12 భాగాలు 13 షెడ్యూళ్లు 108 సెక్షన్లు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ విభజన హామీలు నెరవేరలేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

Updated : 09 Mar 2023 02:38 IST

ఏపీ విభజన సమస్యలు/సవాళ్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ విభజన హామీలు నెరవేరలేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఇంతకీ రాష్ట్ర విభజన ప్రక్రియ ఎలా సాగింది? ఆ చట్టంలో ఏముంది? సిలబస్‌ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన, సమస్యలు-సవాళ్లు’ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలను తెలుసుకోవాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన - చట్టం

కేంద్ర ప్రభుత్వం అనేక తర్జనభర్జనల అనంతరం 2013, జులై 30న ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. సంబంధిత ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. అదే ఏడాది డిసెంబరు 12న రాష్ట్ర విభజనపై రూపొందించిన రాష్ట్రపతి బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి పంపింది. బిల్లుపై అభిప్రాయం తెలియజేసేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది.

* రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును 2013, డిసెంబరు 16న అప్పటి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై 2014, జనవరి 30 నాటికి వివిధ క్లాజులకు సంబంధించి 9,072 సవరణలు సభ్యుల నుంచి రాతపూర్వకంగా వచ్చాయి. శాసనమండలిలోనూ ఈ బిల్లుపై 1,157 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రంలోని రెండు చట్టసభలు తిరస్కరించాయి. (రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర చట్ట సభలు ఇలాంటి బిల్లును తిరస్కరించినప్పటికీ పార్లమెంట్‌ వాటికి కట్టుబడాల్సిన పని లేదు) ః ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014కు లోక్‌సభ 2014, ఫిబ్రవరి 18న, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపాయి. అనంతరం మార్చి 1న రాష్ట్రపతి ఆమోదంతో భారత గెజిట్‌ నంబరు ‘6’ ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014’ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ః కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2014, మార్చి 4న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌ 2(ఎ) ప్రకారం 2014, జూన్‌ 2ను ‘అపాయింటెడ్‌ డే’ (అవతరణ దినం/నియామక దినం)గా నిర్ణయించి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

* 2014, మార్చి 28న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం -2014లోని సెక్షన్‌-6 ప్రకారం తెలంగాణ విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం సూచనలు చేయడానికి ‘శివరామకృష్ణన్‌’ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తన నివేదికను 2014, ఆగస్టు 27న కేంద్ర హోం శాఖకు అందించింది.

* 2014, జూన్‌ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.   అనంతరం 2014, జులై 17న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం -2014లోని సెక్షన్‌-3కి సవరణ చేసి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను (పూర్తిగా 5, పాక్షికంగా 2) నూతన ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఆ మండలాలను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేర్చారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014

ఈ చట్టంలో మొత్తం 108 సెక్షన్లు, 12 భాగాలు, 13 షెడ్యూళ్లు ఉన్నాయి.

1. మొదటి షెడ్యూల్‌ (సెక్షన్‌ 13): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాజ్యసభలోని 18 స్థానాల్లో 7 స్థానాలు తెలంగాణకు కేటాయించడం గురించి వివరిస్తుంది.

2. రెండో షెడ్యూల్‌ (సెక్షన్‌ 15): ఇందులో 2008 నాటి పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల సర్దుబాటు ఉత్తర్వులకు ప్రతిపాదించిన మార్పుల గురించి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 25 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాలు షెడ్యూల్డ్‌ కులాలకు, ఒక స్థానం షెడ్యూల్డ్‌ తెగలకు కేటాయించారు. ఆంగ్ల అక్షర క్రమంలో తమిళనాడు సీరియల్‌ నంబరు ‘24’ తర్వాత 25వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం వివరాలు చేర్చారు. తెలంగాణకు కేటాయించిన 17 లోక్‌సభ స్థానాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు 3 స్థానాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 2 స్థానాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు 29 స్థానాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 7 స్థానాలు కేటాయించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 19 షెడ్యూల్డ్‌ కులాలకు, 12 స్థానాలు షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వ్‌ చేశారు.

3. మూడో షెడ్యూల్‌ (సెక్షన్‌ 24): ఆంధ్రప్రదేశ్‌,   తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, శాసనమండలి,     పార్లమెంటరీ నియోజకవర్గాల వివరాలను పేర్కొన్నారు.

4. నాలుగో షెడ్యూల్‌ (సెక్షన్‌ 22(2)): దీంట్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని శాసనమండలి సభ్యుల గురించి వివరించారు.

5. ఐదో షెడ్యూల్‌ (సెక్షన్‌ 28): ఈ షెడ్యూల్‌లో రాజ్యాంగ ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ కులాలు)లో మార్పుల గురించి పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల గురించి వివరణ.

6. ఆరో షెడ్యూల్‌ (సెక్షన్‌ 29): రాజ్యాంగ ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ తెగలు) లో మార్పుల గురించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ తెగల గురించి వివరిస్తుంది.

7. ఏడో షెడ్యూల్‌ (సెక్షన్‌ 52): ప్రావిడెంట్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌, బీమా ఫండ్స్‌, సింకింగ్‌ ఫండ్స్‌, గ్యారెంటీ రిజంప్సన్‌ ఫండ్స్‌, రిజర్వ్‌ ఫండ్స్‌, ఇతర నిధుల గురించి చెప్పారు.

8. ఎనిమిదో షెడ్యూల్‌ (సెక్షన్‌ 59): రెండు రాష్ట్రాలకు సంబంధించి పింఛను చెల్లింపు బాధ్యతల పంపిణీ.

9. తొమ్మిదో షెడ్యూల్‌ (68, 71 సెక్షన్లు): ప్రభుత్వ కంపెనీలు,   కార్పొరేషన్ల జాబితా. ఇందులో మొత్తం 89 సంస్థలున్నాయి.

10. పదో షెడ్యూల్‌ (సెక్షన్‌ 75): సౌకర్యాలు కొనసాగించాల్సిన సంస్థల జాబితా. మొత్తం 142 సంస్థలున్నాయి.

11. పదకొండో షెడ్యూల్‌ (సెక్షన్‌ 85(7)): ఈ సెక్షన్లో నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని నిర్దేశించే సూత్రాల గురించి పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను అనుకున్నట్లుగానే పూర్తి చేయాలి. వాటి నీటి
కేటాయింపు ఏర్పాట్లలో మార్పు ఉండదు.

12. పన్నెండో షెడ్యూల్‌ (సెక్షన్‌ 92): ఇందులో బొగ్గు, చమురు, సహజ వాయువు, విద్యుత్తు విభజన గురించి
పేర్కొన్నారు.

13. పదమూడో షెడ్యూల్‌ (సెక్షన్‌ 93): విద్య, మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యమున్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్‌; పెట్రోలియం, వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకరిస్తుంది. అలాగే తెలంగాణలో గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తుంది.

* ఓడరేవులు, ఉక్కు పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్‌లు, విమానాశ్రయాలు, మెట్రో రైలు సౌకర్యాలు, విద్యుత్తు ప్లాంటు లాంటి మౌలిక వసతుల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నంలో భారీ ఓడరేవును నిర్మిస్తుంది. ఖమ్మం, కడప జిల్లాల్లో సమగ్ర ఉక్కు కర్మాగారాలను నెలకొల్పుతుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు విస్తరిస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మహానగర- అభివృద్ధి సంస్థ పరిధిలో మెట్రో రైలు సౌకర్యం కల్పించే     విషయమై అధ్యయనం చేసి, ఏడాదిలోగా కేంద్రం నిర్ణయం వెలువరిస్తుంది.

చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు

సెక్షన్‌-1: విభజన చట్టం పేరు గురించి చెబుతుంది.

సెక్షన్‌-3: తెలంగాణ రాష్ట్ర అవతరణ, తెలంగాణ భూభాగాల గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-5: రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, దాని పరిధిని వివరిస్తుంది.

సెక్షన్‌-6: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని కోసం నిపుణుల కమిటీ ఏర్పాటును చెబుతుంది.

సెక్షన్‌-8: ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణ, గవర్నరు బాధ్యతలను తెలియజేస్తుంది.

సెక్షన్‌-9: రెండు రాష్ట్రాలకు కేంద్ర బలగాల సాయం గురించి పేర్కొంటుంది.

సెక్షన్‌-10: రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌కు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌-3లో పేర్కొన్న ప్రాంతాలను చేర్చాలని పేర్కొంటుంది. అలాగే ఎంట్రీ ‘28’ తరువాత ఎంట్రీ ‘29’గా తెలంగాణను చేర్చి విభజన చట్టంలోని సెక్షన్‌-3లో పేర్కొన్న ప్రాంతాలను చేర్చాలి.

సెక్షన్‌-12: రాజ్యాంగం నాలుగో షెడ్యూల్‌లో ఇరు రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యులకు సంబంధించిన మార్పుల గురించి పేర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు 11 మంది, తెలంగాణకు 7 మంది రాజ్యసభ సభ్యులను కేటాయించారు.

సెక్షన్‌-14: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ    ప్రాతినిధ్యం గురించి పేర్కొంటోంది. మొత్తం 42 స్థానాల్లో ఏపీకి 25, తెలంగాణకు 17 స్థానాలను    కేటాయించారు. ఆ మేరకు ప్రజాప్రాతినిథ్య చట్టం-1950 మొదటి షెడ్యూల్‌ను సవరించినట్లు పరిగణించాలి.

సెక్షన్‌-17: ఇరు రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాల కేటాయింపు గురించి చెబుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 175, తెలంగాణకు 119 స్థానాలు కేటాయించి ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లో మార్పులు చేయాలి.

సెక్షన్‌-22: ఇందులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన వేర్వేరు శాసనమండళ్లు, సభ్యుల గురించి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 50 మంది సభ్యులకు మించకుండా,  తెలంగాణకు 40 మందికి మించకుండా ఉండాలి.

సెక్షన్‌-26: అసెంబ్లీ నియోజక వర్గాల డీలిమిటేషన్‌ గురించి పేర్కొంటుంది. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225 స్థానాలకు, తెలంగాణలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెంచాలని సూచిస్తుంది.

సెక్షన్‌-28: రాజ్యాంగ ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ కులాలు) సవరణ గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-29: రాజ్యాంగ ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ తెగలు) సవరణ గురించి వివరిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని