అవినీతి, అక్రమాలపై.. స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థ

భారత న్యాయవ్యవస్థ, న్యాయసమీక్ష భారత న్యాయవ్యవస్థలో లోకాయుక్త, లోక్‌పాల్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తులు, అధికారులు, ఉద్యోగుల అవినీతి, అధికార దుర్వినియోగంపై ఎక్కుపెట్టిన విచారణాస్త్రాలు.

Updated : 16 Jun 2024 05:19 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ పాలిటీ

భారత న్యాయవ్యవస్థ, న్యాయసమీక్ష భారత న్యాయవ్యవస్థలో లోకాయుక్త, లోక్‌పాల్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తులు, అధికారులు, ఉద్యోగుల అవినీతి, అధికార దుర్వినియోగంపై ఎక్కుపెట్టిన విచారణాస్త్రాలు. స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటాయి. వీటి నిర్మాణం, పదవీకాలం, తొలగింపు, అధికారాలు తదితరాలపై పరీక్షార్థులకు
అవగాహన తప్పనిసరి.

లోకాయుక్త

రాష్ట్ర పాలనా యంత్రాంగంలోని ప్రముఖులు, ఉన్నత ఉద్యోగులు, అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థే లోకాయుక్త. 

 • మొదటి పాలనా సంస్కరణల సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్తను ఏర్పాటు చేశారు.
 • ఒడిశా రాష్ట్రం మొదటిసారిగా 1970లో ఈ చట్టాన్ని రూపొందించింది. అయితే దీని అమలు 1983లో జరిగింది.
 • మహారాష్ట్ర 1971లో ఈ చట్టాన్ని రూపొందించి, అమలు చేసింది. దేశంలో ఈ చట్టాన్ని అమలుపరిచిన మొదటి రాష్ట్రం ఇదే.
 • ఆంధ్రప్రదేశ్‌లో 1983 నవంబరు 15 నుంచి అమల్లోకి వచ్చింది.

లోకాయుక్త వ్యవస్థ లక్షణాలు: కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణలో లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది.

 • అనుకూల విధానాలతో, సులభరీతిలో ఫిర్యాదులు చేసేందుకు అందుబాటులో ఉండటం.
 • దాదాపుగా ఉచితంగా, వేగవంతమైన సేవలను ప్రజలకు అందించడం.

లోకాయుక్త పరిధిలోకి వచ్చే అంశాలు: ప్రభుత్వ అధికార దుర్వినియోగం 

 • ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కార్యకలాపాలు
 • బాధితులు ఎవరైనా ఈ వ్యవస్థ దృష్టికి తమ అభియోగాలను తీసుకురావచ్చు.
 • ఆరేళ్లలోపు జరిగిన సంఘటనలకు సంబంధించి మాత్రమే ఫిర్యాదులను స్వీకరిస్తుంది. తనంతట తానుగా చొరవ తీసుకొని విచారణ చేపట్టవచ్చు. గవర్నర్‌ ఆదేశాల మేరకు కూడా విచారణ జరపవచ్చు.
 • ప్రస్తుత మాజీ మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్లు, స్థానిక సంస్థల నిర్వహణాధ్యక్షులు, సంచాలకులు, సహకార సంఘాల అధ్యక్షులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతి, రిజిస్ట్రార్, ప్రభుత్వ ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు.
 • లోకాయుక్త ఆయా ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడు పనిచేసే శాఖాధికారికి తగిన సిఫార్సులు చేస్తుంది. సంబంధిత అధికారి 3 నెలల్లోపు తగిన చర్యలు తీసుకొని, ఆ వివరాలను లోకాయుక్తకు తెలియజేయాలి.
 • అలాకాకుండా సంబంధిత శాఖ నివేదిక అమలుకు విముఖత చూపితే, దానిపై లోకాయుక్త ప్రత్యేక నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. గవర్నర్‌ దాన్ని శాసనసభలో పెడతారు. 
 • లోకాయుక్త శాసనసభకు జవాబుదారీ.
 • దేశంలో కర్ణాటక లోకాయుక్త పనితీరు మెరుగ్గా ఉంది. జస్టిస్‌ ఎస్‌.సంతోష్‌ హెగ్డే అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి సమర్థవంతంగా నివేదికను అందజేశారు. తద్వారా కర్ణాటకలో ప్రజాధనాన్ని కాపాడేందుకు అక్రమ తవ్వకాల నిషేధానికి ఉత్తర్వులు వెలువడ్డాయి.
 • లోకాయుక్త, ఉప లోకాయుక్త ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌.
 • ఒడిశా, పంజాబ్‌లో లోకాయుక్తను లోక్‌పాల్‌గా పిలుస్తారు
 • ఛత్తీస్‌గఢ్‌ లోకాయుక్తను లోక్‌ ఆయోగ్‌గా పేర్కొంటారు.

నియామకం - పదవీకాలం: హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిని లేదా మాజీ న్యాయమూర్తిని లోకాయుక్తగా గవర్నర్‌ నియమిస్తారు. 

 • లోకాయుక్త ఎంపిక కమిటీలోని ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ప్రతిపక్ష నాయకుడు, అడ్వకేట్‌ జనరల్‌ను సంప్రదించిన తర్వాత గవర్నర్‌ లోకాయుక్త నియామకం జరిపి అతనితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
 • ఉప లోకాయుక్తగా జిల్లా న్యాయమూర్తిని గవర్నర్‌ నియమిస్తారు.
 • వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇది పూర్తయిన తర్వాత వీరు తిరిగి ఈ పదవులు పొందడానికి అనర్హులు.
 • లోకాయుక్తకు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
 • లోకాయుక్త సంస్థ పాలనాధిపతి రిజిస్ట్రార్‌. ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హోదాలో విచారణ సంచాలకులు ఉంటారు.
 • ఈయనకు సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.

లోక్‌అదాలత్‌ 

న్యాయస్థానాల్లో కొన్ని కారణాల వల్ల కేసుల పరిష్కారంలో ఎక్కువ జాప్యం చోటుచేసుకుంటుంది.

 • దీనికి తోడు వాది-ప్రతివాదులు కూడా కొన్ని సందర్భాల్లో పరిష్కారాలకు సుముఖంగా ఉండకుండా కాలయాపన చేస్తుంటారు.
 • కేసుల శీఘ్రపరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన లోక్‌అదాలత్‌లకు వీలు కల్పించే లీగల్‌ సర్వీస్‌ ఆర్బిట్రేషన్‌ చట్టాన్ని 2002లో చేశారు. 
 • సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి చట్టపరమైన ప్రతిపత్తిని కల్పిస్తూ లోక్‌అదాలత్‌ అనే పేరుతో ప్రజాన్యాయ సాధనాలు కలిగిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

లోక్‌అదాలత్‌ 6 రకాలు. అవి....

1) నిరంతర లోక్‌అదాలత్‌  2) మొబైల్‌ లోక్‌అదాలత్‌

3) రోజువారీ లోక్‌అదాలత్‌  4) జాతీయస్థాయి లోక్‌అదాలత్‌

5) మెగా లోక్‌అదాలత్‌  6) శాశ్వత లోక్‌అదాలత్‌

 • సాధారణ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తి లోక్‌అదాలత్‌ న్యాయాధిపతిగా కూడా వ్యవహరిస్తుంటారు.
 • శాశ్వత లోక్‌అదాలత్‌ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

లోక్‌పాల్‌

ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి పదవుల్లోని వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారి అధికార దుర్వినియోగంపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ అని పిలుస్తారు.

 • మన దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను వ్యతిరేకించి, విచారించేందుకు లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో నాటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సి.డి.దేశ్‌ముఖ్‌ ప్రతిపాదించారు.
 • అవినీతిపై కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని డా. బాబూ రాజేంద్రప్రసాద్‌ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు సూచించారు.
 • పార్లమెంట్‌ సభ్యుడు ఎల్‌.ఎం.సింఘ్వీ 1963లో లోక్‌పాల్‌ అనే పదానికి రూపకల్పన చేశారు. 1964లో కె. సంతానం కమిటీ లోక్‌పాల్‌ను సిఫార్సు చేసింది.
 • మొరార్జీ దేశాయ్‌ అధ్యక్షతన 1966లో మొదటి పాలనా సంస్కరణల సంఘం లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. 

నిర్మాణం: లోక్‌పాల్‌లో ఒక అధ్యక్షుడు, 8 మంది సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. 

 • వీరిలో సగం మంది న్యాయ పరిజ్ఞానం కలిగినవారు ఉంటారు. మిగిలిన సగం పరిపాలన, అవినీతి నిర్మూలన, పలు రంగాల్లో నిష్ణాతులైనవారు ఉంటారు.
 • ఇందులోని మొత్తం సభ్యుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉంటారు. వీరిలో ఒక మహిళ కూడా తప్పనిసరిగా ఉండాలి.

లోక్‌పాల్‌ బిల్లు - పార్లమెంట్‌: 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వం తొలిసారిగా లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయింది. దీంతో ఈ బిల్లు కూడా రద్దయింది.

 • మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో 2013 డిసెంబరు 16న రాజ్యసభలో, లోక్‌సభలో 2013 డిసెంబరు 18న ఆమోదం పొందింది.
 • నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2014 జనవరి 1న ఆమోదం తెలపడంతో ఈ బిల్లు అమల్లోకి వచ్చింది.

పదవీ కాలం: లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం అయిదు సంవత్సరాలు లేదా వారికి 70 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది.

జీతభత్యాలు: భారత సంఘటిత నిధి నుంచి వీరికి జీతభత్యాలు చెల్లిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమానంగా లోక్‌పాల్‌ ఛైర్మన్‌కు, ఇతర న్యాయమూర్తులకు సమానంగా సభ్యులకు జీతాలు చెల్లిస్తారు.

ఎంపిక: లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల ఎంపిక కమిటీకి ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తారు. 

 • లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.
 • పదవీ విరమణ తర్వాత అయిదేళ్ల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు పోటీ చేయకూడదు.

తొలగింపు: అధికార దుర్వినియోగం, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తే భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరుపుతుంది. నేరం రుజువైనట్లయితే రాష్ట్రపతి వీరిని పదవి నుంచి తొలగిస్తారు.

అధికారాలు - విధులు: ప్రధానమంత్రి సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉంది.

 • జాతీయ భద్రత, ప్రజా భద్రత అంశాలకు సంబంధించి ప్రధాని తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.
 • విధి నిర్వహణ విషయంలో సివిల్‌ న్యాయస్థానాలకు ఉండే అధికారాలన్నీ దీనికి ఉంటాయి.
 • ఫిర్యాదుపై 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి 
 • పది సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే లోక్‌పాల్‌ పరిశీలిస్తుంది.
 • అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిక వ్యవస్థకు సిఫార్సు చేస్తుంది.
 • దురుద్దేశపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వకుండా కొన్ని పరిమితులు విధించింది. అవి.. 

ఎ) ఫిర్యాదు చేసే వ్యక్తి కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

బి) ఫిర్యాదుదారుడి ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించవచ్చు. విచారణలో దోషులుగా తేలితే 2 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని