కొయ్యగుజ్జు అడవులతో.. మంచుపొరల ఎడారులతో!

ఒకసారి మైనస్‌ డిగ్రీల్లో చలి, ఆ తర్వాత మండిపోయే ఎండలు, సంవత్సరమంతా మంచుమయమై ఎముకలు కొరికేసే శీతల వాతావరణం.. ఊహించడానికే కాస్త కష్టంగా అనిపించినా, అలాంటి భూస్వరూపాలు కూడా ఉన్నాయి.

Updated : 31 Mar 2023 06:13 IST

ప్రపంచ భూగోళశాస్త్రం

ఒకసారి మైనస్‌ డిగ్రీల్లో చలి, ఆ తర్వాత మండిపోయే ఎండలు, సంవత్సరమంతా మంచుమయమై ఎముకలు కొరికేసే శీతల వాతావరణం.. ఊహించడానికే కాస్త కష్టంగా అనిపించినా, అలాంటి భూస్వరూపాలు కూడా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తూ కొయ్య గుజ్జు వృక్షాలతో నిండి ఉన్న టైగాలు, ఏడాదిలో ఎక్కువ రోజులు ఘనీభవించి మంచు పొరలతో నిండి ఉండే టండ్రాలు ఆ కోవకు చెందినవే. ధ్రువ ప్రాంతాల్లో ఇలాంటి అసాధారణ పరిస్థితులు అతి సాధారణంగా కనిపిస్తుంటాయి. ప్రకృతిసిద్ధ మండలాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఆ ప్రత్యేకతలను, విశేషాలను తెలుసుకోవాలి.


టైగా భూములు

టైగా భూములనే ఉపధ్రువ లేదా ఉప ఆర్కిటిక్‌ ప్రాంతాలు అంటారు. అతిపెద్ద శృంగాకార అరణ్య మేఖలతో పాటు నీటిగుంటలు, చిత్తడి నేలలు, వాగులు, నదులు విస్తృతంగా కనిపించే ప్రాంతమిది.

ఉనికి: ఈ ప్రకృతిసిద్ధ మండలం ఉత్తరార్ధ గోళంలో 55 డిగ్రీల నుంచి 75 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. దీని ధ్రువం వైపు సరిహద్దును అక్కడ పెరిగే చెట్లు నిర్ణయిస్తాయి. ఈ మండలంలో రెండు ప్రధాన ప్రాంతాలున్నాయి. అవి:
ఎ) ఉత్తర అమెరికా ప్రాంతం: ఇది పసిఫిక్‌ మహాసముద్ర తీరంలో ప్రారంభమై అలాస్కా, కెనడా ఉత్తర ప్రాంతాల మీదుగా ఆగ్నేయంగా అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలోని న్యూఫౌండ్‌ లాండ్‌ వరకూ ఉంది.
బి) యురేషియా ప్రాంతం: ఈ ప్రాంతం స్కాండినేవియా మెట్ట ప్రదేశాల నుంచి స్వీడన్‌, ఫిన్లాండ్‌, రష్యా మీదుగా తూర్పున పసిఫిక్‌ మహాసముద్రం వరకూ ఉంది. ఉత్తర అమెరికా ప్రాంతాల మాదిరిగానే యురేషియాలోనూ ఆగ్నేయంగా, సైబీరియాలోని చాలా చోట్లకు విస్తరించింది. లోతైన మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందిన ‘బైకాల్‌ సరస్సు’ సైబీరియా ప్రాంతంలోనే ఉంది.

శీతోష్ణస్థితి: సంవత్సర ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అత్యధికంగా ఉండటం ఈ ప్రకృతి సిద్ధ మండల విశిష్ట లక్షణం. ఏడాదిలో ఎక్కువ భాగం తీవ్ర చలికాలం ఉంటుంది. సంవత్సరంలో సగం కంటే ఎక్కువ కాలం ఉష్ణోగ్రత ఘనీభవన స్థానం కంటే తక్కువే ఉంటుంది. ఆసియాలోని లోతట్టు ప్రాంతాల్లో, ఖండాంతర్గత ఉష్ణోగ్రత, శీతోష్ణస్థితి మరింత బలంగా ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తారతమ్యాలు మరింత ఎక్కువ.

* సైబీరియాలోని వెర్కోయాన్స్కి ప్రాంతంలో జనవరిలో -32 డిగ్రీ సెంటిగ్రేడ్‌లు, జులైలో 33 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత తారతమ్యం ప్రపంచంలోనే అత్యధికంగా 65 డిగ్రీ సెంటిగ్రేడ్‌లు ఉంటుంది. 1892, ఫిబ్రవరి 5, 7 తేదీల్లో ఈ ప్రాంతంలో ఏకంగా -68 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. అందుకే ఈ ప్రాంతాన్ని శీతల ధ్రువం అంటారు.

వృక్షసంపద: ప్రపంచంలోనే అతిపెద్ద శృంగాకార అటవీ శీతోష్ణస్థితి ప్రాంతమిది. మెత్తటి కలపనిచ్చే వృక్షాలు ఇక్కడ పెరుగుతాయి.
ఉదా: సిల్వర్ఫర్‌, పైన్‌, దేవదారు, స్ప్రూస్‌, విల్లోస్‌ (క్రికెట్‌ బ్యాట్స్‌ తయారీలో ఉపయోగిస్తారు).
నేలలు: ఎక్కువశాతం నేలలు ఎప్పుడూ ఘనీభవించి ఉండటంతో పెద్ద వృక్షాలేవీ పెరగవు. నేలల ఘనీభవనం కారణంగా టెలిఫోన్‌ స్తంభాలు భూమి ఉపరితలానికి నెట్టుకొస్తాయి. భవనాల గోడలు, రహదారులు బీటలు వారడం వంటి అనేక దుష్ఫలితాలు సంభవిస్తుంటాయి.

అటవీ సంపద: ఈ మండలంలోని శృంగాకార అరణ్యాలు ప్రపంచానికి కలప, కొయ్య గుజ్జును అత్యధికంగా సరఫరా చేస్తాయి. ఒక్క రష్యాలోనే సుమారు 726 మిలియన్‌ హెక్టార్ల టైగా ప్రాంతం విస్తరించి ఉంది. కెనడా ప్రపంచంలోనే కొయ్య గుజ్జును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ అరణ్యాల్లోని వృక్షాలను చలికాలంలో నరికి, దుంగలను గడ్డకట్టిన నదీ ప్రవాహ మార్గాల వెంట నిల్వ చేస్తారు.వేసవిలో ఈ గడ్డకట్టిన నదులు కరిగినప్పుడు వాటి తీరాల్లోనే ఉన్న కర్మాగారాలకు ఆ దుంగలు చేరతాయి.
ఫర్‌ వాణిజ్యం: ‘ఫర్‌’ వాణిజ్యం ఇక్కడి అతి ప్రధానమైన, ఆకర్షణీయమైన వాణిజ్య కార్యకలాపం. ముఖ్యంగా రష్యాలో ప్రభుత్వం నెలకొల్పి నిర్వహించే ‘ఫర్‌’ క్షేత్రాలు అధిక రాబడులను అందిస్తున్నాయి. ‘ఫర్‌’ క్షేత్రాల్లోనే గుంటనక్కలు, మింక్‌ మృగాలను పెంచుతారు.

ఖనిజ సంపద: టైగా ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల పూర్తి వివరాలు నేటికీ తెలియలేదు. అయితే ఇప్పటివరకు ఇనుప ఖనిజం, యురేనియం, నికెల్‌, రాగి, కోబాల్ట్‌, బంగారం, వెండి నిక్షేపాలు వంటివాటిని కనుక్కున్నారు. స్వీడన్‌లోని కిరూవా, గల్లీవర్‌ ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను గుర్తించి, వెలికితీస్తున్నారు.

పరిశ్రమలు: సమృద్ధిగా లభించే జలవిద్యుచ్ఛక్తి, మెత్తని కలప, కొయ్య గుజ్జు ఆధారంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం కెనడాలోని క్విబెక్‌ ప్రాంతంలోని అర్విడా వద్ద నిర్మితమైంది. దీనికి ముడి సరకును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా చౌకగా లభించే జలవిద్యుచ్ఛక్తితో నిర్వహిస్తున్నారు.

నగరాలు: దుర్భర శీతోష్ణ పరిస్థితులు, నేలలు ఈ ప్రాంతంలో మహానగరాల అభివృద్ధిని నిరోధిస్తున్నాయి. ఈ మండలంలో పేర్కొనదగిన నగరంగా ఉత్తర ధ్రువానికి సమీపంలోని ‘ముర్మాన్స్క్‌’ను చెప్పవచ్చు.


టండ్రా నేలలు

టండ్రా నేలలనే మంచు ఎడారులు అంటారు. చాలావరకు జనావాసాలు లేని ప్రాంతాలివి. ధ్రువప్రాంతాన్ని నిరంతరం కప్పి ఉంచే మంచుపొరలు సరిహద్దులుగా ఉన్నాయి.

ఉనికి: 66 1/2 డిగ్రీల నుంచి 90 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో విస్తరించి ఉన్నప్పటికీ చాలావరకు ఉత్తరార్ధ గోళానికి
పరిమితమై ఉంది.

విస్తృతి: అలాస్కా, కెనడా ఉత్తర సరిహద్దులు, గ్రీన్‌లాండ్‌ తీర ప్రాంతాలు, స్కాండినే వియన్‌ దేశాల ఉత్తరపు అంచులు, రష్యాలోని సైబీరియా ఉత్తర ప్రాంతం.

శీతోష్ణస్థితి: ఏడాదిలో 9 నెలల పాటు ఉష్ణోగ్రతలు నీటి ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంటాయి. మిగిలిన 3 - 4 నెలల కాలం 10 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో బ్లిజార్డ్స్‌ (మంచు తుపానులు) తీవ్రత ఎక్కువ.

వృక్ష సంపద: పెద్ద వృక్షాలు, పొదల లాంటివి ఉండవు. కేవలం మంచు, రాతి పగుళ్లలో పెరిగే ‘లైఖెన్స్‌’ జాతి నాచుమొక్కలు కనిపిస్తాయి. వివిధ వర్ణద్రవ్యాలు కలిగి ఉండటంతో ఇవి పూలమొక్కల్లా కనిపిస్తాయి. పాపీలు, లిల్లీలు, బటర్‌ కప్‌లు, వయోలెట్లు వంటి పేర్లతో వాటిని పిలుస్తారు.

జంతుసంపద: ఈ ప్రాంతాల్లో పెరిగే జంతువుల శరీరంపై దట్టమైన రోమాలతో కూడిన మందపాటి చర్మం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే బంధకంలా పనిచేస్తుంది. ఇక్కడ నివసించే ప్రధాన జంతువులు ధ్రువపు జింక (కారీబా), ఎలుగుబంటి, తోడేళ్లు, గుంటనక్కలు, కస్తూరి మృగాలు, సీల్‌, వాల్‌రస్‌ చేపలు.

ఆదిమజాతులు: అలాస్కా, కెనడాలోని టండ్రా ప్రాంతాల్లో నివసించే ఆదిమ తెగలు ‘ఎస్కిమోలు’. వీరు సంచార జీవులు. వేటాడటం, చేపలు పట్టడం ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. శీతాకాలంలో ఈ తెగలు మంచుతో నిర్మించుకునే అర్ధచంద్రాకృతి ఇళ్లను ఇగ్లూ అంటారు. చేపలు పట్టడానికి ఉపయోగించే పడవలను ఉమియక్స్‌, కాయక్స్‌ అంటారు. రవాణా కోసం వీరు ఉపయోగించే కుక్కలు లాగే బండ్లను ‘స్లెడ్జ్‌ బండ్లు’ అంటారు. ఇగ్లూలలో దీపాలు వెలిగించడానికి ఉపయోగించే నూనెను సీల్‌ చేప నుంచి తయారు చేసుకుంటారు.

* స్కాండినేవియన్‌ ప్రాంత టండ్రాల్లో నివసించే ఆదిమ జాతుల పేరు ‘లాప్లు’. ప్రధానంగా పశుపోషకులు. వీరి కామధేనువు ధ్రువపు జింక. దీన్నే శీతల ఎడారి ఓడ అంటారు. నీ సైబీరియా టండ్రా ప్రాంతాల్లోని ఆదిమ జాతులు సమోయిడ్స్‌, యాకుట్స్‌, చుక్‌ వీస్‌. నీ ఇటీవల కాలంలో టండ్రా ప్రాంతాల్లో ముఖ్యంగా రష్యా, కెనడా ప్రభుత్వాలు అనేక ధ్రువపు జింకల పెంపకం క్షేత్రాలను నెలకొల్పాయి. వాటి ద్వారా స్థానికుల ఆహార అవసరాలను పూర్తిగా తీర్చి, సంచార జీవనం వదిలి స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి.

మరికొన్ని అంశాలు:

* ఎస్కిమోలు వేసవిలో నీటిపై ప్రయాణించడానికి ఉపయోగించే పెద్ద పెద్ద పడవలను ఉమియక్స్‌, చిన్న పడవలను కాయక్స్‌ అంటారు. * ఉత్తరార్ధ గోళంలో టండ్రా ప్రాంతంలో శీతాకాలపు రాత్రుల్లో ఎర్రని ఆకుపచ్చ రంగుల్లో తెరలుగా ఏర్పడే కాంతిని అరోరా బోరియాలిస్‌ అంటారు. * వేసవిలో టండ్రా ప్రాంతాల్లోని జలాశయాల చుట్టూ చేపల కోసం గుంపులుగా చేరిన పెంగ్విన్‌ జాతి పక్షులు రూకరీలు.

మరికొన్ని అంశాలు: * ఉత్తరార్ధ గోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతం సైబీరియాలోని వెర్కోయన్స్కి. ఇక్కడ ఉష్ణోగ్రత ధ్రువ ప్రాంత ఉష్ణోగ్రత కంటే తక్కువ కావడంతో దాన్ని ‘ప్రపంచ శీతల ధ్రువం’గా పిలుస్తారు. నీ న్యూస్‌ప్రింట్‌ తయారీలో అమెరికాది మొదటి స్థానం.నీ కాగితం తయారీకి ఉపయోగించే కొయ్యగుజ్జు తయారీ, ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం కెనడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని