తయారీలో తగ్గేదేలే!

తక్షణ శక్తికి చవకైన మార్గం చక్కెర, అన్ని రకాల నిర్మాణాలకు అత్యంత అవసరం సిమెంటు, అడుగు అడుగులో అందరినీ నడిపించేది ఆటోమొబైల్‌. అవన్నీ కీలక పరిశ్రమలే. మాట మాటకు మోగే సెల్‌ ఫోన్‌ మొదలు, చూసే టీవీ, ఆన్‌లైన్‌ ఆర్డర్‌తో గడప ముందు వాలే వస్తువులు, స్కానింగ్‌తో చేసే పేమెంట్ల వరకు మొత్తం ఐటీ మహిమలే.

Published : 18 Mar 2023 05:37 IST

ఇండియన్‌ జాగ్రఫీ

తక్షణ శక్తికి చవకైన మార్గం చక్కెర, అన్ని రకాల నిర్మాణాలకు అత్యంత అవసరం సిమెంటు, అడుగు అడుగులో అందరినీ నడిపించేది ఆటోమొబైల్‌. అవన్నీ కీలక పరిశ్రమలే. మాట మాటకు మోగే సెల్‌ ఫోన్‌ మొదలు, చూసే టీవీ, ఆన్‌లైన్‌ ఆర్డర్‌తో గడప ముందు వాలే వస్తువులు, స్కానింగ్‌తో చేసే పేమెంట్ల వరకు మొత్తం ఐటీ మహిమలే. బ్రెడ్‌కు రాసుకునే జామ్‌, సినిమా చూస్తూ ఇష్టంగా తినే చిప్స్‌ ఇవన్నీ ఫుడ్‌ ఇండస్ట్రీల ఉత్పత్తులే. ఉపాధికి, దేశ ప్రగతికి మూలాధారమైన ఈ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ‘మేకిన్‌ ఇండియా’ విధానాలతో తయారీ రంగంలో అగ్రగామిగా నిలిచింది. ఈ వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

పరిశ్రమలు

ఒక దేశ ఆర్థికాభివృద్ధి ప్రధానంగా పారిశ్రామికీకరణపై ఆధారపడి ఉంటుంది. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో స్వాతంత్య్రానంతరం మొదట  వ్యవసాయాధారిత పరిశ్రమలపైనే దృష్టి సారించారు. తర్వాత వస్తు ఉత్పత్తి రంగం, సంబంధిత పరిశ్రమలపై శ్రద్ధ పెట్టారు. ఇవన్నీ స్థాపించేందుకు ప్రాథమికంగా ఉండాల్సిన ఇనుము - ఉక్కు పరిశ్రమలను అభివృద్ధి చేశారు. దాంతో వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు లభ్యమైంది. ఫలితంగా చక్కెర, సిమెంటు, ఆటోమొబైల్‌, ఆహారశుద్ధి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)   పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. భారత్‌ నేడు తయారీ రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ‘మేకిన్‌ ఇండియా’ విధానం ద్వారా; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఏకగవాక్ష అనుమతుల జారీ విధానం (సింగిల్‌ విండో పర్మిషన్‌) లాంటి ప్రత్యేక చర్యల వల్ల పారిశ్రామిక పురోగతి వేగం పుంజుకుంది.

చక్కెర: మన దేశంలో చక్కెరను చెరకు, దుంపలు, ఇతర మార్గాల్లో తయారు చేస్తారు. ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చెరకు ద్వారానే జరుగుతోంది. ఇది దేశంలో రెండో అతిపెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమ (మొదటిది నూలు వస్త్ర పరిశ్రమ). ప్రపంచంలో చెరకు ఎక్కువగా పండించే దేశాల్లో బ్రెజిల్‌ మొదటి స్థానంలో ఉంటే, తర్వాత స్థానంలో భారత్‌ ఉంది. ఉత్పత్తిలో క్యూబా మొదటి స్థానంలో ఉంటే, మన దేశం తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. బెల్లం, కండ చక్కెర ఉత్పత్తిలో మనదే అగ్రస్థానం.

* ప్రాచీన కాలం నుంచి మన దేశంలో బెల్లం, కండ చక్కెర వాడుకలో ఉన్నట్లు ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఆధునిక కాలంలో 1840లో డచ్‌వారు మన దేశంలో చక్కెర పరిశ్రమను ఉత్తర బిహార్‌ ప్రాంతంలో మొదటిసారిగా నెలకొల్పారు. కానీ దాని ఏర్పాటు పూర్తికాలేదు. ఆ తర్వాత 1903లో బ్రిటిషర్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతంలో స్థాపించారు. 1950-51 తర్వాత దేశంలో 139 చక్కెర మిల్లులు 11.34 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం సుమారు 732 మిల్లులు 339 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు చక్కెర ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు. జాతీయ చక్కెర సంస్థ కాన్పుర్‌లో ఉంది.

సిమెంటు: ఒక దేశ పారిశ్రామిక అభివృద్ధిని ఆ దేశ సిమెంటు ఉత్పత్తి, వినియోగం సూచిస్తాయి. దేశంలో మొదటిసారిగా 1904లో మద్రాసులో సౌత్‌ ఇండియా - ఇండస్ట్రీస్‌  పేరుతో  సిమెంటు పరిశ్రమ ప్రారంభమైంది. సిమెంటు ఉత్పత్తికి సున్నపురాయి, బంకమన్ను, బొగ్గు, సిలికా, జిప్సమ్‌, అల్యూమినియం, ఇనుప ధాతువు ముడిసరకులు. ఈ పరిశ్రమలు సున్నపురాయి ఎక్కువ మొత్తంలో లభ్యమయ్యే ప్రదేశంలో నెలకొల్పుతారు. దేశంలో సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సిమెంటు ఉత్పత్తిలో చైనా, భారత్‌, వియత్నాం, అమెరికా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో తలసరి సిమెంటు వినియోగం 195 కిలోలు. ప్రపంచ సగటు 500 కిలోలు, చైనాలో వెయ్యి కిలోలు.

ఆటోమొబైల్‌: మన దేశంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. 2021-22 లెక్కల ప్రకారం ఈ రంగంలో భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. 1930 వరకు మన దేశంలో మోటారు కార్లను దిగుమతి చేసుకునేవారు. 1928లో
జనరల్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. 1930లో ఫోర్డ్‌ కంపెనీ మద్రాసులో ట్రక్కులు, మోటారు కార్ల తయారీని ప్రారంభించింది. 1942లో హిందుస్థాన్‌ మోటార్స్‌ (కలకత్తా), 1944లో ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌ లిమిటెడ్‌ (బొంబాయి) మొదలయ్యాయి.

* 1958లోనే రక్షణ శాఖ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 1945లో మహీంద్ర అండ్‌ మహీంద్ర జీపుల తయారీ, 1960లో ఫియట్‌ కార్ల తయారీ, 1945లో టాటా ఇంజినీరింగ్‌ అండ్‌ లోకో మోటివ్స్‌ కంపెనీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భారత్‌లో ఆటోమొబైల్‌ రంగం విలువ 100 బిలియన్‌ డాలర్లు దాటింది. దేశ ఎగుమతుల్లో 8%, జీడీపీలో 2.3% వాటాలను ఈ రంగమే సమకూరుస్తోంది.

* మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, మహీంద్ర అండ్‌ మహీంద్ర, ఫోర్స్‌ మోటార్స్‌, ట్రాక్టర్‌ అండ్‌ ఫామ్స్‌, ఐషర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హిందుస్థాన్‌ మోటార్స్‌ మొదలైనవి దేశంలో ప్రధాన ఆటోమొబైల్‌ కంపెనీలు. భారత్‌ నేడు ట్రాక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో, బస్సుల తయారీలో రెండో స్థానంలో, భారీ ట్రక్కుల తయారీలో మూడో స్థానంలో ఉంది. ఇటీవలి కాలంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీ, వాడకం పెరుగుతోంది. 2030 నాటికి 10 మిలియన్‌ ఈవీ యూనిట్ల అమ్మకాలు జరుగుతాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

* మన దేశంలో భారీ, మధ్యతరహా వాహనాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థ టాటా మోటార్స్‌. జీపుల తయారీకి మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రసిద్ధి. చిన్న, మధ్యతరహా కార్లను ఎక్కువగా మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌, అంబాసిడర్‌ కార్లను హిందుస్థాన్‌ మోటార్స్‌   లిమిటెడ్‌ (కోల్‌కత్తా, చెన్నై) తయారు చేస్తున్నాయి.

ఐటీ రంగం: ప్రపంచ ఐటీ రంగంలో భారత్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అనేక అగ్రగామి ఐటీ సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండటం ఇందుకు నిదర్శనం. దేశంలో కంప్యూటర్‌ వాడకం అన్ని రంగాల్లోనూ తప్పనిసరైంది. వ్యవసాయంలోనూ ఐటీ, కృత్రిమ మేధ వాడకం పెరగనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 1967లో బొంబాయిలో మొదటిసారిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసు ద్వారా ఐటీ సేవలు మొదలయ్యాయి. మొదటి ఐటీ పార్కు (SEEPZ) 1973లో బొంబాయిలో ప్రారంభమైంది. 1980 వరకు దేశంలోని 80% పైగా ఐటీ ఎగుమతులు SEEPZ నుంచే జరిగేవి.

* ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా మొదలైనవి దేశీయ ప్రధాన ఐటీ కంపెనీలు. ముఖ్యమైన ఐటీ హబ్‌లు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, పుణె, కోల్‌కతా, దిల్లీ (గురుగ్రామ్‌, నోయిడా)లో ఉన్నాయి. ఐటీ ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు. 2022లో దేశ జీడీపీలో ఐటీ-బీపీఓ వాటా 7.4%. ఐటీ రంగం సుమారు 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌: ప్రాథమిక స్థాయి నుంచి ఆహార పదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా మెరుగుపరిచి, వినియోగ వస్తువుగా చేయడాన్ని ఆహార శుద్ధీకరణ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) అంటారు. ఇదో పెద్ద పరిశ్రమ. భారత్‌ లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో నేటికీ పండించిన పంటలో 10% కూడా శుద్ధీకరణ జరగడం లేదు. రోజురోజుకీ పెరుగుతున్న నగర, పట్టణ జనాభా అవసరాలు తీరాలంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తప్పనిసరి. ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి/పండించే పంటలు, తొందరగా పాడయ్యే పదార్థాలు (పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు), కేవలం కొద్ది రోజులు/నెలలు మాత్రమే లభించే ఆహార పదార్థాలను (ఆపిల్‌, మామిడి, నారింజ) శుద్ధీకరణతో ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. అనేక రకాల పానీయాలు, ఆహార పదార్థాలను వివిధ రకాల పద్ధతుల ద్వారా నిల్వ చేయవచ్చు.

* భారత్‌లో రంగాలవారీగా చూస్తే ఆహార రంగం విలువ పరంగా 5వ స్థానంలో ఉంది. జీడీపీలో 6%, ఎగుమతుల్లో 13%, పారిశ్రామిక పెట్టుబడుల్లో 6% వాటా కలిగి ఉంది. పండ్లు, కూరగాయల శుద్ధీకరణలో భారత్‌ ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. మొత్తం శుద్ధీకరణలో 2% పండ్లు, కూరగాయలు; 8% సముద్ర ఉత్పత్తులు, 35% పాలు, 6% పౌల్ట్రీ ఉన్నాయి.

* ప్రపంచ ప్రధాన ఆహార ఉత్పత్తిదారుల్లో మన దేశం ఒకటి. శుద్ధి చేసిన ఆహారం, కిరాణా సరకుల ఉత్పత్తిలో 2021 లెక్కల ప్రకారం 11.3 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఆహారాన్ని భారత్‌ ఉత్పత్తి చేసింది.

* దేశ ఆహార రంగం 2022-30 మధ్యకాలంలో 3% సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)తో అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ, ఆహారశుద్ధి ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (APEDA) అంచనా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని