విభజన చట్టం... చిక్కుల చట్రం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన రాష్ట్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. పంపకాల్లో ఆర్థిక వనరులు తక్కువగా, అప్పుల భారం ఎక్కువగా దక్కడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Published : 27 May 2023 04:39 IST

ఆంధ్రప్రదేశ్‌ విభజన  సమస్యలు/సవాళ్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన రాష్ట్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. పంపకాల్లో ఆర్థిక వనరులు తక్కువగా, అప్పుల భారం ఎక్కువగా దక్కడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పూర్తి శాస్త్రీయ పరిశీలన లేకుండా, హడావుడిగా చేసిన పునర్‌వ్యవస్థీకరణ చట్టమే ఇందుకు కారణం. ఈ చట్టంలో ఉన్న చిక్కుముడుల వంటి సెక్షన్లు, వాటి పర్యవసానాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవాలి.

ఏపీపై పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014ను  రాష్ట్రపతి ఆమోదం అనంతరం  భారత గెజిట్‌ నంబర్‌-6 ద్వారా 2014, మార్చి 1న ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2014, మార్చి 4న భారత గెజిట్‌ నంబర్‌ - 560 ద్వారా 2014, జూన్‌ 2ను అపాయింటెడ్‌ డే (అవతరణ రోజు) అని నిర్ణయించింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014, జూన్‌ 2న రెండు రాష్ట్రాలుగా (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) విడిపోయింది.

సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 మూల కారణమని చెప్పవచ్చు. ఈ చట్టంలో రూపొందించిన నిబంధనలు స్వల్ప, మధ్యకాలాల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
సెక్షన్‌-3 ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక ప్రాంతం: పదమూడు జిల్లాలతో పాటు 2005, జూన్‌ 27న జలవనరుల శాఖ ఉత్తర్వు జీఓ ఎంఎస్‌ నం.111లో పేర్కొన్న గ్రామాలు, ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సీతానగరం, కొండ్రెక రెవెన్యూ గ్రామాలను మాత్రమే నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపారు. దీనివల్ల పోలవరం బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే ముంపునకు గురయ్యే అనేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోతాయి. దీంతో వ్యాజ్యాలు పెరుగుతాయి. ఇది పోలవరం ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారుతుంది.
అయితే విభజన చట్టంలోని సెక్షన్‌ 3ని 2014, జులై 17న భారత ప్రభుత్వం సవరించింది. ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే 7 మండలాల్లోని (5 పూర్తి + 2 పాక్షిక) 211 చిన్న గ్రామాలు (హామ్లెట్‌లు), 136 రెవెన్యూ గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది. ఈ చర్య వల్ల ప్రతికూల పరిస్థితి కొంత మేర తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొరుగు జిల్లాలతో ఈ గ్రామాలను కలపడానికి, సమర్థ పాలన సంస్థలను ఏర్పాటు చేయడానికి, తీవ్ర నిర్వహణ సవాళ్లు ఎదురయ్యాయి. చివరకు ఏడు మండలాల్లోని 3 మండలాలు (వాలైర్‌పాడు, బూర్గంపాడు, కుకునూర్‌) పశ్చిమ గోదావరి జిల్లాలో; మిగిలిన 4 మండలాలు (భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం) తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు.

సెక్షన్‌-5, సెక్షన్‌-8 - ఉమ్మడి రాజధాని, పాలన: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌-5లో పేర్కొన్నారు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. ఈలోగా రాజధాని నిర్మాణం జరగాలి. ఇది కొత్తరాష్ట్రం అభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తులకు రక్షణ కల్పించే ప్రత్యేక బాధ్యతలను ఉమ్మడి గవర్నర్‌కు సెక్షన్‌-8 ద్వారా అప్పగించారు. అయితే గవర్నర్‌ తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించడాన్ని, సెక్షన్‌-8 (3) ద్వారా తప్పనిసరి చేశారు. దీంతో పౌరుల రక్షణ, బాధ్యతల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన స్థాయిని కల్పించలేదని అర్థమవుతోంది.  అలాగే సెక్షన్‌ - 6లో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నగరం కోసం 6 నెలల్లో సిఫార్సులు చేసే విధంగా భారత ప్రభుత్వం శివరామకృష్ణన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనిని రాజధాని నగరాన్ని నిర్ణయించుకునే అధికారాన్ని, హక్కును కేంద్రం లాగేసుకునే ప్రయత్నంగా భావించవచ్చు.
సెక్షన్‌-9 - గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌కు సహాయం: విభజన చట్టంలోని సెక్షన్‌-9 ప్రకారం రెండు రాష్ట్రాలకు అదనపు పోలీసు బలగాలు సమకూరే విధంగా కేంద్రం సహకరిస్తుంది. సెక్షన్‌ 9(2) ప్రకారం అపాయింటెడ్‌ డే నుంచి హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని రెండు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వమే మూడేళ్లపాటు నిర్వహిస్తుంది. ఆ తర్వాత అది తెలంగాణ శిక్షణ కేంద్రం అవుతుంది.

సెక్షన్‌ 9(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్రం నిర్ణయించిన చోట ఇలాంటి అత్యాధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సహాయం చేస్తుంది. అయితే గ్రేహౌండ్స్‌ దళాలకు, ఆక్టోపస్‌కు మూడేళ్ల పాటు ఉమ్మడి శిక్షణ ఇవ్వాలనే నిబంధన వామపక్ష, ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలను నియంత్రించడంలో ఆటంకంగా మారవచ్చు.

5వ భాగం - రాబడి, వ్యయం:  13వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం నుంచి పన్ను సంక్రమణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పంపిణీ చేయాలని విభజన చట్టంలోని 46(1) సెక్షన్‌ పేర్కొంటోంది. 13వ ఆర్థిక సంఘం ఫార్ములా ఆధారంగా కేంద్ర రాబడులను రెండు రాష్ట్రాలకు పంచితే, అంతకు ముందు వచ్చేదానికంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.840 కోట్లు తక్కువగా వస్తుంది. అసలే వనరుల కొరతతో ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇది మరింత ప్రతికూలంగా మారింది.

6వ భాగం- ఆస్తులు, అప్పుల పంపకం:  ఆస్తులను భౌగోళిక ప్రదేశం ఆధారంగా, అప్పులను జనాభా నిష్పత్తిలో (ఆంధ్రప్రదేశ్‌కి 58.32%, తెలంగాణకు 41.68%) పంచాలని విభజన చట్టం 6వ భాగంలో వివరించారు. అన్ని ప్రధాన ఆస్తులు హైదరాబాద్‌ నగరం, పరిసర ప్రాంతాల్లోనే ఉండటంతో అవశేష ఆంధ్రప్రదేశ్‌ వాటిని కోల్పోయింది. పైగా భారీగా రుణ బాధ్యత మిగిలింది.

ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే దానికి సంబంధించిన భూమిశిస్తు, పన్ను రాబడి బకాయిలు ఆ రాష్ట్రానికే చెందుతాయి. అపాయింటెడ్‌ డే నాటికి ఆస్తుల మీద పన్ను మదింపు చేసే చోటు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే పన్ను బకాయిలు వసూలు అధికారం ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్‌ 50 పేర్కొంటోంది.

ఉమ్మడి రాష్ట్రానికి సుమారు 45 శాతం ‘వ్యాట్‌’ను అందించే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, బేవెరేజెస్‌ కార్పొరేషన్లతో కలిపి పన్నులు, డ్యూటీల మదింపునకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం. దీంతో సెక్షన్‌ 50 నిబంధన కారణంగా రూ.వందల కోట్ల మేర పన్ను బకాయిల్లో వాటాను అవశేష ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయింది.

సెక్షన్‌-51లో రుణాలు, అడ్వాన్సులు వసూలు చేసే హక్కుల గురించి పేర్కొన్నారు. సెక్షన్‌-51(1) ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఒక ప్రాంతంలోని ఏదైనా స్థానిక సంస్థ/సొసైటీ వ్యవసాయదారు లేదా ఇతర వ్యక్తికి అపాయింటెడ్‌ డేకు ముందు ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులు వసూలు చేసే అధికారం ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానిదే.

సెక్షన్‌-51(2) ప్రకారం ఉమ్మడి రాష్ట్రం హద్దుల వెలుపల ఎవరైనా వ్యక్తి లేదా సంస్థకు అపాయింటెడ్‌ డే ముందు ఇచ్చిన రుణాలు లేదా అడ్వాన్సులను వసూలు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉండాలి. అలా వసూలైన సొమ్మును జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.

సెక్షన్‌ - 51 సాధారణంగా పారిశ్రామిక యూనిట్లకు ప్రోత్సాహకంగా 14 ఏళ్లపాటు ఇచ్చిన పన్ను నిలుపుదలకు సంబంధించింది. 14 ఏళ్ల తర్వాత పన్నును వార్షిక వాయిదాల్లో చెల్లించే విధంగా వడ్డీ లేని రుణంగా ప్రతిపాదించారు. సెక్షన్‌-51(1) ప్రకారం ఆపి ఉంచిన పన్నులు ఆ పారిశ్రామిక ప్రాంతం ఉన్న రాష్ట్రానికి చెందుతాయి. ఈ పన్ను వసూళ్లను జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచడం సముచితం. కానీ అలా జరగలేదు. పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా తెలంగాణలోనే ఉండటంతో ఆ ప్రాంతానికే లాభం చేకూరింది.

అధికంగా వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించడం గురించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌ - 56లో పేర్కొన్నారు. సెక్షన్‌ 56(1) ప్రకారం అధికంగా వసూలు చేసిన ఆస్తి పన్ను, సుంకం, భూమి శిస్తుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంపై ఉన్న తిరిగి చెల్లింపు బాధ్యత, ఆ ఆస్తి నెలకొని ఉన్న కొత్త రాష్ట్రానికి చెందుతుంది. అపాయింటెడ్‌ డే రోజున అధికంగా వసూలు చేసిన పన్ను గానీ, శిస్తుగానీ తిరిగి చెల్లించాల్సిన ఉమ్మడి రాష్ట్ర బాధ్యతను కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై పంచాలి. బకాయిలు తీర్చిన రాష్ట్రానికి మరొక రాష్ట్రం నుంచి వాటాను రాబట్టుకునే హక్కు ఉంటుంది.

సెక్షన్‌ 56(2) ప్రకారం ఉమ్మడి రాష్ట్రం అధికంగా వసూలు చేసిన ఇతర పన్నులు, శిస్తులు తిరిగి చెల్లించే బాధ్యత ఏ రాష్ట్రం హద్దుల్లో ఆ పన్ను మదింపు చేసే ప్రాంతం ఉందో ఆ రాష్ట్రానికి చెందుతుంది.అపాయింటెడ్‌ డే రోజున అధికంగా వసూలు చేసిన పన్ను లేదా శిస్తు తిరిగి చెల్లించాల్సిన ఉమ్మడిరాష్ట్ర బాధ్యతను కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై పంచాలి.

పై రెండు సెక్షన్లు (56(1), 56(2)) పరస్పరం విరుద్ధమైనవి. పన్ను బకాయి విషయంలో మదింపు ప్రాంతం ఉన్న రాష్ట్రానికి వసూలు చేసే హక్కు ఉంటుంది. అయితే, వాపసు (తిరిగి చెల్లింపు బాధ్యత) విషయంలో మదింపు ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం మొదట రుణ బాధ్యతను తీర్చినప్పటికీ జనాభా నిష్పత్తి ఆధారంగా ఆ రెండు రాష్ట్రాలు భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య బకాయిలను పంచినట్లయితే మదింపు ప్రదేశం ఉన్న రాష్ట్రానికి చెందుతుండటం, ఎక్కువగా పన్ను చెల్లింపుదారులు హైదరాబాదులోనే ఉండటం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రతికూలం.

8వ భాగం - అఖిల భారత సర్వీసులు: ఎనిమిదో భాగంలోని సెక్షన్లు 76 నుంచి 83 వరకు రెండు రాష్ట్రాల మధ్య స్థానిక, జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌, రాష్ట్ర కేడర్లలోని అఖిల భారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీని వివరిస్తాయి. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అపాయింటెడ్‌ డే రోజున లేదా ముందుగా వారి సిబ్బందిని పంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో ఆ విధంగా జరగలేదు. ఇది పాలనా వ్యవస్థ పటిష్టతపై, రెండు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం ప్రతిస్పందనపై ప్రతికూల ప్రభావం చూపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని