డబ్ల్యూహెచ్‌ఓ నియంత్రించిన ఒకే ఒక్క మానవ సాంక్రమిక వ్యాధి?

ఆరోగ్య రంగ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికత పాత్ర కీలకం. మానవులు, జంతువులకు సంక్రమించే వ్యాధుల అధ్యయనం, వాటి నివారణకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ/ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పరీక్షార్థికి అవగాహన ఉండాలి.

Published : 04 Jul 2024 01:24 IST

టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీపరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
ఆరోగ్య రంగం

ఆరోగ్య రంగ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికత పాత్ర కీలకం. మానవులు, జంతువులకు సంక్రమించే వ్యాధుల అధ్యయనం, వాటి నివారణకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ/ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పరీక్షార్థికి అవగాహన ఉండాలి.

భారతదేశంలో డయాబెటిస్‌

ప్రస్తుతం భారతదేశంలో అనేకమంది ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఎక్కువగా వినియోగిస్తున్న అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలు; చక్కెర స్థాయి అధికంగా ఉన్న పానీయాలు తాగడం; ఎక్కువ నూనె, ఉప్పు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మొదలైన కారణాల వల్ల దేశంలో రోజురోజుకు డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది.

ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ రూపొందించిన డయాబెటిస్‌ అట్లాస్‌ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 1/6వ వంతు డయాబెటిస్‌ రోగులు భారతదేశంలో ఉన్నారు. వీరిలో 45-64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారే అధికం.

డయాబెటిస్‌ మిల్లిటస్‌: 

డయాబెటిస్‌ మిల్లిటస్‌ను తీవ్రమైన మెటబాలిక్‌ వ్యాధిగా పరిగణిస్తారు. ఇది సోకిన వారిలో క్లోమ గ్రంథిలో స్రవించాల్సిన ఎండోక్రైన్‌ గ్రంథుల పనితీరు మందగిస్తుంది. 

అంటే అత్యంత తక్కువ మోతాదులో లేదా పూర్తిగా ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోవడం. 

డయాబెటిస్‌ రకాలు: ఇన్సులిన్‌ స్థాయులను బట్టి డయాబెటిస్‌ను కింది విధంగా పిలుస్తారు.

హైపర్‌ గ్లైసిమియా: ఈ వ్యాధి ఉన్న వారిలో బ్లడ్‌ షుగర్‌ అధికంగా ఉత్పత్తి అవుతుంది. 

గ్లైకోసూరియా: ఎక్కువ మొత్తంలో శరీరంలోని గ్లూకోజ్‌ యూరిన్‌ ద్వారా బయటకు వెళ్తుంది. 

పాలీ యూరియా: ఇది సంక్రమించిన రోగులు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు. 

పాలీ డిప్సియా: అత్యధికంగా దాహం వేస్తుంది. 

పాలీ ఫేజియా: ఆకలి ఎక్కువగా ఉంటుంది. 

టైప్‌-1 డయాబెటిస్‌: దీన్ని ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌గా పిలుస్తారు. ఈ తరహా వ్యాధి 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిలో కనిపిస్తుంది. 

బీటా సెల్స్‌ వినాశనం వల్ల ఇన్సులిన్‌ లోపం ఏర్పడుతుంది. దీంతో మానవ శరీరంలో ఇన్సులిన్‌ తయారీ ఆగిపోతుంది. ఈ తరహా డయాబెటిస్‌ను ఆటో ఇమ్యూన్‌ రియాక్షన్‌ అని కూడా అంటారు. ఈ రోగులు తప్పనిసరిగా ఇన్సులిన్‌ను తీసుకోవాలి.

టైప్‌-2 డయాబెటిస్‌: సాధారణంగా 30 ఏళ్లకంటే ఎక్కువ వయసున్నవారు; అధిక బరువున్న వారిలో టైప్‌-2 డయాబెటిస్‌ కనిపిస్తుంది. 

ఈ వ్యాధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐలెట్స్‌ ఆఫ్‌ లాంగర్‌హాన్స్‌ (Islets of langerhans) లోని బీటా సెల్స్‌ పనితీరు మందగిస్తుంది. ఈ తరహా డయాబెటిస్‌ను జీవనశైలి, ఆహారం, మందులతో తగ్గించవచ్చు. 

గెస్టేషనల్‌ డయాబెటిస్‌: గర్భంతో ఉన్న మహిళల్లో ఇన్సులిన్‌ బ్లాకింగ్‌ హార్మోన్లు (నియంత్రించే హార్మోన్లు) అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఈ తరహా డయాబెటిస్‌ కలుగుతుంది. 

వరల్డ్‌ డయాబెటిస్‌ డే 

వరల్డ్‌ డయాబెటిస్‌ డే ఏటా నవంబరు 14న నిర్వహిస్తారు. 2023 సంవత్సరం థీమ్‌ ‘యాక్సిస్‌ టు డయాబెటిస్‌ కేర్‌’. ఈ థీమ్‌ ఉద్దేశం డయాబెటిస్‌ గురించి ప్రజల్లో అవగాహనతో పాటు చైతన్యాన్ని కలిగించడం. దీని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు చెప్పడం.

సికిల్‌సెల్‌ ఎనీమియా

రక్తంలోని హిమోగ్లోబిన్‌ గొలుసుల్లో ఏర్పడే ఉత్పరివర్తనాల వల్ల అర్ధ చంద్రాకారపు ఎర్ర రక్త కణాలు ఏర్పడి సికిల్‌సెల్‌ ఎనీమియాను కలిగిస్తాయి.  

నేషనల్‌ సికిల్‌సెల్‌ ఎనీమియా ఎలిమినేషన్‌ మిషన్‌: దీని ద్వారా భారతదేశంలో 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియాను పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

 • ఈ కార్యక్రమానికి కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ట్రైబల్‌ ఎఫైర్స్‌ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్‌ ఏజెన్సీలుగా పని చేస్తాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 17 రాష్ట్రాలను అధిక ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 
 • ఈ ప్రోగ్రాంను రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ సంయుక్తంగా చేపడుతున్నాయి. 
 • ఈ కార్యక్రమ ప్రథమ లబ్ధిదారులుగా 0 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాతి దశల్లో  40 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులను కూడా ఇందులో లబ్ధిదారులుగా చేరుస్తారు. 
 • ఈ కార్యక్రమ లబ్ధిదారులకు సికిల్‌సెల్‌ జెనెటిక్‌ స్టేటస్‌ కార్డులను అందిస్తారు.

థలసేమియా

రక్తంలో ఉండే వర్ణ ద్రవ్యమైన హిమోగ్లోబిన్‌లోని ప్రోటీన్‌ లోపించటం వల్ల సంభవిస్తుంది. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే రుగ్మత. ఈ రోగుల రక్తంలో అతి తక్కువ ఆక్సిజన్‌ కణాలు ఉంటాయి. దీంతో శరీరంలో వివిధ అవయవాలకు కావాల్సిన ఆక్సిజన్‌ లోపించి; ఆ వ్యక్తులకు అలసట, నీరసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి కలుగుతాయి. ఈ రోగులు అత్యంత తక్కువ నుంచి అతి తీవ్రమైన ఎనీమియా లక్షణాలను కలిగి ఉంటారు. భారతదేశంలో రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌ యాక్ట్‌ 2016 ప్రకారం దీన్ని బెంచ్‌ మార్క్‌ డిజేబిలిటీగా గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా థలసేమియా డేను మే 8న నిర్వహిస్తారు.

హైపర్‌ టెన్షన్‌

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ప్రజలకు సంక్రమిస్తున్న వ్యాధుల్లో హైపర్‌ టెన్షన్‌ ఒకటి. ఇది ఎలాంటి లక్షణాలను బహిర్గతం చేయదు. అందుకే దీన్ని సైలెంట్‌ కిల్లర్‌గా పేర్కొంటారు. 

 • రక్తనాళాల్లో పీడనం 140/90 mm Hg లేదా అంతకంటే ఎక్కువ ఉండటాన్ని హైపర్‌ టెన్షన్‌గా గుర్తిస్తారు. 
 • హృదయం సంకోచించినప్పుడు రక్తనాళాల్లో ఏర్పడిన పీడనాన్ని సిస్టోలిక్‌ ప్రెషర్‌గా, హృదయ స్పందనల మధ్యలో హృదయం విశ్రమ (విరామ) స్థితిలో ఉన్నప్పుడు హృదయ పీడనాన్ని డయాస్టోలిక్‌ ప్రెషర్‌గా పిలుస్తారు. 
 • ప్రపంచవ్యాప్తంగా ఉండే హైపర్‌ టెన్షన్‌ బాధితుల్లో కేవలం 50 శాతం జనాభాలో మాత్రమే వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. ఈ విధంగా నిర్ధారణ జరిగినవారిలో 50 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు.
 • భారతదేశంలో హైపర్‌ టెన్షన్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం 2017లో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ‘ఇండియా హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనీషియేటివ్‌ ప్రోగ్రాం’ను ప్రారంభించింది.
 • భారతదేశంలో హైపర్‌ టెన్షన్‌ నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలను ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహణలో ఉన్న సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‘25by25’ లక్ష్యం ద్వారా నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధుల (non-communicable diseases) వల్ల సంభవించే అకాల మరణాలను 2025 నాటికి 25% తగ్గించాలని నిర్దేశించింది. 
 • ప్రపంచ సగటు జనాభాలో ఉప్పు తీసుకునే పరిమాణాన్ని 30 శాతానికి తగ్గించాలని డబ్ల్యూహెచ్‌ఓ మరొక లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం భారతదేశంలో రోజువారీ సరాసరి ఉప్పు వినియోగం 11 గ్రాములుగా ఉంది. 
 • భారత ప్రభుత్వం 75/25 కార్యక్రమం ద్వారా 2025 నాటికి ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్ల ద్వారా 75 మిలియన్ల డయాబెటిస్, హైపర్‌ టెన్షన్‌ బాధితులకు చికిత్స అందించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా Food Safety and Standards Authority of India (FSSAI) సోషల్‌ మీడియా వేదికగా ‘ఆజ్‌ సే తోడా కమ్‌’ అనే క్యాంపెయిన్‌ని ప్రారంభించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)

1948, ఏప్రిల్‌ 7న ఏర్పడింది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తూ అంతర్జాతీయ సమాజానికి కావాల్సిన ఆరోగ్య సేవలను అందిస్తోంది. దీని లక్ష్యం ‘ప్రపంచ జనాభా అందరికీ ఆరోగ్యం’. దీని ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ప్రస్తుతం ఇందులో 194 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ - టెడ్రోస్‌ అధనామ్‌ గాబ్రెయేసస్‌ (Tedros Adhanom Ghebreyesus).ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా నియంత్రించిన ఒకే ఒక్క మానవ సాంక్రమిక వ్యాధి స్మాల్‌పాక్స్‌ లేదా మశూచి. 

వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌

1924, జనవరి 25న ఏర్పాటు చేశారు. ప్రపంచంలో పశువుల ఆరోగ్యం, జూనోటిక్‌ వ్యాధుల గురించి పరిశోధనలు చేస్తుంది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ప్రస్తుతం ఇందులో 183 సభ్యదేశాలు ఉన్నాయి.

ఎనీమియా 

రక్తంలో ఆక్సిజన్‌ వాహకాలుగా పనిచేసే హిమోగ్లోబిన్‌ వర్ణ ద్రవ్యంలో ఆక్సిజన్‌ లోపించటం వల్ల ఎనీమియా సంభవిస్తుంది. భారతదేశంలో ఈ వ్యాధి ముఖ్యంగా ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12, విటమిన్‌ ఎ లోపం వల్ల కలుగుతుంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం డెసీ లీటర్‌ రక్తానికి పురుషుల్లో 14 గ్రాములు, స్త్రీలలో 12 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండాలి. బాల, బాలికల్లో ఇది 11 నుంచి 12 గ్రాములు ఉండాలి.

భారతదేశంలో ఎనీమియా నివారణకు ప్రభుత్వం ఎనీమియా ముక్త్‌ భారత్, ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్, నేషనల్‌ న్యూట్రిషనల్‌ ఎనీమియా ప్రొఫైలాక్సిస్‌ ప్రోగ్రాం, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ లాంటి కార్యక్రమాలు చేపట్టింది.

మిరాకిల్‌ డ్రగ్స్‌/ మ్యాజిక్‌ డ్రగ్స్‌ 

కొన్ని ప్రత్యేక వ్యాధులను అత్యంత సమర్థవంతంగా నయం చేసే ఫార్మాస్యూటికల్‌ పదార్థాలను మిరాకిల్‌ డ్రగ్స్‌గా పేర్కొంటారు. అత్యంత మెరుగైన, దీర్ఘకాల వ్యాధులను నయం చేసే సామర్థ్యం కలిగిన మందులన్నీ దీని కిందకు వస్తాయి.

బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను అత్యంత సమర్థవంతంగా నయం చేసే పెన్సిలిన్‌; డయాబెటిస్‌ చికిత్సలో చక్కెర స్థాయులను తగ్గించేందుకు వాడే ఇన్సులిన్‌; హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ చికిత్సలో ఉపయోగించే యాంటీ రిట్రో వైరల్‌ డ్రగ్స్‌; హెపటైటిస్‌ - C ట్రీట్‌మెంట్లో వినియోగించే సోవాల్డీ లేదా సోఫోస్బువిర్‌; సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ను తగ్గించే ట్రైకాఫ్తా; బ్లడ్‌ క్యాన్సర్‌ చికిత్సలో వాడే Adcetris మొదలైనవన్నీ మ్యాజిక్‌ డ్రగ్స్‌ కోవలోకి వస్తాయి.

సెమాగ్లుటైడ్‌ (Semaglutide):

సెమాగ్లుటైడ్‌ అనే డ్రగ్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. దీన్ని స్వతంత్రంగా లేదా Fenn-phen అనే డ్రగ్‌తో కలిసి తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చని పరిశోధనల్లో తేలింది.

మొదట టైప్‌-2 డయాబెటిస్‌ నివారణ కోసం సెమాగ్లుటైడ్‌పై పరిశోధనలు నిర్వహించారు. అయితే దీని వినియోగంతో అధిక బరువును నియంత్రించొచ్చని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ డ్రగ్‌ ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉంది. దీంతో భారతదేశంలో సెమాగ్లుటైడ్‌ వినియోగానికి Drugs Controller General of India (DCGI) అనుమతి లభించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని