Updated : 26 Jan 2023 05:55 IST

సమస్త జీవులకూ సానుకూలం!

జనరల్‌ స్టడీస్‌ పర్యావరణ అంశాలు

వర్షాలు పడి నదులు, కాలువలుగా ప్రవహిస్తే జీవులకు, మొక్కలకు కావాల్సిన నీళ్లు అందుతుంటాయి. ఇది సర్వ సాధారణ విషయంగా కనిపించినా, శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇందులో జలావరణం నుంచి జీవావరణం వరకు పలు వ్యవస్థల ప్రభావాలు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ సమస్త జీవులకు అవసరమైన అనుకూలతలను అందిస్తూ వాటి మనుగడ సవ్యంగా సాగడానికి సహకరిస్తుంటాయి. పరిసరాలకు, ప్రాణులకు మధ్య ఉన్న ఈ విశిష్ట బంధం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


భూమి - ఆవరణాలు

జీవులు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జీవించడానికి,  ప్రత్యుత్పత్తికి ఆవరణ వ్యవస్థే ఆధారం. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని జీవ వైవిధ్యం, జీవుల ఆవాసాలు, అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నింటినీ కలిపి ఆవరణ వ్యవస్థ నిర్మాణం అంటారు. ఆవరణ వ్యవస్థ     సమతౌల్యతను కాపాడటం పర్యావరణ వ్యవస్థ ముఖ్యలక్షణం. జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు, జీవుల మధ్య ఉండే  విధిపూర్వక సంబంధాలపై పర్యావరణ   మనుగడ ఆధారపడి ఉంటుంది. మొత్తం భూమి చుట్టూ నాలుగు ఆవరణలు ఆవరించి ఉన్నాయి.

1) శిలావరణం(Lithosphere): భూమి   ఉపరితలం నుంచి కొంత లోతు వరకు    విస్తరించి, ఘనస్థితిలో ఉన్న భూమి బాహ్య పొరను శిలావరణం అంటారు. ఈ ఉపరితలం వివిధ భౌమకాలాల్లో అంతర్జనిత, బహిర్జనిత బలాలకు గురవుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో ఉపరితలంపై పర్వతాలు, పీఠభూములు,   మైదానాలు లాంటి భూస్వరూపాలు ఏర్పడ్డాయి. అలా వివిధ జీవజాతుల మనుగడకు కావాల్సిన భౌతిక పర్యావరణం ఏర్పడింది. శిలావరణం జీవజాతులకు కావాల్సిన ఆహార వనరులు,  శక్తి వనరులు, ఆవాసాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

2) జలావరణం(Hydrosphere): భూమి చుట్టూ ఆవరించిన జలాలను జలావరణం అంటారు. భూ మొత్తం వైశాల్యం సుమారు 510 మిలియన్‌ చదరపు కి.మీ.లలో 71% జలావరణం ఆవరించింది. భూమిపై జీవనానికి అనుకూల వాతావరణం ఏర్పడేందుకు జలావరణం సహకరిస్తుంది. జలచక్రంలో భాగంగా నీరు ఆవిరై, తిరిగి భూమి మీద వర్షంగా కురిసి జీవులకు ఆధారమైన నీటిని సమకూరుస్తుంది. జలభాగం ప్రధాన కార్బన్‌ శోషకం(carbon sink)గా వ్యవహరిస్తుంది. భూమిపై రెండు కార్బన్‌ శోషకాలను గుర్తించవచ్చు. మహాసముద్రాలు, సముద్రాలు అతిపెద్ద బ్లూ కార్బన్‌ సింక్‌ గా ఉన్నాయి. భూమి మీద ఉన్న అటవీ వనరులను గ్రీన్‌ కార్బన్‌ సింక్‌గా పిలుస్తారు. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అడవులు అతిపెద్ద గ్రీన్‌ కార్బన్‌ సింక్‌కు ఉదాహరణ.

3) వాతావరణం(Atmosphere): భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరే వాతావరణం. ఇది భూమి ఉపరితలం నుంచి దాదాపుగా 1600 కి.మీ. ఎత్తువరకూ విస్తరించింది. వాయువులో ఉండే ఘన, ద్రవ  కణాలను ఏరోసోల్స్‌ (Aerosols) అంటారు. వాతావరణంలో చేరే దుమ్ము, ధూళి రేణువులు, కలుషిత గాలి వాతావరణంలోని  ఘనపదార్థాలు. ఇవి పరిమితికి మించి గాలిలో చేరితే గాలి పారదర్శకత దెబ్బతిని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.


వాతావరణంలోని వివిధ  పొరలు

ట్రోపో ఆవరణం: ఇది భూమిని ఆవరించి ఉన్న మొదటి వాతావరణ పొర. భూమధ్య రేఖా ప్రాంతంలో 18 కి.మీ. ఎత్తు, ధ్రువాలపై 8 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. ఈ ఆవరణంలో ధూళి కణాలు, మేఘాలు, పవనాలు, వర్షం, ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణ అంశాలన్నీ ఏర్పడతాయి. అందుకే ఈ ఆవరణాన్ని కల్లోల/మిశ్రమ/ పరివర్తన ఆవరణం అంటారు. జీవుల మనుగడకు అనుకూలమైన ఆవరణం ఇది. ఈ ఆవరణం పైభాగం కంటే కింది భాగంలో  ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి  సంవహన క్రియకు దోహదం చేస్తున్నాయి. ఇందులో పైకి వెళ్లేకొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల చొప్పున లేదా ప్రతి 165 మీటర్లకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూఉంటుంది. దీన్నే ఉష్ణోగ్రత క్షీణతా క్రమం అంటారు. ట్రోపో ఆవరణ పైభాగంలో అత్యంత వేగంగా వంకరలు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్‌ పవనాలనే జెట్‌స్ట్రీమ్స్‌ అంటారు. ఇలాంటి పశ్చిమ జెట్‌ స్ట్రీమ్‌ ఒకటి భారతదేశంపై నుంచి హిమాలయాల అంత ఎత్తులో వీస్తుండటం వల్ల ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షాలు కురుస్తుంటాయి.

స్ట్రాటో ఆవరణం: ఇది ట్రోపో ఆవరణంపైన భూమి    ఉపరితలం నుంచి దాదాపు 50 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవరణానికి, ట్రోపో ఆవరణానికి మధ్యలో ట్రోపోపాస్‌ అనే సంధి పొర ఉంటుంది. స్ట్రాటో ఆవరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులోనే జెట్‌ విమానాలు ప్రయాణిస్తాయి. ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. భూమికి రక్షణ   కవచంగా పిలిచే ఓజోన్‌ ఆవరణం స్ట్రాటో ఆవరణంలోనే భూమి చుట్టూ విస్తరించి ఉంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను వడపోసి వేడిని మాత్రమే పంపిస్తుంది. స్ట్రాటో   ఆవరణం పై అంచులో, దానిపైన ఉన్న మీసో ఆవరణానికి మధ్య స్ట్రాటో సంధి పొర (స్ట్రాటో పాస్‌) ఉంటుంది.

మీసో ఆవరణం: ఇది స్ట్రాటో పాస్‌పైన భూమి ఉపరితలం నుంచి 80 కి.మీ. ఎత్తు వరకూ ఆవరించి ఉంది. ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువల్ల దీన్ని బాహ్యట్రోపో ఆవరణం అంటారు. ఈ ఆవరణం పైఅంచును మీసో పాస్‌ అంటారు. ఇక్కడ  100 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఇక్కడ రాకెట్లు ప్రయాణించేలా వాటికి క్రయోజెనిక్‌ ఇంజిన్లు వాడతారు.

ఐనో ఆవరణం: ఇది మీసోపాస్‌ను ఆనుకుని సుమారుగా 400 కి.మీ. ఎత్తు వరకు భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఇందులో ఆక్సిజన్‌, నైట్రోజన్‌ అణువులు కలిసి  అయనీకరణ చెందుతాయి. హైడ్రోజన్‌, హీలియం అణువులు కలిసి అకస్మాత్తుగా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందువల్ల ఐనో ఆవరణాన్ని థ]ర్మో ఆవరణం అని కూడా అంటారు. భూమి నుంచి పంపిన విద్యుదయస్కాంత తరంగాలు ఐనో ఆవరణంలో పరావర్తనం చెంది తిరిగి భూమిని రేడియో తరంగాలుగా చేరతాయి.

ఎక్సో ఆవరణం: ఇది ఐనో ఆవరణం పైన విస్తరించి ఉన్న ఆవరణం. ఇది పదార్థం నాలుగో రూపమైన ప్లాస్మా స్థితిలో ఉంటుంది. హైడ్రోజన్‌, హీలియం వల్ల ఇది కూడా అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది.ఈ పొరను మాగ్నిటోఆవరణంఅని కూడా అంటారు.

4) జీవావరణం(Biosphere): శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునే సంధి ప్రాంతంలో ఆక్సిజన్‌, నైట్రోజన్‌, కార్బన్‌, నీరు లాంటి పదార్థాలు జీవ - భూ - రసాయన వలయాల ద్వారా   పరస్పరం మార్పిడి చెందుతుంటాయి.  ఇది నిరంతరం జీవజాతుల ఆవిర్భావానికి, వాటి మనుగడకు కావాల్సిన అనుకూల భౌతిక పరిస్థితులను ఏర్పరుస్తాయి. ఈ భౌతిక పరిసరాల్లో నివసించే మొత్తం జీవజాతినే జీవావరణం అని పిలుస్తారు.


వివిధ రూపాల్లో లభించే నీరు

మహాసముద్రాలు 97.25%
ధ్రువాల్లో మంచు, హిమనీనదాలు 2.05%
భూగర్భజలం 0.68%
సరస్సులు   0.01%
నేలలో తేమ 0.005%
గాలిలో తేమ 0.001%
నదులు 0.0001%
మొత్తం 99.9961%


కాంతి పుంజాలు

సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తిమంతమైన వికిరణాలు ఐనోస్ఫియర్‌లోకి ప్రవేశించినప్పుడు అందులోని  ఆక్సిజన్‌, నైట్రోజన్‌ వాయువులతో విభేదిస్తాయి. ఫలితంగా రసాయన చర్య జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుంది. వీటినే అరోరాలు అంటారు. ఈ కాంతి కిరణాలు అయస్కాంత ధ్రువాల వైపు ఆకర్షితమవుతాయి. ఇవి ధ్రువాల పై ఆరు నెలలు చీకటిగా ఉన్న రోజుల్లో కనిపిస్తుంటాయి. వీటినే ఉత్తర ధ్రువంలో అరోరా బోరియాలిస్‌ అని, దక్షిణ ధ్రువంలో అరోరా ఆస్ట్రాలిస్‌ అని అంటారు.


మాదిరి ప్రశ్నలు

1. ఎకోసైడ్‌ అంటే ఏమిటి?
  1. మానవుడి అభివృద్ధి వల్ల పర్యావరణ క్షీణత
  2. మానవుడి అభివృద్ధి వల్ల పర్యావరణ అభివృద్ధి
  3. భూకంపాల వల్ల పర్యావరణం దెబ్బతినడం
  4. పైవన్నీ
2. భూమి మీది మొత్తం జలావరణంలో సముద్రాలు ఎంత నీటిని ఆవరించి ఉన్నాయి?
  1. 73%         2. 97.3%
  3. 25.5%        4. 50%
3. రేడియో తరంగాలు ఏ ఆవరణం నుంచి భూమి పైకి పరావర్తనం చెందుతాయి?
  1. మీసో ఆవరణం  2. స్ట్రాటో ఆవరణం
  3. ఐనో ఆవరణం  4. ఎక్సో ఆవరణం
4. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది?
  1. నైట్రోజన్‌    2. ఆక్సిజన్‌
  3. ఆర్గాన్‌      4. కార్బన్‌ డయాక్సైడ్‌
5. ఏరోసోల్స్‌ అంటే ఏమిటి?
  1. గాలిలోని ఘన ద్రవకణాలు    
  2. గాలిలోని వాయు కణాలు
  3. గాలిలోని దుమ్ము కణాలు    
  4. గాలిలోని కర్బన కణాలు
6. ఉత్తర ధ్రువం వైపు కనిపించే కాంతి పుంజాలను ఏమంటారు?
  1. అరోరా ఆస్ట్రాలిస్‌  
  2. అరోరా బోరియాలిస్‌
  3. విద్యుత్‌ కాంతులు   4. పైవన్నీ
7. అతిశీతల వాతావరణంలో రాకెట్లకు వాడే ఇంజిన్‌ ఏమిటి?
  1. రేడియో విండోస్‌   2. జెట్‌ విండోస్‌
  3. క్రయోజెనిక్‌ ఇంజిన్‌
  4. క్రిటికల్‌ ఇంజిన్‌


సమాధానాలు:

1-1, 2-2, 3-3, 4-1,
 5-1, 6-2, 7-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు