అనంత భాగాల అతిపెద్ద అణువు!

వాహనాల టైర్లు మొదలు వంటపాత్రల వరకు, వాటర్‌ బాటిళ్ల నుంచి విగ్గుల దాకా నిత్యజీవితంలో అందరూ విరివిగా వాడే ప్రతి వస్తువు తయారీలోనూ పాలిమర్‌లను వినియోగిస్తారు. అంత ముఖ్యమైన ఆ పాలిమర్‌లు అంటే ఏమిటి? పాలిమరీకరణ ఎలా జరుగుతుంది? వాటి వర్గీకరణ, ఉపయోగాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. పరీక్షల్లో తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. 

Updated : 25 May 2022 05:35 IST

వాహనాల టైర్లు మొదలు వంటపాత్రల వరకు, వాటర్‌ బాటిళ్ల నుంచి విగ్గుల దాకా నిత్యజీవితంలో అందరూ విరివిగా వాడే ప్రతి వస్తువు తయారీలోనూ పాలిమర్‌లను వినియోగిస్తారు. అంత ముఖ్యమైన ఆ పాలిమర్‌లు అంటే ఏమిటి? పాలిమరీకరణ ఎలా జరుగుతుంది? వాటి వర్గీకరణ, ఉపయోగాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. పరీక్షల్లో తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. 

పాలిమర్‌లు

పాలిమర్‌ అనేది పునరావృత చిన్న యూనిట్లను కలిగి ఉన్న ఒక బృహదణువు. పాలి అంటే అనంతం, మర్స్‌ అంటే భాగాలు లేదా చిన్న చిన్న యూనిట్లు అని అర్థం. ప్లాస్టిక్‌ పదార్థాలు, పాలిమర్‌లను నిత్యజీవితంలో ఉపయోగిస్తారు. ఉదా: పాలిథిన్, పాలి వినైల్‌ క్లోరైడ్, బేకలైట్, నైలాన్‌-6, 6 

పాలిమరీకరణ ప్రక్రియ: చిన్న అణువులు (మోనోమర్‌ యూనిట్లు) ఒకదానితో మరొకటి కలిసిపోయి బృహదణువును (పాలిమర్‌) ఏర్పరిచే ప్రక్రియనే పాలిమరీకరణ అంటారు. ఈ విధంగా ఏర్పడిన బృహదణువును పాలిమర్, ఈ ప్రక్రియలో పాల్గొన్న చిన్న యూనిట్లను మోనోమర్‌ అని అంటారు. 

n (ఇథిలీన్‌)-పాలిఇథిలీన్‌

n (మోనోమర్‌)- పాలిమర్‌

చిన్న యూనిట్‌ బృహదణువు

పాలిమర్‌లు అన్నీ బృహదణువులు. కానీ బృహదణువులన్నీ పాలిమర్‌లు కావు. 

ఉదా: మొక్కల్లో ఉండే ఆకుపచ్చ వర్ణ పదార్థం క్లోరోఫిల్‌ ఒక బృహదణువు మాత్రమే, పాలిమర్‌ కాదు. ఎందుకంటే ఇది పునరావృత యూనిట్లను కలిగి ఉండదు.

పాలిమర్‌ల వర్గీకరణ 

* పాలిమర్‌ ఏర్పడే విధానాన్ని బట్టి అవి రెండు రకాలు. 

సంకలన పాలిమర్‌లు: మోనోమర్‌ యూనిట్లు ఒకదానితో మరొకటి కలిసి పొడవైన శృంఖల పాలిమర్‌ను ఏర్పరిచే ప్రక్రియలో చిన్న అణువులను కోల్పోకుండా, అంటే పూర్తిగా సంకలనం జరిగే ప్రక్రియనే సంకలన పాలిమరీకరణ ప్రక్రియ అంటారు. ఈ విధంగా ఏర్పడిన పాలిమర్‌కు సంకలన పాలిమర్‌ అని పేరు. 

ఉదా: పాలిథిన్, పాలి వినైల్‌ క్లోరైడ్, టెఫ్లాన్, ఓర్లాన్, డైనెల్‌. 

సంఘనన పాలిమర్‌లు: చిన్న అణువులను(H2O, H2S,NH3 .-.-.-.-.-) కోల్పోతూ జరిగే పాలిమరీకరణ ప్రక్రియనే సంఘనన పాలిమరీకరణం అని, ఏర్పడిన పాలిమర్‌ను సంఘనన పాలిమర్‌ అంటారు.  

ఉదా: నైలాన్‌ - 6, 6, బేకలైట్, PET, PHBV

రీ-సైక్లింగ్‌ ప్రక్రియ.. దీని ఆధారంగా పాలిమర్‌లు రెండు రకాలు. 

థర్మోఎలాస్టిక్‌ (థర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌లు): ఇవి వేడిచేసే కొద్దీ మెత్తబడతాయి. వీటి రీ-సైక్లింగ్‌ ప్రక్రియ సులభం. 

ఉదా: పాలి వినైల్‌ క్లోరైడ్, పాలిథిన్, ఓర్లాన్, పాలి ప్రొపిలీన్, డెక్రాన్, టెర్లిన్, PET, నైలాన్‌ - 6, 6.

థర్మోసెట్టింగ్‌ పాలిమర్‌లు: వేడిచేసే కొద్దీ గట్టిపడటం వల్ల వీటి రీ-సైక్లింగ్‌ ప్రక్రియ అత్యధిక ఖర్చుతో కూడుకుంది. అంటే వీటిని రీ-సైక్లింగ్‌ చేయడం దాదాపు సాధ్యం కాదు. 

ఉదా: బేకలైట్, మెలమైన్, యూరియా - ఫార్మాల్డిహైడ్, రెజిన్, నోవోలాక్‌.

జీవ విచ్ఛిన్న ప్రక్రియ.. దీని ఆధారంగా పాలిమర్‌లు రెండు రకాలు.

జీవక్షయీకృతమయ్యే పాలిమర్‌లు: సహజసిద్ధంగా సూక్ష్మజీవులు, ఎంజైమ్‌ల సహాయంతో ప్రకృతికి హాని కలిగించని చిన్న అణువులుగా విడగొట్టబడే లేదా విచ్ఛిన్నం చెందే పాలిమర్‌లనే జీవక్షయీకృతమయ్యే పాలిమర్‌లు అంటారు.  

ఉదా: PHBV, డెక్ట్స్రాన్, నైలాన్‌ - 2 - నైలాన్‌ - 6

జీవక్షయీకృతం కాని పాలిమర్‌లు: పాలిథిన్, నైలాన్‌ - 6, 6, పాలి వినైల్‌ క్లోరైడ్,  PET, పాలిథిన్‌.

* పాలిమర్‌లు లభించే విధానం ఆధారంగా అవి మూడు రకాలు. 

సహజ పాలిమర్‌లు: ఇవి సహజంగా లభిస్తాయి.

ఉదా: కాటన్‌ (పత్తి), ఉన్ని, ప్రొటీన్స్, సెల్యులోజ్‌

సెమీ సింథటిక్‌ పాలిమర్‌లు:

ఉదా: - టెరికాటన్‌ - టెర్లిన్‌ + కాటన్, 

టెరిఊల్‌ - టెర్లిన్‌ + ఉన్ని 

రేయాన్‌ (కృత్రిమ సిల్కు) - సెల్యులోజ్‌ + CS2 +NaOH

కృత్రిమ పాలిమర్‌లు: ఇవి మానవుడు తయారు చేసుకునేవి.  

ఉదా: పాలిథిన్, నైలాన్‌ 

* ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడానికి 4R సూత్రాన్ని పాటించాలి. 

1. R - Reduce n- తగ్గించడం 

2.R - Reuse n-తిరిగి వాడటం (అలంకరణ సామగ్రిగా)

3. R - Recycle n-పునఃచక్రీయం

4.R - Recover n-తిరిగి పొందడం (అధిక ప్రాముఖ్యత గల శక్తిగా మార్చడం) 

రీసైక్లింగ్‌ సింబల్స్‌: ప్లాస్టిక్‌ పరిశ్రమల సంఘం రీ-సైక్లింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి వాటికి కోడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. 

నైలాన్‌ - 6, 6 అనేది ఒక పాలి అమైడ్‌ వర్గానికి చెందిన పాలిమర్‌. డెక్రాన్, టెర్లిన్, PET, గ్లిప్టాల్‌ అనేవి ఎస్టర్‌ వర్గానికి చెందిన పాలిమర్‌లు. బేకలైట్, నోవోలాక్‌ అనేవి ఫినోలిక్‌ రెజిన్‌ పాలిమర్‌లు.

పాలిమర్‌లు - ఉపయోగాలు

* అల్ప సాంద్రత గల పాలిథిన్‌ (LDPE) మోనోమర్‌ యూనిట్లు ఇథిలీన్‌. దీన్ని పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ కవర్‌ల తయారీలో ఉపయోగిస్తారు. 

* అధిక సాంద్రత గల పాలి ఇథిలీన్‌ (HDPE) మోనోమర్‌ యూనిట్లు ఇథిలీన్‌. దీన్ని ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో వాడతారు. 

* పాలి ప్రొపిలీన్‌ మోనోమర్‌ యూనిట్లు ప్రొపిలీన్‌. దీన్ని మందంగా ఉన్న ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో వినియోగిస్తారు.

* పాలి వినైల్‌ క్లోరైడ్‌ మోనోమర్‌ యూనిట్లు వినైల్‌ క్లోరైడ్‌. ప్లాస్టిక్‌ పైపులు, రెయిన్‌కోట్స్, హ్యాండ్‌ బ్యాగ్‌ల తయారీలో వాడతారు. 

* ఓర్లాన్‌ మోనోమర్‌ యూనిట్లు వినైల్‌ సయనైడ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని