ఆధునిక వీరభారతం!

నిజాం నిరంకుశ రాజ్యంలో తమ భూములను కాపాడుకోవడానికి, దుర్మార్గమైన పన్ను వసూళ్లను ఎదిరించడానికి ఎందరో తెలంగాణ రైతులు ప్రాణాలను అర్పించాల్సి వచ్చింది. నాలుగు దశల్లో సాగిన పోరాటాల్లో పాలకులు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా తిరగబడ్డారు.

Published : 03 Jun 2023 01:23 IST

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

నిజాం నిరంకుశ రాజ్యంలో తమ భూములను కాపాడుకోవడానికి, దుర్మార్గమైన పన్ను వసూళ్లను ఎదిరించడానికి ఎందరో తెలంగాణ రైతులు ప్రాణాలను అర్పించాల్సి వచ్చింది. నాలుగు దశల్లో సాగిన పోరాటాల్లో పాలకులు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా తిరగబడ్డారు. ఫలితంగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగాయి. పలువురు ఉద్యమకారులు తూటాలకు బలయ్యారు. రెచ్చిపోయిన రజాకార్ల హింసాకాండలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. నీళ్లు లేని బావిలోకి జనాన్ని తోసేసి, సామూహిక సజీవ దహనాలకు తెగబడ్డారు. కొందరు గ్రామస్థులను వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. ఈ దశలో కమ్యూనిస్టులు సాయుధ పోరాటాలకు దిగారు. నిజాం పాలన అంతమైన తర్వాత కూడా  ఆ పోరాటాలను కొనసాగించాలని కమ్యూనిస్టులు భావించడంతో భారత ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపింది. చివరికి ఉద్యమకారులు ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.  నాడు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కవులు, రచయితలు కూడా ఎంతో కృషి చేశారు. ఈ పోరాటాలను ఆధునిక వీరభారతంగా అభివర్ణించారు.

తెలంగాణ సాయుధ పోరాటం

నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు వీరోచిత పోరాటం చేశారు. మొదటి దశ సాయుధ పోరాటంలో భూస్వాముల అరాచకాలను ఎదిరించి భూమి కోసం పోరాడారు. రెండో దశ హింసాయుత పోరాటానికి దారితీసింది.

సాయుధ పోరాట రెండో దశ (1946-47): విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి 1946, జులై 4న ఆంధ్ర మహాసభ సభ్యులను చంపేందుకు కడవెండి గ్రామంపైకి గూండాలను పంపించాడు. ఈ పోరాటంలో దొడ్డి కొమురయ్య మరణించాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు రెండు వేల మంది కలిసి భూస్వామి ఇల్లు, మామిడి తోటను ధ్వంసం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వీరుడు దొడ్డి కొమురయ్య. ఈ సంఘటన తెలంగాణలో హింసాయుత తిరుగుబాట్లకు నాంది పలికింది.

బాలెంల సంఘటన: 1946, అక్టోబరు 18న నిజాం పోలీసులు, రెవెన్యూ అధికారులు సూర్యాపేట తాలుకా బాలెంల గ్రామంపై లెవీ గల్లా వసూలు పేరుతో దౌర్జన్యకాండకు దిగారు. ప్రజలు ఎదురు తిరగడంతో జరిగిన పోలీసు కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి పటేల్‌, మట్టారెడ్డి మరణించారు. వీరు తెలంగాణలో పోరాడుతూ మరణించిన తొలి అమరవీరులు.

మల్లారెడ్డిగూడెం ఘటన: హుజూర్‌నగర్‌ తాలూకా మల్లారెడ్డిగూడెంపై 1946, డిసెంబరు 1న నిజాం సైన్యం లెవీ గల్లా పేరుతో దాడి చేయడంతో ప్రజలు ఎదురుతిరిగారు. బింద్రాల గురువమ్మ, బొండమ్మ, అంకాళమ్మలు మరణించారు. వీరు తెలంగాణ పోరాటంలో అమరులైన తొలి దళిత మహిళలు. కడవెండి గ్రామ సంఘటన తెలంగాణ పోరాటాన్ని ఒక మలుపు తిప్పింది. భూస్వాముల ఏజెంట్లను, నిజాం పోలీసులను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు గ్రామాల్లో వాలంటీర్ల దళాలను సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లోనే నిజాం ప్రభుత్వానికి ‘సదర్‌ ఆజం (ముఖ్యమంత్రి)’గా నియమితుడైన మీర్జా ఇస్మాయిల్‌ కమ్యూనిస్టుల తిరుగుబాటును
అణచివేయగలిగే విధంగా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేశాడు. భూస్వాములకు మద్దతుగా నిజాం పోలీసులు అనేక గ్రామాలపై దాడులు జరిపి హింసాకాండ సాగించారు.

ఆకునూరు, మాచిరెడ్డిపల్లి ఘటన: నిర్బంధ లెవీ చెల్లించేందుకు నిరాకరించిన ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలపై ప్రభుత్వ రిజర్వు పోలీసులు దాడి చేసి ప్రజల ధనాన్ని దోచుకున్నారు. ఎంతోమంది స్త్రీలపై అఘాయిత్యం చేశారు. అనేక మందిని చంపారు. ఈ సంఘటనను రావి నారాయణరెడ్డి యావత్‌ దేశం దృష్టికి వచ్చే విధంగా కృషి చేశారు. గాంధీజీ కోరిక మేరకు ఇక్కడ జరిగిన సంఘటనలపై పద్మజానాయుడు నివేదిక తయారుచేసి పంపారు. ఈ దారుణకాండ గురించి గాంధీజీ నిజాంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు, రైతులకు మధ్య పాత సూర్యాపేట, పులగిరి, దేవకుప్పం, కామారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఘర్షణ జరిగి చాలామంది మరణించారు. 1946, డిసెంబరు 3న నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. ఈ ఉద్యమం జనగాం, సూర్యాపేట, భువనగిరి, హుజూర్‌నగర్‌ తాలూకాల్లో విస్తృతంగా సాగింది. 1946, డిసెంబరు నాటికి ఒక్క నల్గొండ జిల్లాలోనే 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

సాయుధ పోరాట మూడో దశ (1947-48):  1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం హైదరాబాదు రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వానికి మద్దతుగా ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకారులు ఒక వైపు, నిజాం పోలీసులు మరోవైపు దారుణ హింసాకాండకు పాల్పడ్డారు. నిజాం రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలనేదే వీరి లక్ష్యం. ఈ దారుణాల
నుంచి ప్రజలను రక్షించడానికి కమ్యూనిస్టులు 1947, సెప్టెంబరులో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. గెరిల్లా కమిటీలను సిద్ధం చేశారు.

గ్రామ దళాలు: గ్రామంలోని యువకులు ఈ దళాల్లో చేరేవారు. తమ సాధారణ కార్యకలాపాలను సాగిస్తూనే బర్మార్లు, ఈటెలతో రజాకార్లను, పోలీసులను ప్రతిఘటించేవారు. గ్రామంలోకి శత్రువులు చొరబడకుండా చూసేవారు.

నిర్మూలనా దళాలు: వీరు గ్రామంలోకి శత్రు వాహనాలు ప్రవేశించకుండా నిరోధించేందుకు రోడ్లు, వంతెనలు ధ్వంసం చేసేవారు. పోలీసులు, శత్రు శిబిరాల్లోని ఆస్తులు ధ్వంసం చేయడం వీరి కార్యక్రమాలు.

గెరిల్లా దళాలు: వీరు పూర్తికాలం ఉద్యమంలో పనిచేసేవారు. బర్మార్లు, ఈటెలు, పరిమితమైన అధునాతన ఆయుధాలతో రజాకార్లు, పోలీసు దాడులను ప్రతిఘటించడం, శత్రువులను నిర్మూలించడం, ప్రజలను రక్షించడం వీరి ప్రధాన విధి. ఒక్కో దళంలో దాదాపు 10 మంది ఉండేవారు. భూస్వాములు, రజాకార్లు, పోలీసులపై మెరుపు దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, భూస్వాముల భూములు స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచడం, ప్రభుత్వ కచేరిలను, న్యాయస్థానాలను, విద్యాసంస్థలను బహిష్కరించడం, పన్నుల నిరాకరణ ద్వారా పాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేయడం, ప్రతి గ్రామంలో జాతీయ పతాకంతోపాటు కమ్యూనిస్టు పతాకాన్ని ఆవిష్కరించడం మొదలైనవి లక్ష్యాలు.

కమ్యూనిస్టుల దాడుల వల్ల 400 గ్రామాల్లో నిజాం ప్రభుత్వం ఉనికి లేకుండా పోయింది. ఈ గ్రామాల్లో కమ్యూనిస్టులు తమ అధికారాన్ని స్థాపించారు. దాదాపు 12 లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచిపెట్టారు. భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాలకు పారిపోయారు. స్థానిక వడ్డీ వ్యాపారులకు చెల్లించే రుణాలన్నింటినీ కమ్యూనిస్టులు రద్దు చేశారు. దీంతో ప్రజల నుంచి పెద్దమొత్తంలో వారికి సొమ్ము విరాళంగా వచ్చింది. ఈ సొమ్ముతో ఉద్యమాన్ని విస్తరించారు.

హింసాత్మక సంఘటనలు: సాయుధ పోరాటం సందర్భంగా తెలంగాణ గ్రామాల్లో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో అనేక మంది మరణించారు.

పరకాల హింసాకాండ: నాటి కరీంనగర్‌ జిల్లా పరకాల తాలూకా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులైన కట్టంగూరి కేశవరెడ్డి, యస్‌.మనోహర్‌ రావుల నాయకత్వంలో 1974, సెప్టెంబరు 2వ తేదీన 30 గ్రామాల ప్రజలు త్రివర్ణ పతాకావిష్కరణ కోసం పరకాల చేరుకున్నారు. దగ్గు వీరగోపాల్‌ నాయకత్వంలో జూకల్లు గ్రామానికి చెందిన చిటికేసి శ్రీశైలం స్ఫూర్తితో ఊరేగింపు ముందుకు సాగింది. అప్పటికే అక్కడ తిష్ట వేసిన నిజాం పోలీసులు పరకాల తహసీల్దార్‌ విష్ణువేశ్వర్‌రావు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జియాఉల్లా ఆదేశాలతో ఎలాంటి హెచ్చరికల్లేకుండా ఊరేగింపుపై కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. 15 మంది ఉద్యమకారులు చనిపోగా, 200 మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం రజాకార్లు, పోలీసులు పరకాల గ్రామాన్ని దోచుకున్నారు.

బైరాన్‌పల్లి మారణహోమం: కమ్యూనిస్టుల నిర్మూలనే ధ్యేయంగా రజాకార్లు, నిజాం పోలీసులు జనగాం తాలూకా బైరాన్‌పల్లి గ్రామంపై 1948, మార్చి నుంచి ఆగస్టు 27 వరకు ఆరు సార్లు దాడి చేశారు. మొదటి అయిదుసార్లు ప్రజలు వారిని తరిమికొట్టారు. 1948, ఆగస్టు 27న భువనగిరి తాలూకా డిప్యూటీ కలెక్టర్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ నాయకత్వంలో భారీ బలగాలతో రాత్రిపూట గ్రామంపై దాడి చేసి మారణహోమం సృష్టించారు. 84 మంది మరణించారు. ఈ దాడి తర్వాత రజాకార్లు, పోలీసులు బైరాన్‌పల్లి పక్కనే ఉన్న కూటిగల్లుపైనా దాడి చేసి 31 మందిని చంపారు.

గుండ్రాంపల్లి ఘటన: కమ్యూనిస్టులున్నారనే నెపంతో సైదీ మెయిల్‌ నాయకత్వంలో రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి సామూహిక దహనం చేశారు. ఆరుట్ల గ్రామస్థులను విచక్షణారహితంగా చంపారు. రేణిగుంట, రాయికోడు గ్రామాల్లో ప్రజలను వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. కూటిగల్లు బెహ్రాంపల్లి, కాటకొండ, అంకనూరు, కొనపాక, చౌటుపల్లి తదితర గ్రామాల్లో అనేక మంది ప్రజలు మరణించారు.

1948 సెప్టెంబరులో జరిగిన ‘ఆపరేషన్‌ పోలో’ తర్వాత హైదరాబాదు రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది. సాయుధ పోరాట నాలుగో దశ (1948, సెప్టెంబరు 17 నుంచి 1951, అక్టోబరు 21 వరకు): హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపిన తర్వాత చాలా మంది కమ్యూనిస్టు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. 1948లో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు సమావేశంలో సాయుధ పోరాటం కొనసాగించాలనే రణదివే (కమ్యూనిస్టు నాయకుడు) ఆలోచనను అంగీకరించారు. సాయుధ పోరాటాన్ని తీవ్రతరం చేసి కమ్యూనిస్టు పాలనను సుస్థిరం చేయాలని ఆశించారు. దీంతో సాయుధ పోరాటం మళ్లీ ప్రారంభమైంది. అయితే భారత ప్రభుత్వం శాంతిభద్రతల రక్షణ పేరుతో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. దీంతో కమ్యూనిస్టులు అడవుల్లోకి వెళ్లి దాదాపు 18 నెలలు ఉద్యమాన్ని కొనసాగించారు. పగలు పోలీసుల గాలింపు, రాత్రి కమ్యూనిస్టు గెరిల్లాల మెరుపుదాడులతో ప్రజాజీవనం అల్లకల్లోలంగా మారింది. వీరి పోరాటం 1951, సెప్టెంబరు వరకు సాగింది. కమ్యూనిస్టు పాలనను స్థాపించడంలో విఫలమవుతున్నామని గ్రహించిన ఆ పార్టీ నేతలు సాయుధ పోరాటాన్ని వదిలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలుపంచుకుంటామని అంగీకరించారు. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తేశారు. 1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు తెలంగాణలో అపూర్వంగా 14 స్థానాలు సాధించారు. నల్గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి రావి నారాయణరెడ్డి మూడు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.

తెలంగాణ పోరాట సాహిత్యం: మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థలో, నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయిన తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో నాటి కవులు, రచయితలు ప్రముఖ పాత్ర పోషించారు. కుందుర్తి ఆంజనేయులు తెలంగాణ పోరాటాన్ని ఆధునిక వీరభారతంగా వర్ణించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని