జన చైతన్యానికి సాహిత్యమే సాధనం!

సమాజంలో అన్యాయాలను ప్రశ్నించి, నిర్బంధాలను ఎదిరించి, ప్రపంచ పరిణామాలను ప్రజలకు తెలియజేసి చైతన్యపరిచిన గొప్ప కవులు, రచయితలు ఎందరో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు.

Published : 24 Jun 2024 01:07 IST

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర

సమాజంలో అన్యాయాలను ప్రశ్నించి, నిర్బంధాలను ఎదిరించి, ప్రపంచ పరిణామాలను ప్రజలకు తెలియజేసి చైతన్యపరిచిన గొప్ప కవులు, రచయితలు ఎందరో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. జాతీయోద్యమ కాలంలో స్వాతంత్య్రమే లక్ష్యంగా సాహిత్యాన్ని అనేకమంది మహామహులు సాధనంగా చేసుకున్నారు. వందేమాతరం, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా పోరాటాల కాలాల్లో  గేయాలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, కథానికలతో జనంలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. సామాజిక దురాచారాలు, వ్యసనాలు, పీడిత విధానాలపై గళమెత్తారు. బ్రిటిష్‌ పాలకులను బెంబేలెత్తించి జైళ్లకు వెళ్లారు. ఆంధ్ర ప్రజల్లో పోరాట పటిమను, త్యాగభావాన్ని పెంపొందించిన నాటి కవిత్వం, కవులు, రచయితలు, వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు, సంఘటనల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాడు ప్రసిద్ధి చెందిన నినాదాలు, గేయాలు, రచనలను ఉద్యమాల వారీగా గుర్తుంచుకోవాలి.

జాతీయవాద కవిత్వం

బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు రూపంలో భారత స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైంది. చివరకు 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దాదాపు 200 ఏళ్లు భారతదేశం వలస పాలనలో ఉంది. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది వీరులు త్యాగాలు చేశారు. ఎన్నో ప్రజాఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జాతీయ ఉద్యమంలో కవిత్వం, గేయాలు, పద్యాలు, పాటలు, బుర్రకథలు,  నవలలు, ఖండ కావ్యాల రూపంలో అపురూప సాహిత్యం వెల్లివిరిసింది. 1905 బెంగాల్‌ విభజన సమయంలో దేశభక్తి కవిత్వం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.

బంకించంద్ర ఛటర్జీ: ఈయన రచనలు ఆనందమఠ్, రాజసింహ, రజని, ఇందిర, దుర్గేశ నందిని. వీటిలోని ‘రాజసింహ’, ‘రజని’, ‘ఇందిర’ రచనలను వేంకట  పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువదించారు.‘ఆనంద్‌ మఠ్‌’ నవలను ఛటర్జీ సన్యాసుల ఉద్యమ నేపథ్యంలో రాశారు. ఈ ఉద్యమం బెంగాల్‌లో 30 ఏళ్లు జరిగింది. ఆ నవలలోనే ‘వందేమాతరం’ గీతం ఉంది. ఈ రచన దేశభక్తిని ప్రబోధిస్తుంది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు.

అరబింద్‌ ఘోష్‌: న్యూ ల్యాంప్స్‌ ఫర్‌ ఓల్డ్, భవానీ మందిర్, సావిత్రి, ద డివైన్‌ లైఫ్‌ మొదలైనవి ఈయన రచనలు. 1893లో లండన్‌ నుంచి భారత దేశానికి వచ్చారు. అతివాదులతో కలిసి జాతీయ ఉద్యమం నడిపారు. జాతీయ విద్యను డిమాండ్‌ చేస్తూ.. ‘‘జాతీయ విద్య ప్రధాన ఉద్దేశం ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపడం.’’ అని పేర్కొన్నారు.

వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జాతీయవాద సాహిత్యం: ఈ ఉద్యమ కాలంలో బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో పర్యటించి తన ప్రసంగాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఆయన ప్రసంగాలను చిలకమర్తి   లక్ష్మీనరసింహారావు తెలుగులోకి అనువదించారు.కేతా శ్రీరామమూర్తి వందేమాతర గీతం పాడి జనాన్ని ఉత్సాహపరిచారు. ‘భరత పుత్రుడా మేలుకొనుము’ అనే గేయాన్ని 1909, అక్టోబరులో ‘భారత పత్రిక’ ప్రచురించింది. గురజాడ అప్పారావు రాసిన ‘ముత్యాల సరాలు’ అనే సంపుటిలోని ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా’ గేయం ప్రాచుర్యం పొందింది.

ఎర్రమిల్ల జగన్నాథ శాస్త్రి: స్వస్థలం మండపేట. ఈయన సంస్థ ఆది సమాజం. ప్రతి శుక్రవారం రహస్య సమావేశాలు ఏర్పాటు చేసేవారు. శాస్త్రి ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి ‘వందేమాతరం’, ‘అమృత బజార్‌’  పత్రికలు వచ్చేవి. వందేమాతర ఉద్యమ కాలంలో కృష్ణా పత్రిక (మచిలీపట్నం), భరతమాత (విశాఖపట్నం); ఆంధ్రవాణి, జ్యోతి, కళింగ (గంజాం); శ్రీసాధన, పినాకిని (అనంతపురం); భవాని, సింహపురి, స్వతంత్ర (నెల్లూరు) తదితర   పత్రికలు వచ్చేవి. వందేమాతరం నాటకాన్ని వేటూరి వాసుదేవ శాస్త్రి ప్రదర్శించారు.

సహాయ నిరాకరణ ఉద్యమ కాలం: ఈ ఉద్యమ కాలంలో 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అచ్యుత రామశాస్త్రి ‘‘మహాత్మా గాంధీకి స్వాగతం’’ అనే కావ్యం రాశారు. ఇదే సమయంలో ఖద్దరు ప్రచారం కోసం దువ్వూరి రామిరెడ్డి రాసిన గేయం ‘‘పొద్దు పొడుపు చుక్క పొడిచింది గూళ్లలో పక్షులు కూసెను రాట్నమా రాట్నమా’’.

శాసనోల్లంఘన ఉద్యమ కాలం: ఈ ఉద్యమ కాలంలో రాసిన గేయాలు ‘‘వీరగంధం తెచ్చినారము వీరులెవరో తెలుపుడి’’- త్రిపురనేని రామస్వామి. ‘కల్లు మానండోయ్‌’ - గొల్లపూడి సీతారామశాస్త్రి చౌదరి. ఈ ఉద్యమ కాలంలో వెలువడిన రచనలు- భారత స్వరాజ్య యుద్ధం  (జగన్నాథ శాస్త్రి), నవయుగ గాంధీ (దామరాజు పుండరీకాక్షుడు), పూర్వ స్వాతంత్ర (కె. వెంకట రామశర్మ), సత్యాగ్రహ సమరం (జి.వీరసుబ్రహ్మణ్యం). అల్లూరి సీతారామరాజు, భగత్‌ సింగ్‌ లాంటి వీరుల ఆదర్శాలు పాటించాలని క్రొవ్విడి లింగరాజు వ్యాసాల్లో ఉద్బోధించారు. కవిత్వం తర్వాత నవలలు అధిక ఆదరణ పొందాయి. ఈ నవలా ప్రక్రియ సమకాలీన సమాజ అంశాలను, ఆకాంక్షలను ప్రతిబింబించింది. ఈ నవలా సాహిత్యం రాసిన ప్రతిభావంతులైన కవులు వలస పాలన కాలంలో కారాగార శిక్ష అనుభవించారు.   అస్పృశ్యత, సంఘ సంస్కరణలు అనేవి ఆనాటి సామాజిక సమస్యలు.

వేంకట పార్వతీశ్వర కవులు: వీరు బంకించంద్ర ఛటర్జీ రాసిన అనేక నవలలను తెలుగులోకి అనువదించారు. వీరి ప్రముఖ రచన మాతృ మందిరం. ఈ నవలలో వితంతు పునర్వివాహం, మద్యపానం, గోసంరక్షణ,  అస్పృశ్యత నివారణ మొదలైన అంశాలున్నాయి.

ఉన్నవ లక్ష్మీనారాయణ:  ఈయన రాజకీయ సాంఘిక నవల ‘మాలపల్లి’. ఈ నవల గాంధీజీ అహింసా  సిద్ధాంతాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, కుల   వ్యవస్థను ప్రచారం చేసింది. ఇందులో సంగదాసు అనే పాత్ర ‘జై తిలక్‌ మహారాజ్, జై మహాత్మా’ అనే నినాదం చేస్తుంది. ఈయన దేవదాసీ వ్యవస్థను ఖండించారు.

జమీందారీ వ్యతిరేక ఉద్యమ కాలం: జమీందార్ల అరాచకాలకు వ్యతిరేకంగా నెల్లూరులో వెంకట రామానాయుడు ‘జమీన్‌ రైతు’ పత్రిక నడిపారు. ఈయన గేయం ‘జస్టిస్‌ పార్టీని చంపాలిరా బాబు, జమీందార్ల పొందు తొలగాలిరా బాబు.’’

క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో సాహిత్యం:  1942లో క్రిప్స్‌ రాయబారం విఫలమైన తర్వాత గాంధీజీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.    ‘‘సాధించు లేదా మరణించు’’ నినాదం ఇచ్చారు. ‘‘పరదేశీయులు తొలగండి. ఈ భారతదేశం మాదేశం’’ (వరదాచార్యులు), ‘‘లేచిపోయిన పోలీసు టోపీలు వందలు వేలు’’(కరుణశ్రీ), ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ (రాయప్రోలు సుబ్బారావు), ‘జెండా ఒక్కటే మూడు వన్నెలది’ (దాశరథి కృష్ణమాచార్యులు), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి సుందరాచారి), జయజయప్రియ భారత జనని (దేవులపల్లి కృష్ణశాస్త్రి) లాంటి ఎన్నో గేయాలు, పాటలతో కవులు, రచయితలు ఉద్యమానికి ఊపిరి పోశారు. 

విశ్వనాథ సత్యనారాయణ: ఈయన ‘వేయి పడగలు’ నవల రచించారు. ఇందులో స్వాతంత్య్రోద్యమ సంఘటనల ప్రస్తావనలు ఉంటాయి. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

అడవి బాపిరాజు: ఈయన రాసిన ప్రముఖ నవల - ‘నారాయణ రావు’. ఇందులో కథానాయకుడు ఎనిమిదేళ్ల వయసులో నుదుటిపై వందేమాతరం అని రాసుకుంటాడు.

తుమ్మల సీతారామ శాస్త్రి: ఈయన వినోబా భావే స్ఫూర్తితో సర్వోదయ గానం చేశారు. బాపూజీ ఆత్మకథను తెలుగులోకి అనువదించారు.

జాతీయోద్యమ కాలంలో కథానికలు:

కుటీర లక్ష్మి కథ: కనుపర్తి వరలక్ష్మమ్మ స్వాతంత్య్రోద్యమం గురించి ప్రస్తావించిన తొలి కథానిక ఇది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి పరిస్థితులను వివరించారు. ఈ కథానిక ఆంధ్రపత్రిక ఉగాది   సంచికలో ప్రచురితమైంది. ‘నీలవేణి’ అనే కథానికను రాయసం వేంకట శివుడు రాశారు. ఈ కథలో స్వాతంత్య్ర సమరయోధుల పట్ల కొందరు బ్రిటిష్‌ ప్రభుత్వ ఉద్యోగులు సానుభూతితో ఉన్నారని వివరించారు.

నాటకాలు:

జపానీయం: దీన్ని వీరబ్రహ్మం రాశారు. ఈ నాటకంలో జపాన్‌ గొప్పతనాన్ని తెలియజేశారు. 1905లో చిన్న దేశమైన జపాన్‌ పెద్ద దేశమైన రష్యాను ఓడించిన విధానాన్ని వివరించారు. ఈ రచన తీవ్ర ప్రభావం చూపింది. మునగాల రాజు తన ఇద్దరు కుమారులకు జపాన్‌ సైన్యాధిపతి ‘టోగో’, నావికాదళపతి ‘నోగి’ పేర్లు పెట్టారు.

పాంచాల పరాభవం: ఈ నాటకాన్ని దామరాజు పుండరీకాక్షుడు రచించారు. దీన్ని జలియన్‌ వాలాభాగ్‌ దురంతానికి కారకుడైన జనరల్‌ డయ్యర్‌పై రాశారు. ఇందులో పంజాబీలను ద్రౌపదిగా, డయ్యర్‌ను   దుర్యోధనుడిగా; షౌకత్‌ అలీ, లాలాలజపతి రాయ్, చిత్తరంజన్‌దాస్, మహ్మద్‌ అలీ, తదితరులను   పాండవులుగా చిత్రీకరించారు. ఎన్‌జి.రంగా ఈ   నాటకాన్ని కొందరితో కలిసి లండన్‌లో ప్రదర్శించారు. దానిపై నిషేధం విధించినప్పటికీ ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించారు.

తిరుగుబాటు: ఈ నాటక రచయిత మునిమాణిక్యం నరసింహారావు. ఇందులో ప్రజలను రెచ్చగొట్టే లక్షణం ఉందంటూ బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.

చిచ్చర పిడుగు: రామచంద్రుని వెంకటప్పయ్య  రచించిన ఈ నాటకంలో మంగళ్‌ పాండే స్వాతంత్య్ర కాంక్షను చిత్రించారు. దీన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.

స్వతంత్ర సమరం: అప్పరాజు రంగారావు రచించిన ఈ నాటకంలో స్వాతంత్య్రం కోసం మార్గాలు, లక్ష్యాలపై చర్చ ఉంటుంది. 

ఈ విధంగా నాటి స్వాతంత్య్ర సమర కాలంలో అనేక భావకవిత్వాలు నాటకాలు, కథానికలు ప్రజలను చైతన్య పరిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని