అవగాహనతో అధిక మార్కులు!

అధ్యాపకులు చెప్పే పాఠాలను అందరూ కలిసే వింటారు. ఆ తర్వాత అందరూ పరీక్షలు రాస్తారు. కానీ మార్కులు మాత్రం కొందరికి ఎక్కువా, మరికొందరికి తక్కువా వస్తాయి.

Published : 09 Jul 2024 00:45 IST

అధ్యాపకులు చెప్పే పాఠాలను అందరూ కలిసే వింటారు. ఆ తర్వాత అందరూ పరీక్షలు రాస్తారు. కానీ మార్కులు మాత్రం కొందరికి ఎక్కువా, మరికొందరికి తక్కువా వస్తాయి. ఇలా జరగడానికి కారణం వారు నేర్చుకునే విధానమే. అది సవ్యంగా లేని సందర్భాల్లో సబ్జెక్టుపై అవగాహనలో లోపం ఏర్పడుతుంది. పరీక్షల్లో మార్కులూ తగ్గి పోతుంటాయి. మరి సరిదిద్దుకోవాలంటే? 

రగతిలో పాఠాలు వింటున్నప్పుడే ముఖ్యాంశాలను క్లుప్తంగా నోట్‌ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత వాటిని సొంత మాటల్లో వాక్యాల్లా రాసుకోవచ్చు. ఇలా స్వయంగా చేత్తో రాసినవాటిని త్వరగా మర్చిపోలేరు. అంతే కాదు- వార్షిక పరీక్షల సమయంలో వేగంగా పునశ్చరణకీ వీలుంటుంది. 

సమయం ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి చదివేయాలి అనుకోకుండా తప్పనిసరిగా రోజువారీ టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి. దీంతో ప్రతిరోజూ సరిగ్గా అదే సమయానికి చదవడానికి అలవాటుపడతారు. ఇలా ఏ రోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేయడం వల్ల వేగంగా, సమర్థంగా నేర్చుకోవడం సాధ్యమవుతుంది. 


కొత్త పాఠాలుగానీ, ఇతర విషయాలు గానీ నేర్చుకోవడానికి సానుకూల దృక్పథం ఎంతో తోడ్పడుతుంది. చదువుకోవడం వల్ల పరిజ్ఞానం, నైపుణ్యాలూ పెరుగుతాయి. ఆ తర్వాత విద్యార్హతలకు తగిన ఉద్యోగం సంపాదించి వృత్తిపరంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇలా సాధించబోయే అభివృద్ధి గురించి ఊహించుకుంటే ప్రేరణ లభిస్తుంది. ఉత్సాహంగా నేర్చుకోవటానికి వీలవుతుంది.


విస్తృతంగా, సంక్లిష్టంగా ఉన్న సమాచారాన్ని సులువుగా నేర్చుకోవడానికి గ్రాఫ్‌లు, పైఛార్ట్‌లు ఉపయోగపడతాయి. చదువుతున్నప్పుడు ఆ సమాచారానికి సంబంధించిన చిత్రాలను ఊహించుకోవడం వల్ల కూడా నేర్చుకున్నదాన్ని త్వరగా మర్చిపోయే ఇబ్బంది ఉండదు. అలాగే ఎవరికివారు తమకు అనుకూలంగా ఉండే సొంత సృజనాత్మక పద్ధతులను ఉపయోగించి నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు.


కొన్ని గంటలపాటు నిరాటంకంగా చదవడం వల్ల కూడా ఏకాగ్రత లోపిస్తుంది. అరగంటసేపు చదివిన తర్వాత కనీసం ఐదు నిమిషాలైనా విరామం తీసుకోవాలి. ఆ సమయంలో కూడా కూర్చుని ఉండకుండా కాసేపు అటూఇటూ నడవడం వల్ల చురుగ్గా నేర్చుకోవచ్చు. 


చదవడానికే ఎక్కువ సమయాన్ని వినియోగించడం వల్ల స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లలేరు. ఇలా వినోదాన్ని కోల్పోతున్నామని బాధపడటం వల్ల శ్రద్ధగా చదవలేరు. ఇప్పుడు పాఠ్యాంశాలను చదవడం వల్ల భవిష్యత్తులో పొందబోయే ప్రయోజనాలు, నైపుణ్యాల గురించి ఆలోచిస్తే బలవంతాన కాకుండా సంతోషంగా నేర్చుకోగలుగుతారు.


నేర్చుకునే క్రమంలో.. ఎప్పుడూ ఒకే పద్ధతిని అనుసరించడం సరైన విధానం అనిపించుకోదు. కొత్త మార్గాల్లో అనువైనదాన్ని ఎంచుకుని ప్రయత్నించాలి. ఉదాహరణకు కొందరికి తెల్లవారుజామున చదివితే బాగా గుర్తుంటుంది. కొందరు విద్యార్థులు రాత్రి సమయంలోనే ఏకాగ్రతను నిలపగలుగుతారు. కొందరికి మనసులో చదివితేనే ఒంటబడుతుంది. మరికొందరికి పైకి చదివితేనే సౌకర్యంగా ఉంటుంది. 


ఒక విషయం ఎంతవరకూ అర్థమైందో తెలుసుకోవాలంటే స్వయంగా పరీక్షించుకోవాలి. దీంట్లో భాగంగా ప్రశ్నలు వేసుకుని జవాబులు రాబట్టగలగాలి. అలాగే పాఠానికి సంబంధించిన క్విజ్‌లో పాల్గొని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 


విద్యార్థి దశలో నేర్చుకున్న నైపుణ్యాలతోనే జీవితం మొత్తం గడిపేయొచ్చు అనుకోవడం పొరపాటే అవుతుంది. ఉద్యోగార్థులు కోరుకున్న కొలువును సొంతం చేసుకోవాలన్నా, ఉద్యోగులు పదోన్నతులు పొందాలన్నా నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలి. అదే లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని