ఆర్థిక అస్థిరతపై శాస్త్రీయ అంచనాలు!

ఒకప్పుడు వంద రూపాయలకి డజను పైగా మామిడి పళ్లు వచ్చేవి. ఇప్పుడు రెండో మూడో ఇస్తున్నారంటే కొనుగోలు శక్తి తగ్గినట్లే. డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ధరలు వేగంగా పెరుగుతుంటే పొదుపు పడిపోతున్నట్లే. 

Updated : 29 May 2023 04:33 IST

ఇండియన్‌ ఎకానమీ

ఒకప్పుడు వంద రూపాయలకి డజను పైగా మామిడి పళ్లు వచ్చేవి. ఇప్పుడు రెండో మూడో ఇస్తున్నారంటే కొనుగోలు శక్తి తగ్గినట్లే. డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ధరలు వేగంగా పెరుగుతుంటే పొదుపు పడిపోతున్నట్లే.  ముడి సరకుల ధరలు పెరిగి, ఉత్పత్తి వ్యయం ఎక్కువైతే వినియోగ వస్తువుల ధరలు ఆకాశం వైపు వెళుతున్నట్లే. ఇలాంటివన్నీ ద్రవ్యోల్బణం ప్రభావాలే. కొనుగోలు శక్తి తగ్గిపోయినా, పొదుపు పడిపోయినా, ధరలు పెరిగిపోయినా ఆర్థిక వ్యవస్థ అస్థిరమైపోతుంది. ఈ పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం కొన్ని కొలమానాల సాయంతో ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటుంది.


ద్రవ్యోల్బణం - కొలమానాలు

భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని రెండు సూచీల్లో గణిస్తారు. అవి 1) టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) 2) వినియోగ ధరల సూచిక (సీపీఐ).

టోకు ధరల సూచిక: మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని మొదట్లో టోకు ధరల సూచిక ఆధారంగా గణించేవారు. వ్యవహారాల ప్రారంభ దశలో పెద్దమొత్తంలో వస్తువులు అమ్మేటప్పుడు ధరల సగటు మార్పును లెక్కిస్తారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ గణాంకాలను నెలకోసారి విడుదల చేస్తున్నారు. దీనిలో ప్రాథమిక వస్తువులు, ఇంధన-విద్యుత్తుకు సంబంధించిన వస్తువులు, తయారీ వస్తువులు అనే మూడు గ్రూపులు తీసుకుంటారు. దీనిలో అత్యధిక ప్రాముఖ్యం (వెయిటేజీ) తయారీ వస్తువులకు ఉంటుంది. ఉత్పత్తి విలువ ఆధారంగా ఈ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. టోకు ధరల సూచీలో సేవలను లెక్కలోకి తీసుకోరు. 2017లో ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌’ టోకు ధరల సూచీని లెక్కించడానికి ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కి మార్చింది. టోకు ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని ఇప్పటివరకు ఏడుసార్లు సవరించారు. కొత్త ఆధార సంవత్సరాన్ని మార్చిన తర్వాత వస్తువుల సంఖ్య 676 నుంచి 697కి పెరిగింది.

కొత్త ఆధార సంవత్సరంలో ప్రధానమైన అంశాలు: * కొత్త ఆధార సంవత్సరంలో పరోక్ష పన్నులను లెక్కించలేదు. * అంక మధ్యమానికి బదులు ప్రస్తుతం గుణ మధ్యమంలో లెక్కిస్తున్నారు. * గతంలో విదుచ్ఛక్తిని వ్యవసాయం, గృహ, వాణిజ్య, రైల్వే, పారిశ్రామిక రంగాల్లో భాగంగా గణించేవారు. ప్రస్తుతం విద్యుచ్ఛక్తిని ప్రత్యక్షంగా సింగిల్‌ యూనిట్‌గా గణిస్తున్నారు.

వినియోగ ధరల సూచిక: సమాజంలో ఒక వర్గం ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి
వినియోగ ధరల సూచికను గణిస్తారు. వారి వ్యయం ఆధారంగా వస్తువులకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇందులో రిటైల్‌ ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.మన దేశంలో నాలుగు రకాల వినియోగ ధరల సూచికలు ఉన్నాయి.

1) పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచిక: లేబర్‌, ఎంప్లాయిమెంట్‌ సలహా కమిటీ ప్రకారం 260 వస్తుసేవలను అంచనా వేస్తారు. 2020, ఫిబ్రవరిలో ఆధార సంవత్సరాన్ని 2001 నుంచి 2016కి మార్చారు. నెలవారీ ప్రతిపాదికగా గణాంకాలను సేకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని (డీఏ) దీని ఆధారంగానే ప్రకటిస్తారు.

2) వ్యవసాయ శ్రామికుల వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికన గణాంకాలను సేకరిస్తారు. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ శ్రామికుల కనీస వేతనాలు సవరించేందుకు ఉపయోగపడతాయి.

ఉదా: ఉపాధిహామీ పనుల వేతనాలు.

3) గ్రామీణ శ్రామికుల వినియోగ ధరల సూచిక: దీని ఆధార సంవత్సరం 1986-87. దీన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. పై మూడు గణాంకాలను ‘లేబర్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా’ అంచనా వేస్తుంది.

4) నూతన వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 2011-12. గతంలో వివిధ రకాల వినియోగ ధరల సూచికలను గణించేవారు. ఇవి ఏదో ఒక వర్గం ప్రజలకు సంబంధించిన వస్తువుల ధరల పెరుగుదలను మాత్రమే పేర్కొంటాయి. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం ధరల పెరుగుదలను ప్రతిబింబించవు. అందుకే ఆర్‌బీఐ గ్రామీణ, పట్టణాలకు సంబంధించి ద్రవ్యోల్బణ సూచికలను గణించాలని నిర్ణయించింది. దీని ఆధారంగా కేంద్ర గణాంక సంస్థ సీపీఐ-గ్రామీణ, సీపీఐ-పట్టణ, సీపీఐ-అఖిలభారత సూచికలను తయారు చేస్తుంది.

* 2001 జనాభా లెక్కల ప్రకారం 9 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 310 పట్టణాల్లో సీపీఐ-పట్టణ సూచీని గణిస్తారు.

* దేశంలో జిల్లాకు రెండు గ్రామాలను తీసుకొని, 1183 గ్రామాల్లో ధరల కొటేషన్స్‌ సేకరించడం ద్వారా సీపీఐ-గ్రామీణ సూచీని గణిస్తున్నారు.

ఆ రెండింటినీ కలిపి సీపీఐ-అఖిల భారత సూచీని రూపొందిస్తున్నారు. నూతన సీపీఐ గణనలో గ్రామీణ ప్రాంతాల్లో 225 వస్తువులను, పట్టణ ప్రాంతాల్లో 250 వస్తువులను తీసుకుంటారు. 20 రకాల సేవలను కూడా దీనిలో చేర్చారు. రిటైల్‌ ధరల ఆధారంగా దీన్ని గణిస్తారు. ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ ఈ నూతన సిఫార్సు చేసింది. ఇందులో అధిక ప్రాధాన్యం ఆహార అంశాలదే.

ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (పీపీఐ): బి.ఎన్‌.గోల్డర్‌ అధ్యక్షతన 2017లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పీపీఐని ప్రవేశపెట్టారు. పీపీఐ అనేది మార్కెట్‌లోని ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తువులు, సేవల ధరల్లో వచ్చే మార్పులను లెక్కిస్తుంది.
ప్రపంచంలో అనేక దేశాలు టోకు ధరల సూచిక స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాయి. బి.ఎన్‌.గోల్డర్‌ కమిటీ భారత్‌లో టోకు ధరల సూచీ స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ గణాంకాలను నెలవారీగా విడుదల చేయాలని, ఆధార సంవత్సరం 2011-12ను కొనసాగించాలని, ప్రారంభంలో 15 సేవలను తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది.

ఆహార ద్రవ్యోల్బణం: ఆహార ద్రవ్యోల్బణాన్ని గణించేందుకు రెండు సూచీలు ఉన్నాయి. అవి-

1) టోకు ధరల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: టోకు ధరల సూచికలో ప్రాథమిక వస్తువుల్లోని ఆహార వస్తువులను, తయారీ వస్తువుల్లోని ఆహార వస్తువులను కలిపి దీన్ని లెక్కిస్తారు. ఇందులో అతిపెద్ద వాటా ఆహార వస్తువులదే ఉంటుంది.

2) వినియోగదల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: 2014 నుంచి కేంద్ర గణాంక సంస్థ దీన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ, దేశానికి సంబంధించిన రిటైల్‌ ధరల ద్వారా దీన్ని గణిస్తారు. ఆధార సంవత్సరం 2012. దీనిలో ఆహారం, పానీయాల వాటా అధికంగా ఉంటుంది.

హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌: ఒక భౌగోళిక సరిహద్దు పరిధిలో నివాస ఆస్తుల ధరల్లో మార్పులను తెలియజేస్తుంది. భారత మొదటి ‘రెసిడెక్స్‌’ని 2007లో జాతీయ హౌసింగ్‌ బ్యాంకు ప్రారంభించింది. దీని ఆధార సంవత్సరం 2012-13. ఇది 50 నగరాలకు సంబంధించిన జాతీయ హౌసింగ్‌ బ్యాంకు రెసిడెక్స్‌ని ప్రచురిస్తోంది.

బాటిల్‌ నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌: డిమాండ్‌ మారకుండా సప్లయ్‌ భారీగా పడిపోతే పెరిగే ధరలను బాటిల్‌ నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు.


ద్రవ్యోల్బణ ధోరణిలో మార్పులు

2014 తర్వాత భారతదేశ ద్రవ్యోల్బణ ధోరణిలో వ్యవస్థాపరమైన మార్పులు జరిగాయి. 1977-2000 మధ్యకాలంలో 9.0 శాతంగా ఉండేది. 2005-06 మధ్యకాలంలో - 5.0 శాతానికి తగ్గింది.  2006-14 మధ్య తిరిగి 9.0 శాతంగా నమోదైంది. విదేశీ మారక రేటు తగ్గుదల, ముడి చమురు ధరలు, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల దీనికి కారణాలు.

* 2014-15 లలో 5.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు 2015-16లో 4.9 శాతానికి, ఆ తర్వాత 2016-17లో 4.5 శాతానికి తగ్గింది. టోకు ధరల సూచీ, వినియోగ ధరల సూచీల మధ్య అంతరం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. 2014-15లో 4.7 శాతం ఉన్న ఈ అంతరం 2015-16లో 8.6 శాతానికి పెరిగింది. వర్తక వస్తువుల ధరల నియంత్రణ వల్ల టోకు ధరల సూచీ స్థాయిని తగ్గించడం ద్వారా ఈ అంతరాన్ని 2.8 శాతానికి తగ్గించారు.

* వినియోగదారుడి ధరల సంబంధిత ఆహార ద్రవ్యోల్బణ రేటు 2014-15లో 6.4 శాతం నుంచి 2015-16లో 4.9 శాతానికి, తర్వాత 2016-17లో 4.2 శాతానికి తగ్గింది. ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరగడంతో 19 లక్షల టన్నుల ఆహారధాన్యాల మిగులు నిల్వల ఏర్పాటుతో ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.

ద్రవ్యోల్బణ నియంత్రణకు సూచనలు:

* నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా అభివృద్ధేతర వ్యయాన్ని నియంత్రించాలి. ప్రభుత్వ యంత్రాంగంపై చేసే రెవెన్యూ వ్యయం పెరగకుండా చూడాలి.

* ప్రజోపయోగ పథకాలపై సమర్థంగా ఖర్చు చేసి, తక్కువ ప్రయోజనాలిచ్చే పథకాలు, ప్రచార కార్యక్రమాలపై వ్యయాన్ని నియంత్రించాలి.

* ప్రభుత్వ లోటు బడ్జెట్‌ విధానానికి స్వస్తి చెప్పి సంతులిత బడ్జెట్‌ విధానం వైపు దృష్టి సారించాలి. అంటే రెవెన్యూ లోటు, కోశ లోటును స్థూల దేశీయోత్పత్తిలో 2.0 శాతానికి తగ్గించాలి.

* బడ్జెట్‌ లోటును అధిగమించడానికి రాబడి పెంచుకోవాలి. భారం అధికం కాకుండా ప్రస్తుత పన్ను రేట్లను పెంచి, కొన్ని కొత్త పన్నులు విధించాలి.

* దేశీయ, విదేశీ రుణభారం నిరంతరం పెరుగుతోంది కనుక, రుణ సేకరణ నియమాలను పాటిస్తూ వడ్డీ చెల్లింపుల భారాన్ని కనిష్ఠం చేయాలి.

* కొరతగా ఉన్న వస్తువుల దిగుమతిని అనుమతించి వాటి ఎగుమతిని క్రమబద్ధీకరించాలి. దేశీయ ఉత్పత్తులు పెంచడానికి తగిన ప్రోత్సాహం అందించాలి.

* అక్రమ నిల్వలు, చీకటి వ్యాపారం లాంటి ప్రమాదకర పద్ధతులను కఠినంగా అణచివేయాలి.

ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడటానికి కారణాలు:  1) చక్కెర, పప్పులు, ఉల్లిపాయలు లాంటి నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ. 2) బహుళజాతి సంస్థలు ఆహార వస్తువుల భావి వ్యాపారాన్ని (ఫ్యూచర్‌ ట్రేడ్‌) నిర్వహించడం.   3) వ్యవసాయ రంగంలో సమస్యల వల్ల దేశ జనాభాకు అవసరమైన పరిమాణంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోవడం. 4) రాయితీల తగ్గింపు, వ్యవసాయ ఉత్పాదకాలైన డీజిల్‌, ఎరువుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడం.

ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు:

* ప్రభుత్వం కోశ సంబంధ చర్యలుగా వరి, గోధుమ, పప్పులు, వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని సున్నా రేటుకు తగ్గించింది. రిఫైన్డ్‌ నూనెలు, వెజిటేబుల్‌ ఆయిల్‌పై ఈ సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించింది. ముడి చక్కెర దిగుమతిపై సుంకాన్ని కూడా సున్నా రేటుకు తగ్గించింది. బియ్యం, వంటనూనెలు, పప్పుధాన్యాల  ఎగుమతిని నిషేధించింది.

* 2016-17 నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని