వనాల రక్షణలో పోరాటాలు.. పథకాలు!

సహజ వనరుల్లో ప్రధానమైనవి అడవులు. పర్యావరణ పరిరక్షణ, జీవివైవిధ్య సమతౌల్యానికి వనాలే కేంద్రస్థానాలు. వన్యమృగాలకు ఆవాసంతో పాటు కోట్లాది ప్రజలకు జీవనోపాధిని అందిస్తున్నాయి.

Published : 07 Jul 2024 00:20 IST

ఇండియన్‌ జాగ్రఫీ
అటవీ పరిరక్షణ ఉద్యమాలు, విధానాలు

సహజ వనరుల్లో ప్రధానమైనవి అడవులు. పర్యావరణ పరిరక్షణ, జీవివైవిధ్య సమతౌల్యానికి వనాలే కేంద్రస్థానాలు. వన్యమృగాలకు ఆవాసంతో పాటు కోట్లాది ప్రజలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ఆధునిక కాలంలో అడవుల ప్రాధాన్యం, వాటిని విస్తరించాల్సిన అవసరం అంతకంతకూ పెరుగుతోంది. అందుకే ప్రభుత్వాలతోపాటు పౌరసమాజం కూడా అడవులను కాపాడుకోవడానికి కృషి చేస్తోంది. భారత్‌లో అడవుల వర్గీకరణ, విస్తీర్ణం, విస్తరణ తీరు, వనాల రక్షణకు జరిగిన ఉద్యమాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అటవీ విధానాలు, తీసుకొచ్చిన చట్టాలు, అమలుచేస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి.

క భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలు అధికంగా ఉంటే ఆ ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. భారతదేశ రాష్ట్రాల అటవీ నివేదిక - 2021 ప్రకారం గుర్తించిన (రిజిస్టర్డ్‌) అటవీ ప్రాంతం అంటే ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో చెట్లతో సంబంధం లేకుండా అడవిగా నమోదైన భౌగోళిక ప్రాంతం. చెట్ల పందిరి సాంద్రత ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించారు. 70% లేదా అంతకంటే ఎక్కువ పందిరి సాంద్రత ఉన్న భూములను దట్టమైన అడవిగా గుర్తించారు. ఈ రకమైన అడవులు దేశంలో 3% ఉన్నాయి. చెట్ల పందిరి సాంద్రత 40% నుంచి 70% వరకు భూములున్న ప్రాంతాన్ని మధ్యస్థ దట్టమైన అటవీ ప్రాంతంగా గుర్తించారు. ఈ రకమైన అటవీ ప్రాంతం 9.3% ఉంది. చెట్ల పందిరి 10% నుంచి 40% మధ్య ఉన్న భూములను ఓపెన్‌ ఫారెస్ట్‌గా గుర్తించారు. ఈ రకమైనవి 9.34% ఉన్నాయి. 10% కంటే తక్కువ పందిరి సాంద్రత ఉన్న భూములను స్క్రబ్‌ ఫారెస్ట్‌ (పొదలు)గా గుర్తించారు. దేశంలో అవి 1.42% ఉన్నాయి. ఏ రకమైన వర్గానికి చెందని 76.87% ప్రాంతాన్ని అటవీయేతర వర్గంగా గుర్తించారు.

మూడు రకాలు: అటవీ విధానం - 1927 ప్రకారం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను మూడు రకాలుగా వర్గీకరించారు.

1) రిజర్వ్‌ ఫారెస్ట్‌: ఈ రకమైన అడవులు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. వీటిలోకి సామాన్య ప్రజల ప్రవేశం నిషిద్ధం. పశువుల పెంపకం, కలప, చెట్లు నరకడం కూడా నిషేధం. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జమ్ము-కశ్మీర్‌ల్లో ఉన్నాయి.

2) రక్షిత అడవులు: ఇవి ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ఇందులో ప్రజల సంచారానికి, పశువులు తిరగడానికి, కలప సేకరణకు అనుమతి ఉంటుంది. ఈ అడవులు హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి.

3) వర్గీకరించని అడవులు: ఈ అడవుల్లో చెట్లను నరకడానికి, పశువుల సంచారానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలోనే దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది షెడ్యూల్డ్‌ తెగల జనాభా నివసిస్తున్నారు. సుమారు 460 జాతులు కూడా జీవిస్తున్నాయి. వీరిలో 92% మందికి ఈ అడవులే జీవనాధారం.
జాతీయ అటవీ విధానం - 1894: ఇది దేశంలో మొదటి అటవీ విధానం. వలస పాలనలో 1894లో డెట్రించ్‌ ప్రతిపాదనల ఆధారంగా దీన్ని రూపొందించారు. 1906లో దెహ్రాదూన్‌లో  ‘ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’   నెలకొల్పారు. దీన్నే తర్వాత ‘ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ గా మార్చారు.

జాతీయ అటవీ విధానం - 1952: ఇది స్వాతంత్య్రానంతరం వచ్చిన మొదటి అటవీ విధానం. దీనిప్రకారం దేశ విస్తీర్ణంలో సగటున 33% అడవులు ఉండాలి. మైదానాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60% అటవీ విస్తీర్ణం ఉండాలి.

జాతీయ అటవీ విధానం - 1988: దీన్నే సవరించిన అటవీ విధానం అంటారు. పర్యావరణ పరిరక్షణ, జీవివైవిధ్య సమతౌల్యాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. 1988లో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ఏర్పాటు చేశారు. 2003లో నేషనల్‌ ఫారెస్ట్‌ కమిషన్‌ను నెలకొల్పారు. ఇది 2006లో నివేదికను సమర్పించింది.

జాతీయ అటవీ విధానం - 2018: దీని ప్రకారం 33.3% అడవుల విస్తీర్ణం లక్ష్యంగా వనాలను  100 మిలియన్‌ హెక్టార్లకు పెంచాలి. పీఠభూముల్లో 60%, మైదానాల్లో 40% అటవీ సంపద వృద్ధి చేయాలి.

అడవుల సంరక్షణ - భారత ప్రభుత్వ చర్యలు: 1954లో యూఎన్‌డీపీ ఆధ్వర్యంలో చంద్రాపుర్, నైనిటాల్‌లో అటవీకరణ చేపట్టారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 1976లో నేషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సామాజిక అడవులను ప్రతిపాదించింది. అయిదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ‘సామాజిక అడవుల పెంపకం’ పథకాన్ని చేపట్టారు. దీనికోసం 1978లో సామాజిక అడవుల చట్టం చేశారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం చేశారు. మార్చి 21న అటవీ దినోత్సవాన్ని, జులై మొదటి వారం వన మహోత్సవాలు జరుపుతున్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా 25% అటవీ విస్తీర్ణ లక్ష్యంతో జాతీయ అటవీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. 1999లో నేషనల్‌ ఫారెస్ట్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. దీనిద్వారా రానున్న 20 ఏళ్లలో అటవీ విస్తీర్ణాన్ని 33.3% పెంచాలని లక్ష్యం. ప్రభుత్వ - స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేశారు.

కంపా చట్టం (CAMPA - Compansatory Afforestation fund Management and Planning Authority): 2016లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఉద్దేశం అటవీకరణను ప్రోత్సహించడం. దీనిలో భాగంగా కాంపెన్‌సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తారు. అటవీ భూములు వాడుకునేవారు ఈ ఫండ్‌ చెల్లించాలి. ఆ డబ్బును అటవీయేతర భూముల్లో అడవులు పెంచడానికి వాడతారు.

మియావాకి నమూనా: ఇది జపాన్‌ దేశ అటవీకరణ పద్ధతి. దీనిలో స్థానిక చెట్లను గుర్తించి నాలుగు వరుసలుగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారు. తద్వారా సారాన్ని వృద్ధి చేసి, జీవ ఎరువులను వాడుతూ నేలలో తేమ పెంచుతారు. దీని ముఖ్య ఉద్దేశం పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండే కొద్దిపాటి స్థలాల్లో చిన్నపాటి అడవులను పెంచడం. ఈ పద్ధతిని తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్ట్ర్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.

హరిత పరపతి పథకం: ఫారెస్ట్‌ అడ్వయిజరీ కమిటీ 2020లో ఈ పథకాన్ని ఆమోదించింది. దీనిద్వారా అటవీ శాఖ ప్రభుత్వేతర సంస్థల్లో అటవీ పెంపకాన్ని అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో చేయవచ్చు. ఈ కార్యక్రమం వాతావరణ మార్పులను నియంత్రించడంలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది గ్రీన్‌ ఇండియా మిషన్‌కు తోడ్పాటు అందిస్తుంది.

జాతీయ అటవీకరణ కార్యక్రమం:  దీని ముఖ్య ఉద్దేశం క్షీణించిన అడవులను ప్రజల భాగస్వామ్యంతో పునరుద్ధరింపజేయడం. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పథకం. ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ద్వారా రెండు దశల్లో అమలవుతుంది. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ చూపిన జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు 1) చడ్వాయి (కాగజ్‌నగర్‌)  2) ఇలపీడిక (కేరళ).


అడవుల రక్షణకు ఉద్యమాలు

బిష్ణోయ్‌ ఉద్యమం: ఇది రాజస్థాన్‌లో 1730లో జరిగింది. అమృతాదేవి, ఆమె అనుచరులు ఖేజార్లి గ్రామంలో ఖేజ్రీ చెట్లను కౌగిలించుకుని, వాటిని నరకకుండా అడ్డుకుని నిరసన తెలియజేశారు. ఈ పోరాటంలో నాటి సైనికుల చేతిలో 302 మంది చనిపోయారు. ఖేజ్రీ చెట్లను   తెలంగాణలో జమ్మి చెట్టుగా పిలుస్తారు.

చిప్కో ఉద్యమం: ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ఉద్యమానికి సుందర్‌లాల్‌ బహుగుణ నాయకత్వం వహించారు. నిరసనకారులు చెట్లను నరకడాన్ని నిరసిస్తూ వాటిని కౌగిలించుకునేవారు.

సైలెంట్‌ వ్యాలీ: కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో నిశ్శబ్ద లోయ (సైరాంద్రి వనం)లో కుంతీపూజ నదిపై 60 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం   ఏర్పాటుకు వ్యతిరేకంగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరిగింది.

నర్మదా బచావో ఆందోళన: 1985లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో మేధా పాట్కర్, బాబా ఆమ్టేల నాయకత్వంలో జరిగింది. ఇది సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమం.

అప్పికో ఉద్యమం: దీన్ని దక్షిణ చిప్కో ఉద్యమం అంటారు. కర్ణాటకలోని ‘గుచ్చిగాడె’లో ప్రారంభమైంది. దీనికి పాండురంగ హెగ్డే నాయకత్వం వహించారు. ‘అప్పికో’ అంటే  కౌగిలించుకోవడం అని అర్థం.

తెహ్రీ డ్యామ్‌ ఉద్యమం: ఇది 1990 దశాబ్దంలో జరిగింది. భాగీరథి, ఖిలాంగన నదులు కలిసే చోట డ్యామ్‌ నిర్మించడానికి తలపెట్టారు. ఇది దేశంలోనే ఎత్తయిన ప్రాజెక్ట్‌. సుందర్‌లాల్‌ బహుగుణ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.

జంగిల్‌ బచావో ఉద్యమం: ఇది 1982లో నేటి ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని సింగ్‌భం జిల్లాలో జరిగిన ఉద్యమం. ఛోటానాగ్‌పుర్‌ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగిన సాల్‌ వృక్షాలను నరికివేసి, విలువైన టేకు చెట్లు నాటడానికి ప్రభుత్వం  నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఆందోళన జరిగింది.

రచయిత: గోపగోని ఆనంద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని