తిరగబడిన కలం.. గళం!
తెలంగాణ కవులు పలువురు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి వారిని నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం చేశారు. వివిధ సాహిత్య సంస్థలు అనేక పుస్తకాలు ప్రచురించి తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాయి.
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
పాటలతో పోటెత్తిన పల్లె జనం నిజాం నిరంకుశ పాలనపై పోరాటాలు జరిపారు. కవిత్వం, కథల ప్రభావంతో కదిలి వచ్చిన సామాన్యులు స్వాతంత్య్ర సమరంలో కదం తొక్కారు. నవలలు, నాటకాలు, బుర్రకథలు వంటి కళారూపాలు ఇచ్చిన ఉత్సాహంతో ఉద్యమించారు. ఇదంతా తెలంగాణ ప్రజల్లో ఆనాటి సాహిత్యం సృష్టించిన సామాజిక చైతన్యం. రాజకీయ సభలను హైదరాబాదు నవాబు రద్దుచేసినా ఎవరూ లెక్కపెట్టలేదు. సంస్కరణల కోసం పోరు సాగించారు. స్వేచ్ఛను హరించిన పాలకులపై వందేమాతరం నినాదాలతో తిరగబడ్డారు.
సాహిత్యోద్యమం
తెలంగాణ కవులు పలువురు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి వారిని నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం చేశారు. వివిధ సాహిత్య సంస్థలు అనేక పుస్తకాలు ప్రచురించి తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాయి. చందాల కేశవదాసు 1911లో ‘కనకతార’ నాటకం రచించి ఆధునిక నాటక రచనకు పునాది వేశారు. రత్నమాంబ దేశాయి 1913లో రచించిన హితబోధిని డిసెంబరు సంచికలో స్త్రీలు విద్యలోనూ, కవిత్వంలోనూ రాణించేందుకు సిద్ధం కావాలన్నారు. ఆర్య సమాజం ప్రభావంతో పాశం నారాయణరెడ్డి ‘దయానంద సరస్వతి జీవిత చరిత్ర’ (బుర్రకథ), ‘త్యాగమూర్తి’ గ్రంథంతోపాటు ‘సదాశివరెడ్డి’ అనే పద్య కావ్యం రచించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా అనేక సాహితీ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇలా స్థాపించిన మొదటి సాహిత్య సంస్థ ‘సాహితీ మేఖల’. దీన్ని అంబటిపూడి వెంకటరత్నశాస్త్రి 1936లో నల్గొండలో స్థాపించారు. నీలగిరి కవుల సంచిక (పున్న అంజయ్య), అగ్నిధార (దాశరథి), ఖడ్గ తిక్కన (పులిజాల గోపాలరావు), తర్కభాష (అంబలిపూడి వెంకటరత్నం) తదితర గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది.
సాధన సమితి: యువ రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సాహితీ సంస్థను 1939లో బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెల్దుర్తి మాణిక్యరావు స్థాపించారు. ఈ సంస్థ వెంకట అయ్యంకి రమణయ్య రచించిన ’భోజరాజు’ (పద్యకావ్యం), భోగి నారాయణమూర్తి రచించిన ‘పరీక్ష చదువు’ (కథలు), దేవులపల్లి రామానుజరావు రచించిన ‘నవ్యకవితా నీరాజనం’ (వ్యాసాలు) మొదలైన పుస్తకాలను ప్రచురించింది.
విజ్ఞానవర్ధిని పరిషత్తు: ఈ సంస్థను 1941, నవంబరు 11న సురవరం ప్రతాపరెడ్డి స్థాపించారు. ఆయన రచించిన మృత్యుసిద్ధాంతం, రామాయణ విశేషాలు, ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం వంటి గ్రంథాలను ప్రచురించింది.
రావి నారాయణరెడ్డి నవ్య సాహితీ సమితి: ఈ సమితిని కాళోజీ నారాయణరావు స్థాపించారు. దీనిద్వారా నిఘంటువులు, శాసనాలు, జీవిత చరిత్రల అభివృద్ధికి కృషి చేశారు.
సారస్వత పరిషత్తు: పలువురు కవులు రచించిన గ్రంథాలను ప్రచురించి, తెలుగు సాహిత్యాభివృద్ధిని ప్రోత్సహించింది.
ప్రచురించిన గ్రంథాలు: * సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర
* సూర్యనారాయణ శాస్త్రి - కావ్యాలంకార సంగ్రహం
* దివాకర్ల వెంకటావధాని - సాహిత్య సోపానాలు
* రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి - శాలివాహన గాథాసప్తశతి సారం
* కృష్ణ శాస్త్రి - పల్లె పదాలు, స్త్రీల పౌరాణిక పాటలు
* దేవులపల్లి రామానుజరావు - మనదేశం
* గడియారం రామకృష్ణ - వీరగాథలు
* ఆదిరాజు వీరభద్రరావు - మిఠాయి చెట్టు
ఈ రచనలే కాకుండా అనేకమంది తెలంగాణ కవులు తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. కవి యాదగిరి రాసిన ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావ్ కొడుకో నైజాం సర్కరోడా’ అనే పాట, సుద్దాల హనుమంతు రాసిన ‘పసుల గాసే పోరగాడా పాలు మరిసి ఎన్నాళ్లయిందో’, తిరునగరి కవి రచించిన ‘సైసై గోపాలరెడ్డి! నీవు నిలిచావు ప్రాణాలొడ్డి’ వంటి గీతాలు విశేష ప్రాచుర్యం పొందాయి. సుంకి సత్యనారాయణ ‘కష్టజీవి’ (బుర్రకథ), బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’, లక్ష్మీకాంత మోహన్ ‘సింహగర్జన’, కాంచనపల్లి చిన వెంకటరామారావు ‘అరుణరేఖలు’ (కవిత), రావిళ్ళ వెంకట రామారావు ‘మాతృగీతం’ వంటి గ్రంథాలు జనాన్ని ప్రభావితం చేశాయి.
తెలంగాణలో మొదటి నవల తడకమళ్ళ కృష్ణారావు రచించిన ‘కంబు కందర చరిత్ర’. తెలంగాణ సాహిత్యంలో లోకమల హరి రచించిన ‘జగ్గనియిద్దె’ నవల దళిత జీవితానికి అద్దం పట్టింది. గొల్లపూడి నారాయణరావు నవల ‘తెలుగుగడ్డ’ ఇక్కడి ప్రజల దయనీయ జీవితాలను కళ్లకు కట్టింది. మొదటి చారిత్రక నవల బద్దిరాజు రామచంద్రరావు రచించిన రుద్రమదేవి, దాశరథి రంగాచార్యులు రచించిన జనపదం (1976), మోదుగుపూలు (1971), చిల్లరదేవుళ్లు తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించాయి. తిరునగరి రామాంజనేయులు రచించిన సంగం, కందిమల్ల ప్రతాప రెడ్డి రచించిన బందూక్, ముదిగంటి సుజాత రెడ్డి రచించిన రథచక్రాలు తెలంగాణ ఇతివృత్తంతో వచ్చిన నవలలు.
హైదరాబాదు రాజకీయ మహాసభలు
1918లో హైదరాబాదు రాజ్య సంస్కరణల సంఘాన్ని స్థాపించారు. ఇది హైదరాబాదు రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ. హైదరాబాదు నగరంలోని విద్యావంతులు 1921లో ఒక రాజకీయ సభ జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నిజాం ప్రభుత్వం 1921, సెప్టెంబరు 9న ఫర్మానా జారీ చేసి ఎవరూ రాజకీయ సభలు జరపకూడదని ఆంక్షలు విధించింది. దీంతో హైదరాబాదు రాజకీయ సమావేశాలు నిజాం రాజ్యం వెలుపల జరిగాయి.
ప్రథమ హైదరాబాదు రాజకీయ మహాసభ 1923లో కాకినాడలో మాధవరావు అణే (బేరారు వాసి) అధ్యక్షతన జరిగింది. మాడపాటి హనుమంతరావు, రాఘవేంద్రరావు శర్మ, వామన్నాయక్, బూర్గుల రామకృష్ణారావు తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నిజాం రాజ్యాంగ సంస్కరణలు, వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం వంటి తీర్మానాలు చేశారు. రెండో హైదరాబాదు రాజకీయ మహాసభ 1926లో బొంబాయిలో వై.ఎమ్.కాళే (బేరారు) అధ్యక్షతన జరిగింది. మూడో హైదరాబాదు రాజకీయ మహాసభ 1928లో పుణెలో ఎన్.సి.కేల్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు సుభాష్ చంద్రబోస్ హాజరై ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో సంస్థానాల్లోని నల్లదొరల పాలనను విమర్శించారు. నాలుగో హైదరాబాదు రాజకీయ మహాసభ 1931లో అకోలా (మహారాష్ట్ర)లో శ్రీరామచంద్ర నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఫజుల్ రహమాన్ కార్యదర్శిగా వ్యవహరించారు. నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
వందేమాతర ఉద్యమం
దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్రోద్యమ ప్రభావం హైదరాబాదు రాజ్యంపై ఉండేది. 1938లో ఇక్కడ కూడా వందేమాతర ఉద్యమం జరిగింది. అదే ఏడాది ఉస్మానియా వర్సిటీలో దసరా ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ‘బి’ హాస్టల్ హిందూ విద్యార్థులు ‘వందేమాతరం’ గీతం పాడారు. ఇది నచ్చని వర్సిటీ అధికారులు ప్రార్థనామందిరాన్ని మూసివేయడంతో, విద్యార్థులు వరండాలోనే వందేమాతర గీతాలాపన చేశారు. ఈ గీతం పాడవద్దంటూ అధికారులు సర్క్యులర్ జారీ చేసినప్పటికీ విద్యార్థులు పట్టించుకోలేదు. దాంతో 1938, నవంబరు 29న హిందూ విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. నిరసనగా విద్యార్థులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే మరికొందరు విద్యార్థులు పార్సీ, అరబ్బీ, ఉర్దూ భాషా సాహిత్యాలకు ఆచార్య పీఠాలున్నట్లే ప్రాంతీయ భాషలైన తెలుగు, మరాఠీ, కన్నడం, సంస్కృత భాషలకూ విశ్వవిద్యాలయంలో ఆచార్య పీఠాలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమ్మె డిసెంబరు 10 వరకు నిరంతరాయంగా సాగింది. ఫలితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలల నుంచి 300 మందిని, సిటీ కాలేజీ నుంచి 70 మందిని, గుల్బర్గా-కాలేజీ హైస్కూలు నుంచి 310 మందిని, మహబూబ్‌నగర్ హైస్కూల్ నుంచి 120 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరిని మరో యూనివర్సిటీలో చేర్చుకోకుండా ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు అప్పీల్ చేశారు. సస్సెండ్ అయిన విద్యార్థులకు వామన్నాయక్‌కు చెందిన భవనంలో భోజనం, జైన మందిరంలో వసతి ఏర్పాట్లు చేశారు. వీరి చదువులు ఇతర విశ్వవిద్యాలయాల్లో కొనసాగడానికి రాజా బహద్దూర్ వెంకట్ రామారెడ్డి చొరవతో ఒక కమిటీని వేశారు. దీనికి అచ్యుతరెడ్డి అధ్యక్షులు. వీరి కృషి ఫలించి సస్పెండ్ అయిన విద్యార్థులకు నాగ్‌పుర్ విశ్వవిద్యాలయం ప్రవేశం కల్పించింది. ఈ ఉద్యమం హైదరాబాదు సంస్థానంలో విద్యార్థులు నడిపిన మొదటి గొప్ప ఉద్యమం. హైదరాబాదు రాజ్య స్వాతంత్య్రోద్యమానికి 1946-48 వరకు నాయకత్వాన్ని, కార్యకర్తలను సమకూర్చింది ఈ ఉద్యమమే. వందేమాతర ఉద్యమకాలంలో హైదరాబాద్‌లో కొనసాగిన విద్యార్థుల పోరాటాన్ని జాతీయ నాయకులైన సుభాష్ చంద్రబోస్, సావర్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, గాంధీజీ సమర్థించారు. వందేమాతర నినాదాలను నిరంతరం వ్యాపింపజేసిన రామచంద్రరావు, వందేమాతరం రామచంద్రరావుగా ప్రసిద్ధికెక్కారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ‘గద’ వెనుక కథ ఇదీ..
-
India News
Center: రష్యాలో ఎయిరిండియా ప్రయాణికుల పడిగాపులు.. మరో విమానం పంపుతున్న భారత్
-
Sports News
WTC Final: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు.. భారత్ తుది జట్టు ఇదేనా?
-
Crime News
ప్రభుత్వ హాస్టల్లో యువతిపై హత్యాచారం.. ఆపై అనుమానిత గార్డు ఆత్మహత్య..!
-
World News
Pakistan: డబ్బు కోసం పాక్ తిప్పలు.. అమెరికాలో రూజ్వెల్ట్ హోటల్ తనఖా
-
Crime News
Crime News: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య