సృజనాత్మకతను పెంపొందించే విస్తృత రచన!

ఏదైనా విషయాన్ని లేదా అంశాన్ని వివరంగా, విస్తరించి రాస్తే అదే వ్యాసం. తెలుగు సాహిత్యంలో వ్యాసానికి ప్రముఖ స్థానం ఉంది. రచయిత జ్ఞానానికి, సృజనకు, ఆలోచనా శక్తికి వ్యాసరచన అద్దం పడుతుంది.

Published : 24 Jun 2024 00:57 IST

టీఆర్‌టీ - 2024
తెలుగు మెథడాలజీ

ఏదైనా విషయాన్ని లేదా అంశాన్ని వివరంగా, విస్తరించి రాస్తే అదే వ్యాసం. తెలుగు సాహిత్యంలో వ్యాసానికి ప్రముఖ స్థానం ఉంది. రచయిత జ్ఞానానికి, సృజనకు, ఆలోచనా శక్తికి వ్యాసరచన అద్దం పడుతుంది. రచనా పాటవం, భాషా జ్ఞానాన్ని పెంపొందించే ఈ సాహితీ    ప్రక్రియను ప్రాథమిక, ఉన్నతస్థాయి  విద్యార్థులకు తప్పకుండా అలవాటు చేయాలి. అందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై కాబోయే ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. వ్యాసం లక్షణాలు, ఉపయోగాలు, ఉద్దేశాలతోపాటు తెలుగు సాహిత్యంలో వ్యాసానికి ఉన్న చరిత్ర, పరిచయం చేసిన రచయితలు, వారి కృషి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

వ్యాస బోధన

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో వెలసిన ప్రక్రియ ‘వ్యాసం’. ఏదైనా ఒక అంశం గురించి విరివిగా రాయడమే వ్యాసమని శబ్దరత్నాకరం నిర్వచించింది. ఆంధ్ర వాచస్పత్యం ప్రకారం వ్యాసం అంటే చారిత్రకాంశం. ప్రాచీన సాహిత్యంలో తొలి వ్యాసం ్బమాన్‌టైన్శ్‌ ఫ్రెంచ్‌ భాషలో వెలువడింది. ప్రపంచ సాహిత్యంలో రెండోదిగా భావించే ‘మై సెల్ఫ్‌’ అనే వ్యాసాన్ని బేకన్‌ రచించారు. బేకన్‌ వ్యాసాలను కిళాంబి రామానుజాచార్యులు తెలుగులోకి అనువదించారు. తెలుగులో వ్యాస ప్రక్రియకు మార్గదర్శకుడు సామినేని ముద్దు నరసింహనాయుడు. వ్యాసాన్ని పరవస్తు వెంకట రంగాచార్యులు సంగ్రహాలుగా పిలవగా, కందుకూరి వీరేశలింగం ‘ఉపన్యాసాలు’ అన్నారు. గురజాడ అప్పారావు 1910లో వ్యాసచంద్రిక రాశారు. ఇందులో వ్యాసం అనే పదం ఉపయోగించారు.  ‘‘కవికి గీటురాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం’’ అని ఆచార్య రామచంద్ర శుక్లా పేర్కొన్నారు.

వ్యాసం లక్షణాలు

 • అతిదీర్ఘంగా ఉండకూడదు.
 • స్వల్పకాలంలో చదివేలా ఉండాలి.
 • రచనను అర్థవంతమైన పేరాలుగా విభజించాలి.
 • మొదటి పేరా అంశాన్ని పరిచయం చేసేదిగా, చివరి పేరా ముగింపుగా ఉండాలి.
 • కఠిన సమాస పదాలు, వర్ణనలు ఉండకూడదు.
 • రచయిత తన సైద్ధాంతిక బలాలను పాఠకులపై ప్రయోగించకూడదు.
 • రచయిత ఆత్మీయతను ఇముడ్చుకున్నదై ఉండాలి.

వ్యాసరచన ఉద్దేశాలు

 • సృజనాత్మక శక్తిని పెంపొందించడం.
 • విషయజ్ఞానాన్ని పెంపొందించడం.
 • రచనను పరిచ్ఛేదాలుగా విభజించడం.
 • విమర్శనాత్మక ధోరణిలో రాయడం.
 • భావానుక్రమపద్ధతి పాటించగలగడం.
 • సొంత శైలిలో స్వతంత్రంగా రాయడం, నేర్పించడం.

వ్యాసబోధన పద్ధతులు

అనుకరణ పద్ధతి

ఉపాధ్యాయుడు మొదట వ్యాసంపై కొన్ని వాక్యాలు  విద్యార్థులతో రాయించి దాన్ని పోలిన మరో అంశంపై మొదటిదాన్ని అనుసరిస్తూ రాయమని ప్రోత్సహించడం. ప్రప్రథమంగా విద్యార్థుల్లో రచనా పాటవాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతి వాడొచ్చు. ఈ అనుకరణం ద్వారానే భాషను నేర్చుకుంటారు.

ఉదా:

 • ఆవు అంశంపై మొదట పది వాక్యాలు రాయించి, దాన్ని అనుకరిస్తూ ‘గేదె’ అనే అంశంపై వ్యాసం రాయమని కోరవచ్చు.
 • అనుకరిస్తూ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయా వాక్యాల్లో చిన్న మార్పులు చేసి రాయమని విద్యార్థులను కోరాలి. ఈ పద్ధతి ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులకు అనుకూలం.

అభివర్ణన పద్ధతి

ఏదైనా ఒక చిత్రాన్ని లేదా దృశ్యాన్ని విద్యార్థులకు చూపించి దాని గురించి రాయమని కోరడం అభివర్ణన పద్ధతి. విద్యార్థులకు తెలిసిన, వారికి అర్థమయ్యే అంశాలపై చిత్రాలు ప్రదర్శించి, అందులో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించి క్రమబద్ధంగా రాయించడానికి ఈ పద్ధతి చక్కగా ఉపకరిస్తుంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రామాల్లోని పంట పొలాలు, మేఘావృతమైన ఆకాశం, మేత మేస్తున్న పశువులు, ఆకాశంలో విహరిస్తున్న పక్షులు మొదలైన అంశాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించి వాటిని ఊహిస్తూ రాయమని కోరాలి. పట్ణణ ప్రాంత విద్యార్థులకు రోడ్డుపై మోటార్లు, కార్లు, సైకిళ్లు వెళ్తున్న దృశ్యాలు, గాలిపటాలు ఎగురవేస్తున్న బాలలు, పార్కుల్లో ఆటలాడుకుంటున్న బాలబాలికలు లాంటి అంశాల చిత్రాలను చూపిస్తూ, వాటికి విద్యార్థుల ఊహాశక్తి జోడిస్తూ క్రమబద్ధంగా రాయమని కోరాలి.

చర్చా పద్ధతి

వ్యాస రచనాంశాన్ని మొదట ప్రస్తావించి, విద్యార్థులతో ఆ విషయంపై ప్రశ్నోత్తరాల రూపంలో కూలంకషంగా   చర్చించాలి. అందులోని ప్రధానాంశాలను నల్లబల్లపై ముఖ్యమైన పదాల రూపంలో రాసి, ఆ పదాల ఆధారంగా వ్యాసం రాయాలని విద్యార్థులను కోరాలి. ఈ పద్ధతి ఉన్నత తరగతులకు ఉపకరిస్తుంది.

ప్రయత్న పద్ధతి

విద్యార్థులతో వారికి అభిరుచి ఉన్న అంశాన్ని ఎంపిక  చేసుకోమని చెప్పి, అలాంటి అంశంపై వ్యాసాన్ని రాయమని కోరాలి. వ్యాసాన్ని రాస్తున్నప్పుడు ఏవైనా సూచనలు ఇస్తూ వ్యాసాన్ని పూర్తిగా రాయించాలి. ఉన్నత తరగతి విద్యార్థులకు ఈ పద్ధతి ఉపయోగకరం.

ప్రకల్పనా పద్ధతి

పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన ప్రకల్పన ఆధారంగా విషయాన్ని వర్గీకరించి, వివరించి క్రమబద్ధంగా రాయమని కోరడం. ఇది ఉన్నత దశ విద్యార్థులకు ఉపకరిస్తుంది.

ప్రశంసా పద్ధతి

ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్య విషయ రచయిత, కవి, పాఠ్యాంశంలోని పాత్రలను దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రశంసిస్తూ వ్యాసం రాయమని విద్యార్థులను కోరడం ఈ పద్ధతికి చెందిన విధం. ఇది కూడా ఉన్నత స్థాయి   విద్యార్థులతో రాయించడానికి ఉపయోగించే పద్ధతి.

ఆలోచనాత్మక పద్ధతి

విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయిస్తూ రాయడం. ఏదైనా అంశాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించి రాయగలగడం ఈ పద్ధతి ప్రత్యేకత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని