కరెంట్‌ అఫైర్స్‌

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్‌ (31) ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా అధిరోహించి అరుదైన రికార్డు

Published : 24 May 2022 01:38 IST

ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా ఎవరెస్టు అధిరోహణతి

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్‌ (31) ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమే. పియాలీ స్వస్థలం బెంగాల్‌లోని చందన్‌నగర్‌.


ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ మిట్టా జనార్ధన్‌కు ఘంటశాల జీవన సాఫల్య పురస్కారం దక్కింది. ఘంటశాల శత జయంతి అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంగా సంగీత ప్రపంచానికి జనార్ధన్‌ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం ఇచ్చారు.


తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మరొకసారి కేటీఆర్‌ ఎన్నికయ్యారు. సంఘం కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్‌, ఉపాధ్యక్షుడిగా చాముండీశ్వరీనాథ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఉపేందర్‌ రావు, కోశాధికారిగా పాణి రావు కొనసాగనున్నారు.


దావోస్‌లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యం, రవాణా రంగంలో మార్పులపై సహకారానికి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.


ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓగా మరో అయిదేళ్ల పాటు సలీల్‌ పరేఖ్‌ కొనసాగనున్నారు. 2027 మార్చి 31 వరకు సలీల్‌ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 2018 జనవరి నుంచి ఆయన సంస్థ ఎండీ, సీఈఓగా ఉన్నారు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో తూర్పు సియాంగ్‌ జిల్లాలోని పాసిఘాట్‌లో నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) క్యాంపస్‌ నెలకొల్పేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.


బ్రిటన్‌లోని లండన్‌ బరో ఆఫ్‌ సౌథ్‌వార్క్‌ మేయర్‌గా భారత సంతతికి చెందిన సునీల్‌ చోప్రా రెండోసారి ఎన్నికయ్యారు. 2014-15 కాలంలో ఆయన ఈ పదవిలో ఉన్నారు. భారత సంతతి వ్యక్తి ఒకరు ఇక్కడ మేయర్‌గా ఎన్నిక కావడం అదే మొదటిసారి.


జొహన్నెస్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులకు 2013లో ఈజిప్టులో లభించిన ఓ గులకరాయి హైపాటియా అనే శిలకు చెందినదని, మన సౌర వ్యవస్థ ఆవల సంభవించిన ‘సూపర్నోవా’ మాదిరి భారీ పేలుడు కారణంగా ఇది ఏర్పడిందని తాజాగా నిర్ధారించారు.


ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 11 కి.మీ. పొడవైన చున్నీతో యాత్ర నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దానెక్స్‌ నవా దుస్తుల తయారీ కర్మాగారానికి చెందిన 300 మంది మహిళలు ఇంత పొడవైన చున్నీని తయారు చేశారు. ఇది ప్రపంచంలో అతి పొడవైందిగా నిర్వాహకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని