గిరిజనులపై ఆధిపత్యం ప్రదర్శించి... రైతుల హక్కులు హరించి..

బ్రిటిష్‌ వారు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, రాజకీయంగానూ ఎదిగారు. క్రమంగా గిరిజనుల సంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. అన్యుల ఆధిపత్యం తమ తెగలపై ఎక్కువ కావడంతో గిరిజనులు ఆగ్రహించారు.

Published : 06 Jul 2024 00:38 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర
బ్రిటిష్‌ కాలంలో రైతాంగ, గిరిజన తిరుగుబాట్లు

బ్రిటిష్‌ వారు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, రాజకీయంగానూ ఎదిగారు. క్రమంగా గిరిజనుల సంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. అన్యుల ఆధిపత్యం తమ తెగలపై ఎక్కువ కావడంతో గిరిజనులు ఆగ్రహించారు. గిరిజనేతరుల అధికారాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించని వారు తిరుగుబాట్లు లేవదీశారు. జమీందార్లు రైతుల హక్కులను కాలరాసి, వారి భూములపై అధికారం చెలాయించారు. శిస్తులు అధికంగా వసూలు చేసి, చెల్లించని వారి భూములు లాక్కున్నారు. బలవంతంగా నీలిమందు సాగు చేయించారు. ఆయా ఉద్యమాలు, వాటికి నేతృత్వం వహించినవారు, తిరుగుబాట్లను కంపెనీ సేనలు అణచివేసిన తీరుతెన్నులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

కోల్‌ గిరిజనుల తిరుగుబాటు

బ్రిటిష్‌ పాలకుల చట్టాలు, ఆర్థిక దోపిడీ, గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో జోక్యాన్ని నిరసిస్తూ కోల్‌ తెగవారు 1831-32లో తిరుగుబాటు చేశారు.

 • ఈ తిరుగుబాటు వల్ల బిహార్‌లోని రాంచీ, సింగ్భమ్, హజారీబాగ్, పలమౌ ప్రాంతాలు విశేషంగా ప్రభావితమయ్యాయి. 
 • ఈస్టిండియా కంపెనీ పాలనకు ముందు ఈ ప్రాంతంలోని భూమిపై హక్కులు ఆ తెగ పెద్దలైన ముండాలకు ఉండేవి.
 • ఆంగ్లేయుల పాలనలో ఈ అధికారం బ్రిటిష్‌ అధికారులకు, గిరిజనేతరులకు లభించింది.
 • ప్రభుత్వం సిక్కు, ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపై పెత్తందార్లుగా నియమించింది. వీరు గిరిజనులపై అజమాయిషీ చేశారు. దీనికితోడు కంపెనీ దౌర్జన్యాలు అధికమయ్యాయి.
 • గిరిజనులు సాగుచేస్తున్న భూములపై శిస్తు పెంచి, బలవంతంగా వసూలు చేసేవారు. శిస్తు చెల్లించని రైతులను పెత్తందార్లు, కంపెనీ పోలీసులు అనేక రకాలుగా హింసించారు.
 • విసుగెత్తిన కోల్‌ ప్రజలు 1831లో కంపెనీకి, పెత్తందార్లకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. వారిపై దాడులు చేసి, ఆస్తులు దగ్ధం చేశారు. 
 • ఈ తిరుగుబాటుకు రాంచీ ప్రధాన కేంద్రమైంది. తర్వాత ఈ తిరుగుబాటు సింగ్భమ్, హజారీబాగ్, పలమౌల్లోకి విస్తరించింది. 
 • వీరి చర్యలు హింసాత్మకం కావడం, పరిస్థితులు అదుపు తప్పడంతో కంపెనీ వారు సైనిక చర్యలు ప్రారంభించారు.
 • 1832 మార్చి నాటికి కోల్‌ తిరుగుబాటును బ్రిటిష్‌ వారు పూర్తిగా అణచివేశారు. 
 • కోల్‌ తిరుగుబాటు స్థానికమైందే అయినా లక్ష్యానికి చేరువైంది. 
 • గిరిజనులకు సరైన నాయకత్వం, వ్యూహరచన, సైనిక బలం, ఆధునిక ఆయుధాలు లేకపోవడంతో బ్రిటిష్‌ వారు ఈ తిరుగుబాటును అణచివేయగలిగారు. 
 • ఈ తిరుగుబాటు భవిష్యత్‌ గిరిజన తిరుగుబాట్లకు మార్గదర్శకమైంది.

పాట్నా రైతుల తిరుగుబాట్లు

బెంగాల్‌ తిరుగుబాటు తర్వాత ముఖ్యమైంది పాట్నా రైతుల తిరుగుబాటు. బెంగాల్‌లో రైతులు ఆంగ్లేయ యజమానులపై ఉద్యమం చేస్తే, పాట్నాలో జమీందార్లపై తిరుగుబాటు చేశారు.

 • జమీందారీ విధానం అమలు తర్వాత రైతులపై జమీందార్ల దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
 • 1859 యాక్ట్‌లోని 10వ నిబంధన ప్రకారం రైతుకు కొన్ని కౌలుదారీ హక్కులు లభించాయి.
 • ఆ హక్కులు పొందనివ్వకుండా జమీందార్లు అడ్డుకునేవారు.
 • రైతులు పండించిన పంటను, పశువులను అక్రమంగా స్వాధీనం చేసుకునేవారు. జమీందార్లు పెట్టే బాధలను భరించలేక పాట్నా జిల్లాలో యుసఫీజాహీ పరగణాకు చెందిన రైతులు ఉద్యమానికి దిగారు. 
 • 1873లో అక్కడి రైతులు ధామ్‌ శంభూపాల్, ఖుదిమిల్లా, ఇషాన్‌ చంద్రయ్‌లు నాయకత్వంలో ఒక రైతు సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. 
 • జమీందార్లు తమ రైతులపై అబ్‌వబ్‌ అనే ఆదాయ పన్నులు విధించేవారు. భూమి సర్వేకు తప్పుడు కొలతలు అవలంబించేవారు. ఈ పద్ధతులను వ్యతిరేకించిన రైతులు జమీందార్లు పెంచిన పన్నులు చెల్లించడానికి నిరాకరించారు.
 • ఈ తిరుగుబాటు ఇతర జిల్లాలకూ వ్యాపించింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని 1883లో బెంగాల్‌ కౌలుదార్ల చట్టాన్ని రూపొందించింది. ఇందులో రైతులకు శాశ్వత కౌలుదారు హక్కులు కల్పించింది.

ఖోండ్‌ గిరిజనుల తిరుగుబాట్లు 

సర్‌ హెన్రీ హార్డింజ్‌ భారతదేశంలో గవర్నర్‌ జనరల్‌గా పనిచేస్తున్న కాలంలో ఒరిస్సాలోని బోద్, దస్‌పల్లా రాజ్యాల పరిసరాల్లో ఖోండోమల్‌ పర్వత శ్రేణుల్లో నివసించే ఖోండ్‌ తెగ గిరిజనులు తిరుగుబాటును లేవదీశారు.

 • ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం బ్రిటిష్‌ అధికారులు ఖోండ్‌ల సామాజిక, మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం. 
 • ఈ తెగ గిరిజనుల ఆచారాల్లో నరబలులు, శిశుహత్యలు ఒక భాగంగా ఉండేవి. వీటిపై నిషేధం విధిస్తూ 1837లోనే కంపెనీ అధికారులు చట్టాలు తీసుకువచ్చారు.
 • ప్రభుత్వం తమ మత విశ్వాసాల్లో, ఆచార వ్యవహారాల్లో అనవసర జోక్యం చేసుకుంటోందని ఈ తెగ ప్రజలు భావించారు.
 • ఈ గిరిజన పెద్దలు బోద్, దస్‌పల్లా రాజుల అధికారానికి కట్టుబడి ఉండేవారు. 
 • 1843లో ఖోండ్‌ తెగలో నెలకొన్న ఈ దురాచారాలను అణచివేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఖుర్దా, బాలసోర్‌ కంపెనీల సేనలకు మేజర్‌ హిక్స్‌ను కమాండర్‌గా నియమించి ఖోండోమల్‌ ప్రాంతానికి పంపింది.
 • అతడు బోద్, దస్‌పల్లా రాజుల సహకారంతో ఈ దురాచారాలను అదుపు చేసి, ఖోండ్‌ల తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 
 • ఈ తెగ వారు ప్రభుత్వానికి భూమిశిస్తును చెల్లించడం నిలిపివేశారు.
 • బ్రిటిష్‌ అధికారులు ఖోండ్‌ తెగలోని నరబలులను, ఆడశిశువుల హత్యలను అరికట్టాలనే ఉద్దేశంతో 1845లో మెరియా ఏజెన్సీని నెలకొల్పారు.
 • బ్రిటిష్‌ అధికారులు బోద్‌ ప్రాంతాన్ని మేజర్‌ మాక్‌ఫర్‌సన్‌ సైనిక పర్యవేక్షణలో ఉంచారు. ఇతడు ఆ ప్రాంత ప్రజల్లో మార్పు తేవాలని కృషిచేశాడు. 
 • కుటిల నీతితో తమ భూములను స్వాధీనం చేసుకోవడానికే మేజర్‌ మాక్‌ఫర్‌సన్‌ తమ ప్రాంతానికి వచ్చాడని, తమపై అధిక భూమిశిస్తు పన్నులు విధించనున్నాడని, తమను వెట్టి కూలీలుగా మార్చడానికి కుట్రపన్నుతున్నాడని ఖోండ్‌ తెగ ప్రజలు భావించారు.
 • ఈ కారణంతో 1846లో వారు మాక్‌ఫర్‌సన్‌కి ఎదురుతిరిగారు. వీరి మెరుపుదాడిని ఎదుర్కోవడంలో బ్రిటిష్‌ సేనలు విఫలమయ్యాయి. బ్రిటిష్‌ వారి చెరలో ఉన్న ఖోండ్‌లను విడుదల చేయించుకున్నారు.
 • ఆంగ్లేయుల అధీనంలోనే ఉన్న వారి రాజును విడిపించడానికి బ్రిటిష్‌వారిపై తిరిగి పోరు జరిపారు. దీనికి చక్రబిసాయ్‌ నేతృత్వం వహించారు.
 • ఈ పోరులో ఓడిపోయిన గిరిజనులు అడవుల్లోకి పారిపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా గెరిల్లా పద్ధతిలో ఆంగ్లేయులతో యుద్ధం చేస్తూనే వచ్చారు.
 • కంపెనీ తమ వ్యూహాన్ని మార్చి బహిష్కరించిన ఖోండ్‌రాజు సామ్‌బిసాయ్‌కు తిరిగి సింహాసనం అప్పగించారు. ఈ పరిణామంతో ఖోండ్‌లు చాలావరకు సంతృప్తి చెందారు. చక్రబిసాయ్‌ మాత్రం తన తెగ హక్కుల కోసం 1855 వరకు ఉద్యమాన్ని కొనసాగించాడు.
 • చివరికి బ్రిటిష్‌ సైన్యాలు ఖోండ్‌ల తిరుగుబాటును పూర్తిగా అణచివేసి, వారి ప్రాంతాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనం చేశాయి.

మహారాష్ట్రలో తిరుగుబాట్లు

మహారాష్ట్రలో వడ్డీ వ్యాపారస్తులు రైతులకు అప్పులు ఇచ్చి, పెద్ద మొత్తంలో వడ్డీలు వసూలు చేసేవారు.

 • మార్వాడీ గుజరాతీలు మహారాష్ట్రకు వచ్చి స్థిరపడి వ్యాపారం చేసేవారు. వీరి దోపిడీకి వ్యతిరేకంగా సూపా గ్రామ పత్తి రైతులు ఉద్యమం చేపట్టారు. తర్వాత ఈ ఉద్యమం పుణె, అహమ్మద్‌నగర్‌ జిల్లాలకు విస్తరించింది. 
 • మొదట రైతులు వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా సంఘబహిష్కరణోద్యమాన్ని చేపట్టారు. తర్వాత ప్రత్యక్ష తిరుగుబాటుకు దిగి ఆయా వ్యక్తుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేసి, బాండ్లు, రుణపత్రాలు తగులబెట్టారు. 
 • ఉద్యమం దౌర్జన్య పద్ధతుల్లోకి మారుతోందని గ్రహించిన ప్రభుత్వం ఈ తిరుగుబాట్లను అణచివేసింది. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం 1879లో దక్కన్‌ వ్యవసాయదారుల సహాయక చట్టాన్ని ప్రవేశపెట్టింది. 

ఆ చట్టం అప్పులు చెల్లించలేని రైతులను జైలు శిక్ష నుంచి మినహాయించింది.

నీలి మందు రైతుల తిరుగుబాటు

19వ శతాబ్దంలో జరిగిన రైతుల ఉద్యమాల్లో అతి ముఖ్యమైంది బెంగాల్‌ నీలిమందు రైతులు చేసిన తిరుగుబాటు. 

 • బెంగాల్‌లో నీలిమందు పండించే రైతులను బ్రిటిష్‌ యజమానులు విపరీతంగా దోచుకున్నారు. వారి  దోపిడీ భరించలేక బెంగాల్‌ నీలిమందు రైతులు 1859-60లో తిరుగుబాటు చేశారు. 
 • ఐరోపా తోట యజమానులు తమ లాభాల కోసం బలవంతంగా రైతులతో నీలిమందు సాగు చేయించేవారు. 
 • పండిన పంటను అతితక్కువ ధరకు కొనేవారు. వారి చర్యలను వ్యతిరేకిస్తే రైతులపై దౌర్జన్యాలు చేసేవారు. 
 • బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని గోవిందపూర్‌ గ్రామస్థులు 1859లో ఉద్యమం ప్రారంభించారు. వారికి దిగంబర బిస్వాస్, విష్ణు బిస్వాస్‌ నాయకత్వం వహించారు. 
 • ఆ ప్రాంత రైతులు నీలిమందు సాగు చేసేదిలేదని తేల్చిచెప్పడంతో కోపగించిన ఆంగ్లేయులు దాడులు చేశారు.
 • వారి దాడికి రైతులు ప్రతిదాడి జరిపారు. ఫ్యాక్టరీల మీద దాడులు చేశారు. తోట యజమానులను సంఘం నుంచి బహిష్కరించారు.
 • బ్రిటిష్‌ వారి యుక్తులకు లొంగని రైతులు సమష్టిగా తమ పోరాటాన్ని కొనసాగించారు. ప్రభుత్వం దిగివచ్చి రైతుల సమస్యలను పరిష్కరించడానికి 1960లో నీలిమందు కమిషన్‌ను నియమించింది. 
 • ఆ కమిషన్‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం నీలిమందు పంటను నిర్బంధంగా సాగు చేయడంపై నిషేధం విధించింది..

రచయిత : డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని