ఆయుధ సమీకరణ లక్ష్యం.. రక్షణ రంగ బలోపేతం

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధవాతావరణం, పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.

Published : 25 Jun 2024 01:07 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధవాతావరణం, పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ఆ దిశగా కొనసాగేందుకు పలు విధానాలనుఅవలంబిస్తున్నాయి. దేశ, విదేశీ ప్రాంతాలు తమతమ ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ విషయాలన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన ఏర్పర్చుకోవాలి.

రక్షణ రంగం

ప్రపంచ దేశాలు వివిధ రకాల అణ్వాయుధాలను తయారు చేసుకున్నాయి. ప్రమాదకరమైన మిసైల్స్‌ను తమ ప్రత్యర్థి దేశాలపైకి ప్రయోగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న మిసైల్స్, బాంబ్‌లు...

థర్మోబరిక్‌ బాంబ్‌ (Thermobaric bomb)

 • మయన్మార్‌ మిలటరీ ఇటీవల ఈ రకమైన బాంబులను వినియోగించి, వార్తల్లో నిలిచింది.
 • ఈ తరహా బాంబులనే వ్యాక్యూమ్‌ బాంబ్‌ లేదా ఏరోసాల్‌ బాంబ్‌ లేదా ఫ్యూయల్‌ ఎయిర్‌ ఎక్స్‌ప్లోజివ్‌గా పిలుస్తారు.
 • ఈ బాంబులను ఎయిర్‌క్రాఫ్ట్‌ లేదా సముద్ర ఆధారిత ట్యాంకుల నుంచి ప్రయోగిస్తారు.
 • ఇది రెండు దశలను కలిగి ఉంటుంది. మొదటి దశలో బాంబు పరిధిలోని వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌ను అధిక మొత్తంలో శోషించుకుంటుంది. రెండో దశలో అప్పటివరకు బాంబులో నిల్వచేసిన ఇంధనాన్ని మేఘం రూపంలో వదిలి దాన్ని పెద్ద ఫైర్‌ బాల్‌ లేదా పేలుతున్న మేఘాల రూపంలో విడుదల చేయడం.
 • ఇవి మానవాళికి అత్యంత హానికరమైనవి. వీటికి అంతర్జాతీయ సమాజంలో అనుమతి లేదు.

కింజాల్స్‌ లేదా డాగర్లు

రష్యా ఉక్రెయిన్‌పై వినియోగించిన హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ను కింజాల్స్‌ లేదా డాగర్స్‌ అని పిలుస్తారు.

 • ఇవి ధ్వని వేగం కంటే అయిదు రెట్లు ఎక్కువ వేగాన్ని కలిగి ఉండే మ్యాక్‌ 5 శ్రేణికి చెందినవి.
 • ఈ హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ అత్యంత యుక్తి కలిగినవిగా ఉండి తీవ్ర ప్రమాదాలను సృష్టిస్తాయి.

3డీ- ప్రింటెడ్‌ బాంబులు

రష్యాపై ప్రతిదాడిలో భాగంగా ఆయుధ కొరతలను నివారించే వ్యూహంతో ఉక్రెయిన్‌ త్రీడీ ప్రింటెడ్‌ బాంబులను వినియోగించింది.

 • వీటినే క్యాండీ బాంబులు అని కూడా పిలుస్తారు.
 • ‘-4 ఎక్స్‌క్లూజివ్, ప్రయోగించిన బాంబు అవశేషాలను వినియోగించి అత్యంత తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేస్తారు.

మిస్సైల్‌ PATRIOT

PATRIOT - Phased array Tracking Radar for Intercept On Target

ఇవి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన మిస్సైల్స్‌.

 • ఇది అత్యధిక విస్తృతి కలిగి భూఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ.
 • ఈ వ్యవస్థ అత్యధిక శక్తి కలిగిన రాడార్లను, కంట్రోల్‌ వ్యవస్థను, పవర్‌ జనరేటర్, లాంచ్‌ స్టేషన్‌ను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక మిస్సైల్‌ వ్యవస్థగా దీన్ని చెప్పవచ్చు.

స్పై బెలూన్స్‌

అమెరికా సంయుక్త రాష్ట్రాల గగనతలంలో చైనాకి చెందిన స్పై బెలూన్లను కూల్చివేయడంతో వీటి గురించి చర్చ మొదలైంది.

 • స్పై బెలూన్లను అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయోగిస్తారు. వీటిలో నిఘా పరికరాలుగా ఇమేజింగ్‌ డివైజెస్‌ను వినియోగించి వాటి ద్వారా లక్ష్యాలను హై రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలుగా సేకరిస్తారు.
 • ఈ చిత్రాలతో శత్రుదేశాలపై దాడి సులభతరం అవుతుంది.

INDUS X

INDUS X - ఇండియా - యునైటెడ్‌ స్టేట్స్‌ డిఫెన్స్‌ ఎక్సెలరేషన్‌ ఎకో సిస్టం.

 • ఈ వ్యవస్థను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వాషింగ్టన్‌ డీసీ ప్రాంతంలో భారత్, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.
 • దీని ద్వారా ఇరుదేశాలు రక్షణ రంగంలో కావాల్సిన సాంకేతిక సహకారాలను వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్లనున్నాయి. 
 • నూతన తరం సాంకేతికతలను ఇరు దేశ భద్రతల కోసం వినియోగించుకోనున్నాయి.

వైట్‌ ఫాస్ఫరస్‌ బాంబ్‌

ఇజ్రాయెల్‌ హమాస్‌ ఉగ్రవాదులపై చేసిన దాడిలో భాగంగా వీటిని వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 • తెల్ల భాస్వరం పైరోఫోరిక్‌ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే గాలి తగలగానే మండే గుణం దీనికి ఉంటుంది.
 • ఈ రకమైన బాంబులు పొగను సృష్టించి, తద్వారా సైనిక కదలికలను కనిపించకుండా చేస్తాయి. ఇది శత్రుదేశాల వెపన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ను నిర్వీర్యం చేస్తుంది.
 • తెల్ల భాస్వరాన్ని పీల్చినా, మింగినా, శరీరాన్ని తాకినా అత్యంత ప్రమాదకరమైన గాయాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించవచ్చు.
 • కన్వెన్షన్‌ ఆన్‌ కెమికల్‌ వెపన్స్‌ ప్రోటోకాల్‌ 3 ప్రకారం, తెల్ల భాస్వరాన్ని దాహక ఆయుధంగా (incedinary weapon)గా మాత్రమే వినియోగించాలి. రసాయనిక ఆయుధంగా వినియోగించకూడదు.

సముద్రయాన భద్రత

భారత్, ఇజ్రాయెల్‌ దేశాలు సముద్రయాన భద్రత, రవాణాకు సంబంధించిన చర్చలు జరిపాయి.

ఇందులో భాగంగా ఎర్ర సముద్రం, బాబెల్‌ మాండెబ్‌ ప్రాంతంలో భద్రత, పర్యావరణ పరిరక్షణ, నదులు, పోర్టులు అంతర్జాతీయ సముద్ర పరిధి మొదలైన అంశాలపై చర్చలు జరిపాయి.

భారతదేశంలో ముఖ్యమైనవి..

సాగర్‌ సంపర్క్‌:

భారతదేశంలోని పోర్టు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ ఇటీవల రూపొందించిన డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థను (DGNSS) సాగర్‌ సంపర్క్‌గా పిలుస్తారు. 

 • పూర్వం ఉన్న నావిగేషన్‌ వ్యవస్థలో ఉన్న చిన్నచిన్న లోపాలను సవరిస్తూ దీన్ని రూపొందించారు. 
 • ఈ నావిగేషన్‌ వ్యవస్థ మరింత కచ్చితత్వంతో సముద్ర మార్గాలను నిర్దేశిస్తుంది.

AFSPA:

AFSPA- ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌

భారత హోం మంత్రిత్వ శాఖ నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఈ యాక్ట్‌ను మరో ఆరునెలలపాటు పొడిగించింది.

యాంటీ సబ్‌ మెరైన్‌ వార్ఫేర్‌:

కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శత్రుదేశాల సబ్‌ మెరైన్లను గుర్తించి, వాటి దాడిని తప్పించుకునే వ్యూహంలో భాగంగా మూడు నూతన యాంటీ సబ్‌ మెరైన్‌ వెసెల్స్‌ను రూపొందించారు.

PALM 400:

PALM-  ప్రెసిషన్‌ ఎటాక్‌ లాయిటరింగ్‌ సిస్టం

 • ఇది భారత్, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా రూపొందించిన మిలటరీ గ్రేడ్‌ ఆర్మ్‌డ్‌ రిమోట్లీ పైలెటెడ్‌ వెహికల్‌. 
 • ఈ వ్యవస్థ ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను కలిగి ఉండి, నావిగేషన్‌ వ్యవస్థల సహాయంతో 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా ఛేదించగలదు.

మత్స్య - 6000/ డీప్‌ ఓషన్‌ మిషన్‌:

ఈ మిషన్‌లో భాగంగా హిందూ మహాసముద్రంలో 6000 మీటర్ల లోతు వరకు పరిశోధనలు చేయనున్నారు.

 • సముద్ర అంతర్భాగంలో ఉన్న పాలీ మెటాలిక్‌ నాడ్యూల్స్‌ అధ్యయనం కోసం దీన్ని రూపొందించారు. 
 • సముద్రయాన్‌ అనేది సముద్ర గర్భంలో 6000 మీటర్ల పరిశోధన లక్ష్యంగా భారత్‌ చేపట్టే మానవ సహిత సముద్ర అంతర్భాగ అన్వేషణ.

మాయ: పెరుగుతున్న సైబర్‌ క్రైమ్‌ల నివారణలో భాగంగా రక్షణ రంగ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన నూతన ఆపరేటింగ్‌ సిస్టం.

ప్రళయ్‌ క్షిపణి వ్యవస్థ:

భారత రక్షణ రంగ వ్యూహంలో భాగంగా దేశ ఉత్తర సరిహద్దులను బలోపేతం చేయడానికి మరో 250 ప్రళయ్‌ క్షిపణి సేవలను వినియోగించుకోనున్నారు.

 • ప్రళయ్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే రకం క్షిపణులు. ఇవి తక్కువ దూరంలోని లక్ష్యాలను అత్యంత చాకచక్యంగా ఛేదించగలవు. 
 • ఈ క్షిపణులను మొబైల్‌ లాంచర్లతో ప్రయోగించవచ్చు. వీటిని క్వాసీ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌గా పిలుస్తారు. 
 • ఇవి బాలిస్టిక్, క్రూయిజ్‌ మిస్సైల్స్‌ రెండు లక్షణాలను కలిగి ఉంటాయి. 
 • ఇవి సంప్రదాయక మిస్సైల్స్‌ కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తూ శత్రుదుర్భేద్యంగా ఉంటాయి.

డిజిటల్‌ అరెస్టు:

సైబర్‌ క్రెమ్‌లో భాగంగా నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకుంటారు. పోలీసులు, సీబీఐ, నార్కోటిక్స్‌ డిపార్ట్‌మెంట్, ఆర్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లలో పనిచేసే ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారి ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయించాలని ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు ఈ అధికారుల నుంచే పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్‌ చేస్తుంటారు.

ఈ నేరాల నియంత్రణలో భాగంగా హోం మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఉద్యోగులను డిజిటల్‌ అరెస్టు స్కాములపై అప్రమత్తం చేసింది. భారతదేశంలో ఈ స్కాముల నియంత్రణను ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్, మైక్రోసాఫ్ట్‌ సంయుక్తంగా చేపడుతున్నాయి.

D4 వ్యవస్థ:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యాంటీ డ్రోన్‌ వ్యవస్థను దీ4 వ్యవస్థగా రూపొందించింది. 

 • ఈ వ్యవస్థ ద్వారా శత్రు దేశాల డ్రోన్లను గుర్తించటం, వాటి మార్గాలను ఆటంకపరచటం, అవి దేశ రహస్యాలను చేరవేయకుండా నియంత్రించటం, ఆ డ్రోన్లను నాశనం చేయడం లాంటి కార్యక్రమాలను చేపడతారు. 
 • గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టంను వినియోగించుకోకుండా సిగ్నల్స్‌ను నిరోధిస్తారు. లేజర్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా డ్రోన్లు లక్ష్యాలను చేరకుండా నియంత్రిస్తారు. మైక్రో డ్రోన్లనూ గుర్తించి లక్ష్యాలను చేరకుండా అవరోధాలను సృష్టిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా అత్యంత సమర్థవంత గూడఛర్య కార్యకలాపాలను నియంత్రిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని