ఆధునిక అవకాశాలు అందుకుందామా?

దేశం విజ్ఞాన కేంద్రంగా మారుతోన్న క్రమంలో సమాచార నిర్వహణ సవాలుగా మారుతోంది. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న డేటాను ఒక పద్ధతి ప్రకారం నిల్వచేసి, దాన్ని అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకోవడం కీలకం. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌...

Updated : 18 Jan 2022 06:34 IST

కెరియర్‌: లైబ్రరీ సైన్స్‌

దేశం విజ్ఞాన కేంద్రంగా మారుతోన్న క్రమంలో సమాచార నిర్వహణ సవాలుగా మారుతోంది. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న డేటాను ఒక పద్ధతి ప్రకారం నిల్వచేసి, దాన్ని అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకోవడం కీలకం. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ చదివినవారు ఈ పనిని సమర్థంగా నిర్వహించగలరు. సాంకేతిక పురోగతి లైబ్రరీ సైన్స్‌ రంగంలోనూ చాలా మార్పులు తీసుకొస్తోంది. తాజా పరిణామాలు ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి అవకాశాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సులు, సంస్థల వివరాలు, ఉద్యోగాల గురించి తెలుసుకుందాం!

విజ్ఞానంతో సంబంధమున్న ప్రతి సంస్థకూ గ్రంథాలయం మూలస్తంభం లాంటిది. ఒకప్పుడు ఇది పుస్తకాలతో నిండిన గదిగా ఉండేది. అయితే నేటితరం లైబ్రరీలు భవిష్యత్తును మార్చగల విజ్ఞాన కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్‌ రూపంలో సమాచారం నిల్వ చేయడం అనివార్యమైంది. దీంతో లైబ్రరీ సైన్స్‌ కోర్సు కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేసుకుంది. నేటితరం లైబ్రరీ నిపుణులు కోరుకున్న సమాచారాన్ని క్షణాల్లో.. పుస్తకం, ఆడియో, వీడియో..ఇలా అన్ని ఫార్మాట్లలోనూ అందిస్తున్నారు. అన్ని రంగాల సంస్థలకూ తమ సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో నిల్వచేయడం, అవసరమైనప్పుడు దాన్ని సులువుగా పొందడం తప్పనిసరి వ్యవహారంగా మారింది. అందువల్ల లైబ్రరీ సైన్స్‌ కోర్సులు చదివినవారికి అవకాశాలు అన్ని చోట్లా విస్తరించాయి. భవిష్యత్తులో లైబ్రరీ సైన్స్‌ పరిధి మరింత ఎక్కువ కానుంది. విజ్ఞాన వనరుల సంరక్షణలో లైబ్రరీల పాత్ర కీలకం కావడమే ఇందుకు కారణం.  

ఇవీ కోర్సులు...

లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటిలో చేరవచ్చు. అయితే ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారు డిగ్రీ అనంతరం ఏడాది వ్యవధితో ఉంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ (బీఎల్‌ఐఎస్‌సీ) కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ అర్హతతో వివిధ ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. బీఎల్‌ఐఎస్‌సీ అనంతరం ఏడాది వ్యవధితో ఉన్న ఎంఎల్‌ఐఎస్‌సీ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీకీ ప్రయత్నించవచ్చు. జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సులు నడుపుతున్నాయి. ప్రవేశపరీక్షలతో వీటిలో చేరే అవకాశం కల్పిస్తున్నాయి. చాలా విద్యాసంస్థలు దూరవిద్యలోనూ ఈ చదువులు అందిస్తున్నాయి.

వీటిలో చేరినవారు అందుబాటులో ఉన్న సమాచారం, వనరులను ఎలా నిర్వహించాలి, సంరక్షించాలి, విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలో తెలుసుకుంటారు. సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో నిల్వచేయడం, అవసరమైనప్పుడు దాన్ని సులువుగా తిరిగి అందించగలగడం.. ఈ రెండింటిపై దృష్టి సారిస్తారు. ఇందుకు అవసమైన సాంకేతికతపై పట్టు పెంచుకుంటారు.  

ఇవీ విద్యాసంస్థలు..

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌: ఎమ్మెస్సీ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సు రెండేళ్ల వ్యవధితో ఐఎస్‌ఐ, బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తోంది. ఇందులో అవకాశం వచ్చినవారు ప్రతి నెలా రూ.8000 స్టైపెండ్‌ అందుకుంటూ చదువుకోవచ్చు. మూడేళ్ల డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. ఇక్కడ 12 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. త్వరలో ప్రకటన వెలువడుతుంది. వీరు బెంగళూరులోని డాక్యుమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతారు. తర్వాతి తరం ఇన్ఫర్మేషన్‌ మేనేజర్లను రూపొందించే లక్ష్యంతో ఈ సంస్థ నెలకొల్పారు. లైబ్రరీ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌, క్వాంటిటేటివ్‌ స్టడీస్‌ మేటి కలయికతో ఈ కోర్సు రూపొందించారు. ఇక్కడ చదువుకున్నవారికి ఐటీ పరిశ్రమ, ఆర్‌అండ్‌డీ, ఉన్నత విద్యా సంస్థల్లో మేటి అవకాశాలు దక్కుతాయి. దేశంలో లైబ్రరీ సైన్స్‌లో మేటి కోర్సుగా దీన్ని చెప్పుకోవచ్చు.
టాటా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబయి (ప్రకటన వెలువడింది) జామియా మిల్లియా ఇస్లామియా
బెనారస్‌ హిందూ యూనివర్సిటీ
అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ
దిల్లీ యూనివర్సిటీ
ఆంధ్రా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో పలు విశ్వవిద్యాలయాలు బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సులు నడుపుతున్నాయి.


ఏమేం కావాలి?

మంచి లైబ్రేరియన్‌ కావాలంటే ఉండాల్సినవి-
పుస్తకాలపై ప్రత్యేకమైన ఆసక్తి  భిన్న అంశాలపై అభిరుచి
భావప్రసారణ నైపుణ్యాలు వినియోగదారులకు సేవ చేసే దృక్పథం క్రమపద్ధతిలో తీర్చిదిద్దగలిగే నైపుణ్యాలు
పాఠకుల అవసరాలు గ్రహించడం  సాంకేతికతపై పట్టు  


ఉపాధి

వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో లైబ్రరీ సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు విద్యా సంస్థల్లోనే కాకుండా మ్యూజియంలు, గ్యాలరీలు, కార్పొరేట్‌ సంస్థలు, పరిశోధన సంస్థలు, మీడియా హౌస్‌లు, ప్రచురణ సంస్థలు...ఇలా దాదాపు అన్ని చోట్లా ఉంటాయి. వేతనాలూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువ మంది ఇ-బుక్స్‌ ద్వారా డిజిటల్‌ లర్నింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

డేటా విశ్లేషణలోనూ లైబ్రరీ సైన్స్‌ సహాయపడుతుంది. వర్చువల్‌ రియాలిటీ విస్తరిస్తోంది. ఈ ట్రెండ్‌... కావలసిన అంశాలను వేగంగా కనిపెట్టి వాటిని చూసేందుకు ఉపయోగపడుతుంది. తాజా పోకడలు ఈ రంగంలో పనిచేసే నిపుణుల అవసరం పెరుగుదలను సూచిస్తున్నాయి.

అభ్యసన, పరిశోధన కేంద్రాలకు లైబ్రరీ సైన్స్‌ నిపుణుల సేవలే కీలకం. పబ్లిక్‌/ప్రభుత్వ లైబ్రరీలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విదేశీ కార్యాలయాలు, ఫొటో/ఫిల్మ్‌/టెలివిజన్‌/రేడియో లైబ్రరీలు, ఇన్ఫర్మేషన్‌/ డాక్యుమెంటేషన్‌ కేంద్రాలు, సమాచార సేవలతో ముడిపడి ఉండే సంస్థలు/ వ్యవస్థలు..ఇలా పలు చోట్ల లైబ్రరీ సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు ఉంటాయి.  

ప్రభుత్వపరంగా...

టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీలు పాఠశాలల్లో లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలచేస్తుంటాయి. బీఎల్‌ఐఎస్‌సీ పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు విభాగాల్లో (జనరల్‌ స్టడీస్‌, లైబ్రరీ సైన్స్‌)ల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. మూలవేతనం రూ.26 వేలకు పైగా ఉంటుంది. అంటే మొదటి నెల నుంచే రూ.40 వేలు అందుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో లైబ్రేరియన్‌ పోస్టులకు ఎంఎల్‌ఐఎస్‌సీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. జనరల్‌ స్టడీస్‌, లైబ్రరీ సైన్స్‌ అంశాల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. వీరు రూ.యాభై వేలు వేతనం అందుకోవచ్చు. డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్‌ పోస్టులకు ఎంఎల్‌ఐఎస్‌సీతోపాటు నెట్‌/స్లెట్‌లో అర్హత సాధించాలి. వీరికి రూ.80 వేలకు పైగా వేతనం దక్కుతుంది. పీహెచ్‌డీతో విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీ సైన్స్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు.

హోదాలు

జూనియర్‌ లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, డెప్యూటీ లైబ్రేరియన్‌, లైబ్రేరియన్‌, చీఫ్‌ లైబ్రేరియన్‌, రిసెర్చర్‌, కన్సల్టెంట్‌, రికార్డ్స్‌ మేనేజర్‌, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ హెడ్‌, ఇన్ఫర్మేషన్‌ ఎనలిస్ట్‌, ఇండెక్టర్‌, ఇన్పర్మేషన్‌ ఆర్కిటెక్ట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌.. తదితర హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి. పని చేస్తోన్న సంస్థ, విద్యార్హతలు, అభ్యర్థి నైపుణ్యాలు, అనుభవం ప్రాతిపదికన వేతనాలు ఆధారపడతాయి. బీఎల్‌ఐఎస్‌సీతో ప్రారంభంలో ప్రైవేటు సంస్థల్లో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు నెల వేతనం ఆశించవచ్చు.


దూరవిద్యలో..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎల్‌ఐఎస్‌సీ కోర్సు ఆంగ్ల మాధ్యమంలో అందిస్తోంది. వ్యవధి ఏడాది. ఫీజు రూ.3200. యాభై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ లేదా ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రంథాలయంలో పని అనుభవం ఉన్నా, లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకున్నా డిగ్రీలో మార్కులతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత సరిపోతుంది. ఈ సంస్థ అందించే ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సుకు 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్‌సీ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమం. ఫీజు రూ.6900.

ఇగ్నోలో బీఎల్‌ఐఎస్‌సీ ఫీజు రూ.6000. ఎంఎల్‌ఐఎస్‌సీ ఫీజు రూ.9000. అర్హతలు, వ్యవధి అంబేద్కర్‌ వర్సిటీ మాదిరిగానే ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు