సహాయంలో సంతోషం!

కొందరు విద్యార్థులు పరీక్షల్లో తమకు మాత్రమే ఎక్కువ మార్కులు రావాలనే దృష్టితో పక్కవారికి సాయం చేయటానికి వెనకాడతారు. కష్టమైన పాఠ్యాంశంపై సహాధ్యాయులకు సందేహాలుంటే వివరించి చెప్పటానికి ప్రయత్నించరు.

Published : 05 Jun 2023 00:07 IST

కొందరు విద్యార్థులు పరీక్షల్లో తమకు మాత్రమే ఎక్కువ మార్కులు రావాలనే దృష్టితో పక్కవారికి సాయం చేయటానికి వెనకాడతారు. కష్టమైన పాఠ్యాంశంపై సహాధ్యాయులకు సందేహాలుంటే వివరించి చెప్పటానికి ప్రయత్నించరు. వాస్తవం ఏమిటంటే... విద్యార్థులు తమకు తెలిసిన విషయాన్ని పక్కవారికి అర్థమయ్యేట్టు చెపితే మరింత స్పష్టత ఏర్పడి, దానిపై పట్టు పెరుగుతుంది. ఇద్దరికీ సంతోషకరమైన, ప్రయోజనకరమైన విషయమిది. ‘హ్యాపీనెస్‌ బెలూన్‌’ కథ దీన్నే రుజువు చేస్తుంది! 

ఓ కాలేజీ ప్రొఫెసర్‌ ఒకరోజు విద్యార్థులకు సెమినార్‌ నిర్వహించారు. దాంట్లో భాగంగా కొన్ని బెలూన్లు ఇచ్చి ఒక్కోదాని మీదా వాళ్ల పేరు రాయమన్నారు. అందరూ రాసిన తర్వాత వాటిని పక్కగదిలోని ట్రేలో వేయించారు. కొంతసేపటి తర్వాత.. ఎవరి బెలూన్‌ను వారు రెండే నిమిషాల్లో పక్క గదిలోంచి తెచ్చుకోవాలన్నారు. అందరూ ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లి.. తమ పేరున్న బెలూన్‌ కోసం ఆత్రుతగా వెతకటం మొదలుపెట్టారు. ఈలోగా సమయం మించిపోయిం ది, ఎవరి బెలూను వారికి దొరకనే లేదు!

‘ఇప్పుడు ఎవరి చేతికి దొరికిన బెలూన్‌ను వాళ్లు తీసుకుని... దాని మీద ఎవరి పేరుంటే వాళ్లకు ఇచ్చేయండి’ అని ప్రొఫెసర్‌ టాస్కును మార్చి చెప్పారు. విద్యార్థులందరూ ఆయన చెప్పినట్టుగానే చేశారు. ఈసారి ఎవరి బెలూన్‌ వాళ్ల చేతికి సులువుగా, వేగంగా వచ్చేసింది. ఇదంతా విద్యార్థులకు గమ్మత్తుగా అనిపించింది!

అప్పుడు ప్రొఫెసర్‌ ఇలా చెప్పారు- ‘‘ఈ బెలూన్లు మన సంతోషం లాంటివి. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పక్కవాళ్ల సంగతి పట్టించుకోకుండా హడావిడిగా వెతుక్కుంటే మనకది దొరక్కపోవచ్చు. కానీ ఇతరులకు సంతోషం కలిగించాలనీ, వారి భావోద్వేగాలు పట్టించుకోవాలనీ, వారి అవసరాలను గమనించాలనీ ఆలోచించి శ్రద్ధపెట్టగలిగితే వారి సంతోషంతో పాటు మన సంతోషం కూడా దానికదే వచ్చేస్తుంది’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని