జాతీయాదాయ చరిత్రలో అదో ‘ల్యాండ్‌ మార్క్‌’!

Published : 11 Jul 2024 00:26 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ
జాతీయాదాయం

జాతీయాదాయం అనేది దేశ సంపదను సూచిస్తుంది. దేశంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల విలువలు ఇందులో ఉంటాయి. దేశంలోని అన్ని రకాల ఆర్థికపరమైన కార్యకలాపాలను జాతీయాదాయం ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం తన విధానాలను, కార్యకలాపాలను రూపొందించడంలో; ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో జాతీయాదాయం ఎంతో కీలకంగా ఉంటుంది.

జాతీయాదాయ అంచనాల కమిటీ (1949)

స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి, గణాంకాల సేకరణకు ఒక సమగ్రమైన పద్ధతిని రూపొందించడానికి 1949లో జాతీయాదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యక్షుడు - ప్రొఫెసర్‌ పి.సి. మహలనోబిస్‌ కాగా, డి.ఆర్‌ గాడ్గిల్, డా.వీకేఆర్‌వీ రావు సభ్యులుగా ఉన్నారు. దీన్నే High powered Expert Committee అంటారు.

 • ఈ కమిటీ తన మొదటి నివేదికను 1951 ఏప్రిల్‌లో, చివరి నివేదికను 1954 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది.
 • మొదటి నివేదికలో 1948-49 ధరల్లో తలసరి ఆదాయం రూ.225గా, జాతీయాదాయం రూ.8,710 కోట్లుగా అంచనా వేశారు.
 • మన దేశంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని జూన్‌ 29న (పి.సి.మహలనోబిస్‌ జన్మదినం సందర్భంగా) జరుపుకుంటారు.
 • అంతర్జాతీయ గణాంక దినోత్సవాన్ని అక్టోబరు 20న నిర్వహిస్తారు. 2010లో యూఎన్‌ఓ దీన్ని ప్రకటించింది.

1949 జాతీయాదాయ కమిటీ నివేదికలోని ముఖ్య లక్షణాలు

1950-51లో అడవులు, పశుపోషణ, మత్స్య పరిశ్రమలతో కలుపుకుని జాతీయాదాయంలో దాదాపు సగం మేర వాటా వ్యవసాయ రంగానిదే.

 • గనులు, ఉత్పాదక రంగం, చేతివృత్తుల వ్యాపారం వాటా జాతీయాదాయంలో సుమారు ఆరింట ఒకటో వంతుగా నమోదైంది.
 • వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్లు కూడా జాతీయాదాయంలో ఆరింట ఒకటో వంతు కంటే కొంచెం ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
 • పాలనాపరమైన దేశీయ సేవలు, గృహ సంబంధిత ఆస్తి, లిబరల్‌ ఆర్ట్స్, వృత్తులు లాంటి ఇతర సేవల నుంచి ఆర్జించే ఆదాయం జాతీయాదాయంలో సుమారుగా 15% మేరకు వాటాను కలిగి ఉంది.
 • జాతీయాదాయంలో వస్తూత్పత్తి వాటా సుమారు మూడింట రెండోవంతు ఉండగా, సేవలు మూడింట ఒకటో వంతు వాటాను కలిగి ఉన్నాయి.
 • 1950 - 51లో నికర దేశీయోత్పత్తిలో ప్రభుత్వ రంగ వాటా 7.6%.
 • జాతీయాదాయ అంచనాల గణనలో రమారమి 10% మేరకు దోష పరిమాణం ఉంటుందని భావించారు.
 • తొలిసారిగా ఈ జాతీయదాయ అంచనాల కమిటీ దేశం మొత్తానికి సంబంధించిన గణాంకాలను చేపట్టినందువల్ల జాతీయాదాయ చరిత్రలో దీన్ని ‘ల్యాండ్‌ మార్క్‌’గా పేర్కొంటారు.

నామమాత్రపు జాతీయాదాయం, వాస్తవిక జాతీయాదాయం (Nominal National Income and Real National Income)

ఒక దేశ జాతీయాదాయాన్ని రెండు విధాలుగా అంచనా వేయవచ్చు. అవి:

1) ప్రస్తుత ధరలు/ వర్తమాన ధరలు/ మార్కెట్‌ ధరలు (Current Prices/ Market Prices)

2) స్థిర ధరలు/ నిలకడ ధరలు (Constant Prices)

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం:

ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల సముదాయాన్ని ఆ సంవత్సరం ధరల్లో తెలియజేస్తే ప్రస్తుత ధరల్లో జాతీయాదాయంగా పేర్కొంటారు. ఇది వస్తు, సేవల ద్రవ్య విలువను తెలియజేస్తుంది. అందుకే దీన్ని నామమాత్రపు జాతీయాదాయం అని కూడా అంటారు. ఇది వాస్తవిక వృద్ధిరేటును ప్రతిబింబించదు. ఎందుకంటే ధరల్లో మార్పును పరిగణనలోకి తీసుకోదు. ఏ సంవత్సరంలో జాతీయాదాయ లెక్కింపును చేపడతారో, ఆ సంవత్సరం మార్కెట్‌ ధరలను ఆధారంగా తీసుకుంటారు.

కేంద్ర గణాంక సంస్థ (Central Statistical Organisation - CSO)

మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి 1951లో కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు. 

ఇది 1954 నుంచి మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేయడం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది (సీఎస్‌ఓ 2019 వరకు జాతీయాదాయాన్ని అంచనా వేసింది.)

 • మన దేశంలో 1950లో నిరుద్యోగ, పేదరిక గణాంకాలను అంచనా వేయడానికి జాతీయ నమూనా సర్వే (National Sample Survey - NSS)ను దిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు.
 • నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 మే 23న సీఎస్‌వో, ఎన్‌ఎస్‌ఎస్‌ఓలను కలిపి జాతీయ గణాంక సంస్థ (National Statistical Organisation - NSO)గా ఏర్పాటు చేసింది.
 • మన దేశంలో 2019 నుంచి ఎన్‌ఎస్‌ఓ జాతీయాదాయాన్ని అంచనా వేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. ఎన్‌ఎస్‌ఓ ప్రస్తుత ఛైర్మన్‌ ప్రొ. రాజీవ లక్ష్మణ్‌ కరందికర్‌ (2022 నుంచి).
 • ఎన్‌ఎస్‌ఓ మాతృ సంస్థ Ministry of Statistics and Programme Implementation.
 • 2000లో డా. సి.రంగరాజన్‌ అధ్యక్షతన జాతీయ గణాంక కమిషన్‌ను నియమించారు. 2006 జులై 12న ఈ కమిటీ సిఫార్సుల మేరకు స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థగా జాతీయ గణాంక కమిషన్‌ను (NSC) ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది.
 • రాష్ట్ర గణాంక వివరాల సేకరణలో ఒక ఏజెన్సీకి, మరొక ఏజెన్సీకి తేడాలు ఉండటంతో, వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. 1950లో ఎన్‌ఎస్‌ఎస్‌ ఏర్పడగా, 1970లో అది ఎన్‌ఎస్‌ఎస్‌ఓగా మారింది.

ఉదా: 2024లో ధరలు ఆ సంవత్సరం జాతీయాదాయ అంచనాల కోసం ఉపయోగపడతాయి.

స్థిర లేదా నిలకడ ధరల్లో జాతీయాదాయం:

ఈ పద్ధతిలో ప్రాతిపదిక/ మూలాధార సంవత్సరాన్ని ఎంపిక చేస్తారు. ఏ విధమైన ఆర్థిక ఒడిదొడుకులు లేని సంవత్సరపు ధరల స్థాయిని ఒక ఆదర్శవంతమైన ధరల స్థాయిగా పరిగణిస్తారు. ప్రాతిపదిక ధరల స్థాయి ఆధారంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువను నిర్ణయించి జాతీయాదాయాన్ని లెక్కిస్తారు.

గతంలో ధరల పెరుగుదలలో మార్పులు తక్కువగా ఉన్న ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా గుర్తించి, ప్రస్తుత సంవత్సర వస్తు, సేవల ఉత్పత్తిని గుర్తించిన ఆధార సంవత్సర ధరల్లో తెలియజేస్తే దాన్ని నిలకడ ధరల్లో జాతీయాదాయం అంటారు. ఇది ధరల్లో మార్పులను పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇది వాస్తవిక వృద్ధిరేటును సూచిస్తుంది. దీన్నే వాస్తవిక జాతీయాదాయం అంటారు.

స్థూల జాతీయోత్పత్తి ప్రతిద్రవ్యోల్బణం (GDP Deflator)

ఒక దేశంలో నిర్ణీత సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువ (జీడీపీ) అంతర్లీన ధరల ప్రతిద్రవ్యోల్బణ కొలతనే స్థూల జాతీయోత్పత్తి ప్రతిద్రవ్యోల్బణం అంటారు. కాలక్రమేణా ధరలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రస్తుత సంవత్సరంలో జీడీపీ ద్రవ్య విలువ గత సంవత్సరంలో జీడీపీ ద్రవ్య విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఆర్థికాభివృద్ధిని సరిగా సూచించదు. ప్రస్తుత జీడీపీ ద్రవ్య విలువను ఆధార సంవత్సర జీడీపీ ద్రవ్య విలువలో వ్యక్తీకరించాలి లేదా ప్రస్తుత జీడీపీ ద్రవ్య విలువను ధరల ప్రతిద్రవ్యోల్బణంతో తగ్గించి, ఆధార సంవత్సర జీడీపీ ద్రవ్య విలువతో పోల్చడం సమంజసం.

జాతీయ గణాంకాల అంచనా విధానాల్లో స్థూల జాతీయోత్పత్తి ప్రతిద్రవ్యోల్బణ సూచీ ప్రస్తుత ధరల్లో జీడీపీ ఆధార సంవత్సర జీడీపీ నిష్పత్తిని సూచిస్తుంది. ప్రస్తుత ధరల్లో ప్రస్తుత సంవత్సర జీడీపీని నామమాత్రపు జీడీపీ అంటారు. ప్రస్తుత సంవత్సర జీడీపీని ఆధార సంవత్సర ధరల్లో తెలిపితే వాస్తవిక జీడీపీ అంటారు.

జాతీయాదాయ అంచనా - ప్రాతిపదిక సంవత్సరాలు

1954 నుంచి జాతీయాదాయాన్ని అంచనా వేసే బాధ్యతను కేంద్ర గణాంక సంస్థకు అప్పగించారు. అప్పటినుంచి ఈ సంస్థ జాతీయాదాయ అంచనాలను రూపొందిస్తూ వచ్చింది.

 • మనదేశంలో వాస్తవిక జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి తొలిసారిగా తీసుకున్న ప్రాతిపదిక మూలాధార సంవత్సరం (బేస్‌ ఇయర్‌) 1948 - 49.
 • ప్రస్తుతం మన దేశంలో వాస్తవ జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి తీసుకుంటున్న బేస్‌ ఇయర్‌- 2011 - 12 (ఇది ఎనిమిదోది).
 • 2004 - 05 బేస్‌ ఇయర్‌ను ప్రొ. అభిజిత్‌సేన్‌ కమిటీ సూచన మేరకు తీసుకున్నారు.
 • 2015 జనవరి నుంచి 2011 - 12 సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా పరిగణిస్తున్నారు. ప్రొ. కె.సుందరం కమిటీ సూచన మేరకు 2011 - 12 ప్రాతిపదిక సంవత్సరాన్ని ప్రవేశపెట్టారు.
 • 2004 - 05 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2011 - 12కు మార్చారు. అయితే 2011 - 12 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2017 - 18కు మార్చాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించగా, ఇది ఆమోదం పొందలేదు.
 • ఒకవేళ 2017 - 18 ప్రాతిపదిక సంవత్సరాన్ని అమలు చేస్తే తొమ్మిదో బేస్‌ ఇయర్‌ అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని