సాధన సంకల్పం.. సమితిగా.. సమరంగా!

అన్నదాతలపై పడిన అప్పుల భారాన్ని ఒక గళం ప్రస్తావించింది. అప్పటికే అదే పథంలో సాగుతున్న కొందరు మేధావులు తమ గొంతులు కలిపారు. మథనం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం దృఢమైంది.

Published : 20 Mar 2023 00:47 IST

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

అన్నదాతలపై పడిన అప్పుల భారాన్ని ఒక గళం ప్రస్తావించింది. అప్పటికే అదే పథంలో సాగుతున్న కొందరు మేధావులు తమ గొంతులు కలిపారు. మథనం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం దృఢమైంది. ఆ సంకల్పంలో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లోకి విస్తరించింది. జరుగుతున్న అన్యాయాలపై గర్జించింది. పల్లెబాట పట్టింది. చలో దిల్లీ అంటూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను దేశ రాజధానికి చేర్చింది. జన జైత్రయాత్రగా మారింది. పాదయాత్రలతో సాగునీటి కోసం సమరాలు చేసింది. పొలికేకలతో మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంలో అతి కీలకమైన తెరాస ఏర్పాటు, నేపథ్యం, తదనంతరం చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాల గురించి అభ్యర్థులు అదే క్రమంలో తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి.


తెరాస పార్టీ ఆవిర్భావం-సదస్సులు-సమావేశాలు

ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనల నాటి నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదన చాప కింద నీరులా విస్తరించింది. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠంగా అమలు చేయడంతో అది వెనుకబడిన తెలంగాణ ప్రాంతంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా హైదరాబాద్‌, పరిసర జిల్లాల్లో పారిశ్రామికీకరణ వల్ల పేద రైతులు వ్యవసాయ భూములను కోల్పోయి, సొంత భూముల్లోనే వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ప్రైవేటీకరణతో ఇక్కడి ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. ప్రపంచీకరణ ఫలితంగా గ్రామాల్లోని చేతివృత్తులవారు    జీవనోపాధి కోల్పోయి పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వ్యవసాయ పనులు లేక కూలీలు, ఉపాంత, సన్నకారు రైతులు  ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ నగరాల బాట పట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు రంగ సంస్థ (APSEB)ని మూడుగా విభజించి ప్రైవేటీకరించడంతో, వ్యవసాయ విద్యుత్తు పంపుసెట్లు ఎక్కువగా ఉన్న తెలంగాణలోని పేద రైతులపై ఆర్థిక భారం పడింది. ఈ నేపథ్యంలో 1997 మార్చిలో భువనగిరి సభ, 1997 ఆగస్టులో సూర్యాపేట మహాసభ, ఆ తర్వాత 1997 డిసెంబరులో వరంగల్‌ సభ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను విస్తృతం చేశాయి.

2000 సంవత్సరంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సంస్కరణలతో తెలంగాణ రైతులపై ఛార్జీల భారం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో అప్పటి రాష్ట్ర విధానసభ డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న రాష్ట్ర మాజీ రవాణా శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) విద్యుత్తు ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దాని ప్రతిని వార్తాపత్రికలకు విడుదల చేశారు. ఈ సంఘటనతో నాటి తెలంగాణ మేధావులు, తెలంగాణ ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ నేతృత్వంలో కేసీఆర్‌ను కలిశారు. 1956 నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆయనతో చర్చించారు. దాంతో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయాలని దృఢంగా సంకల్పించారు. 2001, ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీని స్థాపించారు. అదే రోజున తన డిప్యూటీ స్పీకర్‌ పదవికి, ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట విధాన సభ సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తన లక్ష్యమని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని అప్పటికే తెలంగాణ ఐక్యవేదిక ఆఫీసుగా కొనసాగుతున్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన జలదృశ్యంలోనే ఏర్పాటు చేశారు. తర్వాత దశలో తెలంగాణ ఐక్యవేదిక, టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. 2001, మే 4న పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2001, మే 5న కేసీఆర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఈ సమావేశం ‘ఫోరం ఫర్‌ తెలంగాణ’ అనే సంస్థ, ప్రొఫెసర్‌ మధుసూదన్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో జరిగింది. 2001, మే 11న తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏకకాలంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు.


కరీంనగర్‌ సింహగర్జన

తెలంగాణ మలి ఉద్యమ కాలంలో నిర్వహించిన మొదటి భారీ బహిరంగ సభ ఇది. కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది. గొట్టె భూపతి అధ్యక్షత వహించారు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు శిబూ సోరెన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సింహగర్జన సభలో కేసీఆర్‌  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌  జయశంకర్‌  తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ప్రజలకు వివరించారు.
కరీంనగర్‌ సభ స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ పలు జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలను నిర్వహించింది. అవి..

* 2001, జూన్‌ 1న-మహబూబ్‌ నగర్‌.  
* 2001 జూన్‌ 2న-నల్గొండ.
* 2001 జూన్‌ 4న-నిజామాబాద్‌.
* 2001 జూన్‌ 5న-నిర్మల్‌.
* 2001 జూన్‌ 21న-వరంగల్‌.

ఈ భారీ సభల్లో కేసీఆర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌లు తెలంగాణకు అప్పట్లో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను వివరించి, ప్రజలను ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వైపు నడిపించారు. తర్వాత 2001, జులైలో నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాగలి చిహ్నంతో పోటీ చేసింది. మంచి ఫలితాలను సాధించింది. అనంతరం 2001, ఆగస్టు 18న టీఆర్‌ఎస్‌ పార్టీ భారత ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. కేసీఆర్‌ రాజీనామా చేసిన సిద్ధిపేట విధాన సభ స్థానానికి 2001, సెప్టెంబరు 22న జరిగిన ఉపఎన్నికలో మళ్లీ ఆయనే భారీ మెజారిటీతో గెలుపొందారు.


తెలంగాణ సాధన సమితి

భారతీయ జనతా పార్టీకి చెందిన ఆలె నరేంద్ర 2001, సెప్టెంబరు 19న తెలంగాణ సాధన సమితిని స్థాపించారు. దీని లక్ష్యం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడమే. అప్పటివరకు తెలంగాణ ముక్తి మోర్చా అధ్యక్షుడైన మాచినేని కిషన్‌ రావు, మాజీ మంత్రి సమరసింహారెడ్డి తెలంగాణ సాధన సమితిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ సాధన సమితి రెండింటి లక్ష్యం ప్రత్యేక తెలంగాణ పోరాటమే కావడంతో తెలంగాణ సాధన సమితి 2002, ఆగస్టు 11న టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఆలె నరేంద్ర టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ అయ్యారు.

తొలి పల్లె బాట: గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి 2002, సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 7 వరకు 15 రోజులపాటు టీఆర్‌ఎస్‌ తొలి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించింది.

జల సాధన ఉద్యమం: తెలంగాణ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయాలను నిరసిస్తూ 2002, డిసెంబరు 25 నుంచి 2003, జనవరి 5 వరకు ఉద్యమాన్ని టీఆర్‌ఎస్‌ విజయవంతంగా కొనసాగించింది. జనవరి 5న తెలంగాణ బంద్‌ కూడా నిర్వహించింది.

తెలంగాణ గర్జన సభ: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో 2003, జనవరి 6న భారీగా తెలంగాణ గర్జన సభను టీఆర్‌ఎస్‌ నిర్వహించింది. ఈ సభకు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు శిబూ సోరెన్‌తో పాటు నర్మదా బచావో ఆందోళన్‌, నేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ నాయకురాలు మేధా పాట్కర్‌, లోక్‌ జనశక్తి పార్టీ నాయకుడు, నాటి కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ హాజరయ్యారు.

దిల్లీ చలో కార్ల యాత్ర (ర్యాలీ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గళాన్ని దేశ రాజధానిలో ప్రతిధ్వనింపజేసేందుకు దాదాపు వెయ్యి కార్లతో కేసీఆర్‌ నాయకత్వంలో దిల్లీకి ర్యాలీ జరిగింది. అక్కడ రాంలీలా మైదానంలో రాంవిలాస్‌ పాసవాన్‌ నేతృత్వంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. అప్పటి ప్రసంగాలను అక్కడి వార్తా పత్రికలు ప్రచురించడంతో తెలంగాణవాదం దిల్లీకి చేరింది.

వరంగల్‌ జైత్రయాత్ర: టీఆర్‌ఎస్‌ రెండో వార్షిక సభను వరంగల్‌లోని హనుమకొండలో భారీగా నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్‌ సిద్ధిపేట నుంచి సైకిల్‌   ర్యాలీ ద్వారా చేరుకున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరయ్యారు.

కేసీఆర్‌ పాదయాత్రలు: * కేసీఆర్‌ తన మొదటి పాదయాత్రను 2003, జులై 20 - 25 తేదీల్లో అలంపూర్‌ నుంచి గద్వాల్‌ వరకు నిర్వహించారు. ఈ పాదయాత్ర లక్ష్యం రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌కు చెందిన రాయలసీమకు సాగు నీరు అందించే కాలువను మూసివేసి, పూర్తి జలాలను మహబూబ్‌నగర్‌ జిల్లాకు మళ్లించాలని డిమాండ్‌ చేయడం.
* రెండో పాదయాత్రను 2003, ఆగస్టు 25 - 30 తేదీల్లో కోదాడ నుంచి హాలియా వరకు నిర్వహించారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింది రైతుల సమస్యలపై చర్చించారు.

తెలంగాణ పొలికేక: 2003, జూన్‌ 14న హైదరాబాద్‌ నిజాం కాలేజీ క్రీడా మైదానంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన తెలంగాణ ఐక్య వేదికకు ఆలె నరేంద్ర అధ్యక్షత వహించారు.
కేసీఆర్‌ పల్లెబాట: ఈ కార్యక్రమాన్ని కేసీఆర్‌ 2003, అక్టోబరు 22న నాటి వరంగల్‌ జిల్లా మేడారం నుంచి ప్రారంభించి కొనసాగించారు.

2003 సింహగర్జన సభలు: 2003, నవంబరు-డిసెంబరుల్లో సింహగర్జన సభలను సంగారెడ్డి, పాలమూరు (మహబూబ్‌నగర్‌), నిజామాబాద్‌, వరంగల్‌, సిరిసిల్లల్లో నిర్వహించి తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని కొనసాగించారు.

నోట్‌: తెలంగాణ మలి ఉద్యమ కాలంలో జరిగిన ఈ సభలు, సమావేశాలపై ప్రశ్నలు కాలక్రమానుసారం (Chronological Order) పై ఉంటాయని అభ్యర్థులు గమనించి, గుర్తుంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు