విశిష్ట వనరుల ఉష్ణమండలం!

యాభైకి పైగా దేశాలు, మూడు వేలకు పైగా భాషలు, రెండు ఎడారులు, మహాసముద్రాలు, ఎత్తయిన పర్వతాలు, పొడవైన నదులు, లోతైన సరస్సులతో ప్రపంచంలోనే రెండో అతి పెద్దదైన ఆ ఖండం అనేక ప్రత్యేకతలకు పెట్టింది పేరు.

Updated : 28 May 2023 03:27 IST

యాభైకి పైగా దేశాలు, మూడు వేలకు పైగా భాషలు, రెండు ఎడారులు, మహాసముద్రాలు, ఎత్తయిన పర్వతాలు, పొడవైన నదులు, లోతైన సరస్సులతో ప్రపంచంలోనే రెండో అతి పెద్దదైన ఆ ఖండం అనేక ప్రత్యేకతలకు పెట్టింది పేరు. అక్కడ అత్యంత ఉష్ణోగ్రత నమోదవుతుంది. అత్యధిక వర్షపాతం కురుస్తుంది. బంగారు నిక్షేపాలకు, వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. ఖండానికి ఒకవైపు వేసవికాలం, మరోవైపు శీతాకాలం ఉంటాయి.  ఏనుగులు కూడా కనిపించనంత ఎత్తయిన గడ్డి  పెరుగుతుంది. విశిష్ట వనరులతో కూడిన ఆ ఉష్ణమండల విశేషాలన్నింటినీ పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి.


ఆఫ్రికా ఖండం 

భౌగోళిక విస్తీర్ణం, జనాభా పరంగా ఆఫ్రికా రెండో అతిపెద్ద ఖండం. ఇది మొత్తం భూభాగంలో 20.49%తో ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో విస్తరించి ఉంది. ఇదొక పీఠభూమి. అతిపెద్ద పగుళ్ల లోయ (విదీర్ణ దరి) దీనిలో ఉంది. అతిపెద్ద  ‘సహారా’ ఎడారి కూడా ఇక్కడే ఉంది. ఈ ఖండం మీదుగా భూమధ్యరేఖ, కర్కటక రేఖ, మకరరేఖలు వెళుతున్నాయి.

విస్తీర్ణం: 3,02,71,000 చ.కి.మీ.
* ఆఫ్రికాలో ఒక శాతం కొండలు, మూడు శాతం పర్వతాలు, 71 శాతం పీఠభూములు, 25 శాతం మైదానాలు ఉన్నాయి. ఈ ఖండ సరాసరి వాలు 6,232 మీ.
*ఎత్తయిన వాలు - మౌంట్‌ కిలిమంజారో (టాంజానియా) 6344 మీ.
* అత్యల్ప వాలు - లేక్‌ అన్సల్‌ (సోమాలిలాండ్‌)           492 మీ. సముద్ర మట్టం నుంచి కిందికి.
ఆఫ్రికా జనాభా: 146,04,81,772గా ఉంది. 2023 లెక్కల ప్రకారం జనాభా శాతం 18.2%. అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం నైజీరియా. విస్తీర్ణంలో అల్జీరియా అతిపెద్ద దేశంగా, సీషెల్స్‌ అతి చిన్న దేశంగా ఉన్నాయి.
* ఆఫ్రికా 37 డిగ్రీల ఉత్తర, 35 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య, 51 డిగ్రీల తూర్పు, 16 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇందులో 54 దేశాలు, సుమారుగా 3000 భాషలు ఉన్నాయి.
సరిహద్దులు: ఈ ఖండం పశ్చిమాన అట్లాంటిక్‌ మహా సముద్రం, ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రం; దక్షిణాన అట్లాంటిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్రం కలిసిన నీటితో సరిహద్దులుగా ఉన్నాయి.
  ఈ ఖండాన్ని పాలనా సౌలభ్యం కోసం తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాలుగా     విభజించారు. ఆఫ్రికా ఖండం ఉత్తర, దక్షిణాలుగా 8  వేల కి.మీ. పొడవు; తూర్పు పడమరలుగా 7,400    కి.మీ. వెడల్పుతో ఉంది. యూరప్‌ ఖండానికి ఆఫ్రికా అతి  సన్నిహితంగా ఉన్నప్పటికీ దాన్ని చీకటి ఖండంగానే పరిగణిస్తారు.
ముఖ్యమైన పర్వతాలు:  ముడుత పర్వతాలైన అట్లాస్‌ పర్వతాలు, ఖండ పర్వతాలైన డ్రాకెన్స్‌ బర్గ్‌ పర్వతాలు ఈ ఖండంలోని ముఖ్యమైన పర్వతాలు. * కిలిమంజారో - 5895 మీ.* కెన్యా శిఖరం - 5199 మీ.*రువెంజరీ శిఖరం - 5109 మీ. * డ్రాకెన్స్‌ బర్గ్‌ - 3482 మీ.
* అల్‌ అజీజియా (ప్రపంచంలోనే) అత్యుష్ణ ప్రాంతం. ఇది సహారా ఎడారి (లిబియా దేశం)లో ఉంది.

నదులు: ఆఫ్రికా ఖండంలో నైలు, నైజర్‌, కాంగో, ఆరెంజ్‌, జాంబేజీ నదులున్నాయి. ప్రపంచంలో పొడవైన నది నైలు (6670 కి.మీ.). ఈ నది లేక్‌ ఆఫ్‌ విక్టోరియా వద్ద పుట్టి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పై ఓవెన్‌, ఆస్వాన్‌ డ్యామ్‌లున్నాయి. భూమధ్యరేఖను రెండుసార్లు ఖండించుకుంటూ పోయిన జైరే (కాంగో)నది అట్లాంటిక్‌ మహాసముద్రంలో కలుస్తుంది. నైజర్‌ నది గినియా సింధుశాఖలో కలుస్తుంది. జాంబేజీ నది హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. దీనిపై విక్టోరియా జలపాతం ఉంది. ఆంజ్‌ నది అట్లాంటిక్‌ మహాసముద్రంలో, లింపో నది హిందూ మహాసముద్రంలో కలుస్తాయి.
* ఉష్ణమండల ఎడారుల్లో నీటిని జీవానికి మారుపేరుగా పేర్కొంటారు. ఎడారుల మీదుగా ప్రవహించే నదులను ‘ఎక్సోటిక్‌/జీవనదులు’ అంటారు. సహారా ఎడారి మీదుగా ప్రవహించే జీవనది - నైలు. కలహారి ఎడారి మీదుగా ప్రవహించే జీవనది - ఆరెంజ్‌. ఎడారుల్లో అక్కడక్కడా ఒయాసిస్సులు ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో ఖర్జూరం చెట్లు, గడ్డి పెరుగుతాయి.

ఎడారులు: ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా రెండు ఎడారులు విస్తరించి ఉన్నాయి. అవి 1) సహారా 2) కలహారి. ఇవేకాకుండా లిబియన్‌, నూబియన్‌ ఎడారులున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా.
* భూఉపరితలంపై 1922, సెప్టెంబరు 13న సహారా ఎడారిలోని లిబియా దేశంలో అజీజియా ప్రాంతంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదైంది. ఇప్పటికి భూఉపరితలం మీద నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే. కలహారి హర్ముడాకి మంచి ఉదాహరణ.
సూయజ్‌ కాలువ: దీన్ని 1869లో నిర్మించారు. దీని పొడవు 161 కి.మీ. ఈ కాలువ యూరప్‌, ఆసియాల మధ్య ఉంది. ఇది మధ్యధరా, ఎర్ర సముద్రాలను కలుపుతుంది.
ముఖ్యమైన పంటలు: కాఫీ, కోకో, పామ్‌ ఆయిల్‌, మొక్కజొన్న, పొగాకు, పత్తి, రబ్బరు, లవంగాలు, వేరుశనగ, చెరకు, ఖర్జూరం. ఆఫ్రికాలోని ఈజిప్టు, యూనియన్‌ ఆఫ్‌ సౌత్‌ ఆఫ్రికాలు విస్తృతంగా మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తున్నాయి. పత్తి ఉత్పత్తిలో ఈజిప్టు ప్రధాన దేశం. ఈజిప్షియన్‌ పత్తిని సాకెల్‌ అంటారు. ఇది అత్యధిక ఉత్పత్తిని ఇస్తుంది. దిగువ నైలు లోయ ప్రాంతం పత్తి పంటకు ప్రసిద్ధి.
ఖనిజాలు: బంగారం, వజ్రాలు, ఇనుము, మాంగనీస్‌, రాగి, భాస్వరం, పొటాషియం, ఫాస్ఫేట్‌, కోబాల్ట్‌, ప్లాటినం, పెట్రోలియం, బొగ్గు లాంటివి ఈ ఖండంలో లభించే ఖనిజాలు. దక్షిణాఫ్రికాలోని జొహనెస్‌బర్గ్‌లో విట్‌వాటర్స్‌రాండ్‌ అనే ప్రాంతం బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యధికంగా పసిడి నిల్వలున్న ప్రాంతమిది. దక్షిణాఫ్రికాలోని కింబర్లి ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి.
శీతోష్ణస్థితి: ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా ఉష్ణ మండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ఖండం ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలు రెండింటిలో వ్యాపించి ఉండటం వల్ల ఆఫ్రికా ఖండంలో వైవిధ్యమైన శీతోష్ణ పరిస్థితులున్నాయి. ఉత్తరార్ధ గోళంలో మే నుంచి అక్టోబరు వరకు వేసవి కాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు చలికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది. ఆఫ్రికా ఖండ సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేడ్‌.
సరస్సులు: ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా 5 సరస్సులు ఉన్నాయి.
మంచినీటి సరస్సులు: విక్టోరియా, న్యాసా, టాంగన్యీకా ఉప్పునీటి సరస్సులు: చాద్‌, గామి.
* ఆఫ్రికాలో అతిపెద్ద మంచినీటి సరస్సు - విక్టోరియా (భూమధ్యరేఖ ఈ సరస్సు మీదుగా వెళుతుంది).
వర్షపాతం: వర్షపాతం ఆధారంగా ఆఫ్రికాను మూడు భాగాలుగా విభజించారు.
అత్యధిక వర్షపాతం: భూమధ్యరేఖకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షపాతం నమోదవుతుంది. దీన్ని అత్యధిక వర్షపాత ప్రాంతం అంటారు.
* అత్యధిక వర్షపాత ప్రాంతాలు పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతాల వరకే విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులున్నాయి. వాటిలో కోతులు, చింపాంజీలు, ఎగిరే ఉడుతలు, ఎగిరే పాములు, అనకొండలు, సీసీ(సేసే) ఈగలు, విషపూరితమైన ఈగలున్నాయి.
మధ్యస్థ వర్షపాత ప్రాంతాలు: అత్యధిక, అల్ప వర్షపాత ప్రాంతాలకు మధ్య విస్తరించిన ప్రాంతాలను మధ్యస్థ వర్షపాత ప్రాంతాలు అంటారు. ఇవి  తేమ, పొడి వాతావరణంతో ఉంటాయి. ఇక్కడ ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో గడ్డి పెరుగుతుంది. వీటిని ఉష్ణమండల ‘గడ్డిభూములు’ అని పిలుస్తారు. ఉదా: సవన్నాలు
* ఆఫ్రికాలోని సమశీతోష్ణ మండల గడ్డిభూములు - వెల్డులు (దక్షిణాఫ్రికా).
అల్పవర్షపాత ప్రాంతాలు: సంవత్సర పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు, అల్ప వర్షపాతం ఉండే ప్రదేశాలను ‘శుష్క ప్రాంతాలు’ అంటారు. వీటినే ఎడారులు అని కూడా పిలుస్తారు. ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలోని సహారా ఎడారి, దక్షిణ ప్రాంతంలోని కలహారి ఎడారిలో సంవత్సరం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు, అల్ప వర్షపాతం నమోదవుతాయి.
ఈ ప్రాంతాల్లో ముళ్ల పొదలతో కూడిన అరణ్యాలు ఉంటాయి. ఈ అరణ్యాల్లో నాగజెముడు, బ్రహ్మజెముడు, కలబంద వృక్ష సంపదతో పాటు ముళ్లతో కూడిన    అనేక వృక్షాలు ఉంటాయి. జిరాఫీ, ఒంటె, చిరుతపులి, ఏనుగు లాంటి శాకాహార, మాంసాహార జంతువులుంటాయి.


జాతులు: ఆఫ్రికా ఖండ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటరుకు 65 మంది. భూమధ్యరేఖ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆదిమ ఆటవిక జాతుల వారు తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.
ఆఫ్రికాలోని ఆటవిక జాతులు
కాంగోనది హరివాణం   - పిగ్మీలు
సహారా   - బిడౌన్లు
కలహారి - బుష్‌మెన్‌లు, హట్టిన్‌టాట్లూ
తూర్పు ఆఫ్రికా - మసాయ్‌
సహారా ఉత్తర భాగం   - సైమైట్లు
పశ్చిమ ఆఫ్రికా సూడాన్‌  - హమైట్లు
పశ్చిమ ఆఫ్రికా - నీగ్రోలు
ఆఫ్రికా ప్రజలు నీగ్రోయిడ్‌, కాకసాయిడ్‌ వర్గాలకు చెందినవారు. ఉత్తర ఆఫ్రికాలో కాకసాయిడ్‌ జాతి ప్రజలున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు