నాటి నాగరికతకు సమాధుల సాక్ష్యాలు!

ఆది మానవుడు వేటాడే దశ నుంచి క్రమంగా స్థిర జీవిగా మారడం, ఆ తర్వాత సమాజ విస్తరణతో జనపదంగా అవతరించడం వరకు మానవ వికాస పరిణామానికి తెలంగాణ గడ్డ కూడా వేదికగా నిలిచింది.

Published : 08 Jul 2024 00:40 IST

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

ఆది మానవుడు వేటాడే దశ నుంచి క్రమంగా స్థిర జీవిగా మారడం, ఆ తర్వాత సమాజ విస్తరణతో జనపదంగా అవతరించడం వరకు మానవ వికాస పరిణామానికి తెలంగాణ గడ్డ కూడా వేదికగా నిలిచింది. నిర్దిష్ట లిపి ఏర్పడక ముందున్న చరిత్ర పూర్వయుగంలో మానవుడు ఈ ప్రాంతంలో నిర్మించిన రాక్షస గూళ్లు, వాటిలోని వైవిధ్యం, వేటకు వాడిన ఆయుధాలు, పశుపోషణ, పండించిన పంటలు, వాడిన పాత్రలు, పాటించిన ఆచారాలు, సంస్కృతి, పూజించిన దేవతలు, తీరిక వేళలో వేసిన చిత్రాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. పురావస్తు అవశేషాల ఆధారంగా మానవ వికాసం జరిగిన విధానం, ఆ ఆనవాళ్లు బయటపడిన ప్రాంతాలు, అక్కడ నిర్వహించిన పరిశోధనల గురించి అవగాహనతో ఉండాలి.

రాక్షస గూళ్లు
(చరిత్ర పూర్వయుగం)

చారిత్రక పూర్వయుగంలో భాగంగా తెలంగాణలో రాక్షస గూళ్ల యుగం ప్రముఖ పాత్ర పోషించింది.  దొరికిన పురావస్తు అవశేషాల ద్వారా ఆనాటి మానవుల జీవన విధానం, సంప్రదాయాలు, నాగరికత లాంటి అంశాలు తెలుస్తున్నాయి. నిర్మాణం ఆధారంగా రాక్షస గూళ్లను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి 1) గుంత సమాధులు  2) గూడు సమాధులు 3) గది సమాధులు  4) గుహ సమాధులు

హబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉప్పలపాడు గుంత సమాధిలో పడవ ఆకారపు శవపేటిక ఆధారాలు లభ్యం కాగా చిన్నమారూరు గూడు సమాధిపై తడికె గుర్తులు కనిపించాయి. మొదటి రెండు రకాల సమాధులు ఎక్కువగా కృష్ణానది ఎడమ ఒడ్డున ఉంటే, గది సమాధులు గోదావరి కుడి ఒడ్డున ఎక్కువగా బయటపడ్డాయి. గుహ సమాధులు కూడా కొన్ని గోదావరి తీర ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. రాతి పలకల గూడు కొన్నిసార్లు ‘స్వస్తిక్‌’ లేదా ‘ప్లస్‌’ ఆకారంలో కూడా కనిపిస్తుంది. గూడు నిర్మాణంలో వాడిన నాలుగు రాతి సల్పల్లో ఏదో ఒకదానికి ముఖ్యంగా తూర్పు రాతి పలకకు ఒక్కోసారి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం చనిపోయిన మనిషి ఆత్మ సంచరించేందుకు లేదా సమాధి క్రతువులు నిర్వహించినప్పుడు ఆహార పదార్థాలు, ఇతరత్రా వస్తువులు సమాధి గూడు లోపల పెట్టడానికి ఉద్దేశించిందని భావిస్తున్నారు. రంధ్రం కాకుండా కొన్నిసార్లు రాతి తలుపుల మాదిరి రాతి చెక్కలు ఉంటున్నాయి. ఇలాంటివి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏటూరు నాగారం అడవుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే అడవుల్లో మల్లూరు గుట్టపై ఉన్న గది సమాధులైతే నిర్మాణ కళలో ఉచ్చస్థితిని అందుకున్నాయి. వాటి భారీ పరిమాణం, చుట్టూ నున్నగా చెక్కి నిలిపిన రాతి కంచెలు, సమాధి గదుల లోపల పల్నాటి సున్నపురాయి తొట్టెలు, సమాధి అరుగులపై రోళ్లు, వందలాది సమాధుల మధ్యలో ఉన్న మూడు కోటగోడలు, ఆ కాలపు పట్టణీకరణ, నగర రాజ్య మూలాలను చూసి ఎవరైనా ఆశ్చర్యానికి గురవుతారు. తెలంగాణలోని కొన్నిచోట్ల రాక్షస గూళ్ల దగ్గర రకరకాల నిలువు రాళ్లు కూడా కనిపిస్తాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణ, నల్గొండలోని ఫణిగిరి; ఆలేరు, వరంగల్‌లోని బొమ్మెర, లేబర్తి; మెదక్‌ జిల్లాలోని శివారు వెంకటాపుర్‌ లాంటి ప్రదేశాల్లో నిలువు రాళ్లు కనిపించాయి. గజం నుంచి అయిదు గజాల ఎత్తు వరకు ఉండే ఇవి సమాధి ఉనికిని తెలియజేస్తాయి. నిలువు రాళ్లు వరుసగా, సమాంతర వరుసలుగా కూడా మహబూబ్‌నగర్‌ జిల్లాలో కనిపిస్తాయి. మానవాకార శిలలు, శిలువ ఆకార శిలలు వరంగల్‌ జిల్లాలోని జానంపేట, మంగపేట; ఖమ్మం జిల్లాలోని గుండాల, కాంచనపల్లి లాంటి గోదావరి లోయ ప్రాంతంలో మాత్రమే గుహ సమాధుల దగ్గర కనిపించాయి. శిలువ రాళ్లు మాత్రం ప్రపంచంలో మరెక్కడా కనిపించలేదు. ఈజిప్టులోని పిరమిడ్‌ రాళ్లపై శిలువలను పట్టుకున్న దేవతలను చిత్రించారు. ఆ విధంగా మధ్యదరా ప్రాంతంతో తెలంగాణకు సంబంధం ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. గోదావరి తీరంలో ఉన్న పోచంపాడు (నిజామాబాద్‌), కాంచనపల్లి లాంటి చోట్ల దీర్ఘచతురస్రాకార వేదికలు కనిపించాయి. అవి.. శవాన్ని రాబందులకు ఆహారపు వేదికలుగా లేదా పనిముట్ల తయారీ అరుగులుగా భావిస్తున్నారు.

గూళ్ల తవ్వకాల్లో బయటపడిన వస్తువులు, సంస్కృతి: రాష్ట్రంలోని ప్రతి మండలంలో రాక్షస గూళ్లు ఉన్నాయి. పురావస్తు శాఖవారు సుమారు 50 సమాధులను తవ్వారు. వాటిలో బయటపడిన వస్తువులు, ఆ యుగపు మనుషుల సాంస్కృతిక విశేషాలను తెలియజేస్తున్నాయి. వీటిలో అంత్యక్రియల కోసం వాడిన అనేక రకాల పాత్రలు, కుండలు, వాటి మూతలు, గుండ్రటి మూకుళ్లు, ముక్కాలు పీటలు లభ్యమయ్యాయి. వాటిపై గోరునొక్కుళ్లు, వేలిముద్రలు, తాడుతో ఒత్తిన డిజైన్లు, రేఖాచిత్రాలు, కుమ్మరి చిహ్నాలు కనిపించాయి. మహబూబ్‌నగర్‌లోని చిన్నమారూరులో కుండపై తెలుపురంగు పూత కనిపించింది. ఖమ్మంలోని రుద్రమకోటలో గుండ్రటి మట్టి కుండల కింద నాలుగు కాళ్లున్నాయి. అంటే మట్టి పాత్రల తయారీలో ఈ యుగం మానవులు చాలా ప్రగతి సాధించారని చెప్పొచ్చు. ఎరుపు-నలుపు రంగు పాత్రలు, పూర్తి నలుపు రంగుతో మెరిసే పాత్రలు ఈ యుగంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇవి ఎక్కువగా సమాధుల్లో వాడే పాత్రలుగా ప్రసిద్ధికెక్కాయి. అలంకరణకు ఉపయోగించిన మట్టి  పూసలు మహబూబ్‌నగర్‌లోని వీరాపురంలో, మౌలాలీ (హైదరాబాద్‌)లో మట్టిగాజులు లభించాయి. మట్టిబొమ్మలు చాలాచోట్ల వెలుగులోకి వచ్చాయి. నిజామాబాదులోని పోచంపాడులో కుక్కలు, మహబూబ్‌నగర్‌లోని ఉప్పేరులో కొమ్ములు తిరిగిన పొట్టేలు, శేరుపల్లిలో పొడవాటి కొమ్ముల దున్నపోతు, కరీంనగర్‌లోని పెద్దబొంకూరులో దున్నపోతు తల లాంటి మట్టిబొమ్మలు లభించాయి. వీటిని ఆనాటి మానవులు మచ్చిక చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ శివార్లలో ఉన్న హస్మత్‌పేటలో నాగలి కర్రు లాంటి వస్తువు దొరకడం దీనికి నిదర్శనం. ఇంచుమించు ప్రతి సమాధిలో ఇనుప వస్తువులున్నాయి. వేట, యుద్ధాల్లో వాడిన చిన్నపాటి కొడవళ్లు, గొడ్డళ్లు, బల్లెపు మొనలు, కత్తులు, ఖడ్గాలు, బల్లాలు, బ్లేడ్లు, బాడిసలు, ఉలులు, త్రిశూలాలు, గుర్రపు నాడాలు, ఏనుగును అదిలించే అంకుశాలు పలుచోట్ల దొరికాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నమారూరులో దొరికిన చేపలు పట్టే గాలాలు ఆనాటి మనుషుల ఆహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. రాగి కత్తులు, కత్తిపిడులు, గంటలు, గాజులు, ఉంగరాలు, సూదులు అనేక సమాధుల్లో దొరికాయి. చాలా స్వల్పంగా వెండి, బంగారు వస్తువులు కూడా దొరికాయి. కరీంనగర్‌ జిల్లాలోని కదంబాపూర్‌లో బంగారు పూసలు, చెవిపోగులు; నల్గొండ జిల్లాలోని రాయగిరిలో వెండి, బంగారు పూసలు, చెవిపోగులు; ఖమ్మం జిల్లాలోని పొలిచెట్టి చెరువు గడ్డలో బంగారు ఉంగరం లభించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా శేరుపల్లి, చిన్నమారూరు, పెద్దమారూరుల్లో లభించిన జాతి రాళ్లు.. కెంపు, కురువిందం, సూర్యకాంతమణి, పద్మరాగమణి, స్ఫటికరాళ్లు పలు ఆకారాల్లో ఆభరణాలుగా వాడినట్లు కనిపించాయి. పోచంపాడు, చిన్నమారూరుల్లో కొమ్ముతో చేసిన దువ్వెనలు, ఖమ్మం జిల్లాలోని వెల్లిమిల్లిలో దంతపు పూసలు, గాజులు, హస్మత్‌పేటలో ఎముకలతో చేసిన పూసలు లభించాయి. పలు రాక్షస గూళ్లలో ప్రత్యేకించి కృష్ణానది ఒడ్డున మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న వీరాపురంలోని సమాధుల్లో అనేక ఆహార ధాన్యాల ఆధారాలు లభించాయి. వాటిలో ముఖ్యమైనవి వరి, బార్లీ, కొర్రలు లాంటి తృణధాన్యాలు; ఉలవ, బఠానీ, మినుము, కంది, చిక్కుడు లాంటి పప్పు/కాయధాన్యాలు; రేగు పండ్లు, ఉసిరికాయలు మొదలైనవి. ఇదే జిల్లా శేరుపల్లి, ఉట్నూరులో వరి పౌష్టికాహార ధాన్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సమాధిలో రాగులు బయటపడ్డాయి.

చారిత్రక యుగ తొలి వెలుగులు, పునాదులు:  అయో యుగంలో ప్రజలు ప్రధానంగా పశుపోషణ, వ్యవసాయం చేసి ధాన్యం నిల్వ చేసుకున్నారు. అందువల్ల నిరంతరం ఆహార సేకరణ కోసం పాటుపడాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో వారికి ఖాళీ సమయం దొరికింది. ఆలోచనా వికాసం జరిగి, కళాతృష్ణ పెరిగి చిత్రకళ నేర్చుకున్నారు. ప్రకృతిసిద్ధంగా లభించే ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో కొండగుహల్లో బొమ్మలు గీశారు. అలాంటి బొమ్మల గుహలు వరంగల్‌ జిల్లాలోని నర్సాపూర్, మెదక్‌ జిల్లాలోని ఎద్దనూర్, శివారు వెంకటాపూర్, వర్గల్‌; ఖమ్మంలోని రామచంద్రాపురం, నల్లముడి; రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లా ముడుమల మొదలైన చోట్ల ఉన్నాయి. ఈ గుహల్లో ముఖ్యంగా వేటాడే చిత్రాలు, కత్తి, డాలు, ధనుస్సు, బాణం, బల్లెం ఆయుధాలు పట్టుకుని తలపడుతున్న యుద్ధ వీరులు; గుర్రం, ఏనుగును స్వారీ చేస్తున్న మనుషులు, కుక్క, మూపురం ఎద్దు, పశువులు, జింకలు, పక్షులు, చిరుత, కుందేలు, నక్క, తాబేలు, ఎండ్రకాయలు మొదలైన వాటిని చిత్రించారు. పశుపోషణ ప్రధాన వృత్తిగా ఉన్న ఆనాటి ప్రజలు ఆవును కూడా పశు  సంపద వృద్ధి కోసం గోమాతగా పూజించారని ఆ చిత్రం వల్ల అర్థమవుతుంది. పశుపోషణ, భూసాగు అనే కొత్త వృత్తుల వల్ల ఆహారం సమృద్ధిగా లభించి, సమాజం కూడా విస్తరించింది. విస్తరించిన సమాజాన్ని నియంత్రించడానికి రాజకీయ వ్యవస్థ అవసరమైంది. ఆ విధంగా తెలంగాణలోనే కాకుండా, మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో అస్మక జనపదం (రాజ్యం) ఏర్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని