నిర్మాణ రంగంలో కీలకం... ఆధునిక పరిశ్రమకు వెన్నెముక!

పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే కార్యకలాపాలను సూచిస్తుంది.

Published : 18 Jun 2024 00:10 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ


పరిశ్రమలు

పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే కార్యకలాపాలను సూచిస్తుంది. పూర్తిగా తయారైన వస్తువు దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన ముడిపదార్థం కంటే అధిక విలువను, ప్రయోజనాన్ని పొందుతుంది. పరిశ్రమలు, రకాలు, ఉపయోగాలు, నెలకొల్పిన ప్రాంతాలపై  అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

ఉత్పాదక ప్రక్రియ (Manufacturing)

ఒక ముడిపదార్థం అనేక రూపాల్లోకి మారి అంతిమ వస్తువు లేదా వినియోగ వస్తువుగా మారే ప్రక్రియే ఉత్పాదక ప్రక్రియ.
ముడిపదార్థాలను ద్వితీయ కార్యకలాపాలు లేదా తయారీ ప్రక్రియ ద్వారా అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తారు.
ఉదా: ముడి పత్తిని దారంగా మార్చి, దానికి రంగులద్ది వస్త్రంగా నేయడం.

అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు

వీటిని Sunrise Industries ( అని కూడా పిలుస్తారు. ఏ పరిశ్రమలైతే బాగా అభివృద్ధి చెందుతున్నాయో అవి ఈ వ్యవస్థ కిందికి వస్తాయి.
ఉదా: సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం.

పారిశ్రామిక ప్రాంతాలు

అనేక పరిశ్రమలు ఒకదానికొకటి దగ్గరగా ఉండి పరస్పర ప్రయోజనాలను ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు పారిశ్రామిక ప్రాంతాలు ఆవిర్భవిస్తాయి.

 • ప్రపంచంలో ఈశాన్య అమెరికా, పశ్చిమ అమెరికా, మధ్య యూరప్, తూర్పు యూరప్, తూర్పు ఆసియాలు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్నాయి.
 • ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా సమశీతోష్ణ మండలంలో, ఓడరేవులు, బొగ్గు క్షేత్రాలకు సమీపంలో ఉన్నాయి.

భారత్‌లో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు:

 • గుర్గావ్‌ - దిల్లీ - మీరట్‌ ప్రాంతం.
 • అహ్మదాబాద్‌ - బరోడా ప్రాంతం. 
 • ముంబయి - పుణె క్లస్టర్‌.
 • బెంగళూరు - తమిళనాడు ప్రాంతం.
 • కొల్లాం - తిరువనంతపురం.
 • చోటానాగ్‌పుర్‌
 • హుగ్లీ.

ప్రధాన పరిశ్రమల పంపిణీ

వస్త్ర పరిశ్రమ, ఇనుము - ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమలను ప్రపంచంలో ప్రధాన పరిశ్రమలుగా పేర్కొంటారు.

 • సమాచార సాంకేతికత పరిశ్రమ నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కాగా వస్త్ర పరిశ్రమ, ఇనుము - ఉక్కు పరిశ్రమ దీనికంటే పురాతన పరిశ్రమలు.

ఇనుము - ఉక్కు పరిశ్రమ 

ఇతర పరిశ్రమల్లాగే ఇనుము - ఉక్కు పరిశ్రమ కూడా వివిధ ఉత్పాదకాలను, ఉత్పత్తి ప్రక్రియలను, ఉత్పత్తులను కలిగి  ఉంది. ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాలను ఇది సరఫరా చేస్తుంది.

 • ఈ పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడిపదార్థాలుగా ఇనుము, బొగ్గు, సున్నపురాయి, శ్రమ, మూలధనం, భూమి ఇతర మౌలిక సదుపాయాలు ఉపయోగపడతాయి.
 • ముడి ఇనుమును ఇనుప కొలిమిలో కరిగిస్తారు. ఆ తరువాత శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమల్లో ముడిపదార్థంగా ఉపయోగిస్తారు. 

ఉక్కు(Steel) ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు. ఉక్కు కఠినమైనదే కానీ దాన్ని సులభంగా కావాల్సిన ఆకృతిలో తయారు చేయవచ్చు, కత్తిరించవచ్చు, వైర్‌గా మార్చవచ్చు. భారీ భవన నిర్మాణాల్లో దీన్ని ఉపయోగిస్తారు.

 • అల్యూమినియం, నికెల్, రాగి లాంటి ఇతర లోహాలను కొంతమొత్తంలో జోడించి ఉక్కుకు చెందిన ప్రత్యేక మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. ఈ లోహాలు ఉక్కుకు గట్టిదనం, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యాన్ని అందిస్తాయి.

ఉపయోగాలు: మనం ఉపయోగించే వస్తువులన్నీ దాదాపు ఇనుము లేదా ఉక్కు లేదా ఈ లోహాలతో తయారైన సాధనాలు, యంత్రాలతో రూపొందుతాయి. పడవలు, రైళ్లు, ట్రక్కులు లాంటివన్నీ ఎక్కువగా ఉక్కుతోనే తయారు చేస్తారు. చమురు బావులు ఉక్కు యంత్రాలతో తవ్వుతారు. ఉక్కు పైపుల ద్వారా చమురును రవాణా చేస్తారు.

పరిశ్రమల వర్గీకరణ

ముడిపదార్థాలు, పరిమాణం, వాటి యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలను వర్గీకరిస్తారు.

ముడిపదార్థాల ఆధారంగా

ఉపయోగించే ముడిపదార్థాలను బట్టి పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 

వ్యవసాయాధారిత పరిశ్రమలు: మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడిపదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమ. ఆహారోత్పత్తులు, కూరగాయలు, వంట నూనెలు, వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ల పరిశ్రమలను వీటికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ఖనిజాధార పరిశ్రమలు: ఖనిజ ధాతువులను ముడిపదార్థాలుగా ఉపయోగించే ప్రాథమిక పరిశ్రమలు. ఈ పరిశ్రమ ఉత్పత్తులను ఇతర పరిశ్రమలు ముడిపదార్థాలుగా ఉపయోగిస్తాయి.
అటవీ ఆధారిత పరిశ్రమలు: అటవీ ఉత్పత్తులను ముడిసరుకుగా ఉపయోగించే పరిశ్రమలను అటవీ ఆధారిత పరిశ్రమలు అంటారు.
ఉదా: కాగితపు పరిశ్రమ, ఔషధ రసాయనాల పరిశ్రమ, గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమ.

సముద్ర ఆధారిత పరిశ్రమలు: మహాసముద్రాలు, సముద్రాల నుంచి లభించే ఉత్పత్తులను ముడిపదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు.
ఉదా: సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు, చేప నూనె తయారీ పరిశ్రమ మొదలైనవి.

పరిమాణం ఆధారంగా

పరిశ్రమ పరిమాణం పెట్టుబడి మూలధనాన్ని, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణాన్ని సూచిస్తుంది. పరిమాణం ఆధారంగా పరిశ్రమలను చిన్నతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలుగా విభజిస్తారు.

చిన్నతరహా పరిశ్రమలు: ఈ పరిశ్రమల్లో ఉత్పత్తులను చేతివృత్తుల వారు స్వయంగా తయారు చేస్తారు. 

 • ఇందులో తక్కువ మూలధనం, సాంకేతికతను ఉపయోగిస్తారు.

ఉదా: బుట్టలు అల్లడం, కుండలు చేయడం, హస్తకళలు, పట్టువస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ.

భారీ పరిశ్రమలు: ఇందులో ఎక్కువ మూలధనం, ఎక్కువ సాంకేతికతను ఉపయోగిస్తారు.

ఉదా: ఆటో మొబైల్స్, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు.

యాజమాన్యం ఆధారంగా

ప్రైవేట్‌ రంగ పరిశ్రమలు(Private Sector Industries): ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఉన్న యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమలు.

ప్రభుత్వ రంగ పరిశ్రమలు(Public Sector Industries): ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమలు

ఉదా: హిందుస్తాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా

ఉమ్మడి రంగ పరిశ్రమలు (Joint Sector Industries): ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమలను ఉమ్మడి రంగ పరిశ్రమలు అంటారు. 

సహకార రంగ పరిశ్రమలు(Co-operative Sector Industries): ముడిసరుకు ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు, కార్మికులు లేదా ఇరువురి యాజమాన్యం ఆధ్వర్యంలోని పరిశ్రమలను సహకార రంగ పరిశ్రమలు అంటారు. 

ఉదా: ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌(AMUL),సుధా డైరీ.

పారిశ్రామిక వ్యవస్థ (Industrial System) 

పారిశ్రామిక వ్యవస్థలో ముడిపదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు లాంటివి ఉంటాయి.

 • ప్రాథమికంగా వస్తువుల ఉత్పత్తి లేదా తయారీలో ఉపయోగించే పదార్థాలే ముడిపదార్థాలు. ఇది ఒక ప్రాథమిక పదార్థం.

ఉదా: పత్తి, సహజ వాయువు, ఉక్కు, చమురు, కలప

 • ఉత్పాదకతలో ముడిపదార్థాలు, కార్మికులు, భూమి వెల, రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయి.
 • ముడిపదార్థాలను ఉత్పత్తులుగా మార్చే విస్తృత కార్యకలాపాలు ఉత్పాదకత అనే ప్రక్రియలో జరుగుతాయి.
 • ఈ ఉత్పాదకత ప్రక్రియలో అంతిమంగా తయారైన తుది ఉత్పత్తి నుంచి ఆదాయం లభిస్తుంది.
 • పత్తి నుంచి గింజలు వేరు చేయడం, వడకడం, నేయడం, రంగు వేయటం, అద్దకం తదితరాలు ఉత్పాదకత ప్రక్రియలో భాగాలు.
 • ఉత్పత్తి అనేది అంతిమ వస్తువును తెలియజేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు