శరీర పోషణలో శక్తి జనకాలు!

శరీరంలో జరిగే జీవక్రియలకు, ఇతర అవసరాలకు ప్రధాన శక్తి వనరులు కార్బోహైడ్రేట్‌లు. పండ్లు, తేనె, కూరగాయలు, ఆకు కూరలు, విత్తనాలు, మొలకలు వంటి సహజ ఆహార పదార్థాలతో పాటు చక్కెర ఉత్పత్తులు, వేపుళ్లు, చిప్స్‌, పిజ్జా, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు వంటి అనారోగ్యకర పదార్థాల్లోనూ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.

Published : 04 Jun 2023 01:51 IST

శరీరంలో జరిగే జీవక్రియలకు, ఇతర అవసరాలకు ప్రధాన శక్తి వనరులు కార్బోహైడ్రేట్‌లు. పండ్లు, తేనె, కూరగాయలు, ఆకు కూరలు, విత్తనాలు, మొలకలు వంటి సహజ ఆహార పదార్థాలతో పాటు చక్కెర ఉత్పత్తులు, వేపుళ్లు, చిప్స్‌, పిజ్జా, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు వంటి అనారోగ్యకర పదార్థాల్లోనూ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి శక్తి అందుతుంది. ఇందులో తక్షణం శక్తినిచ్చేవి, క్రమంగా శక్తిని విడుదల చేసేవి, అత్యధికంగా శక్తిని సమకూర్చేవి అని భిన్న రకాలుగా ఉంటాయి. వీటి వర్గీకరణ, లభించే పదార్థాలు, ఉపయోగాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

కార్బోహైడ్రేట్‌లు

జీవులకు ప్రాథమిక శక్తి జనకాలు కార్బోహైడ్రేట్‌లు. జంతువులతో పోలిస్తే మొక్కల భాగాల్లో ఇవి ఎక్కువ. మొక్కల్లో సెల్యులోజ్‌, పిండిపదార్థాలుగా; జంతువుల్లో గ్లైకోజెన్‌ రూపంలో నిల్వ ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లు సాధారణంగా కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల నిర్మితాలు. ఉన్నతస్థాయి కార్బోహైడ్రేట్‌లలో నైట్రోజన్‌, సల్ఫర్‌ అదనం. చక్కెర పరమాణువులు, నిర్మాణం ఆధారంగా వీటిని మూడు రకాలుగా విభజించారు. అవి 1) మోనో శాఖరైడ్‌లు 2) ఒలిగోశాఖరైడ్‌లు 3) పాలీశాఖరైడ్‌లు.

1) మోనోశాఖరైడ్‌లు: ఒకే చక్కెర అణువు ఉన్న కార్బోహైడ్రేట్‌లను మోనోశాఖరైడ్‌లు అంటారు. వీటిని సరళ చక్కెరలని పిలుస్తారు. రుచికి తియ్యగా ఉండి, నీటిలో కరుగుతాయి. వీటిలో కర్బన పరమాణువులను బట్టి కార్బోహైడ్రేట్‌లను తిరిగి డైయోజ్‌లు, ట్రైయోజ్‌లు, టెట్రోజ్‌లు, పెంటోజ్‌లు, హెక్సోజ్‌లు, హెప్టోజ్‌లుగా వర్గీకరించారు.

డైయోజ్‌లు: వీటిలో రెండు కార్బన్‌ పరమాణువులుంటాయి. గ్లైకోలాల్డిహైడ్‌ అనేది వీటికి ఉదాహరణ. ఇది అతి సరళ కార్బోహైడ్రేట్‌.

ట్రైయోజ్‌లు: వీటిలో మూడు కార్బన్‌ పరమాణువులుంటాయి. ఉదా: గ్లైసిరోజ్‌

టెట్రోజ్‌లు: వీటిలో నాలుగు కార్బన్‌ పరమాణువులుంటాయి. ఎరిథ్రోజ్‌, ఎరిథ్రులోజ్‌, థ్రియోజ్‌ అనేవి వీటికి ఉదాహరణ.

పెంటోజ్‌లు: వీటిలో 5 కార్బన్‌ పరమాణువులుంటాయి. రైబోజ్‌, అరాబినోజ్‌, క్సైలోజ్‌ అనేవి వీటికి ఉదాహరణ. రైబోజ్‌ చక్కెర కేంద్రకామ్లాలైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలలో ఉంటుంది. అయితే డీఎన్‌ఏలో ఉండే చక్కెరను డీఆక్సీరైబోజ్‌ చక్కెర అని అంటారు.

హెక్సోజ్‌లు: వీటిలో 6 కార్బన్‌ పరమాణువులుంటాయి. గ్లూకోజ్‌, మాన్నోజ్‌, గాలక్టోజ్‌, ఫ్ర£క్టోజ్‌లు అనేవి వీటికి ఉదాహరణ. వీటిలోని గ్లూకోజ్‌ను రక్తంలో ఉండే చక్కెర, తక్షణ శక్తినిచ్చే చక్కెర, క్రీడాకారులు వ్యాయామం తర్వాత తీసుకునే చక్కెర అని పిలుస్తారు. ఫ్రక్టోజ్‌ చక్కెరను అతి తియ్యనైన చక్కెర అంటారు. ఇది తేనె, పండ్లలో ఉంటుంది. గాలక్టోజ్‌ చక్కెర పాలలోని చక్కెర అయిన లాక్టోజ్‌లో భాగంగా ఉంటుంది.

హెప్టోజ్‌లు: వీటిలో 7 కర్బన పరమాణువులుంటాయి. గ్లూకోహెప్టోజ్‌, గ్లూకోహెప్టులోజ్‌, మాన్నోహెప్టోజ్‌ అనేవి వీటికి ఉదాహరణ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని