ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు దర్పణం జాతీయదాయ అంచనాలు

జాతీయాదాయంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వాటా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి పోకడలకు అద్దం లాంటిది జాతీయాదాయ అంచనా.స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ వారు దీనికోసం సరైన విధానాలను అవలంబించలేదు.

Published : 05 Jul 2024 00:35 IST

టీజీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

జాతీయాదాయంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వాటా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి పోకడలకు అద్దం లాంటిది జాతీయాదాయ అంచనా.స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ వారు దీనికోసం సరైన విధానాలను అవలంబించలేదు. జాతీయాదాయాన్ని లెక్కించే పలు రంగాల ధోరణులు, వాటికి ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, నిర్మాణాత్మక మార్పులు తదితరాలపై పోటీపరీక్షార్థులు  అవగాహన కలిగి ఉండాలి.

జాతీయాదాయం
జాతీయాదాయంలో వివిధ రంగాల ధోరణులు

ప్రాథమిక రంగం వాటా 

వ్యవసాయం, పశుసంపద, అడవులు, చేపల ఉత్పత్తి, గనుల తవ్వకాలు ప్రాథమిక రంగానికి చెందినవి. స్వాతంత్య్రానంతర కాలంలో జాతీయాదాయంలో ప్రాథమిక రంగం వాటా గరిష్ఠంగా 1950-51లో 53.1 శాతం ఉంటే 2018-19 నాటికి 17.1 శాతానికి తగ్గింది. ఇది 2019-20 నాటికి 17.8 శాతం ఉండగా, 2024 నాటికి 18 శాతంగా ఉంటుందని అంచనా. (భారత ఆర్థిక సమీక్ష - 2024 ఆధారంగా)

 • అంటే జాతీయాదాయంలో ప్రాథమిక రంగం వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నిర్మితపరమైన మార్పులే వ్యవసాయ రంగ వాటాలో త్వరితగతిన సంభవించే తగ్గుదలకు కారణంగా పేర్కొంటారు. ఇటీవలి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 
 • రవాణా, వర్తకం, బ్యాంకింగ్, బీమా, ఇతర సేవారంగాలు వ్యవసాయ రంగం కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఇది నికర దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాల అంచనాలను ప్రభావితం చేసింది. 
 • వ్యవసాయ రంగం సత్వరాభివృద్ధి చెందితేనే దేశ జాతీయాదాయంలో అధికంగా పెరుగుదల నమోదవుతుంది. 
 • ఆర్‌బీఐ వార్షిక నివేదిక, 2022-23 ప్రకారం జీవీఏలో వ్యవసాయ రంగం వాటా 15.1 శాతం. 
 • ప్రణాళికల కాలంలో వ్యవసాయ రంగం వృద్ధిరేటు సగటున 2.7 శాతం మాత్రమే. కాబట్టి దీన్ని ఇతర వ్యవసాయిక దేశాల వృద్ధి రేటుతో పోల్చేందుకు ఆస్కారం లేదు.

ద్వితీయ రంగం వాటా 

యారీ రంగం (రిజిస్టర్‌ చేసిన పరిశ్రమలు, రిజిస్టర్‌ కాని పరిశ్రమలు), విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం మొదలైనవి ద్వితీయ రంగం కిందికి వస్తాయి. జాతీయాదాయ వృద్ధి క్రమంలో మొదట పెరిగేది ఈ రంగం వాటానే. 

 • 1950-51లో ఈ రంగం వాటా 16.6 శాతం ఉంటే, 1980-81 నాటికి 25.9 శాతానికి చేరింది. 2018లో 29.2 శాతం, 2019లో 28.9 శాతంగా ఉంది. 2023 జీవీఏలో ఈ రంగం వాటా 30 శాతం.
 • వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికీకరణ దిశగా పయనించేందుకు కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థ సత్వరాభివృద్ధికి పరిశ్రమలు వ్యవసాయానికి ఉత్పాదితాలను సరఫరా చేయాలి. 
 • ఆర్‌బీఐ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం 2022-23లో జీవీఏలో పారిశ్రామిక రంగాల వాటా 22.2 శాతంగా ఉంది.

వివిధ వర్గాల మధ్య ఆదాయ పంపిణీ

ప్రజలందరి ఆదాయాల మొత్తమే జాతీయాదాయం. అంటే ప్రజలు ఉత్పతి కారకాలుగా ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని భాటకం, వేతనాలు, వడ్డీ, లాభాల రూపంలో పొందిన ఆదాయాల మొత్తం. వీటి అంచనాల వల్ల సమాజంలోని వివిధ వర్గాలకు ఏయే నిష్పత్తిలో ఆదాయం పంపిణీ అయ్యిందో తెలుసుకోవచ్చు. ఆర్థిక అసమానతలను గుర్తించవచ్చు.

ఆర్థిక వ్యవస్థ స్థాయిని పోల్చడం: ఒక దేశ జాతీయాదాయ స్థాయిని, ఆర్థిక వృద్ధి రేటును ప్రపంచంలోని ఇతర దేశాలతో సరిపోల్చడం ద్వారా ఆ దేశ స్థాయిని అంచనా వేయవచ్చు. దీన్ని బట్టి దేశాభివృద్ధికి అవసరమైన ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుని, ప్రపంచ స్థాయి వృద్ధిరేటును సాధించడానికి ప్రయత్నించవచ్చు.


జాతీయాదాయ లేదా స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల వాటా

 • స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగ కార్యకలాపాలు త్వరితగతిన విస్తరించాయి. 
 • మన దేశంలో 1948లో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం, 1956లో రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రభుత్వ పరిధిని విస్తృతం చేస్తూ, ప్రైవేట్‌ రంగ కార్యకలాపాలను అతిగా నియంత్రించకుండా ఉండేలా రూపొందించారు.
 • ఇవి భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ప్రాధాన్యం ఇచ్చాయి. (1948 తొలి పారిశ్రామిక విధాన తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది)
 • ఈ రెండు పారిశ్రామిక విధాన తీర్మానాలు పరిశ్రమల విభజనను సూచించాయి.
 • కొన్నింటిని పూర్తిగా ప్రభుత్వ రంగానికి, మరికొన్నింటిని ఉమ్మడి రంగానికి అంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు, మిగిలిన అన్నింటిని కేవలం ప్రైవేట్‌ రంగానికి మాత్రమే అప్పగించాయి.
 • ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెండూ కలిసి జాతీయాదాయాన్ని ఉత్పత్తి చేస్తాయి.
 • భారతదేశంలో 1951కి పూర్వం జాతీయాదాయంలో ప్రభుత్వరంగ వాటా చాలా తక్కువగా ఉండేది.
 • పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరగడంతో జాతీయాదాయంలో ప్రభుత్వ రంగ వాటా నిలకడగా పెరిగింది.
 • జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం అయిదింట ఒక వంతు వాటా కలిగి ఉంది.
 • వాస్తవానికి గడిచిన 5 దశాబ్దాల కాలంలో భారతదేశ జాతీయాదాయంలో ప్రైవేట్‌ రంగ వాటా అధికంగా ఉంది.
 • 1991 నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత జాతీయాదాయంలో ప్రైవేట్‌ రంగం వాటా పెరిగింది.

తృతీయ రంగం వాటా 

 • వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్స్, స్టోరేజీ (నిల్వ), బ్యాంకింగ్, బీమా, రియల్‌ ఎస్టేట్, సాంఘిక సేవలు (విద్య, వైద్యం) మొదలైనవి తృతీయ రంగంలో భాగంగా ఉంటాయి. 
 • 1950-51 జాతీయాదాయంలో సేవారంగం వాటా 30.3 శాతం ఉండగా, 2018-19 నాటికి 54.3 శాతానికి పెరిగింది. ఇది 2019-20లో 55.3 శాతం, 2020-21లో 54.3 శాతం, 2021-22లో 53 శాతంగా నమోదైంది.
 • ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక, సాంఘిక సేవలైన విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం త్వరితగతిన విస్తరించాలి. 2022-23 ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2022-23లో జీవీఏలో సేవారంగం వాటా 62.7 శాతంగా ఉంది.

జాతీయాదాయం అంచనా, ఇతర ప్రయోజనాలు

ద్రవ్యోల్బణం, ప్రతిద్రవ్యోల్బణ ఒత్తిడులను తెలుసుకొని సరైన విధానాన్ని రూపొందించడానికి, ప్రభుత్వ పన్నుల అంతిమ భారాన్ని, వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్‌ గ్రామీణ-పట్టణ, సంఘటిత, అసంఘటిత రంగాల పాత్రను తెలుసుకునేందుకు జాతీయాదాయ అంచనాలు అవసరం.

 • అంతేకాకుండా భవిష్యత్తు మూలధన కల్పన ఆవశ్యకతను గుర్తించడానికి, వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
 • జాతీయాదాయం ఆర్థిక వ్యవస్థలోని అన్ని కార్యకలాపాలకు, మార్పులకు, పోకడలకు అద్దం లాంటిది. కాబట్టి జాతీయాదాయ అంచనాలు లేకుండా భవిష్యత్తులోకి ప్రయాణం అసాధ్యం.

స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో జాతీయాదాయ అంచనాలు

క ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, వృద్ధి పోకడలకు దర్పణం లాంటివే జాతీయాదాయ అంచనాలు.

 • స్వాతంత్య్రానికి ముందు జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి ఏ ప్రభుత్వ సంస్థ ప్రయత్నించలేదు. అందుబాటులో ఉన్న అన్ని జాతీయాదాయ అంచనాలు ప్రైవేటు వ్యక్తులు తయారు చేసినవే.
 • ఆ కాలంలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి, తద్వారా భారత ప్రజల జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. వాటిలో ప్రముఖమైంది దాదాభాయ్‌ నౌరోజీ చేసిన ప్రయత్నం.
 • భారత్‌లో జాతీయాదాయాన్ని 1868లో మొట్టమొదటి సారిగా దాదాభాయ్‌ నౌరోజీ అంచనా వేశారు. ఇది వ్యక్తిగతమైంది కానీ కొన్ని పరిమితులకు లోబడి ఉంది.
 • 186768లో దాదాభాయ్‌ నౌరోజీ అంచనా ప్రకారం, భారత జాతీయాదాయం రూ.340 కోట్లు, తలసరి ఆదాయం రూ.20.
 • నౌరోజీ రాసిన (Poverty and Un-British rule in India) అనే పుస్తకంలో బ్రిటిష్‌ పరిపాలనలో భారతదేశ సంపద, మూలధనం ఏ విధంగా తరలిపోయింది, దాని కారణంగా దేశంలో ఆర్థికాభివృద్ధి ఏ విధంగా నిలిచిపోయిందనే అంశాలను వివరించారు.
 • దాదాభాయ్‌ నౌరోజీ సంపద దోపిడీ/ఆర్థిక దోపిడీ లేదా తరలింపు  (Drain Theory/Economic Drain)  అనే సిద్ధాంతాన్ని రూపొందించారు.
 • భారత్‌లో మొట్టమొదట పేదరికాన్ని అంచనా వేసింది - దాదాభాయ్‌ నౌరోజీ.
 • ఈయనకు Grand Old Man of India  అనే బిరుదు ఉంది.
 • స్వాతంత్య్రానికి ముందు ఒక క్రమపద్ధతిలో జాతీయాదాయాన్ని అంచనా వేసింది - డాక్టర్‌ విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజు రావు.
 • 1931-32లో డా. వీకేఆర్‌వీ రావు భారతదేశ జాతీయాదాయాన్ని రెండు విధాలుగా లెక్కించారు.

ఆదాయ మదింపు పద్ధతి: ఈ పద్ధతిని ఉపయోగించి కింది రంగాల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. అవి...
ఎ) పరిశ్రమలు        బి) వర్తకం
సి) రవాణా            డి) ప్రభుత్వ సర్వీసులు
ఇ) వృత్తులు, జీవనాధార కళలు    ఎఫ్‌) దేశీయ సర్వీసులు

ఉత్పత్తి మదింపు పద్ధతి: ఈ పద్ధతి ఉపయోగించి కింది రంగాల్లో జాతీయాదాయాన్ని అంచనా వేశాడు. అవి..
ఎ) వ్యవసాయం        బి) పచ్చిక బయళ్లు
సి) గనులు            డి) అడవులు
ఇ) చేపలు పట్టడం, వేటాడటం

 • డా. వీకేఆర్‌వీ రావు అంచనా ప్రకారం అప్పటి భారత జాతీయాదాయం రూ.1689 కోట్లు. తలసరి ఆదాయం రూ.62.
 • 1931-40లో ఆర్‌.సి.దేశాయ్‌ జాతీయాదాయాన్ని అంచనా వేశారు.
 • జె.ఆర్‌.హిక్స్, ఎం.ముఖర్జీ, ఎస్‌కే. ఘోష్‌లు కూడా స్వాతంత్య్రానికి ముందు జాతీయాదాయాన్ని అంచనా వేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని