వనరులను అందిస్తూ.. విలయాలను అడ్డుకుంటూ!

జీవావరణ వ్యవస్థలో, ప్రకృతి సమతౌల్యతలో కీలకమైన, అత్యంత విలువైన సహజ వనరులు అడవులు. అవి పలు రకాల పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తాయి. వన్యప్రాణులు, క్రూరమృగాలకు ఆవాసాలుగా ఉపయోగపడతాయి.

Published : 21 Jun 2024 00:59 IST

ఇండియన్‌ జాగ్రఫీ

జీవావరణ వ్యవస్థలో, ప్రకృతి సమతౌల్యతలో కీలకమైన, అత్యంత విలువైన సహజ వనరులు అడవులు. అవి పలు రకాల పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తాయి. వన్యప్రాణులు, క్రూరమృగాలకు ఆవాసాలుగా ఉపయోగపడతాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించి, వరదలను, సునామీల లాంటి విలయాలను నివారించే సహజ రక్షణలుగా వీటికి అధిక ప్రాధాన్యం ఉంది. గృహోపయోగ పరికరాలను అందించడంతోపాటు పారిశ్రామిక అవసరాలు తీరుస్తున్న ఈ అడవుల రకాలు, వాటికి ప్రాతిపదికలు, ప్రత్యేకతలు, విస్తీర్ణం వివరాలు, దేశంలో విస్తరణ తీరుతెన్నులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అడవుల విస్తీర్ణం వృద్ధి చేసేందుకు  ప్రభుత్వాలు చేసిన చట్టాలు, పరిరక్షణ, పరిజ్ఞానం పెంచేందుకు ఏర్పాటైన సంస్థల గురించి తెలుసుకోవాలి.


అడవులు

దైనా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని వృక్షాలు, గడ్డిభూములు, పొదచెట్లు, తుప్పలను కలిపి సహజ ఉద్భిజ సంపద అంటారు. అదే విధంగా ఒక ప్రాంతంలో సహజంగా పెరిగే వృక్షాలు దట్టంగా, అధిక మొత్తంలో ఉంటే దాన్ని అడవి అంటారు. అడవులు సహజ వనరులు. ఇవి మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో వాటంతట అవే పుట్టి పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అడవులు 31% విస్తరించి ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాలు, ఖండాల్లో ఒకే విధంగా లేవు. ఈ వ్యత్యాసానికి కారణం అక్కడి శీతోష్ణస్థితి, నేలలు, నేలవాలు, వర్షపాతం, మానవుల, జంతువుల చర్యలు.

భారతదేశంలోని సహజ వృక్ష సంపద ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలకు చెందింది. పాశ్చాత్య  దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడ కలప వినియోగం తక్కువ. భారతదేశంలో అడవుల ద్వారా సుమారు పది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అడవుల నుంచి కలపతో పాటు అగ్గిపెట్టెలు, కాగితం, పెన్సిల్, రెసిన్, జిగురు, ఔషధాలు, తేనె, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. చాలాకాలంగా వ్యవసాయం, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం అడవులను నరికేస్తున్నారు.   ఫలితంగా మృత్తికా క్రమక్షయంతో పాటు వాతావరణ మార్పులు లాంటి అనర్థాలు జరుగుతున్నాయి.

దేశంలో బ్రిటిష్‌ హయాం (1894)లో మొదటి అటవీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1927లో మొదటి అటవీ చట్టం చేశారు. స్వాతంత్య్రానంతరం 1950లో అడవులు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వన మహోత్సవం పేరుతో ఏటా జులైలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారు. 1952లో భారత ప్రభుత్వం మొదటి అటవీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం 33.3% ఉండాలని ఈ విధానం నిర్ణయించింది. తిరిగి 1988లో రెండో అటవీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశ భూభాగంలో అడవుల విస్తీర్ణం పెంచడంతో పాటు, సామాజిక అడవులు పెంచడంపై దృష్టి సారించింది.

స్వాతంత్య్రానంతరం దేశంలో మొదటి అటవీ చట్టాన్ని 1980లో భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను 1981లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, శీతోష్ణస్థితుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలోని అటవీ విస్తీర్ణాన్ని ఈ సంస్థ లెక్కిస్తుంది. 1987 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి నివేదిక విడుదల చేస్తుంది. వర్షపాతం, ఉష్ణోగ్రత, నేలల స్వభావం, ఆ ప్రదేశం ఎత్తు ఆధారంగా అడవులను పలు రకాలుగా  వర్గీకరించారు. వర్షపాతం ఆధారంగా దేశంలో అడవులను విభజించారు.

సతతహరిత అరణ్యాలు: వీటిని ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అరణ్యాలు అంటారు. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో (200 సెంటీమీటర్లు, అంతకంటే ఎక్కువ) ఉంటాయి. దేశ పశ్చిమ తీరంలో, అస్సాంలో, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల సంవత్సరం పొడవునా చెట్లు పొడవైన ఆకులతో ఉంటాయి. ఇక్కడి కలప గట్టిగా ఉంటుంది. ఈ అడవుల్లో కలప వెదురు, కేన్, పామ్స్, తుమ్మ, మహగనీ, ఎబోని, రోజ్‌వుడ్‌ మొదలైనవి లభిస్తాయి. దేశ అడవుల్లో సతతహరిత అరణ్యాలు 21% ఉన్నాయి.

ఆకురాల్చు అడవులు: వీటినే ఉష్ణమండల ఆకురాల్చు అడవులు అంటారు. ప్రధానంగా దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్నాయి. నైరుతి రుతుపవన వర్షాల తర్వాత ఎక్కువ కాలం అనార్ధ్ర పరిస్థితుల వల్ల చెట్లు ఆకులు రాల్చుతాయి. ఈ రకమైన అడవులు దేశంలో సుమారు 60% ఉన్నాయి. వార్షిక వర్షపాతం 70 నుంచి 200 సెం.మీ. ఉన్న ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. వర్షపాతం 100-200 సెం.మీ. ఉన్న కొండలు, పీఠభూమి ప్రాంతాల్లో ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు ఉంటాయి. ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్, చోటా నాగ్‌పుర్, శివాలిక్‌ పర్వత సానువులు, సహ్యాద్రి పర్వత వాలులో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో సాల్, టేకు, మంచిగంధం, షీసమ్, వెదురు, ఖైర్, రెడ్‌వుడ్‌ మొదలైన వృక్షాలు పెరుగుతాయి. వర్షపాతం 70 - 100 సెం.మీ. ఉన్న ప్రాంతాల్లో అనార్ధ్ర శుష్క ఆకురాల్చు అడవులు ఉంటాయి. ఇవి ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువ. టేకు, సాల్, వెదురు, గంధం, ఖైర్‌ చెట్లు పెరుగుతాయి.

వర్షాభావ ప్రాంత అరణ్యాలు/చిట్టడవులు: ఇవి తక్కువ వర్షపాతం (50-75 సెం.మీ.) ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటిని ఉష్ణమండల ముళ్లజాతి అడవులు అంటారు. ఎక్కువగా రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ భాగంలో, గుజరాత్, పశ్చిమ కనుమల వర్షచ్ఛాయా ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కువగా పొదలు, బాబుల్, జంద్, షీసమ్, టమారిక్స్, ఈత, తాటి, రేగు, బ్రహ్మజెముడు, తుమ్మ, వేప, ఉసిరి లాంటి వృక్షాలు కనిపిస్తాయి. ఈ రకమైన అరణ్యాలు దేశంలో సుమారు 3% ఉన్నాయి.

క్షార జలారణ్యాలు/మడ అడవులు: వీటినే మాంగ్రూవ్, డెల్టా అరణ్యాలు, పోటు-పాటు అడవులు అంటారు. ఎక్కువగా సముద్ర తీరాల్లో గంగానది డెల్టా ప్రాంతంలో ఉంటాయి. వీటిలో సుంద్రీ చెట్టు ప్రధానమైంది. అందువల్ల ఇక్కడ సుందరవనాలు (పశ్చిమ బెంగాల్‌లో గంగానది ముఖద్వారం వద్ద) కనిపిస్తాయి. ఇక్కడ పెరిగే ఇతర వృక్షాలు రైజోఫోరా, అవిసెన్నియా, ఎర్రమడా, నైపా. మడ అడవులు సునామీల నుంచి కొంతవరకు సహజ రక్షక కవచాలుగా పనిచేస్తాయి. దేశంలో వీటి విస్తీర్ణం సుమారు 0.7%.

పర్వతప్రాంత/ హిమాలయ అడవులు: దేశంలో ఈ  రకమైన అడవులు 9% ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో కశ్మీర్‌ నుంచి అస్సాం వరకు వ్యాపించి ఉన్నాయి. హిమాలయాల్లో ఎత్తు ఆధారంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం మారుతూ ఉంటాయి. అందుకే వీటిని ఎత్తు ప్రకారం వివిధ పేర్లతో పిలుస్తారు. 1000 మీటర్ల ఎత్తువరకు ఉన్న అరణ్యాలను ఉష్ణమండల ఆకురాల్చు అడవులు, 1000-1800 మీటర్ల ఎత్తులో ఉన్నవాటిని ఉష్ణమండల సతత హరిత అరణ్యాలని, 1800-3300 మీటర్ల ఎత్తులో ఉన్న వాటిని శృంగాకార అరణ్యాలని, 3300 మీటర్ల కంటే ఎత్తులో ఉన్న వృక్షాలను అల్ఫైన్‌ అరణ్యాలని అంటారు. పశ్చిమ కనుమల్లో 1800- 3000 మీటర్ల ఎత్తున్న అరణ్యాలను ‘షోలాస్‌’ అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని