తెల్ల రాక్షసుడి నరమేధం!
ఆధునిక భారతదేశ చరిత్ర
మానవ జాతి చరిత్రకే మాయని మచ్చ!
ప్రపంచానికి నాగరికత నేర్పించామని గర్వంగా ప్రగల్భాలు పలికే తెల్లదొరలు జలియన్ వాలాబాగ్‌లో జరిపిన నరమేధం మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిలిగిపోయింది. శాంతియుత నిరసనల్లో, పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలపై డయ్యర్ అత్యంత రాక్షసంగా సాగించిన దమనకాండలో వందలమంది దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ గుళ్ల వర్షంతో క్షణాల్లో శవాల కుప్పలుగా మారిపోయారు. వేలమంది ప్రాణభీతితో పరుగులు పెట్టారు. హంటర్ కమిటీ డయ్యర్‌ను తప్పు పట్టినా, ఆంగ్లేయ సమాజం అతడిని వీరుడిగా కొనియాడి సంస్కార హీనతను చాటుకుంది. గాంధీజీ వైఖరిని, జాతీయోద్యమం తీరును గొప్ప మలుపు తిప్పిన ఈ సంఘటనపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి.
జలియన్ వాలాబాగ్ దురాగతం
గోపాలకృష్ణ గోఖలే అభిమతం మేరకు గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చారు. అప్పటికే ఆయన దక్షిణాఫ్రికాలో తెల్లదొరల జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడిన యోధుడు. భారత్‌కు చేరిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు దేశ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేటాయించారు. అనంతరం 1917-18 మధ్య చంపారన్‌లో (బిహార్) ఆంగ్లేయ భూస్వాముల చేతిలో బాధితులైన ఇండిగో రైతుల దుస్థితిపై, గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని బాధిత రైతుల కోసం, అహ్మదాబాద్‌లోని వస్త్ర మిల్లు కార్మికుల జీతభత్యాల పెంపు కోసం సత్యాగ్రహ పోరాటాలు చేశారు. వాటిలో విజయం సాధించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.
మొదటి ప్రపంచ యుద్ధ కాలం (1914-18)లో భారతీయుల సహకారం కోసం అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్ అనేక హామీలిచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు, యుద్ధకాలంలో మాంటేగ్ హామీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత జాతీయవాద నాయకత్వం వీటిని మందకొడి సంస్కరణలుగా, అచేతన వ్యవస్థలుగా, నామమాత్రపు అధికారంగా విమర్శించింది. ఒక పరాయి ప్రభుత్వం తమ స్వపరిపాలన యోగ్యతను నిర్ణయించడాన్ని జాతీయ నేతలు అంగీకరించలేదు. ‘‘భారతీయులకు యోగ్యమైన సంస్కరణలు లభించే వరకు ప్రాణాలకు తెగించి పోరాడటం తప్ప గత్యంతరం లేదు’’ అన్నారు గాంధీజీ. 1918, ఆగస్టులో సయ్యద్ హాసన్ ఇమాం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో స్వపరిపాలన వ్యవస్థ తప్ప మరే విధమైన పరిపాలన తమకు ఆమోదం కాదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమై సమరశీల జాతీయవాద కార్యకలాపాలు ఉద్ధృతమయ్యాయి.
రౌలత్ చట్టం
యుద్ధకాలంలో వలస ప్రభుత్వం ఒకవైపు భారతీయుల సహాయం అర్థిస్తూనే, మరోవైపు తీవ్ర అణచివేత చర్యలకు దిగింది.ఎందరో ఉద్యమకారులను ఉరితీసింది. ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు జస్టిస్ రౌలత్ కమిటీ నివేదిక ఆధారంగా, 1919లో "Anarchical and Revolutionary Crimes Act 1919" తీసుకొచ్చింది.ఇదే రౌలత్ చట్టం. భారతీయుల తీవ్ర నిరసనలను పట్టించుకోకుండా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్ని ఆమోదించింది. దీంతో 1919, మార్చిలో నివేదిక చట్టరూపం దాల్చింది. దేశంలో రాజకీయ ఉద్యమాలను అణచివేయడానికి 1915లో తీసుకొచ్చిన ‘డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం’ కంటే క్రూరమైన చట్టం ఇది. పౌర హక్కులను కాలరాస్తూ పోలీసులకు విశేష అధికారాలను కల్పించింది. ఏ వ్యక్తినైనా విచారణ, నేర నిరూపణ లేకుండా నిర్బంధించేందుకు అధికారం ఇచ్చింది. ఈ క్రూర చట్టం చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల గౌరవ ప్రతిష్ఠలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పూర్తిగా హరించి వేసింది. రాజకీయ సంస్కరణల రూపంలో తమకు ఆమోదయోగ్యమైన పాలనను ఆంగ్లేయులు అందిస్తారని జాతీయవాదులు భావించారు. కానీ ప్రభుత్వం రౌలత్ చట్టం అనే పైశాచిక అస్త్రాన్ని ప్రయోగించడంతో అందరూ హతాశులయ్యారు. అప్పటివరకు ప్రాంతీయ సమస్యలపై సత్యాగ్రహాలు జరిపిన గాంధీజీ, జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఈ రౌలత్ చట్టం కల్పించింది. జాతీయోద్యమ నాయకత్వాన్ని గాంధీజీ స్వీకరించారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ‘సత్యాగ్రహ సభ’ స్థాపించి 1919, ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా అహింసాయుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఆ సభ సభ్యులు రౌలత్ చట్టాన్ని ధిక్కరించడానికి, దాని వల్ల ఎదురయ్యే పర్యవసానాలకు సిద్ధమయ్యారు. గాంధీజీ పిలుపుతో దేశం యావత్తు స్పందించి హర్తాళ్ పాటించింది. ప్రజల్లో రాజకీయ అసంతృప్తి పెల్లుబికింది. హిందు-ముస్లిం ఐక్యత వికసించింది. బొంబాయి ప్రభుత్వం అప్పటికే నిషేధించిన గాంధీజీ పుస్తకాలు ‘హింద్ స్వరాజ్’, ‘సర్వోదయ’లను వీధుల్లో పెట్టి మరీ అమ్మడం ప్రారంభించారు. ప్రజలు వాటిని ఎక్కువ ధరకు కొని, ఉద్యమానికి నిధిని సమకూర్చేవారు. ఉద్యమ కార్యాచరణలో ప్రజలు నూతనోత్సాహంతో పాల్గొన్నారు. క్రమంగా దిల్లీ, పంజాబ్‌లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గాంధీని నిర్బంధించడంతో, ప్రజల ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయి.
డయ్యర్ దమనకాండ
రౌలత్ చట్ట వ్యతిరేక సత్యాగ్రహ యోధులను కఠినంగా అణచివేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ సందర్భంలో జలియన్ వాలాబాగ్ (అమృత్‌సర్)లో జరిగిన అమానుష సంఘటన మానవజాతి చరిత్రకే మచ్చగా మిగిలింది. నాగరికులమని ప్రకటించుకునే తెల్లదొరల వికృత స్వరూపాన్ని బహిర్గతం చేసింది. పంజాబ్‌లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. ఈ వార్తతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దాంతో ప్రభుత్వం అమృత్‌సర్‌లో మార్షల్ లా విధించింది. నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్ డయ్యర్‌కు ఇచ్చింది. ఆ రోజు ఏప్రిల్ 13వ తేదీ. వైశాఖీ పర్వదినం. అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో నిరసన సభకు ఉద్యమ కారులు ఒకవైపు, అలాగే వైశాఖీ వేడుకల కోసం గ్రామీణులు, పట్టణ వాసులు మరోవైపు సమావేశమయ్యారు. డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూలాంటి నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ప్రజలంతా కోపంగా ఉన్నారు. మరోవైపు సభలకు, సమావేశాలకు అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. ఈ సమాచారాన్ని మొక్కుబడిగా చాటింపు వేయించారు. నిషేధాజ్ఞల విషయం మైదానానికి వచ్చినవారిలో చాలామందికి తెలియదు. మైదానం చుట్టూ ఎత్తైన గోడ. ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఒక్కటే ఉంది. ప్రశాంతంగా సాగుతున్న ఆ సమావేశ మైదానాన్ని జనరల్ డయ్యర్ సాయుధ దళం చుట్టుముట్టింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జన సమూహంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. మైదానం శవాల దిబ్బలా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం వందల మంది మరణించారు. వేల మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హఠాత్పరిణామానికి దేశమంతా నివ్వెరపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘నైట్‌హుడ్’ను త్యజించారు. దక్షిణాఫ్రికాలో బోయర్ల యుద్ధం సందర్భంగా బ్రిటిషర్లు ఇచ్చిన ‘కైజర్’ బిరుదును గాంధీజీ త్యజించారు. శంకరన్ నాయర్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్షుణ్నంగా విషయ సేకరణ చేసి 92 ప్రశ్నలను సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు పంపించారు. ఈ అమానుష సంఘటనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొక్కుబడిగా లార్డ్ హంటర్ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని నియమించింది. భారత జాతీయ కాంగ్రెస్ ఈ కమిటీని బహిష్కరించి, తన సొంత విచారణ కమిటీని వేసింది. అందులో గాంధీజీ, చిత్తరంజన్ దాస్, ఫజుల్ హాక్, అబ్బాస్ థ్యాబ్జీ, యం.ఆర్.జయకర్‌లు సభ్యులు. ఈ కమిటీ వందలమంది సాక్ష్యులను విచారించి, వార్తలు సేకరించి జనరల్ డయ్యర్, అతడి అధికారుల దమనకాండను ఎండగట్టింది. డయ్యర్‌ను శిక్షించాలని కోరింది.
హంటర్ విచారణ సంఘం 1920, మే 20న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పంజాబ్ సంఘటనలో స్థూలంగా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని నిర్ణయించింది. పైగా డయ్యర్ బుద్ధిపూర్వకంగా కాల్పులు జరపలేదని, కానీ అతడి నిర్ణయంలో పెద్ద పొరపాటు (Grave error of judgementz) దొర్లిందని చెప్పింది. హంటర్ నివేదిక రాకముందే డయ్యర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. బ్రిటిష్ సమాజం అతడి ప్రభుభక్తిని కొనియాడింది. ‘బ్రిటిష్ సామ్రాజ్య పరిరక్షకుడు’ అన్న బిరుదునిచ్చి సత్కరించింది.
సామ్రాజ్యవాదం, విదేశీపాలకుల దుర్మార్గం, అరాచకత్వాన్ని ప్రజలు గమనించారు. పంజాబ్ దురాగతాలకు ప్రభుత్వం బాధ్యత వహించకపోవడం, బాధ్యులపై చర్య తీసుకోకపోవడం గాంధీజీని కలచివేసింది. ఆయన వైఖరిలో కూడా తీవ్ర మార్పు వచ్చింది. ఆంగ్లేయులపై, వారి పాలనా వ్యవస్థలపై ఆయన పెంచుకున్న నమ్మకం పూర్తిగా సడలిపోయింది. ఆ విధంగా జలియన్ వాలాబాగ్ సంఘటన, జాతీయోద్యమ గతిని ప్రభావితం చేసిన ముఖ్య సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!