుష్పం - రఫ్లీషియా

* పుష్పాల అధ్యయనాన్ని ఆంథాలజీ అంటారు.

* అర్కిడ్‌ విత్తనాలు అతి చిన్న విత్తనాలు

* మొక్కజొన్నలో అతి పొడవైన కీలం ఉంటుంది.

* పూయారాయ్‌మొన్‌డి - అతి పెద్ద పుష్ప విన్యాసం

* విత్తనాల అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటారు.

* లొడీసియాలో అతి పెద్ద ఫలాలు ఉంటాయి.


పరాగ సంపర్క సహకారులు

మిర్మకోఫిలి: చీమల ద్వారా జరిగే పరాగ సంపర్కం

ఎనిమోఫిలి: గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం

హైడ్రోఫిలి: నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం

జూఫిలి: జంతువుల ద్వారా జరిగే పరాగ సంపర్కం

ఆర్నిథోఫిలి: పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం

ఎంటమోఫిలి: కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం

కైరోప్టిరోఫిలి: గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం


మాదిరి ప్రశ్నలు

1. విత్తనాల అధ్యయనాన్ని ఏమంటారు?

1)స్పెర్మాలజీ  2)స్పెర్మటాలజీ  3) సీడాలజీ  4) ఆంథాలజీ

2) అనృత ఫలానికి ఉదాహరణ?

1)మామిడి  2) కొబ్బరి  3) ఆపిల్‌  4) పనస

3. పుష్పంలో దేన్ని ఆవశ్యక అంగం అంటారు?

1) ఆకర్షణ పత్రం  2) రక్షక పత్రం  3) పుష్పాసనం  4) కేసరావళి

4. పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగాలు?

1) దిగుబడి పెరుగుతుంది     2) మేలైన లక్షణాలు ఏర్పడతాయి   3) కొత్త లక్షణాలు ఏర్పడతాయి 4) పైవన్నీ

5. పుష్పంలో కింది దేన్ని పురుష ప్రత్యుత్పత్తి అవయవంతో పోల్చవచ్చు?

1) అండాశయం  2) కేసరావళి  3) పుప్పొడి రేణువు  4) అండం

6. ఎదుగుతున్న పిండానికి పోషణను కల్పించేది?

1) అంకురచ్చదం  2) పరిచ్చదం   3) పిండకణజాలం 4) అండకణజాలం

7. పిండకోశంలో పురుష సంయోగబీజం, స్త్రీ బీజకణంతో కలవడాన్ని ఏమంటారు?

1) ద్విఫలదీకరణం     2) సంయుక్త సంయోగం   3) త్రిఫలదీకరణం     4) బీజ ఫలదీకరణం

సమాధానాలు: 1-1, 2-3, 3-4, 4-4, 5-2, 6-1, 7-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని