Updated : 24 Jan 2022 06:15 IST

ఉపాధికి బాటలు.. ఈ నైపుణ్యాలు

అకడమిక్‌ మార్కులు, గ్రేడ్‌లకు తోడు అదనంగా మెరుగైన ఉపాధి నైపుణ్యాలున్నవారికి కార్పొరేట్‌ సంస్థల్లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ. మిగతా సామర్థ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ నైపుణ్యాలు లోపిస్తే ఉద్యోగ ఎంపికకు అవరోధమే! ఏ వృత్తి ఉద్యోగాల్లో విజయం సాధించడానికైనా సార్వజనీనంగా ఉపాధి నైపుణ్యాలు అవసరమవుతాయి.

ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేేసుకునే ప్రక్రియలో కార్పొరేట్‌ సంస్థలు అభ్యర్థి వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలతో పాటు ఉపాధి నైపుణ్యాలను అదనపు అర్హతగా భావిస్తాయి. ఉద్యోగార్థులకు డిగ్రీ పట్టా ఒక ప్రాథమిక అవసరం. ప్రత్యేక నైపుణ్యాలుంటే అభ్యర్థిత్వానికి అదనపు విలువ ఏర్పడుతుంది. ఈ విలువను చేకూర్చేవే ఉపాధి నైపుణ్యాలు.

తాము ఎంపిక చేసిన అభ్యర్ధి తమ సంస్థకు ఎలాంటి అదనపు విలువ చేకూర్చగలడనే అంశాల ఆధారంగా యాజమాన్యాలు అభ్యర్థుల తుది నియామక నిర్ణయాలు తీసుకుంటారు. అదనంగా ఉపాధి నైపుణ్యాలున్న అభ్యర్థి- యాజమాన్యాలకు అత్యంత ఆకర్షణీయమైన అభ్యర్థి. చాలా కాలేజీల్లో సాంకేతిక అంశాల్లాగా ఈ ఉపాధి నైపుణ్యాలను బోధించరు. 

అందుబాటులో ఉన్న వనరులు, సమయాన్ని సరైన పద్ధ్దతిలో వినియోగించుకోవడం, తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధించడం ఉపాధి నైపుణ్యాల కిందకు వస్తుంది. కాలేజీ విద్యార్థి దశ నుంచి కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగిగా ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు మెరుగుపరుచుకోవాల్సినవాటిలో వనరుల నిర్వహణ ముఖ్యమైనది. విద్యార్ధి దశలో ఏకకాలంలో ఎన్నో పనులు, వివిధ ప్రాజెక్టులు చేపడుతూ ఉంటారు. ఆ సందర్భంలో అందుబాటులో ఉన్న వనరులనూ, సమయాన్నీ సమర్థంగా  ఉపయోగించుకునే నైపుణ్యం అలవడుతుంది. 

విమర్శనాత్మక ఆలోచనలు 

ఉద్యోగంలో ఎదురయ్యే జటిల సమస్యల పరిష్కారానికి అవసరమైన సమాచారాన్ని పరిశీలించి సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించాల్సివుంటుంది. అందుకే కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో ఈ లక్షణాన్నే ఎక్కువగా ఆశిస్తారు. మేధా మథనంలో జరిగే వాదనలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం ఒక సామర్థ్యం. సృజనాత్మకంగా, తార్కికంగా అలోచించగలిగే నైపుణ్యం ఇందుకు కావాలి. ఈ తార్కిక, విమర్శనాత్మక ఆలోచనలను యాజమాన్యాలు విలువైనవిగా భావిస్తాయి. 

నాయకత్వ లక్షణాలు 

ప్రాంగణ నియామకాల ద్వారా జూనియర్‌ స్థాయిలో ఉద్యోగంలో చేరినప్పటికీ నాయకత్వ లక్షణాలుంటే యాజమాన్య భావనతో ఓ నాయకుడిగా పని చేస్తారు. ఇది కెరియర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరిస్తుంది. విద్యార్థిగా బృందంలో కలిసి పని చేస్తున్నప్పుడు ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. అందుకే నాయకత్వ లక్షణాలు.. ఉపాధి నైపుణ్యాల్లో ప్రధానమైనవి. 

మార్పును స్వాగతించడం

టెక్నాలజీ ప్రభావంతో వ్యాపార స్వరూప స్వభావాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వీటికి తగిన విధంగా త్వరితగతిలో మారి, కొత్త వాతావరణంలో ఇమిడిపోవడం ఒక నైపుణ్యం. విధినిర్వహణలో మార్పులు తీసుకురావడం, మారిన వాతావరణానికి అలవాటుపడటం, కొత్త పోటీ పద్ధతులు అనుసరించటం ముఖ్యం. ఈ పోటీ ప్రపంచంలో సమస్యలకు నూతన, సృజనాత్మక పరిష్కారాలను అందివ్వడానికి అవసరమయ్యే వ్యవహార జ్ఞానం సంపాదించాలి. ఇలాంటి వాతావరణానికి అలవాటుపడుతూ నేర్చుకునే తత్వం అలవరచుకోవాలి. 

పరస్పర సహకారం

కార్పొరేట్‌ సంస్థలో చేరాక, వృత్తి ఉద్యోగాల నిర్వహణలో సభ్యుల మధ్య లక్ష్యాల సాధనకు పరస్పర సహకారం అవసరం. ఈ సహకార స్థాయి, ప్రభావాలను తక్కువగా అంచనా వేయలేము. సంఘటితంగా, వ్యవస్థీకృతంగా పనిచేసి విజయం సాధించడం ఫలవంతంగా ఉంటుంది. యాజమాన్యాలు కోరుకునే నైపుణ్యాల్లో పరస్పర సహకారం ముఖ్యమైనది. ముఖ్యంగా పరస్పర సహకారం ఉన్నచోట- భిన్న నేపథ్యాలున్న వ్యక్తులతో కలిసి పనిచేయదం సులభమవుతుంది. జట్టులో ఏర్పడే విభేదాలు సులభంగా పరిష్కరించవచ్చు. భిన్న సంస్కృతులు, నైపుణ్యాలున్న వ్యక్తులతో కలిసి పనిచేయడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని