ప్రజల చేతికే పాలనాపగ్గాలు!
ఒక పంచాయతీలో పరిశుభ్రతను ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు. మారుమూల పల్లెకు మంచినీటిని అందించే బాధ్యతను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించలేరు.
భారత రాజ్యాంగం
రాజకీయాలు
ఒక పంచాయతీలో పరిశుభ్రతను ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు. మారుమూల పల్లెకు మంచినీటిని అందించే బాధ్యతను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించలేరు. వేల గ్రామాల్లో విద్యుత్తు, రహదారుల వంటి సౌకర్యాల కల్పన, నిర్వహణ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు కుదిరే పని కాదు. అందుకే ఆ బాధ్యతలన్నింటినీ స్థానిక ప్రజలకే ఇచ్చేశారు. తమను తామే పాలించుకునే రాజ్యాంగబద్ధ అధికారాన్ని అప్పగించేశారు. ఈ పరిణామాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.
స్థానిక స్వపరిపాలన - అభివృద్ధి క్రమం
స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి, వాటిని సమర్థంగా అమలు చేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. అందుకోసం ఏర్పాటైనవే స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటి ద్వారా పాలనాపగ్గాలు ప్రజల చేతుల్లోనే ఉంటాయి.
స్థానిక సంస్థల ఆవశ్యకత:
* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.
* పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి.
* స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.
* ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.
అభివృద్ధి క్రమం
ప్రాచీన భారతదేశంలో:
* రుగ్వేదంలో ‘సభ’, ‘సమితి’ అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ప్రజాసంక్షేమ పాలన నిర్వహించేవారని తెలుస్తోంది.
* రామాయణంలో ‘జనపదం’ అనే పేరును అనేక గ్రామాల సమాఖ్యగా అభివర్ణించారు.
* మహాభారతంలోని ‘శాంతి పర్వం’ ప్రకారం గ్రామీణ పరిపాలనను ‘గ్రామసంఘాలు’ నిర్వహించేవి.
* శుక్రాచార్యుడు రచించిన ‘నీతిశాస్త్రం’ గ్రంథంలో ‘గ్రామాల కామన్వెల్త్’ గురించి పేర్కొన్నారు.
* ‘బౌద్ధం విలసిల్లిన కాలంలోనే భారత్‌లో స్థానిక పాలన వర్ధిల్లింది’ అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు.
* కౌటిల్యుడు తన ‘అర్థశాస్త్రం’ గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించాడు. ఈ గ్రంథంలో గ్రామ పరిపాలన అధికారిని ‘గ్రామణి’ అని, పది గ్రామాల పరిపాలనా అధికారిని ‘దశ గ్రామణి’గా పేర్కొన్నారు.
* మన దేశంలో గ్రామీణ పాలనకు ప్రణాళికాబద్ధమైన పునాదులు వేసినవారు చోళులు. చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించిన ‘ఉత్తర మెరూర్’ శాసనం ప్రకారం చోళులు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేవారు.
* చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం ‘పంచాస్’ అనే అయిదుగురు సభ్యులతో ఒక మండలి ఉండేది. ‘పంచాస్’ పదమే ‘పంచాయతీ’గా పరిణామం చెందింది.
మధ్యయుగంలో:
* క్రీ.శ.712లో మహ్మద్ బిన్ ఖాసిమ్‌తో భారత్‌పై ప్రారంభమైన మహ్మదీయుల దండయాత్రలతో స్థానిక స్వపరిపాలనకు విఘాతం.
* దిల్లీ సుల్తానుల పరిపాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల పాలనకు ‘పంచాయతీలు’ ఉండేవి.
* షేర్షా పాలనా కాలంలో భూమిని కొలిచి శిస్తు విధించే విధానం, గ్రామీణ స్థానిక సంస్థల పరిపాలన కొనసాగేవి.
* మొగలుల హయాంలో స్థానిక పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ‘పంచాయతీలు’ తీసుకునేవి. వీరి పాలనా కాలంలో పట్టణ పాలనాధికారి ‘కొత్వాల్’. అతడికి సహకరించేందుకు ‘మున్సబ్’ అనే అధికారి ఉండేవారు.
* ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, ఫ్రెంచివారు, డచ్‌వారు.. వారి పరస్పర ఘర్షణలు, భారత్‌లో స్థానిక స్వపరిపాలనపై తీవ్రమైన దుష్ప్రభావం చూపాయి.
ఆంగ్లేయుల పాలనా కాలంలో:
* ఈస్టిండియా కంపెనీ పన్నుల వసూళ్లకు 1687లో మద్రాసులో తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. పన్నులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో 1726లో మున్సిపల్ కార్పొరేషన్‌కు బదులుగా ‘మేయర్’ కోర్టులను అమల్లోకి తీసుకొచ్చారు.
* 1772లో వారన్ హేస్టింగ్స్ కాలంలో భూమిశిస్తు వసూలు లక్ష్యంగా ‘జిల్లా కలెక్టర్’ పదవిని ప్రవేశపెట్టారు.
* 1793 చార్టర్ చట్టం బొంబాయి, మద్రాసు, కలకత్తా పట్టణాల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు చట్టబద్ధత కల్పించింది.
* 1813 చార్టర్ చట్టం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఇచ్చింది.
* 1861 ‘ఇండియన్ కౌన్సిల్’ చట్టం స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించింది.
* 1870లో లార్డ్ మేయో ప్రవేశపెట్టిన ‘ఆర్థిక వికేంద్రీకరణ’ విధానం, మన దేశంలో పరిపాలనా వికేంద్రీకరణకు పునాదిగా నిలిచింది.
* చార్లెస్ మెట్‌కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను ‘లిటిల్ రిపబ్లిక్స్’గా అభివర్ణించారు.
లార్డ్ రిప్పన్ చొరవ:
* 1882, మే 18న లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఒక తీర్మానాన్ని వెలువరిస్తూ ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేశారు. ఈ తీర్మానాన్ని భారతదేశ స్థానిక స్వపరిపాలన చరిత్రలో ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. అందుకే లార్డ్ రిప్పన్‌ను ‘భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు’గా పేర్కొంటారు. రిప్పన్ తీర్మానం ప్రకారం స్థానిక సంస్థలను వర్గీకరించారు. అవి 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీలు 2) మధ్య స్థాయి - తాలుకా బోర్డులు 3) ఉన్నత స్థాయి - జిల్లా బోర్డులు. స్థానిక సంస్థలకు సంబంధించి బెంగాల్ మున్సిపాలిటీల చట్టం - 1884, బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం - 1885, బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయంపాలన చట్టం - 1919 లాంటివి కీలకమైనవి.
రాయల్ కమిషన్ (1907): భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును సమీక్షించి, తగిన సిఫార్సులు చేయడానికి 1907లో చార్లెస్ హబ్‌హౌస్ అధ్యక్షతన ‘రాయల్ కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 1909లో నివేదిక సమర్పించింది.
ఇందులోని అంశాలు:
* ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలి. మూడు స్థాయుల్లో ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.
* ప్రాథమిక విద్య (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) బాధ్యతను పురపాలక సంఘాల (మున్సిపాలిటీల)కు అప్పగించాలి.
* ప్రతి గ్రామానికీ ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి.
* జనాభా ఆధారంగా పురపాలక సంస్థలను ఏర్పాటు చేయాలి.
* పరిపాలనా వికేంద్రీకరణను పటిష్టంగా అమలుచేయాలి.
మింటో - మార్లే సంస్కరణలు (1909): రాయల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1909లో మింటో - మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.
మాంటేగ్-ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం (1919):
* దీని ద్వారా కేంద్ర జాబితాలోని ‘స్థానిక స్వపరిపాలన’ను రాష్ట్ర జాబితాలోకి మార్చారు.
* స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లభించింది.
* 1919 నాటికి మన దేశంలోని జిల్లా బోర్డుల సంఖ్య 207. తాలుకా బోర్డుల సంఖ్య 584.
భారత ప్రభుత్వ చట్టం-1935:
* ఈ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ‘స్వయంప్రతిపత్తి’ వచ్చింది. వాటి పాలన మంత్రుల పరిధిలోకి వచ్చింది. ఈ సంస్థలకు సభ్యులు ‘నామినేట్’ అయ్యే విధానాన్ని రద్దు చేశారు.
* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
స్వాతంత్య్రానంతరం: 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన సమయంలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ‘గాంధీ ప్లాన్’ను ప్రతిపాదించారు.
గాంధీజీ - ఆలోచనలు:
* గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమ వుతుందని గాంధీజీ పేర్కొన్నారు. దేశ ప్రగతికి గ్రామాలు పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలన్నారు. ప్రాచీన భారతంలో గ్రామాలు స్వయం సమృద్ధితో కొనసాగేవన్నారు.
ప్రారంభ రాజ్యాంగంలో:
* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఖిజువ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్40)గ్రామపంచాయతీల ఏర్పాటును పేర్కొన్నారు.
* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పేర్కొన్నారు. దీనిలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటుచేసే బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
పీవీ హయాంలో రాజ్యాంగ హోదా:
* పి.వి.నరసింహారావు పాలనా కాలంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా ‘పంచాయతీరాజ్ వ్యవస్థ’కు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ చట్టంతో రాజ్యాంగానికి IXవ భాగాన్ని చేర్చి, అందులో ఆర్టికల్స్ 243, 243(A) నుంచి 243(O) వరకు పంచాయతీరాజ్/గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థల విధివిధానాలను పేర్కొన్నారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను వివరించారు.
* 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగానికి IX(A) భాగాన్ని చేర్చి అందులో ఆర్టికల్, 243(P) నుంచి 243(ZG) వరకు పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిపాలనను వివరించారు.
* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి కొత్తగా 12వ షెడ్యూల్‌ను చేర్చి, అందులో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM