అంతరిక్ష ప్రయోగాల్లో నమ్మకమైన నౌక!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందించి, అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహక నౌకల్లో అత్యంత విశ్వసనీయమైంది, విజయవంతమైనది పీఎస్‌ఎల్‌వీ.

Published : 05 Jul 2024 00:36 IST

పీఎస్‌ఎల్‌వీ - ప్రత్యేకతలు, ప్రయోజనాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందించి, అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహక నౌకల్లో అత్యంత విశ్వసనీయమైంది, విజయవంతమైనది పీఎస్‌ఎల్‌వీ. ఇస్రోకు నమ్మకమైన పనిగుర్రంగా నిలిచి మూడుదశాబ్దాలుగా వందలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేసింది. ఒకేసారి వందకు పైగా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత దీని సొంతం. చంద్రయాన్, మంగళ్‌యాన్, ఆదిత్య లాంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకూ వాహకమైంది. అద్భుత పనితీరుతో దేశాన్ని అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రదేశాల సరసన  నిలిపిన పీఎస్‌ఎల్‌వీ ప్రత్యేకతలు, దీని ద్వారా చేపట్టిన విభిన్న ప్రయోగాలు, పంపిన ఉపగ్రహాలు, అందుతున్న ప్రయోజనాలు, సాధించిన అద్భుతాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో రకాలు, అందులోని దశలు, ముఖ్యమైన ప్రయోగాల తేదీలు, వాటి ప్రత్యేకతలను గుర్తుంచుకోవాలి.

భారతదేశం అంతరిక్ష రంగంలో సాధించిన విజయాల్లో పీఎస్‌ఎల్‌వీ పాత్ర ప్రత్యేకం. అంతరిక్ష వాహక నౌకల పరిజ్ఞానంలో దేశం స్వయంసమృద్ధి సాధించడంలో ఈ రాకెట్‌ కీలకంగా మారింది. స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలెన్నింటినో పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించి అంతరిక్ష రంగంలో దూసుకుపోతోంది. భారత్‌  ఇప్పటివరకు 5 రకాల వాహక నౌకలను అభివృద్ధి చేసింది. అవి..1) ఎస్‌ఎల్‌వీ 2) ఏఎస్‌ఎల్‌వీ 3) పీఎస్‌ఎల్‌వీ  4) జీఎస్‌ఎల్‌వీ 5) ఎస్‌ఎస్‌ఎల్‌వీ. వీటిలో అత్యధిక సార్లు ప్రయోగించింది పీఎస్‌ఎల్‌వీ.

పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ): భారతదేశం అభివృద్ధి చేసిన వాహక నౌకల్లో ఇది మూడోది. దీని పొడవు 44 మీటర్లు. వ్యాసార్ధం 2.8 మీటర్లు. దీనిలో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశ ద్రవ ఇంధనం, మూడో దశ ఘన ఇంధనం, నాలుగో దశ తిరిగి ద్రవ ఇంధనం (ఘన, ద్రవ దశలు ఏకాంతరంగా ఉంటాయి). ఈ వాహక నౌకకు అనేక ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం ఉంది. 

పీఎస్‌ఎల్‌వీ రకాలు: పీఎస్‌ఎల్‌వీ తీసుకెళ్లే బరువు, దాని సామర్థ్యం ఆధారంగా పలు రకాలున్నాయి.

1) పీఎస్‌ఎల్‌వీ - సీఏ: దీనికి ఎలాంటి స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉండవు.

2) పీఎస్‌ఎల్‌వీ - ఎక్స్‌ఎల్‌:  దీనికి మొదటి దశలో ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి.

3) పీఎస్‌ఎల్‌వీ - క్యూఎల్‌: దీనికి మొదటి దశలో నాలుగు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి.

4) పీఎస్‌ఎల్‌వీ - డీఎల్‌:  దీనికి మొదటి దశలో రెండు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి. ఇదే కాకుండా ఇస్రో  పీఎస్‌ఎల్‌వీ - జీ అనే వేరియంట్‌ను కూడా వాడింది. దీనికి     ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి.


పీఎస్‌ఎల్‌వీ ప్రత్యేకతలు

 • ద్రవ ఇంధనాన్ని ఉపయోగించుకునే మొదటి వాహక నౌక.
 • తి ఎక్కువ  విజయాలు సాధించిన వాహక నౌక. అందుకే దీన్ని ‘ఇస్రో పనిగుర్రం’, ‘నమ్మకమైన వాహక నౌక’ అంటారు.
 • రెండో దశలో వికాస్‌ ఇంజిన్‌ను ఉపయోగించుకుంటుంది.
 • రాకెట్‌ మొదటి దశలో ఉపయోగపడే ‘స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌’ ఉన్న మొదటి వాహక నౌక. ఇవి మండి రాకెట్‌ వెళ్లడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.
 • సాధారణ ఉపగ్రహాలే కాకుండా చంద్రయాన్‌ - 1 ద్వారా చంద్రుడి కక్ష్యలోకి, మంగళ్‌యాన్‌ (మార్స్‌ మిషన్‌) ద్వారా అంగారక గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్‌.
 • ఈ వాహక నౌక 600 కి.మీ. సన్‌ సింక్రోనస్‌ పొలార్‌ ఆర్బిట్‌ (ఎస్‌ఎస్‌పీఓ) లోకి 1750 కిలోల బరువైన ఉపగ్రహాలను తీసుకెళ్లగలదు.
 • జియోస్టేషనరీ, జియోసింక్రోనస్‌ కక్ష్యల్లోకి 1425 కిలోల బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ప్రవేశపెడుతుంది.
 • వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన మొదటి వాహక నౌక.
 • అతిఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది..
 • అయిదు రకాల వేరియంట్స్‌ (పీఎస్‌ఎల్‌వీ - క్యూఎల్, పీఎస్‌ఎల్‌వీ - సీఏ, పీఎస్‌ఎల్‌వీ - ఎక్స్‌ఎల్, పీఎస్‌ఎల్‌వీ - జీ, పీఎస్‌ఎల్‌వీ - డీఎల్‌) ఉన్న ఏకైక వాహక నౌక.
 • వాహక నౌకల్లో ఇది మూడో తరగతికి చెందింది.
 • ఇప్పటి వరకు దీన్ని 60 సార్లు ప్రయోగిస్తే కేవలం రెండు సార్లు మాత్రమే విఫలమైంది. అవి 1) 1993, సెప్టెంబరు 20న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ - డీ1 2) 2017, ఆగస్టు 31న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ - సీ39

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 

పీఎస్‌ఎల్‌వీ విజయాలు, ప్రయోగించిన ఉపగ్రహాలు:

1) పీఎస్‌ఎల్‌వీ-డీ2: దీన్ని 1994, అక్టోబరు 15న ప్రయోగించారు. ఇది ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన మొదటి పీఎస్‌ఎల్‌వీ. దీని ద్వారా ఐఆర్‌ఎస్‌-పీ2 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.

2) పీఎస్‌ఎల్‌వీ-సీ2: 1999, మే 26న ప్రయోగించారు. దీని ద్వారా మొదటిసారిగా మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అవి 1) ఐఆర్‌ఎస్‌-పీ4. దీన్నే ఓషన్‌ శాట్‌ అంటారు. 2) కొరియాకు చెందిన కిట్‌శాట్‌-3 3) జర్మనీకి చెందిన డీఎల్‌ఆర్‌ - టబ్‌శాట్‌.

3) పీఎస్‌ఎల్‌వీ-సీ4: 2002, సెప్టెంబరు 12న ప్రయోగించారు. దీని ద్వారా మెట్‌శాట్‌ (ఎమ్‌ఈటీఎస్‌ఏటీ) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రముఖ అంతరిక్ష యాత్రికురాలు కల్పానాచావ్లా మరణానంతరం ఈ ఉపగ్రహానికి 2003, ఫిబ్రవరి 5న కల్పనా-1గా పేరు పెట్టారు.

4) పీఎస్‌ఎల్‌వీ-సీ11: 2008, అక్టోబరు 22న ప్రయోగించారు. ఇది మొదటిసారిగా ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌. దీనిద్వారా చంద్రయాన్‌  ఖి ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

5) పీఎస్‌ఎల్‌వీ-సీ17: 2011, జులై 15న ప్రయోగించారు. దీనిద్వారా మొదటగా  సమాచార ఉపగ్రహం జీఎస్‌ఏటీ-12 (జీశాట్‌)ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

6) పీఎస్‌ఎల్‌వీ-సీ18: దీన్ని 2011, అక్టోబరు 12న ప్రయోగించారు. దీనిద్వారా మెగా ట్రోపిక్స్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఇండియా,   ఫ్రెంచ్‌ దేశాల సంయుక్త మిషన్‌. ఉష్ణమండల ప్రాంతంలోని వాతావరణ పరిశోధనకు దీన్ని ప్రయోగించారు. ఇది ఈ ప్రాంతంలోని నీటి వలయం, మేఘాల్లోని నీటి   పరిమాణం, వాతావరణంలోని నీటి ఆవిరి, ఇక్కడి వర్షపాతం, నీరు ఆవిరి కావడం లాంటి సమాచారాన్ని తెలియజేస్తుంది.

7) పీఎస్‌ఎల్‌వీ-సీ19: దీన్ని 2012, ఏప్రిల్‌ 26న ప్రయోగించారు. దీనిద్వారా రిశాట్‌ఖి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది మైక్రోవేవ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. సింథటిక్‌ అపెర్చెర్‌ రాడార్‌ (ఎస్‌ఏఆర్‌)ను కలిగి ఉంది. దీని ద్వారా రాత్రి, పగలు వాతావరణం మేఘావృతమై ఉన్నప్పుడు కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. సహజ విపత్తులైన వరదలు, తుపాను లాంటి వివరాలు, వ్యవసాయ సంబంధసమాచారాన్ని సేకరిస్తుంది.

8) పీఎస్‌ఎల్‌వీ-సీ20: 2013, ఫిబ్రవరి 25న ప్రయోగించారు. దీనిద్వారా సరళ్‌ (ఎస్‌ఏఆర్‌ఏఎల్‌) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది ఇండో-ఫ్రెంచ్‌ సంయుక్త మిషన్‌. సముద్రాలపై పరిశోధనకు ఉపయోగపడుతుంది.

9) పీఎస్‌ఎల్‌వీ-సీ22: దీన్ని 2013, జులై 1న ప్రయోగించారు. దీని ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - ఖితి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం    (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)లో మొదటి ఉపగ్రహం. నావిగేషన్‌కు ఉపయోగపడుతుంది.

10) పీఎస్‌ఎల్‌వీ-సీ23: 2014, జూన్‌ 30న ప్రయోగించారు. దీనిద్వారా మొదటిసారిగా అన్ని విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచారు. ఇది ఇస్రో మొదటి పూర్తి వాణిజ్య మిషన్‌.

11) పీఎస్‌ఎల్‌వీ-సీ25: 2013, నవంబరు 5న ప్రయోగించారు. దీని ద్వారా మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (ఎమ్‌ఓఎమ్‌) ఉపగ్రహాన్ని అంగారక గ్రహ (మార్స్‌) కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీన్నే ‘మంగళ్‌యాన్‌’గా పిలుస్తారు. భారతదేశ మొదటి గ్రహాంతర యాత్రగా చెప్పొచ్చు.

12) పీఎస్‌ఎల్‌వీ-సీ28: 2015, జులై 10న ప్రయోగించారు. దీనిద్వారా 1440 కిలోల  బరువైన 5 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు సాగించే ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ వారి అత్యంత బరువైన వాణిజ్య మిషన్‌.

13) పీఎస్‌ఎల్‌వీ-సీ30: 2015, సెప్టెంబరు 28న ప్రయోగించారు. దీనిద్వారా భారతదేశ మొదటి ఖగోళ ఉపగ్రహమైన ఆస్ట్రోశాట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

14) పీఎస్‌ఎల్‌వీ-సీ37: 2017, ఫిబ్రవరి 15న ప్రయోగించారు. దీనిద్వారా ఇస్రో మొత్తం 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీన్ని ఇస్రో ఘనతగా భావించవచ్చు.

15) పీఎస్‌ఎల్‌వీ-సీ48: 2019, డిసెంబరు 11న ప్రయోగించారు. దీనిద్వారా రిశాట్‌- 2బీఆర్‌1 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది రాడార్‌ ఇమేజింగ్‌తో పనిచేసే భూపరిశీలనా ఉపగ్రహం. దీన్ని వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణకు ఉపయోగించుకోవచ్చు. ఈ వాహక నౌక ఇస్రో 50వ పీఎస్‌ఎల్‌వీ.

ఇటీవల ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ మిషన్‌లు

1) పీఎస్‌ఎల్‌వీ-సీ56: దీన్ని 2023, జులై 30న ప్రయోగించారు. దీని ద్వారా డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ అనే ఉపగ్రహంతోపాటుగా ఆరు ఇతర ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

2) పీఎస్‌ఎల్‌వీ-సీ57: దీన్ని 2023,  సెప్టెంబరు 2న ప్రయోగించారు. దీనిద్వారా సూర్యుడిపై పరిశోధన చేసేందుకు, సూర్యుడి క్రోమోస్ఫియర్, కరోనా అధ్యయనానికి ఆదిత్య - ఎల్‌1 అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

3) పీఎస్‌ఎల్‌వీ-సీ58: దీన్ని 2024, జనవరి 1న ప్రయోగించారు. దీనిద్వారా ఎక్స్‌పోశాట్‌ అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని