కరెంట్‌ అఫైర్స్‌

టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా పాండ్య నిలిచాడు. హార్దిక్‌ ఖాతాలో 222 పాయింట్లున్నాయి.

Published : 06 Jul 2024 00:20 IST

టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా పాండ్య నిలిచాడు. హార్దిక్‌ ఖాతాలో 222 పాయింట్లున్నాయి. శ్రీలంక ఆల్‌రౌండర్‌ హసరంగ కూడా 222 పాయింట్లే సాధించినప్పటికీ దశాంశాల తేడాతో అతడిని హార్దిక్‌ వెనక్కి నెట్టాడు. మార్కస్‌ స్టాయినిస్‌ (ఆస్ట్రేలియా-211) మూడో స్థానం సాధించాడు.

ప్రతిష్ఠాత్మకమైన ‘విశ్వంభర’ డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి 2024 ఏడాదికి సుప్రసిద్ధ తమిళ రచయిత్రి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆమెకు రూ.5 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక లభిస్తాయి. జులై 29న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 93వ జయంతి ఉత్సవంలో ఆమెకు పురస్కారం ప్రదానం చేస్తారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ 2024, జులై 4న మూడోసారి ప్రమాణం చేశారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

2013లో తొలిసారిగా అతి పిన్న వయసులో ఝార్ఖండ్‌కు హేమంత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఐఎస్‌) సీనియర్‌ అధికారి ధీరేంద్ర కె.ఓఝా 2024, జులై 4న కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 బ్యాచ్‌ అధికారి అయిన ధీరేంద్ర, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


మాదిరి ప్రశ్నలు

సెంట్రల్‌ బ్యాంకు నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్‌ రిస్క్‌ బఫర్‌ (సీఆర్‌బీ)ను భారతీయ రిజర్వు బ్యాంకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఎంత శాతానికి పెంచింది? (ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించింది. సీఆర్‌బీ 5.5% నుంచి 6.5% శ్రేణిలో ఉండాలని ఇది నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్‌బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కొవిడ్‌-19 మహమ్మారి లాంటి పరిణామాల నేపథ్యంలో 2018-19 నుంచి 2021-22 వరకు సీఆర్‌బీని 5.50 గా నిర్వహించారు. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022-23లో సీఆర్‌బీని 6 శాతానికి పెంచారు.)

జ: 6.5 శాతం

సింగపూర్‌కు చెందిన సైబర్‌ భద్రతా సంస్థ ‘సైఫర్మా’ 2023 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా సైబర్‌ నేరాల బారిన పడిన దేశాల జాబితాలో 2023లో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది? (గతేడాది దేశంలో 34% వినియోగదారులు సైబర్‌ దాడులకు గురయ్యారని నివేదిక పేర్కొంది. దీనిప్రకారం ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్‌ దాడుల్లో  13.7% వరకు భారత్‌ పైనే జరిగినట్లు వెల్లడైంది. ఇండియాపై ఎక్కువ సైబర్‌ దాడులకు చైనా, పాకిస్థాన్, పశ్చిమాసియా దేశాల్లోని సైబర్‌ నేరగాళ్లే కారకులు.)

జ: 80వ

ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ఏటా ఏ రోజున   నిర్వహిస్తారు? (‘లెటస్‌ పార్టీ’ అనే థీమ్‌తో ఈ ఏడాది   దినోత్సవాన్ని నిర్వహించారు.)

జ: మే 23 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని